Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, December 13, 2021

Michelle's story

  దినమణి  నడినెత్తికి చేరి తెల్లని కాంతి రేఖలు  విరజిమ్ముచుండెను. ఆ కాంతి పుంజములు రహదారికిరువైపులా  యున్న దుకాణముల నున్నని రేకు,  గాజు పలకలపై పడి పరావర్తనం చెంది    కనులు మిరుమిట్లు గొలుపుచుండెను. నెత్తిపై కండువా కప్పుకున్న వ్యక్తి చేతులో నల్ల సంచితో వడివడిగా నడుచుచుండెను. అతడు ఊరిమధ్యలోనున్న ఎం ఎల్ ఏ సింహాచలం ఇంటివద్ద ఆగెను. ఆ ఇంటి ముంగిటనున్న విశాల ప్రాంగణమంతయూ వాహనములతో నిండి యుండెను. అందు ఇన్స్పెక్టర్ గారి వాహనము కూడా ఉన్నది.  ఆ ప్రదేశమంతయూ పార్టీ కార్యకర్తలతో సందర్శకులతో  కోలాహలంగా యున్నది. ఆ కండువా కప్పుకున్న వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించెను. అతడి వాలకం చూసి అక్కడి వారతనిని అడ్డుకొనిరి.  ఇంతలో ఇన్స్పెక్టర్ బయటకువచ్చి అతడి వాహనమెక్కి వెడలిపోయెను. పిదప ఒక బృందం లోపలకు ప్రవేశించుచుండగా వారిని తోసుకుని లోపలి పోయి ఆ నల్లని సంచిని సింహాచలం చేతిలో నుంచెను. సింహాచలం “పెంచ లయ్యా! ఏమి ముసుగేసుకొచ్చినావు? నల్ల సంచిలో తెచ్చితివా?” అని నవ్వగా పెంచలయ్య “తెల్లడబ్బే తెచ్చితిన”నెను. సింహాచలం అతడిని ప్రక్క గదిలోకి పంపివేసెను. అప్పుడే ఒక సమూహము చొచ్చుకొని వచ్చెను. వారు ఒక భూవివాదపు గొడవ పరిష్కారనిమిత్తము వచ్చినవారు.

సింహాచలం తన అనుంగుడు చిక్కణకి వారి తోమాట్లాడమని సైగచేసి “రత్నా!” అని పిలుచుచూ సంచితో లోపలి పోయెను. ఆ సంచిని రత్నకుమారి చేతిలో పెట్టి కాఫీ త్రాగుచుండెను. చిక్కణ వారిని కూర్చొండబెట్టి  ఎం ఎల్ ఏ గారు మీ ఇవరితో విడివిడిగా మాట్లాడినారు కదా మీరు అయన చెప్పిన షరతులకు లోబడి పరిష్కారము మీ కిష్టమేనా అని ఇరువర్గాలవారిని అడిగెను. అందొకవర్గము వారికి ఆ షరతులు నచ్చలేదు వారు అదే చిక్కణ కు చెప్పగా “ఎం ఎల్ ఏ గారు చెప్పినది న్యాయమార్గమే అవతల వర్గమువారు కూడా ఇవే షరతులకు ఒప్పుకొని వచ్చినారు మీకు నచ్చనిచో ఇంక మీరు భూమిపై ఆశ వదులుకొనుడు. మీ సంగతి  మండలాధికారి చూచుకొందురు” అనెను “మండలాధికారి మమ్మల్ని భూఆక్రమణ దారులనుచున్నాడు. ఏబది ఏళ్ళనుండి మాసాగుబడిలో నున్నదా భూమి. మావద్ద పట్టా కూడాఉన్నదని మా నాన్న రైతు కానీ నేను చదువుకొంటినని అందొకడు గొంతుపెంచెను. ఈ లోగా  డబ్బులెక్క పెట్టుకొని సింహాచలం మరలివచ్చి భూ ఆక్రమణ చట్టం క్రింద ప్రత్యేకన్యాయస్తానానికి  సర్వే నెంబరు 27 ఆక్రమణ భూమి అని స్వాధీనపరుచుకొనవలసినదని అభ్యర్ధన చేయును. అప్పుడు నీ పాతికెకరములకు నీళ్ళొదులుకొన వలసివచ్చును. అంతర్జాలమందు గొండ మల్లయ్య కేసును చరవాణిలో చూపి చదువు వచ్చినచో గొండమల్లయ్య కేసు చదువుకొనమని వారిని బెదిరించగా కడకు వారునూ సరే అనిరి.

 రాతకోతలు పూర్తయ్యి భూతగాదా బృందములు నిష్క్రమించినవి  “ఒకరి పైకి మరొకరిని ఎగదోసి ఇరుపక్షాలనుండి భూములను గుంజుకొను నక్కజిత్తుల మారి మనము కలహించుకొని వీడి కంట పడి చెరొక ఐదు ఎకరములు వీడి పెళ్ళాం పేర రిజిస్ట్రేషను చేయవలసి వచ్చినదని రక్తము మరిగిపోవుచుండగా నిస్సహాయముగా “వీడి పెళ్ళాం ముండమొయ్య”   అని సింహాచలమును కసిదీరా తిట్టుకొని వెడలిపోయిరి. 

అట్లు వారు వెడలిన మరుక్షణము మరొక చిన్న సమూహము ప్రవేశించెను “వుయ్ ఆర్ ఫ్రొమ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్” అని వారిని వారు పరిచయము చేసుకొని సింహాచలముతో “దేవాలయ స్థలములో పెంచలయ్య చర్చ్ నిర్మించుచున్నాడు. మేము అతడిపై కేసు పెట్టవలెనని చూచుచుండగా ఇన్స్పక్టర్ మమ్మల్ని నిరుత్సాహ పరుచుచున్నాడు. మేము న్యాయస్థానమునాశ్రయించెడి వారమే కానీ గోటితో పోయేడి  దానికి గొడ్డలెందుకని మీ వద్దకు వచ్చినాము.” అనెను. “అవి ప్రభుత్వ స్థలములు పెట్టినచో మేము కేసుపెట్టవలెను. మీ కేమి సంబంధమని సింహాచలము అనుచుండగా నరసింహ దేవస్థాన అర్చకులు మరియు కమిటీ పెద్దలు ప్రవేశించిరి. వారు చేతిలో పత్రములను చూపుచూ ఇవి  దేవాలయ స్థలములు. మీ ప్రభుత్వ స్థలములను ఆక్రమించు కొని  చర్చ్ లు కట్టి వేయుచున్ననూ మీరు మిన్నకున్నారు. అది మీ ఇష్టము. మా దేవాలయ స్థలములను ఆక్రమించినచో  గొడవ చాలా దూరం పోవునని హెచ్చరించిరి.

చివరిగా నరసింహ ఉపాసకులైన దేవాలయ అర్చకులు రమణాచార్యులు “హిందువులనిన  ఎందుకండీ అంత చులకన?  మీరు ఎప్పుడూ ఆ మతము మారిన పెంచలయ్య నాగిరెడ్డితో అంటకాగుచూ వారిని వెనకేసుకు వచ్చెదరు. మీరు కూడాకిరస్తానం పుచ్చుకొనినారా? అంతమాత్రముచేత దైవమాన్యములను కూడా కైంకర్యము చేయవలెనా?  ఆ నాగిరెడ్డి తమ్ముడు జేసిన పనికి మహిళా సంఘములన్నియూ అతని ఇంటివద్ద ధర్నా చేయుచున్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు ధర్మమును  కాపాడినచో దేముడు మిమ్మల్ని కాపాడును. లేనిచో... మీ ఇష్టము”

   “ఆ సింహాచలేసునిపై ఆన నేను కిరస్తానము తీసుకొనలేదు!  అతడి సంగతి నేను చూచెదన”ని నచ్చజెప్పి సింహాచలం వారిని పంపివేసెను. వారు పోయిన పిమ్మట పెంచలయ్య ముందరి గదిలోకి వచ్చెను. రత్న కూడా వచ్చి నిలిచెను. కళాహీనమైన సింహాచలం ముఖమును చూచి “ఏటి ఆ ధర్మోపన్యాసం వినేసి తెగ ఆలోచించేత్తన్నావు? రచ్చకుడు మా పెబువుంటుండగా నీకేటి బయం”అనెను. రత్న“అర్చకులు నరసింహో పాసకులు ఆయన దీవెనెంత చల్లనో ఆయన కోపమంత ఎర్రన.  ఆయన శాపము యమపాశమ”ని దేవుని మాన్యముల విషయములో తల దూర్చ వలదని జెప్పెను. అటులనేనని ఆమెను లోపలి పొమ్మని సైగచేసి నేను పెంచలయ్య తో “నాగిరెడ్డి నెట్లు రక్షించవలెనని ఆలోచించుచున్నాన”నెను.

“నాగిరెడ్డి ఇక వలదని ఆ స్థానము నాకిచ్చినారు కదయ్యా మరల అతడిని రక్షించుటా!” అని చిక్కణ సింహాచలం వైపు అయోమయముగా చూచు చుండెను సింహాచలం   “హ హ్హ హ్హ హ వాడినుంచి నన్ను నేను ఎట్లు రక్షించుకొనవలెనని ఆలోచించుచున్నాను.” వాడి తమ్ముణ్ణి ఊబినుండి లాగుటకు ప్రయత్నించిన నేను ఊబిలో కూరుకుపోవుట ఖాయము.  కానీ ఇంత కాలము నా ఇంట కాలము గడిపినాడు కావున ఏంతో  కొంత ప్రయత్నము చేసెదను." పెంచలయ్య "అంటే మరేటి నేదు ఆడవసరము ఇంకొద్దిగున్నాది" సింహాచలం "హ హ్హ హ్హ హ నీవు రాజకీయాల్లో ఉండవలసిన వాడివి సుమీ! “హ హ్హ హ్హ హ”  పెంచలయ్య కూడా  సింహాచలంతో శృతి కలిపెను. చిక్కణ కు వారిరువురు బేతాళ మాంత్రికుల వలె నగుపించిరి.

 అంతలో నాగిరెడ్డి వచ్చెను సింహాచలం “నాగిరెడ్డి నేను బైటకి పోవుచు న్నాను నీవు పోయిరమ్ము. ఆగాగు నీవు.. నీవు ఇచ్చటకు రావలదు కొద్దిరోజులు ఎచ్చటికైననూ పోయి తలదాచుకొనుము.”  “మరి నా తమ్ముడి  సంగతి?” నాగిరెడ్డి అడిగెను. సింహాచలం మాట్లాడకముందే చిక్కణ "అయ్యగారినడుగుచున్నావేమి? అయ్యగారు గోశాలకు  నిప్పు పెట్టమని చెప్పినారా?” నాగిరెడ్డి “అయ్యగారి కుడిభుజము నేను.  నేను  చేయుపనులను నీవు చేయుచూ నాకే చెప్పుచున్నావా?” చిక్కణ “అయ్యగారు భుజము మార్చుకొనినారు. ఇకపొమ్ము.” నాగిరెడ్డి సింహాచలంతో  "మీరు జెప్పిన పిదప నేను  నా తమ్ముడు    మీ ప్రత్యర్థుల కాళ్ళు విరగ్గొట్టినాము, తెగులబెట్టమన్నప్పుడు కొంపలు తెగులబెట్టినాము. ఇప్పుడు నా తమ్ముడు ప్రేమలో మైకంలో గోశాలకు నిప్పుపెట్టినాడు కానీ తలవని తలంపుగా  ఆ మంటలలో  ఆ దేవుడమ్మ ( అహల్య)  చిక్కుకొని మరణించెను. ఇప్పుడు నేనెచ్చటికిపోవలెను.” వెంటనే సింహాచలం పెదవులపై తళుక్కుమని నవ్వు మెరిసెను అతడు పెంచలయ్య తో "పెంచాలా కొమ్మాదిలో నీ క్షేత్ర గృహమునందు కొంత కాలము.."  పెంచలయ్య "నాకే పెట్టావూ, నువ్వు సెప్పేక తప్పుద్దేటి. అలాగే" సింహాచలం “నేను ప్రజాసేవ చేసుకొనుటకు పోవుచున్నాన"ని బయలుదేరెను. పెంచలయ్య “సాయంకాలమయిందంతే  మనసు నిలవదు ఆ ఇంగిలీసు గుంటకాడ కెల్లిపోవాల…హ్హి హ్హి హ్హి” అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుచుండెను.                

                                                                            *** 


భారతవర్ష తరుపున న్యాయవాది బైర్రెడ్డి ఇచ్చటున్నట్టు సాక్ష్యము కలదని  వాదించుటతో న్యాయమూర్తి కేసును మరుసటి  నెలకు వాయిదా వేసినారు. వ్యవహారము కకపికలగుచుండగా మహిళా  సంఘములు  దిగులుకొను చుండెను.  అందుచే భారతవర్ష స్వయముగా సాక్ష్యములను సేకరించ వలెనని రంగములోకి దిగెను. 

అతడు ఒక ఉదయమునే సబ్బవరం పోయి స్థానికులను  విచారించి కూపీలాగుచుండగా మరీదు కనిపించెను. “ఇచ్చటేలయుంటివోయి? ఏదైనా పనిచేయుచున్నావా?"యనడుగగా  “పని చేయకున్న నాకు గడుచుటెట్లు, సహకార రంగమున చేయుచున్నాన”ని మరీదు జెప్పెను. 

ఒక క్షణమాలోచించి నేరుగా అడుగుటకు నిర్ణయించుకొని “మరీదు నీ మంచి గుణము నాకు దెలియును అతివృష్టి ఎంతకురిసిననూ తాత్కాలి కమే. నీవంటి మంచివానికి కష్టములు తాత్కాలికమే యని బైరెడ్డి ఛాయా చిత్రమును చూపి అతడు చేసిన ఘోరమును దెలిపి  "యితడు నీకు తెలియునా?" యనడిగెను. అతడి గూర్చి పోలీసులడిగి ననూ నేనేమీ చెప్పజాలను అని మరీదు తప్పించుకొనజూచెను. 

“కానీ ఒక తెలుగు ప్రేమికుడింకొక  తెలుగు ప్రేమికునివద్ద అసత్యము పల్కినచో తెలుగు చిన్న బుచ్చుకొనున”ని వర్షుడనెను. “ఆరోజు అబ్దుల్కలాం గారికి మ్రొక్కినది కపటము కాదని నిజము జెప్పి నేడు నిరూపించుకొననిచో నీవు కూడా కపట భాషా ప్రేమికుడీవే”  అని భారతవర్ష అనగా మరీదు ఉలిక్కి పడి   

 “నా తెలుగు ప్రేమను శంకించవలదు కలాంగారిపై  మీ మత్తేభము నామనసు నందింకనూ మెదులుచున్నది. కోటిగాడి గురించి వివరములు పోలీసులకు జెప్పకున్ననూ మీకు చెప్పెదను. ఒక్కసారి ఆ మత్తేభ పద్యమును పాడమని మరీదు అడుగుచుండ వర్షుడు చదువు, పదవులతో నిమిత్తమేమున్నది నిజాయతీ పరులెవ్వరైనూ గొప్పవారే అని మా మంచి మరీదు పైనే   మత్తేభమును సంధితునని

మ. సహకా రక్రమ విక్రమా మరల  నీసాకా  రమీనా టికిన్       

అహరా రంభము నందునే కలిగె నే ఆహాఏ మినాభా గ్యమో     

మహదా నందము మాయెనే నినుగ  నమ్రాగ న్నుశోభి ల్లెనే            

విహగేం  ద్రుడైన  మామరీ దునెటు రప్పింపం గసాద్య మౌనే  

సహకార క్రమమున(రంగములో ) విక్రమా మరల  నీ సాకార మీనాటికి (చాలా కాలం తరువాత చూచుట)  అహరా రంభము నందునే   ( ఉదయాన్నే) కలిగెనే.  ఆహా  ఏమి నాభాగ్యమో!!    మహదానందము మాయెనే నినుగన  మ్రాగన్ను  ( వెతికి వెతికి అలసిన కన్నులు) శోభిల్లెనే (కాంతి నొందెనే). విహగేంద్రుడైన  (గరుడడైన)నిను  రప్పింపంగ సాద్యమౌనే!  

వర్షుడు భావమును తెలుపగా రోమాంచితమయ్యి మరీదు జరిగిన కథంతయూ, (బైరెడ్డి కోటిగాడిని కలుసుట చలన చిత్రమును చూచుట) చెప్పెను.  నాడు వారు చూచినది విడుదల చిత్రము మగుటతో పాత్రికేయులను సంప్రదిం చినచిత్ర ప్రదర్శనశాల  వద్ద వారు తీసిన  ఛాయాచిత్రములేమైననూ దొరకవచ్చని భావించి వర్షుడు పాత్రికేయుడు మారయ్య గారిని సంప్రదించగా మారయ్యగారొక గంటాగి “నాలుగు ఛాయా చిత్రములున్న”వని తెలిపిరి వర్షుడు పోయి  నేత్రములు గుడ్లగూబలవలె విశాలమొనర్చి ఆ ఛాయాచిత్రములను పరిశీలించెను. అందు బైరెడ్డి కానరాకుండెను.  

సూర్యుడు పడమట క్రుంగుచుండ చీకటిలలుముచుండెను.  నైరాశ్యమ మనసునలుము చుండ  వర్షుడు కూడా క్రుంగి ఇంటి ముఖం పట్టెను.

                                                                                 ***

నింగి సంధ్యారాగమాలపించుచుండెను సింహాచలం వాహనమును ఒక చెట్టు క్రింద నిలిపి దూరముగా నున్న సెయింట్ మేరీ స్కూల్ కు మెల్లగా కాలినడకన సాగుచుండెను. దూరమునుండి విద్యుత దీప కాంతులీను చున్న ఆ భవనమును చూచి కాంతులీను మిషేల్ ముఖము  గుర్తుకు రాగా భావోద్వేగమును పొందెను. జవరాలి పొందెంత తీయనో అనుకొనుచున్న అతడికి రత్న గుర్తుకువచ్చి ముఖము ముకుళిత మాయెను.  “సాయంకాలం అయితే ఆ ఇంగిలీసు గుంట కాడకెల్లక పొతే మనసు లాగేస్తాది.  అనే పెంచలయ్య మాటలు గుర్తొచ్చినవి. 
“ఇంగిలీసు గుంట” అబ్బా ఆమాట ఎంత తియ్యగా నున్నదో కదా ఎంతైననూ సీమ సరుకు సీమ సరుకే అందుకే ఆమెను పొందుటకు పెంచలయ్యచే ఈ పాఠశాల  స్థలము నాదని పేచీ పెట్టించినది. మధ్యలో దూరి పెంచలయ్యను ఆపి వారిని కాచినట్టు చూపినది. ఇట్లాలోచించుచూ సింహాచలం ఎఱుకలేక పాఠశాల భవనమును సమీపించెను. సింహాచలం ఆకాశములోకి చూచెను. చంద్రోదయమగుచుండెను. అతడికి శ్రీనాధుని భీమఖండంలో చంద్రోదయ వర్ణన గుర్తుకువచ్చెను. 
’కాదు కాడుదయాద్రి కనక కూటంబిది –డంబైన పాన వట్టంబు గాని
కాదు కాదిది సుధాకర పూర్ణ బింబంబు –కాశ్మీర శంభు లింగంబు గాని
కాదు కాదుదయ రాగ ప్రకాశం బిది –నవ కుంకుమా లేపనంబు గాని
కాదు కాదిది కలంక చ్చటా రించోళి-పూజ చేసిన కల్వ పువ్వు గాని..
తూర్పుకొండ బంగారు శిఖరం కాదు, కాశ్మీర శివలింగం కాని, చంద్రుని తెల్ల బింబం కాదు, కొత్త కుంకుమ పూత కాని ఎరుపు పూత కాదు, శివుడికి పూజ చేసిన కలువ పూలే కాని చంద్రుని మచ్చ కాదు. సింహాచలం పాఠశాలను చూచి అదే విధముగా కవితను తలపోసెను.
కావు కావు రవికిరణముల స్నానమాడు  తూర్పు కనుమలివి 
విద్యుత్ కాంతుల స్నానమాడు  పాఠశాల భవంతులవి 
కాదు కాదు బృందావనమిది   కూనలు ఆడుకొను నందనమిది 
కాదు కాదు పచ్చల హారమిది - పచ్చని పొదలు అల్లుకున్న విహారమిది.
సింహాచలం పాఠశాల ముందరనున్న తోట దాటి  కార్యాలయ భవనమును దాటి వెనుకనున్న మిషేల్ గృహము వైపు నడుచుచుండెను.  అతడు మరల చంద్రబింబమును చూచెను. మునుపటికంటే స్పష్టంగా వెలిగిపోవుచున్నది. అతడికి మిషేల్ పాలుకారు యవ్వనము స్ఫురణకు వచ్చెను. నాకేల శివలింగము స్ఫురణకు రాకున్నదని ప్రశ్నించుకొనెను.
సమాధానముగా అతడి అంతరంగము నుండి హాసము వెలువడెను.

 శ్రీనాధుడు మహా శివభక్తుడు కనుక చంద్రబింబం సాక్షాత్తు శివ స్వరూపంగా దర్శనమిచ్చెను. నేను కాముకుడిని కనుక చంద్రబింబము నాకు మిషేల్ స్తనములను గుర్తుకు తెచ్చుచున్నది. ఇట్లు ఆలోచనలలో మైమరచి నిద్రలో నడుచుచున్నట్లు నడుచుచూ అతడు మిషేల్  ఇంటి ద్వారమును చేరి అప్రయత్నముగా తలుపు తట్టుచుండెను. తలుపు తెరుచుకొనెను. సింహాచలం  చంద్రబింబమును ఎట్ట ఎదుట చూసినట్టు ఉలిక్కి పడెను. ఎదురుగా చంద్రబింబమువలె వెలిగిపోవుచున్న మిషేల్. 
మిషేల్ : మై  పేరెంట్స్ అర్ హియర్.
 సింహా : ఐ టోల్డ్ థెం లాస్ట్ వీక్ దట్ ఐ యాం లెర్నింగ్ ఇంగ్లిష్ ఫ్రొం యు. 
మిషేల్ : థెయ్ అర్ నాట్ ఫూల్స్ టు  బిలీవ్. 
సింహా : నమ్మినాఁ నమ్ముకున్న ఏదో ఒకటి చెప్పవలెను కదా. 
మిషేల్ : సరే ఎంతకాలమిట్లు, ఆ చర్చ్ పెద్ద ( పెంచలయ్య)తో మాట్లాడి ఈ పాఠశాల స్థలంపై అతడు పెట్టినకేసును తొలగించుము. అతడి మనుషులు పాఠశాల సమయములో వచ్చి రభస చేయుచున్నారు. నాకు త్వరలో వివాహము చేయదలచినారు. నీవు ఇచ్చటికి వచ్చుట మానుకొనుము. 
సింహా : అంతపని చేయుచున్నాడా ఆ పెంచలయ్య!  నీవు నన్ను పెళ్లి  చేసుకొన్నచో నీవంక ఎవ్వరూ కన్నెత్తిచూడరు, కదా! నేను నా భవనమును కూడా నీకిచ్చివేతును. నేను కొత్త భవనము కట్టుకొంటిని. నీకు కొత్తభవనము కావలెనా? పాత భవనము కావలెనా ? 
మిషేల్ : నీవు ఇచ్చటనుండి వెడలుట కావలెను. 
సింహా : అది నీచేతులోనే ఉన్నదని ఆమెను ఎత్తుకొని పడకగదిలోకి తీసుకుపోయి మంచము మీద పడవేసెను. ఆమె మంచముదిగి అతడికి చిక్కకుండా పరిగెడుచున్నది. నేను సింహాచలము అనగా సింహము. నీవు లేడివి పరిగెత్తుము. కొలది సేపు ఇట్లు ఆడుకొందుము. ఆమె అతడిని ఏవగించుకొనుచూ కొలది సేపు మంచము చుట్టూ పరిగెత్తి కడకు అతడి చేతికి చిక్కెను.

                                                                          ***
  
అదే సాయంత్రం పొద్దుగ్రుంకిన పిదప భారతవర్ష ఇల్లు చేరెను.  రాధామనోహరం కళాహీనంగా కనిపించెను. రాలిపోయిన రాధామనోహ రాలు వర్షుని వైపు జాలిగా చూచుచున్నవి. యింటనెవ్వరూ లేక ఇల్లు వంటరిదైనది. 
మాలినిగారు, మంజూష, కేశవుడు కానరాక  మనసు బోరుమనుచుండగా బాల్య స్నేహితురాలు విదిష విషణ్ణ వదనము స్మృతి పథమున మెదులుచుండ మానిపుక్కిటిపులుఁగు హృదయమును గొట్టుచున్నట్లుం డగా  బాధాతప్తడెందమునకు వీణా వాదనము జేయుచూ  సంగీత లేపనమును పూసి ఉపసమనము కలిగించుచూ అట్లే  వీణపై పడి నిద్రించెను. 
కొంతసేపటికి ఎవ్వరో తట్టి లేపుచున్నట్లనిపించి కనులు తెరచి చూచెను అన్నము తినమని తల్లిగారు చెప్పుచున్నట్లనిపించి లేచి చుట్టూ   చూసిననూ ఎవ్వరూ కానరాకుండిరి. బైటకు పోయి చూడగా తల్లి చెల్లి వచ్చుచు కనిపించిరి  " కేశవుడేడి ఎచ్చటకు బోయినాడని వారినడిగెను.  కేశవుడి అక్క (చారుమతిగారి కూతురు) మంచము  పట్టెనని కబురు తెలిసెనని కేశవుని బస్సెక్కించి వచ్చుచున్నామని చెప్పిరి. హతవిధీ కష్టములన్నియూ కట్టకట్టుకొని రావలెనా. అని భారతవర్ష అనగా "ఇదంతయూ  ఏ అరిష్టమునకు దారితీయునో?" యని మాలినిగారు వాపోయినారు. భోజనములు చేయుచూ  "మనముఁబోయినచో పోలీసులు హడావిడి చేయుచున్నారు తప్ప బైరెడ్డి వ్యవహారము  ఎచ్చట వేసిన గొంగళి అచ్చటనే యున్న"దని మంజూష అనెను. బలమైన సాక్ష్యమున్నాకానీ  పోలీసులేమియునూ చేయజాలరు.అని మాలినిగారు అనుచుండగా "
 సాక్ష్యములను తారుమారు చేయగల సమర్థులు వారు సాక్ష్యమున్న ప్రయోజనమేమి యని మంజూష అనెను. వారట్లు మాట్లాడుకొనుచుండగా వర్షుడి మనసున ఒక ఆలోచన తళుక్కు మనెను. అతడు ముఖపుస్తకము న విడుదలైన చిత్రపు  కథానాయకుని అభిమాన సంఘములవారి కొరకు వెతుకులాడెను. నిశరాత్రి....ఒక అభిమాని తన మిత్రులతో గూడి ఆ సబ్బవరం చిత్రమందిరము ముంగిట గ్రహించిన ఛాయాచిత్రమును ముఖపుస్తకమునందుంచెను. అందు బైరెడ్డి సుస్పష్టముగా కనిపించు చుండగా అది చూచిన వర్షుడు మేఘమండల మదురునట్టు  ఆత్మధన్య నాదము (యురేకా) జేసి పిమ్మట అది రాత్రని గుర్తుకు వచ్చి నాలుక కరుచుకొనెను. 
***
 అదే  రాత్రి  విదిషకు కాళ రాత్రిగా పరిణమించినది. దుస్వప్నము లెన్నియో చిత్తవికారము కలిగించినవి. తన తల్లి చావుకు కారకుడైన  దుష్టత్రయం బైరెడ్డి వాడి అన్న నాగిరెడ్డి మరియు  ఎం. ఎల్. ఏ సింహాచలం దివిటీలు చేబూని భూతప్రేత పిశాచములవలె ఆమెను చుట్టుముట్టి వలయాకృతిన రాక్షసతాండవము చేయు  దృశ్యము చాక్షుషప్రత్యక్షమైనది. ఆమె అంతర్జ్వలన కీలలందు ఎంతకాలిననూ గుండెబాధ  గండశిలవలె కరుగ కుండెను. రాత్రంతా అట్లు యాతన పడిన ఆమె ఒక తెల్లవారు జామున అలసి సొలసి నిద్రించెను.

                                                                  ***

 అదే  రాత్రి రత్నకు సింహాచలం మధ్య మంటలు రగులుచుండెను. “నీకెవరు జెప్పినారో చెప్పుము. నేనా పెంచలయ్యనడ్డుపెట్టుకొని ఆ ఇంగిలీషు పిల్లను వశపరుచుకొంటినని ఎవరుచెప్పినారు? నీకేమైనా కర్ణ పిశాచమున్నదా?” “పిశాచములతో తిరుగువాడివి నువ్వు.  పిశాచములు  పలికిన నీకు పలుకును నాకెట్లు పలుకును? నాకు తెలిపిన దేముడు తెలుపును.”       దేముడు కలలో కనిపించిచెప్పెనా? “అహ్హహ్హహ్హ నీవు అంత  పతివ్రతావా?” అని సింహాచలం ఎద్దేవా చేసెను. 
 "నువ్వు తిరుగుబోతువని  ఇతరులు కూడా తిరుగుతున్నారని అను కొనవలదు." రత్న అట్టు తిరగేసినంత సులభముగా విషయమును  తిరగేసేను.   ఆమె మాట కొరడా దెబ్బవలె తగలగా సింహాచలం విలవిలా లాడి  "అర్ధరాత్రి మద్దెలదరువను సామెతవలె నున్నది. నీ అనుమానంతో నన్ను వేపుకొని తినుచున్నావు, నీకెవరో తప్పుడు సమాచారమిచ్చు చున్నారు. తాళి కట్టిన భర్తని నామాట నమ్ముము” అని బ్రతిమాలెను. “నమ్మితిని కావున నీతో కాపురము చేయుచుంటిని. నీవు స్త్రీ  లోలిడివైననూ నేను  సరిపెట్టుకొందును.  దేవుడి జోలికి పోయిన దేవుడు సరిపెట్టుకొనడ”ని చుబుకమును పట్టి అనునయముగా చెప్పెను. 

                                                                   ***
 
తెల్లవారినది భానుని వెలుగు రేఖలు జగతిని తట్టిలేపుచున్నవి. కొండగాలి తెరలు తెరలుగా వీచుచూ పూల గంధమును మోసుకు వచ్చుచున్నది. విస్తారమైన ఎత్తైన ప్రదేశములో గాలి సంగీతమును పాడుచున్నది. దూరంగా నరసింహస్వామివారి ఆలయం బొమ్మరిల్లు వలే కనిపించుచున్నది. మండలాధికారి  సిబ్బందితో  ఒక ప్రక్క నడుచు చుండగా, జాయంట్ కలెక్టర్ తన సహాయకులతో నడుచుచుండెను. నరసింహ స్వామిగుడి అర్చకులు మరియు సిబ్బంది వారిననుసరించు చుండిరి. ఒక పక్కగా సింహాచలం, పెంచలయ్య, చిక్కణ నడుచుచుండిరి. వారందరు ఒక ఎత్తైన ప్రదేశం చేరి నిలిచిరి.  ఆ ఎత్తైన ప్రదేశములో ఒక ఇరువది అడుగుల సిలువ పాతబడి యుండెను.

మండలాధికారి,  సబ్ కలెక్టర్ గారికి కాగితములపై భూమి లెక్కలు కొలతలు చూపించు చుండిరి కొండగాలి  పూల  మొగలి పరిమళము మోసుకొనచ్చుచున్నది. ఆ పరిమళము తాకిన  జనహృదయములు పులకరించుచున్నవి.   “ఎచ్చట నుండి వచ్చుచున్నదీ తీయని పరిమళము”  సింహాచలం పెంచలయ్యను అడిగెను.“ఏం మిషేల్ గుర్తుకొత్తన్నాదా? గతరాత్రి తియ్యగా…కమ్మగా?”  అని పెంచలయ్య అనుచుండగా  ఇంటికెళ్ళిన తరువాత రత్నతో పెద్ద పేచీ వచ్చిపడినది. ఆమెకెవరో  ఈ మధ్య విషయములను చేరవేయుచున్నారు. ఆ నాగిరెడ్డి కొమ్మాదిలోనే యున్నాడు కదా! “నాకేటి తెలుత్తాది నేనెల్లడం నేదు. ఈ స్థలం గొడవొచ్చిన కాంచి సబ్బవరంలోనే తొంగొతన్నాను. సూడాల్లు కొలతలు లెక్కలు సూత్తన్నారు ఆల్లతో మాట్లాడు సింవాసలమా.”  “చేయనిమ్ము. వారి పని వారు జేసిన నాపని నేను చేసెదను మనకి ప్రభుత్వములో  పలుకుబడున్నద”ని సింహాచలం అనెను. 

                                                                         ***

 సింహాచలం సబ్బవరం గృహమందు ముందటిగదిలో సోఫాలో  కూర్చొనుండెను. అతడు తల వెనుకకు వాల్చి కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో ములిగి యుండెను. రత్న కుమారి తేనీరు తెచ్చి ఇచ్చెను సింహాచలం త్రాగుచుండగా ఆమె అతడి ప్రక్కన కూర్చొనెను. నాగరాజు సింహాచలమును కలిసి తన కోర్టు వాయిదా తేదీ దగ్గర పడుచున్నదని కేసువిషయమై సహాయము కోరుటకు వచ్చెను. కిటికీనుండి సింహాచలం రత్నకుమారి లను చూసిన నాగరాజు కిటికీవద్ద నక్కి వారి మాటలు వినుటకు నిర్ణయించుకొనెను.  

రత్న: దేవాలయ భూములను చూచుటకు మండలాధికారి వచ్చినారట కదా?  మీరు పెంచలయ్యతో పోయినారట కదా? నాకు దేవాలయ భూములలో తలదూర్చనని మాట ఇచ్చినారు మరచినారా

సింహాచలం : ఎవరు చెప్పినారు నీకీ మాటలు… చిక్కణ అని ఉరిమెను. చిక్కణ గజగజ వణికెను. “అయ్యా మీ ఉప్పుతిని మీకే… ద్రోహము చేయగలనా?”

సింహాచలం : చేయగలవు కానీ చేయకున్నచో బ్రతికెదవు. అట్లు చేసిన ఆ నాగిరెడ్డికి పట్టిన గతేనీకునూ  పట్టును.  వాడు పలుకుబడి పెంచుకొనుచూ నాకే రాజకీయప్రత్యర్థిగా మారుటకు చూచుచున్నాడని అనుమానము కలుగుచున్నది. పోలీసులకు నాగిరెడ్డి బైరెడ్డిలను ఖైదు చేసినచో నా ప్రమేయముండదని చెప్పివేసినాను. నాగిరెడ్డి చేసిన నేరములకు నావద్ద రుజువులున్నవి. అవి కూడా పోలీసులకిచ్చెదను. ఇదంతయూ అనుమానము వచ్చినందుకు మాత్రమే”అని చెప్పి చిక్కణను హెచ్చరించెను. ఆ మాటలు విన్న నాగిరెడ్డి కడుపు రగిలెను. సింహాచలం తేనీరు త్రాగి కోపను భార్యకి ఇచ్చివేసెను. ఆమె లోపలి వెడలెను. దూరవాణి మ్రోగెను. సింహాచలం సాధనము చేకొని దూరవాణిలో సంభాషించుచుండెను. భార్య తో మాట్లాడుచున్నప్పుడున్న  చిరాకు పోయి అతడి ముఖము ప్రసన్నముగానున్నది.

అతడు మెలికలు తిరుగుచూ తేనెపలుకులు పలుకుచుండెను. "చందమామకంటే అందమైనదాన, పుట్టతేనె కంటే తీయనైనదానా  నీకు సరి జోడి నేను కానా" అతడి మాటలను బట్టి అతడు మిషెల్ తో మాట్లాడుచున్నాడని నాగిరెడ్డికి అర్థమయ్యెను. "నేనిప్పుడే పెంచలయ్యను పాఠశాలవైపు కన్నెత్తయిననూ చూడవలదని హెచ్చరించితిని. అతడు వచ్చి నిన్ను క్షమాపణ కోరును. నేను ఈ ఒక్కరాత్రి వచ్చెదను. ఇదే ఆఖరి  రాత్రి” అని బ్రతిమాలుచుండెను. నాగిరెడ్డి ఒక నిర్ణయమునకొచ్చినట్లు పిడికిలి బిగించెను.  సంభాషణ ముగించిన సింహాచలం ముఖములో కళహెచ్చెను. అతడి పెదవులపై చిరునవ్వు వెలసెను. అతడు బైటకు వెడలిపోయెను.

అతడు బయలుదేరుచున్నప్పుడు నాగిరెడ్డి ఒక వాహనము వెనుక నక్కి పిదప లోపలి ప్రవేశించెను. అప్పటికి రత్నకుమారి చిక్కణ తో నిజము జెప్పరా చిక్కణ అయ్యగారు చెప్పుచున్న మాటలు ఒకటీ నమ్ముటకు వీలులేదని చిక్కణను  నిగ్గు దీయుచుండెను. చిక్కణ బిక్క చచ్చిపోయెను. వాడి మొఖంలో ప్రేతకళ చూచి నాగిరెడ్డి పగలబడి నవ్వెను "పిరికి సచ్చినోడు వాడేమి చెప్తాడు అమ్మగారు అని మొదలు పెట్టి  అయ్యగారు పెంచలయ్య పక్షము వహించి అతడికి దేవాలయ భూములను కట్టబెట్టుటకు మంత్రాంగం చేయుచున్నారు.  కానీ దేవస్థానము వారు  హైకోర్టుకు పోయినారు. అంతే కాక మిషేల్ అను ఇంగ్లీషు పిల్లను ఇబ్బందులలోకి నెట్టి వశపరుచుకొన్నార”ని అతడు పొంచివిన్న దూరవాణి సంభాషణను కూడా వివరించెను. రత్నకుమారిని  కోపము ఆశ్చర్యము దుఃఖము ముప్పిరిగొన్నవి. ఆమె నేలపై పడి మూర్చరోగి వలే  గిలగిలా తన్నుకొనుచుండెను. నాగిరెడ్డి వెడలిపోయెను.      

***

నాటి సాయంత్రము రత్నకుమారి కొండపై నృసింహస్వామి దేవాలయ మును సందర్శించుకొనుటకు పోవుచుండగా సింహాచలం కొత్త పెళ్లి కొడుకువలె సింగారించుకుని మిషెల్ వద్దకు బయలుదేరెను. స్వామివారి దర్శనము చేసుకొని మండపములో కూర్చొన్న రత్నకు ఏదో తెలియని ఆందోళన మొదలాయెను. అర్చకులు ఆమెను ఓదార్చి ఇప్పుడు హరికథా గానము జరుగును విని ప్రశాంతతను పొందవమని చెప్పిరి. రత్న కుమారి మంటపములో కూర్చొనెను. కొద్దిసమయములో మంటపము భక్తులతో నిండెను. దేవాలయపై నమర్చిన బాకానందు “హిరణ్యకశిప వధ” అను హరికథా గానము జరుగునని ప్రకటించబడెను.

భారతవర్ష కాలికి గజ్జలు మెడలో మాల నుదుటిన నామాలతో వేదికపై కనిపించెను. రత్న కుమారిఈ యువకుణ్ణి ఎచ్చటో చూచినట్టున్నదే!” అని పక్కనే కూర్చొన్న భక్తురాలితో అనెను.

“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. “అతడి  అవధాన కార్యక్రమముల  వార్తాపత్రిక లందు దూరదర్శన మాద్యమములందు వచ్చుచుండును. మీరతడిని పత్రికలలో లేదా దూరదర్సన కార్యక్రమములందు చూచి యుండవచ్చు”   “అవును గుర్తుకువచ్చినది” అనుచున్న రత్న ముఖము వెలిగెను.  “యితడిచ్చటివాడు కాదు కదా!” అనెను. ఆమె “యితడు మువ్వవానిపాలె మందుండును. కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసెడివాడు. విదిష నల్లరి జేసినందుకు బైర్రెడ్డి పై కేసు పెట్టుటచే నాగిరెడ్డి అతడిని ఉద్యోగము నుండి తొలగింపజేసెను.”  “ఇవన్నీ మీకెట్లు తెలియును?” పక్కనున్న భక్తురాలు నవ్వి “నాపేరు నళిని. నేనతడి స్థానమందు పనిచేయుచున్న ఉపాధ్యాయురాలిన”నెను రత్నకుమారి మౌనముగా వెనుకనున్న స్తంభమునకు జారపడెను.  

 భారతవర్ష “గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర  గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన మహా!”మరికొంత మంది భక్తులు వచ్చుచు న్నారు. సిబ్బంది వారికి స్థలము చూపి కూర్చొనమని చెప్పుచున్నారు.

 నాగిరెడ్డి పాఠశాల ఉద్యానవనంలో మిషేల్ తో ఎదో చెప్పుచున్నాడు. మిషేల్, నాగిరెడ్డికి నరసింహాలయము నుండి గానము వినవచ్చుచున్నది.

భారతవర్ష “ మహా గణపతిమ్ మనసా స్మరామి|  మహా గణపతిమ్ మనసా స్మరామి| వశిష్ట వామ దేవాది వందిత|| మహా దేవ సుతం గురుగుహ నుతం|మార కోటి ప్రకాశం శాంతం||   మహా కావ్య నాటకాది ప్రియం| మూషిక వాహన మోదక ప్రియం||” నాగిరెడ్డి చెప్పుట ముగించెను. మిషేల్ ఒక నిర్ణయమునకు వచ్చి మేడ  మెట్లు ఎక్కుచుండెను.   నాగిరెడ్డి    కూడా మిషేల్ ననుసరించుచుండెను.

భారతవర్ష “ శ్రీ నారసింహుని  భక్తులందరికీ వందనం ఈనాటి  సత్కథ హిరణ్యకశిప వధ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషుల రక్షించుట కొరకు దుష్టు లనంత మొందించుటకు కొరకు ధర్మాన్ని స్థాపించుటకు ప్రతి యుగంలోనూ అవతరించునని భగవానుడు చెప్పినాడు. ఐతే భగవంతుడు ఒకే  రూపములో కాక వివిధ రూపములలో దుష్ట సంహారమొనర్చును.

నరసింహ, నృసింహ, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. దుష్టశిక్షణ కొఱకు శ్రీమహావిష్ణువు ధరించు 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములందురు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారములందురు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడందురు. తెలుగునాట  యాదగిరిగుట్ట, మంగళగిరి, ధర్మపురి  సింహాచలం, అహోబిలం వంటి నృసింహాలయాలు ప్రసిద్ధం. తెలుగువారికి కులదైవం   నృసింహావతారం.”

రత్నకుమారి “కథకుని స్వరము ఎంతో మధురముగానున్నది ఇతడు అంతదూరమునుండి ఇచ్చటికి వచ్చి ఈ కొండపై హరికథా గానము చేయుట అబ్బురముగానున్నది.” భక్తురాలు “వీరి తాతముత్తాతలందరూ నరసింహ అను నామమును కలిగి యుండి మాతృభూమికొరకు ప్రాణములిచ్చినారు. నారసింహుడు వీరి కులదైవము. ఈ ఆలయ అర్చకులు వీరికి దూరపు బంధువులే.” భారతవర్ష పాడుచుండెను….

నృసింహ నరసింహ నారసింహ,  నృసింహ నరసింహ నారసింహ 

నరమూర్తివి గావు నారాయ ణువిగావు అవతారమూర్తివి నారసింహ

ఏకవింశతి రూప నారసింహ!!   ఏకవింశతి రూప నారసింహ!!!

చతుర్దావతారము చండప్రచండము బహు ఉగ్రరూపము నారసింహ!!

మిషేల్కు నిజము దెలిసిపోయినది.   పాఠశాల భూవివాద మంతయూ   బూటకమని ఆదంతయూ  ఎం ఎల్ తనని వశపరుచుకొనుటకు పన్నిన జాలమని తెలిసి ఆమె ముఖము రైలు యంత్రమందు మండుతున్న రాచబొగ్గు వలెనున్నది.  తనకు జేసిన మోసముతోపాటు తన ఇంటనే తనతో కామక్రీడలాడుచున్న కామ పిశాచమును తలుచుకొని హృదయము రగులుచుండ తల్లితండ్రులకు కలిగిన క్షోభకు తుదిపలుకు చెప్పుటకు నిర్ణయించుకొని  ఎం. ఎల్. రాకకొరకు ఎదురు చూచుచుండెను.

 హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దితి కశ్యపులకు జనియించినారు

 ఆకృతి వికృతి రాక్షస ప్రక్రుతి లోక కంటకులు ధర్మ భంజకులు

 హిరణ్యాక్షుడు బలగర్వితుడు విష్ణువు పైనే దండెత్తినాడు

 చండ వేదండ శుండాదండ మండిత భుజాదండబున గదాదండంబు   

 కొని విష్ణువు పైనే దండెత్తినాడు భీకర పోరున మరణించాడు. 

"ప్రతిరోజూ నేను సింహం నువ్వు  జింక"యనుచు ఇచ్చము వచ్చిన రీతిన  ఆటలాడెడివాడవు కానీ నేడు నేను సింహం నీవు జింక"యని గట్టిగా జెప్పు కొనెను. ఆమెకు కొండపైనుండి గానము వినిపించుచున్నది.

అతని కంటె ఘనుడు హిరణ్యకశిపుడు

ఘోరతపముచే వరములు పొంది తపోశక్తిచే ధుర్బేధ్యుడైనాడు.

 గాలిలోన గంగలోన, ఇంటిలోన  పైనగాని

 రాత్రిగాని పగలుగాని నింగిలోని నేలనైనా

 మనిషి కాని మృగము కాని చంపకుండునట్లు వరముపొందినాడు

ఆనాటి రాక్షసులు  దేవతలను ప్రార్ధించి వరాలు పొంది సజ్జనులను పీడిస్తే  నేటి రాజకీయ నాయకులు ప్రజలను ప్రార్ధించి పదవులు పొంది సజ్జనులను పీడిస్తున్నారు. ఆనాటి  శక్తివంతులైన రాక్షసులు విష్ణులోకంపై దండెత్తితే  నేడు శక్తి వంతులైన రాజకీయనాయకులు దేవుని మాన్యాలపై దండెత్తుతు న్నారు. అచ్యుతపద శరణాగతుడు ప్రహ్లాదుని క్రోధంతో హిరణ్య కశిపుడు  పిలిపించి నేనంటే సకల భూతాలు వణుకును. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు? అని గద్దించెనుచక్రే నాకు దిక్కు”   “ఎచ్చటున్నాడు నీ చక్రి?” "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిననందందే గలడు" "అయితే స్తంభమునవా జూపగల చక్రిన్ గిక్రిన్?"

ప్రహ్లాదుడు"బ్రహ్మనుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండే వాడు స్తంభమునందెందు కుండడు? స్తంభాంతర్గతుడై ఉండును.” "సరేఅని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచెను. బ్రహ్మాండం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించి ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణవిశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, మహాప్రభావుండునైన  నృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించెను.

                                                                                                                                                                                                                                                     


 

సింహం వచ్చెను జింక ఎక్కడ?" యనుచు లోపలి కడుగిడుచున్న ఆ మానవ మృగమును నాగిరెడ్డి వెనుకనుండి రెక్కలు విరిచి పట్టుకొనెను. మిషేల్ ఛాతిలోనొక్క పోటుతో అంత మొందించెను. పూర్తిగా శ్వాస నిలుచువరకూ వేచియుండి శవమును ఠాణాకు ఈడ్చుకొని పోయి నేరమునఁగీకరించి  మిషేల్  లొంగిపోయెను

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు

హరి కథ ముగిసెను సింహాచలం కథ కూడా ముగిసెను.


2 comments:

  1. This long episode is so nice. It is visible. The killing of Simhachalam while Harikatha is going on is an amazing picturization.

    ReplyDelete
  2. I dare say that ordinary people cannot read to this extent. You are extraordinary, an amazing inspiration. All the credit of my work goes to you.

    ReplyDelete