Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, December 20, 2021

మనోహరి : నృత్య రూపకం

మనోహరి  సంగీత నృత్య రూపకం అంటే Ballet  అనుకోవచ్చు. 

పులకరింపజేసే నృత్యంతో, మనోహరి కథ నృత్య రూపకంగా ప్రదర్శించబడుతుంది. మనోహరి  పురాణ సాహిత్యం కోవలోకి వస్తుంది. సంగీత నృత్య రూపకంలో వచనం,  గానము నృత్యం  మూడూ  ఉంటాయి.

ఇందులో ముఖ్య పాత్ర ధారులు: మనోహరి ప్రకృతి బాలిక,   వన దేవత, ఇంద్రుడు, ఇంద్రుని కొడుకు మిధుషుడు, పర్వతరాజు దశరూప, ప్రభవ సంగీత సాహిత్య సమలంకృతుడైన పండితుడు.  ఇతర పాత్రలు : ప్రభవ శిష్యుడు.


వనమువలె అలంకరించ బడిన వేదిక. పువ్వుల వేష ధారణలో పిల్లలు,  చెట్లు.

తెర తీయగానే చుట్టూ కొండాకోనలు ఆ మధ్యలో    ఒక వనం.  అందులో కి  ప్రవేశిస్తుంది ఒక అందాల రాసి ఆమె పేరు మనోహరి. ఆమె గత జన్మలో ఆమె ఒక అప్సర. శాపవశాత్తూ భూమిపై ప్రకృతి ఒడిలో పెరుగుతున్న బాలిక . 

మృదంగం మెల్లగా వినిపిస్తూ ఉంటుంది, వేదికపైకి వస్తుంది చెట్లను తాకుతుంది, లతలను ముద్దాడుతుంది. నాట్యం చేస్తుంది. మూడు నిమిషాలు  నాట్యం కొనసాగుతుంది.  నాట్యానికి  బేక్ గ్రౌండ్ గా  కథ  వినపడుతుంటుంది


పల్లవాలె  శిరోజాలు  జాజితీగకూ బిమ్బాధరి వదనమే చంద్రబింబము  
నవనీతము దేహమెల్ల  గంధ మోదము మనోహరము ఆమె చూపు
చంద్రకిరణము  పుష్ప భాష విచక్షణ , పుష్ప స్నేహము చిత్ర పతగ 
విహగములే  ఆమె నేస్తము.  కానరాదు  కానలోన ఒక్క వైరము.  
అజాత శత్రువు  పూలబాలకు ప్రకృతే మాతృమూర్తి  పూలబాలకు


పువ్వులు గుసగుసలాడుకుంటుంటాయి.  పూలబాల వాటిని చూచి గ్రహించి  వాటి దగ్గరికి పోయి వాటినిప్రేమగా తాకుతుంది. వాటితో మాట్లాడుతుంది. వాటిని ముద్దాడుతుంది. పువ్వులు కిలకిలా నవ్వుతాయి. ( మృదంగం జోరు కొద్దిగా పెరుగుతుంది)  మీద కూర్చొన్న పక్షులు కూ కూ  రాగాలు తీస్తాయి.  ( వయోలిన్ ఉత్సాహంగా మ్రోగుతుంది)  పువ్వులు పూలబాలను చుట్టుముడతాయి  నాట్యం మొదలవుతుంది.

వనమే తన నివాసము వనమే తన విహారము 
చామంతులు పూబంతులు కంఠాహారము 
చామంతులు పూబంతులు కంఠాహారము, 
సంసప్తకి నడుముకి  సన్నజాజులు. 
 విరజాజులు  గాజులు చిన్న మోజులు  
విరిమల్లెలు విరబూయును ఆమె హాసము. 
వనమే తన నివాసము వనమే తన విహారము 

వచనం : పల్లవములు ధరించిన  జాజితీగ వంటి    ఈ  ముగ్ద మనోహర బాల,  ప్రకృతి ఒడిలో పెరిగే ప్రకృతి బిడ్డ ప్ పూలబాష తెలిసిన ఈ పూలబాల పూవుల గుసగుసలు విన గలదు, పూలతో సంభాషించగలదు. జింకపిల్ల వలె కొండకోనల్లో విహరిస్తూ, పక్షులతో కలిసి పాడుతుంటుంది ,    జింకలు , పక్షులు , పువ్వులు ఆమె నేస్తాలే.   ఆ వనమే ఆమె నేస్తం." 


                       


వచనం ముగిశాక  నాట్యం ఊపందుకుంటుంది ఒక నిమిషం కొనసాగి ముగుస్తుంది.    


దూరదేశ నివాసీ ప్రభవనామ ద్విభాషి 
సంగీత  సాహిత్య  సుధాసాగరా 
దూరదేశ నివాసీ ప్రభవనామ ద్విభాషి 
ప్రణవనాద స్వరూపము  వజ్ర దేహము 
ప్రవేశించే కానలోకి  దైవ ప్రణితము 


వచనం : ఆ కొడకోనల్లోకి  దూరప్రాంతం నుండి శిష్యుడితో కలిసి అడవిలో కొస్తాడు సంగీత సాహిత్య సమలంకృతుడైన ఒక పండితుడు.  

వేష భాషలందు అతడు వేదవాక్యమే 
సంగీత సాహిత్య సమలంకృతుడే 
కేశవృక్ష విచారేణ శిష్య సహిత అభ్యాగత  
ప్రణిహిత పండిత కుమార  ప్రభవ 
ప్రవేశించే కానలోకి  దైవ ప్రణితము 

వచనం : కేశపుష్పవృక్షము తో లైర్  అనగా  వీణవంటి ఒక సంగీత పరికరం చేస్తే అద్భుత రాగాలు పలుకుతుంది తెలుసుకుని ఆ సంగీతసాధనాన్ని తయారుచేయడానికి అనుభవమున్న ఒక శిల్పిని(తన శిష్యుడిని ) వెంట తీసుకొస్తాడు.  


కేశపుష్పవృక్షాన్ని  వెదుకుతూ  

సుస్వరాల వీణకై తరలివచ్చెనే ,  కేశపుష్ప వృక్ష మే వలసివచ్చెనే
సంగీత మాధుర్యమే  కురిపించే వచ్చెనే తరతరాలు నిలిచి యుండు  ఆ వీణకై, 
సంగీత సాహిత్య సమలంకృతుడే ఎచటినుండో ఈడకీ   తరలివచ్చెనే , 


 దేవతలను మెప్పించిన దివ్య గానమే 
 శిష్యునితో పండితుడు తిరుగ  సాగె;
అడవంతా వెతక సాగె  తిరిగి తిరిగి అలిసెను 
అలసి అలసి తిరిగెను. కొండలలో తిరిగెను 
కొనలలో  వెతికెను.  నిశ్చల  కొలనులో తన
 నీడ చూసి నవ్వెను.    

జఢుడై  కూర్చొని జడలు విప్పెను 
జడివాన మొదలాయెను  
ఒడలె తడిసెను తడి మన్నెతట్టెను 
ఆడవే  పుష్పమై వికశించెను.  

చిలుకలు జేసెను  కిలకిల నాదం ,
కోకిలల కూతల వినిపించే  గానం;
స్వరలయమున నిండిన అడవి,
అతిథి మన్నించెను ఆహ్వానించెను
ఆడవే  పుష్పమై వికశించెను. 


కమలాలు తేలాడు కొలనులోన  జలకేలికలాడే
మీనాలు ఈదాడు నీటిలోనే మీనాలతో మీనాక్షి  ఆటలాడే 
తపనహరుణి తేజోమయి తాపసులకును ||
సరసతరంగిణి  నీరజముఖి నవయౌవ్వని సొగసుచూసి 
మూగ శ్లోకాలు మనసులో మీనాలుగా ఈదులాడే   
మనసు మాయల జాలముతో మర్మమున బంధించె ||

జలక్రీడలతో అలలపై లాలిస్తూ, సూర్యకాంతిని తలపించే తేజస్సుతో, అప్సర తన యౌవన సౌందర్యంతో పండితుల మనసులను మాయగా బంధించింది.  



జలక్రీడామణిమాలికానన్యసౌందర్యభారార్థరూపం చూచి।  
చకితో మునిరాజ ఏకస్థానే స్థిత్వా మనో నిశ్చలీకృతవాన్॥

తతః శిష్యో విచింత్య తస్య స్థితిం నిరుదీపతామానినం।  
విముఖః ప్రస్థితః స్వకార్యే మునిం విస్మృత్య స్వయంపథమ్॥


జలకాలాడుతున్న అందాల రాశిని  చూసి చకితుడై నిలిచిపోతాడు.  అతడితో వచ్చిన  శిష్యుడు  నిశ్చలుడై  నిలచిన పండితుణ్ణి చూసి   చూసి లాభం లేదనుకొని అతనిని వదలి వెళ్ళిపోతాడు 
 
  
మనిషి నిగ్రహమే దప్పెనో    విగ్రహమై పోయెనో  
ఆగ్రహమే వచ్చెనో  వీణియ కొరకు తీగలు తెచ్చి
తీగకు చిక్కితివి వీణను చేయగ కానకు  వచ్చి,  
నీవు జాణకు జిక్కితివి జాగు చేయక   జక్కగ పోయెద 
జల్లెడపట్టెద వృక్షము వెదికెద. జాణ ను జూచుచు 
జక్కగ నుండుము.  జాణ ను జూచుచు జక్కగ నుండుము 
 
 

  పండితుడు మనసులో  : 

   శా.  కొండల్లో  తిరిగాడి  పాడు   తరుణీ  కురంగాక్షి  పూభా సలన్               
         గుండెల్లో నిలబెట్టి  పారు తురవాగు  లందాడి  చర్లాడగన్       
         ఎండల్లో తిరిగేటి  ఘండములు  చూచెసంగేను  సయ్యాటకున్  
        పండల్లే  మెరిసే  లతాంగి   పరితాప మందీదులాడ ల్లనన్

    శా. పూలల్లో   తిరిగే  టిబాల  వెలిగే   పుష్పాలం  కృతబ్ర స్వజన్            
        చేలల్లో   మెలిగే  టిబంగ  రులతన్   జితక్రో  ధమందా రమున్    
        నీళ్ళల్లో  మెరిసే   టిచేప   లమిరే  నెనేత్ర   ద్వయంబం  దునన్    
        ఒళ్ళల్లా   మెరిసే టివంపులమిరే   ఉరోజా  లచందా లకున్

      శా.ఆటాడే   విరిబో  డిచూచె  విరులే   హసించ  ప్రమోదం బుగా
         మాటాడే కుసుమా  లుకూడి  మురిపిం  పపూబా  లముద్దా డగా 
         వేటాడే   భ్రమరా   లుబాల  నుపుష్పం   బిదేనం  చుకాటే యగా   
         పోటాడే  నలివే   ణిబంభ    రముతో    ముద్దుగా రుభాషా డుచూ


పద్యాలకు వివరణ:  పూ, పక్షి,  పల్లవ,  భంబురముల మైత్రిని బడసిన  జవ్వని నవ్విన పువ్వులు వికసించును,  శ్వాసించిన పూతావులు గుభాళించును, భాషించిన పూలు మురియును   మీనములే ఈమెకు నేత్రములవలె అమిరినవి కదా. ఆహా!  ఈ జవ్వని దేహము బంగారు కాంతులీను చున్నది

అట్లు ఆమె అందమునకు ముగ్దుడైనా,  ఆమె ఎదుట పడలేక  తన అంతరంగము ను  చెప్పలేక ప్రభవ   ( పండితుడు) అక్కడినుంచి నిష్క్రమిస్తాడు. కానీ ఆమెను మరువజాలక ఆ అడవిలో ఒక చెట్టుక్రింద కూర్చుని తన భుజాన్న ఉన్న సంచిలోంచి తాళ పత్రాలు తీసి  వ్రాసి  పారవశ్యంతో ఆమెపై అద్భుత గానం చేస్తుంటాడు. అతడు పాడుతున్నప్పుడు   చిలుకలు తూనీగలు  అతడిని చుట్టుముడతాయి   ఆ చిలకల్లో  ఒక చిలక  వనదేవత.  తూనీగలన్నీ  సూక్ష్మ రూప అప్సరలు.

అతడి గాన  మాధుర్యములో  కరిగి  వారి  రూపములను బైటపెట్టక  అతడి గానమును ఆలకిస్తూ ఉంటాయి . అందులో ఒక  చిలక వనదేవత . ఆమె ప్రభవ గానాన్ని మెచ్చి   చిలకల కు ఆ గానాన్ని  పట్టుబడు శక్తిని ఇచ్చి  ప్రభవ ప్రేమను ఎరిగించమని  ఆజ్ఞాపించును.  వన దేవత వారికి తల్లి కావున ఆ కీరములన్నీ గాలిపాటలాపి ప్రేమపాఠాలు పాడుతూ  ఉంటాయి  పూలబాల   చిలకల  చిలకల గానము విని కొంత,  పూవులా గుసగుసలు విని కొంత తనని ప్రేమించిన  ప్రభవ గొప్పతనమును తెలుసుకొంటుంది. చిలకలు తాళ పత్రములను ముక్కుతో కరుచుకుపోయి పూలబాల పై వానలా కురిపిస్తాయి.  పూలబాల ప్రభవ అన్వేషణలో పడుతుంది. 

పూలబాలని తండ్రివలె  ఇష్టపడే   పర్వతరాజు   "దశరూప" (దుష్టశక్తి )  చిలకల గానాన్ని  వింటాడు.  ప్రభవ ను ద్వేషిస్తాడు.  పూలబాల ప్రభవని చాటుగా చూసి అతడి గానాన్ని విని ఆరాధిస్తూ ఉంటుంది.  అది ప్రభవ  గ్రహించడంతో వారిరువారి కళ్ళు  కలుసుకుంటాయి. వారు  కళ్ళతో  ప్రేమను తెలుపుకుంటారు.  పూలబాలని పండితుడు పెళ్ళిచేసుకుని తన వూరు తీసుకుపోతాడని  చిలకలు గానం చేస్తాయి.  తన కుమార్తెవంటి పూలబాలని పండితుడు పెండ్లి చేసుకొని తన వూరికి  తీసుకు పోతాడని పక్షుల గానం ద్వారా గ్రహించి దశరూప కుపితుడౌతాడు. ప్రభవ పూలబాల వన విహారములు చేస్తుండగా చూసి కంట గించుకుంటాడు.  మన్మధుడు  పర్వతరాజు ని  చూచి నవ్వుకొని   పెంకితనముతో   తన పూ  శరములను ప్రభవ పూలబాల పై గుప్పిస్తాడు. ఆ శరములు వారిలో మోహమును పెంచుతాయి.  ప్రభవ పూలబాల శృంగార క్రీడలాడుకోడం చూచి ఓర్వలేని  "దశరూప" సుడిగాలి సృష్టించి వారిని విడదీస్తాడు.

పూలబాల వంటరిగా  విరహము లో యుండగా ఇంద్రుని కొడుకగు మిధుషుడు  చూచి  అబ్బురపడి ఆమెను వలచి  తన మోహమును తెలియజేస్తాడు.  పూలబాల అతడికి బదులీయక  బెదిరి పారి పోతుంది. మిదుషుడు  తన దివ్య దృష్టి తో ప్రభవను కనిపెట్టి  ఆకాశమునా  జ్ఞాపించి   ప్రభవపై  పిడుగుపడునట్లు చేసి మట్టుబెడతాడు.  ప్రభవ  చేసిన  పుణ్యం డటం వల్ల అతడి ఆత్మ స్వర్గానికి పోతుంది. అరణ్యమందు అతడి ఎముకలతో  అతడితో వచ్చిన వడ్రంగి లైర్( వీణ వంటి పరికరము) ను తయారు చేసి రోదించి తన వూరికి పోతాడు. 

ప్రభవ స్వర్గ  ప్రవేశము : నర్తకీ మణులు నాట్యము చేస్తుంటారు.  దేవరాజు ఉన్నతాసనముపై కూర్చుని వారి నాట్యాన్ని చూసి ఆనందిస్తుండగా సభికులు మైమరిచి తాళం వేస్తుంటారు. వారి నాట్యము గానములేక సాగుచుండగా ప్రభవ వారి నాట్యమునకు తన గానాన్ని జోడిస్తాడు.



సభికులు అతడి గానమునకు  పారవశ్యమును  అనుమతి లేని  ప్రవేశమునకు ఆగ్రహము చూపగా  దేవరాజు  కొలది కాలము అతడిని స్వర్గప్రాప్తి అభించెనని సభికులతో చెపుతాడు. ప్రభవ దేవసభలో నిత్యమూ తన గానంతో ప్రభవ సభికులను ఆనందపరచ వలసినదిగా కోరతాడు.

పూలబాల వేదనతో వనములో  పాడుతూ ఉంటుంది 


ప్రభవకు ఆ గానము వినపడి తన మరణానికి కారణం తెలుస్తుంది.  

స్వర్గ లోకములో   ప్రభవ  పూలబాలని పెండ్లి ఆడవలెనని   మిధుషుని కోరును.   ప్రభవ మాటలతో మిహుషుడు పరివర్తన చెంది క్షమించమని కోరి వేడుకొనును. తన తండ్రికి తనతప్పును తెలియజేసి  ప్రభవకి జీవితమును ఇచ్చి భూమికి పంపమని కోరును. ప్రభవ శరీరము కాలిపోయినది కావునా అది సాధ్యము కాదని ఇంద్రుడు చెప్పును . ప్రభవ మిహిషుని ఓదార్చి పూలబాల కు జీవితమును ఇమ్మని వేడుకొనును. 

ఇంద్రుడు తన మహిమచే భూమిపై యున్న సంగీత పరికరము ద్వారా   ప్రభవ స్వర్గములో పాడుచున్న గానము వెలువడునట్టు చేయును  ప్రభవ పాట  లైర్ యందు  విని స్వాంతన పొందును.  ప్రభవ గానముచే     పూలబాలను మిహిషుని వివాహమాడునట్లు   అంగీకరింపజేయును.   పూలబాల ను ఇంద్రుడు స్వర్గమునకు కొనిపోయి మిహుషు నికిచ్చి వివాహము చేయును.   పూలబాల వివాహము జరుగురోజు ప్రభవకు స్వర్గమునందు ఆఖరిరోజు. ప్రభవ అత్యద్బుతముగా గానము చేసి సభను రంజింపజేయును. వివాహమైన మరుక్షణమ ప్రభవ ఆత్మ అంతర్థాన మగును.

ప్రేమ త్యాగమును కోరుకుంటుందని తెలియజేసే రూపకం మీకు నచ్చితే తెలియజేయండి.

భవదీయుడు 
పూలబాల

2 comments:

  1. పూలబాల వ్రాస్తున్న పూలబాల కొంగ్రొత్త ప్రక్రియ.
    శార్దూలములతో అనగా పులులతో పూలబాల ఆటలాడుకోవడం మాకు వినోదం గా ఉంది

    ReplyDelete
  2. పూలబాల గారి కలం నుండి మరో మహాకావ్యం ఉద్భవించబోతుంది అన్నమాట. సాహిత్య ప్రియులకి మరో కానుకను అందించబోతున్నందుకు ధన్యవాదములు. శార్దూలములతో సై అనుటకు సిద్దముగా ఉన్నాము.

    ReplyDelete