Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 6, 2022

భారతవర్ష వెనుక కృషి

కాలం వెంట కలంతో పరుగు. ప్రాణాలు చాలొచ్చే ప్రయాణం.

"నా పగలు సెగలు కక్కితే నా రాత్రులు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి"


2020 జులై 9 వ తారీకున భారతవర్ష మొదలు పెట్టినదగ్గరనుండి  కాలం వెంట కలంపట్టుకుని పరిగెడుతూ కవితా జాలంలో చిక్కి ఉక్కిరి బిక్కిరవుతున్ననాకు చుక్కలు లెక్క పెడుతున్నట్టు పని ఎంతకీ తరగదు." గూగుల్ ట్రాన్స్ లిటిరేషన్ టూల్ వాడి తెలుగులో రెండు వందల వృత్త పద్యాలతో వంద పాత్రలతో ఒక్క ఆంగ్ల పదం (ఇంగ్లీషు ముక్క) వాడకుండా భారతవర్ష కథను టైప్ చేసి 142 భాగాలుగా నా బ్లాగ్ లో పోస్ట్ చేసాను.


కాళ్ళు చేతులు తిమ్మిర్లు నడుము మెడలు నొప్పులు

"రాత్రి కేవలం మూడు గంటలు నిద్ర పోయేవాడిని. రాత్రి 12. 00 గంటలు నుండి తెల్లవారు ఝామున 3.00 గంటలవరకు పడుకునేవాడిని. కొన్ని రాత్రులు పూర్తిగా నిద్రలేకుండా రాస్తూండేవాడిని."

"నడుము మెడలు నొప్పులు కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి పోయేవి గంటల సేపు టైప్ చేయడంతో వేళ్లు బిగుసుకు పోయేవి."

సంవత్సరం పాటు  ప్రతి రాత్రి మూడు గంటలే  నిద్ర పోయినా ఆరోగ్యం  భద్రంగా ఉందంటే ఆశ్చర్యమే.  2021 ఫిబ్రవరి లో (2020 జులై -2021 ఫిబ్రవరి) 8 నెలల్లో  భారతవర్ష  రచన పూర్తయ్యింది.    

"భారతవర్ష రాసేసి పెద్ద గ్రంథం రాసేసాను అంతా అయిపోయింది. అనుకున్నాను, తరువాత దాన్ని మైక్రో సాఫ్ట్ వర్డ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసాను. ముప్పైసార్లు తప్పులు దిద్దిన తరువాత తెలిసింది తెలుగు టైప్ చేయడానికి గూగుల్ వాడడం ఎంత తప్పో.


తప్పులు దిద్దుతుంటే తాతలు దిగొచ్చేవారు.

ఎన్నిసార్లు సరిచేసి 100 పేజీలు దాటి వెళ్లలేకపోయేవాడిని ముందుకు వెళ్ళిపోయినా 10 వ పేజీలో నో 20 వ పేజీలనో ఒకటో రెండో తప్పులు కనిపిస్తుండేవి. మళ్ళీ మొదటినుంచి చూసుకోడం దిద్దడం. వారాలపాటు ఇదే పని రాత్రి పగలు. చేతులు పడిపోతుండేవి.
గూగుల్ ట్రాన్స్ లిటి రేషన్ టూల్ వాడడం వచ్చిన తప్పులు ఇన్ని అన్నీ కావు.

ఏంతో ప్రేమగా రాసుకున్న పద్యాలు కొరడా పట్టుకొచ్చి

తప్పులు దిద్దుతుంటే 4 లైన్ల పద్యాలలో ఒక లైను మరుసటి పేజీ లోకి వెళ్లిపోయేది. 1 వ పేజీలో 3 లైన్లు ( పాదాలు) రెండవ పేజీలోకి 1 లైను ( పాదం) వెళ్లిపోయేవి. ఆ ఒక్క లైన్ ని 1 వ పేజీ లోకి రప్పించడానికి పద్యానికి ముందున్న ఒక పేరాగ్రాఫ్ లో ఒక లైన్ ని తగ్గించడం. తొలగిస్తే సులభమే తొలగించలేక కుదిస్తుంటే నరకం. ఏంతో ప్రేమగా రాసుకున్న పద్యాలు కొరడా పట్టుకొచ్చి చీరేస్తున్నట్టు అనిపించేది. 

 

కన్నీళ్లు పెట్టించిన  ముద్రణ

కుక్క పాట్లు పడి  1200 పేజీలని 1200 సార్లు స్క్రోల్ చేస్తూ  తప్పులు సవరణ పేజీల సర్దు బాటు పూర్తి చేసిన తరువాత   కన్నీళ్లు పెట్టించినతరువాత కానీ ముద్రణ పూర్తికాలేదు. 

న్నో పబ్లిషింగ్ హౌస్లను అడిగాను.  ఎవ్వరూ తక్కువ కాపీలు వేయమన్నారు. ఒక వెయ్యి కాపీలు వేయించుకోమని చెప్పేవారు. 10 లక్షలు బిల్లు చెప్పేవారు. ప్రయత్నం చేయగా చేయగా  ఒక రెండు వందలు పుస్తాకాలు వేయనుకోలేరా అని మాటలు వచ్చాయి? చిట్టచివరకు ఒక పబ్లిషర్  "ఒక వంద పుస్తకాలు అయితే వేస్తా ము. పెద్ద ఖర్చు ఏముండదండీ 2లక్షలు అంతే! అదిచ్చుకోలేరా? కానీ 1 సంవత్సరం టైం కావాలి." అన్నారు.   


గుండె పగిలే మాట  "మీరు చేసిన పని పనికి రాదండీ.."

 "మీరు మైక్రో సాఫ్ట్ వర్డ్ మీద సులభంగా సర్ది తీసుకొచ్చేశారు. మేము మళ్లీ  అను ఫాంట్స్ వాడి  పేజ్ మేకర్లో  మొత్తం మొదటినుంచి  టైప్ చేయాలి."అన్నారు. నా గుండె జారిపడి పగిలిపోయింది. 


ముద్రణ ఇలా నేనే చేసుకున్నాను

కన్నీళ్లతో ఇంటికి చేరుకొని అనేక పెద్ద నవలలు తీసుకుని ఆ పేజీల ప్రింట్ ఏరియాని కొలిచి  ఆ  కొలతలతో  నేనే ఇంట్లో ప్రింట్ చేస్తూ ప్రయత్నం చేసాను. పేజీలు ఎగుడు దిగుడులు  వచ్చేసాయి  తప్ప  కుదరలేదు.  చాలా పేజీలు పాడయ్యాయి   అనేక ప్రయత్నాలు చేయగా  15 రోజుల తరువాత ఒక ఐడియా వచ్చింది ఆ సెట్టింగ్ పనిచేసింది. తల్లి సరస్వతి దయ  అనుకున్నాను. ముద్రణ చేసుకున్నాను.     

  

ముద్రణ పూర్తయిన తరువాత అందమైన ముందుమాట పొందడానికి అందంట, ఇందంట తిరిగి వాళ్ళని  వీళ్ళనీ కలిసినా చాలాకాలం కాలం  కలిసి రాలేదు. ఎవరిని కలవాలో  తెలిసిరాలేదు.  అయినా పట్టిన పట్టు విడవలేదు. బుద్ధప్రసాద్ గారో గారికిపాటివారో, అలాంటి వారెవరైనా ముందుమాట రాస్తే  బాగుటుందని ఆశించాను. నా కల నన్ను శాసించింది. వందలాదిమందికి వందనాలు చేస్తూ   పిచ్చిచొచ్చేలా  ప్రయత్నాలు సాగించాను.  1265 పేజీలు చదివే నాథుడేడీ? 

తెలుగు అనవసరంగా రాసావంటూ అయినా ఇప్పుడెవరు చదువుతున్నారు అంటూ పట్టపగలే చెవులో కీచురాళ్ళ రొద. నా రాత్రులు ఆవిరైపోయాక,  నా రక్తం ఆవిరైపోతోంది ఇలాటి మాటలతో.  చీకటి అలుముకున్న మార్గంలో ప్రాణాలు చాలొచ్చే ప్రయాణం. ఒళ్లు మరిచిపోయే ప్రయాణం. తుళ్ళుతూ కాస్సేపు తూలుతూ కాస్సేపు నిరాశా సౌధంలో ఆశాలలూయల లూగాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు చివరికి చీకట్లు చీల్చుకుని వెలుగు కిరణాలు ప్రసరించాయి. 2021 Oct 7న యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆచార్య కృష్ణారావు గారిని యూనివర్సిటీలో కలిసి భారతవర్ష ఇచ్చి ముందుమాట ఇవ్వవలసిందిగా వేడేను. 

నవల స్వీకరించి పూర్తిగా చదివి నవంబర్ 7 వ తారీకున మూడు పేజీల ముందుమాట  స్వహస్తాలతో వ్రాసి ఇచ్చారు. ఇది అద్భుతం.  2021 Oct 27న డాక్టరు లక్ష్మిపార్వతిగారు విజ్ఞానవేదిక సమావేశాల్లో పాల్గొడానికి విజయవాడ వచ్చారు. ఆ సభలో కలిసి ఆవిడకు భారతవర్ష ఇచ్చాను. ఆవిడ కూడా ముందు మాట ఇచ్చారు.   ఇది రెండవ అద్భుతం. 

భారతవర్ష గ్రంధం సిద్ధం. ముందుమాట లేనిదే  అంత  పెద్ద గ్రంధానికి అందం ఏముంటుంది?  గురువుగారు గంధం పూసిన తరువాత అందానికి లోటేముంటుంది? భారతీయ ఆత్మకి ప్రతీక భారతవర్ష అని  ఆచార్యులు భారతవర్షకి కిరీటమే పెట్టారు. గ్రంధంలో అందం అందులో సాహిత్యంలో  సాహిత్యలో కలిసి ఉన్న సంగీతం లో ఉంది. భారతవర్షలో అనేక సంస్కృత  కీర్తనలు, గీతాలు  ఉన్నాయి వాటినేంచేయాలి? వాటికి ట్యూన్ కట్టి, వాటిని సాధన చేసి యూట్యూబ్లోకి  ఎక్కించాను.  ఇంకా పాడేవాళ్లు కావాలి.  వెనక సంగీతం కావాలి 

పాఠకుల స్పందన  

అసలు భారతవర్ష కథ చదివి ఎవరైనా ఏమంటారో తెలుసుకోవాలని ఉండేది. నా భార్య వరలక్ష్మి   నా మొదటి పాఠకురాలు విమర్శకురాలు.  కథలో అనవసరమైన అతి అనిపించే ఏ విషయం వచ్చినా ఆవిడ వెంటనే చెప్పేది , కథ విలువ పోతుందని గట్టిగా చెప్పేది, సక్రమ మార్గంలో ముందుకు నడిపించేది.  నా బాల్య స్నేహితుడు ఎవ్వడూ కూడా నాలుగు పేజీల ఇతివృత్తం కూడా చదవడానికి ముందుకు రాలేదు. నాలుగు లైన్ల ముందుమాట వ్రాయడానికి కూడా కుదరదని చెప్పేసారు.   

ప్రత్యేక పాఠకురాలు 

శ్రీమతి అడపా తులసి గారు  నేను భారతవర్ష రచన చేస్తున్నంతకాలం అంటే 8 నెలల పాటు రాత్రి పగలు ఆన్లైన్ లో అర్థ రాత్రి వరకు భారతవర్ష చదివే వారు.  ఉద్యోగం చేసి అలసి ఇంటికి వచ్చిన ఆమె కు రాత్రి 9.00  తరువాత మాత్రమే తీరిక దొరికేది. 9. 00 నుండి అర్ధ రాత్రి దాకా ఒక్కోసారి తెల్లవారే దాకా చదువుతూనే ఉండేవారు. కథ అంత  ఆశక్తికరంగా ఉండేది.   కథ చదివి  నా బ్లాగ్ లో   తన స్పందన లిఖించి కానీ పడుకునే వారు  కాదు. 


సంగీతం     

నా సంగీతం సమకూర్చడం కోసం నేను పడ్డ శ్రమ రాస్తే భారతవర్షను పోలిన  మరో గ్రంధం అవుతుంది. మూడునెలల పాటు వందల ఫోన్ కాల్స్  సింగర్స్ కోసం.  కాల్ చేస్తే  అలాగే కొంచెం బిజీగా ఉన్నాం వారంరోజుల తరువాత  చేయమని అనేవారు. మళ్లీ  చేస్తే మరి తీసేవారు కాదు.  చిట్టచివరకు  సింగర్స్ ని కలసి పాటల స్ట్రిప్ట్ చూపిస్తే  మొదట హార్మొనీతో మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ కడితే తప్ప పాడం  అన్నారు.  లేదు నేను ట్యూన్ కట్టి పాడి ఉన్నాయంటే . ఆ పాటలు విని ట్యూన్ మార్చి శాస్తీయ సంగీతాన్ని మోడర్న్ సినీగీతాల్లా పాడేవారు కొందరు. వారి ఉచ్చారణ దోషాలతో వింటే భయం వేసేలా పాడేవారు కొందరు. 


మళ్ళీ  ట్యూన్ కట్టించమని..   ట్యూన్ మార్చేస్తే పాట  విలువ పోతుందని తెలిసి కూడా తప్పని సరి పరిస్థితులలో  అనేక రికార్డింగ్ స్టూడియో ల ఓనర్స్ ని కలిసినా  వాళ్ళు డబ్బులకోసం మాట్లాడేరు తప్ప సంగీతం గురించి మాట్లాడలేదు. బేక్గ్రౌండ్ మ్యూజిక్ కి  పాటకి పది వేలు చొప్పున్న ఒప్పుకుంటే  చేస్తామన్నారు లేదా మొత్తంగా  40 వేలు అన్నారు.   హైద్రాబాద్ కి చెందిన ఒక గాయకురాలు పాటలు పాడడానికి 50 వేలు అడిగింది.  హై ద్రాబాద్ లో తారక్ స్టూడియో తారక్ గారు  ఈ పాటలకి లక్ష రూపాయలు అడిగారు. ఆయనది తప్పేం లేదు పాటలు రేట్లు అలా ఉన్నాయి.  

నాబుర్ర తిరిగి పోయి నేను కాళ్లరిగేలా  తిరిగి తిరిగి  ఒక పెద్ద సంగీత కోవిదుణ్ణి కలిసాను. ఆయన నేను కట్టిన ట్యూన్స్ ఏంతో బాగున్నాయని చెప్పిన మీదట  విజయవాడ గాయకుల వెంట పడ్డాను.  ఒక మధ్యవర్తికి ఫోన్ చేస్తే అతడు ఒక గాయకురాలి  అన్నయ్యకి ఫోన్ చేస్తాడు ఆమె అన్నయ్యతోనే మాట్లాడుతుంది. నాకు సమాచారం రావడానికి అంటే ఒక చిన్న విషయం తెలియడానికి వారం రోజులు పట్టేది.  ఇక్కడికి రమ్మని అక్కడికి రమ్మని రోడ్లమీఁద కుక్కలా తిప్పారు. ఇలా మొత్తం  రాస్తే రక్తకన్నీరు అవుతుంది. 

 తణుకు గాయకుడు తాడేపల్లి గాయకురాలు విజయవాడ ఎఫ్ ఎం స్టేషన్ గాయకురాలు, వీరి పేర్లు చెప్పక్కరలేదు కానీ ఒకే గాయకుడికి 50 సార్లు వందనాలు చేసాను.  మూడు నెలలు పాటు ప్రతి వారం రెండు సార్లు ఫోన్ చేసేవాడిని. అలాగే ఒక ప్రోగ్రాం ఉంది అదయిపోయాక చేద్దాం అనేవాడు.

చిట్ట చిరవరకు చాలా..దారుణం....    ఆయన.  అనేక మందితో అనుభవాలు అయినా తరువాత  భీమవరంలో లక్ష్మి శ్రీవల్లి అనే ఒక స్వరరాణి అద్భుత గాత్ర సౌందర్యం, హృదయ సౌందర్యం  ఉన్న గాయకురాలు దొరికింది. భీమవరం రెండు సార్లు బండి మీద వెళ్ళాను. విష్ణురేడియోవారికి అందించిన సేవ గుర్తుంచుకొని  వారు నాకు  రికార్డింగ్ చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. దాంతో రికార్డింగ్ భీమవరంలో పూర్తయ్యి గానాల కోసం చేసుకున్న గాయాలు మానిపోయాయి. లక్ష్మి శ్రీవల్లి   డబ్బుఇచ్చినా తీసుకోలేదు. 

తదుపరి కాలంలో  ఋగ్వేదం  సిస్టర్స్ గా  లోక విడితులైన పద్మ శ్రీ కృష్ణ శ్రీ అనే ఇద్దరు ప్రఖ్యాత గాయనీ మణులు  తెలుగు భాష పై మమకారంతో నాపై గౌరంతో   భారతవర్ష గీతాలని పలుమార్లు  వేదికలపై ఉచితంగా ఆలపించి నాకు సాయపడ్డారు 


భారతవర్ష  పబ్లిసిటీ 

భారతవర్ష గ్రంధాన్ని ఎవరూ చదవకపోగా  నాలుగు పీజీలు ఇతివృత్తం కూడా చదవకపోతే రెండు పేజీల లో పాత్రల గొప్పతనాన్ని రాస్తూ ఉండేవాడిని, కథ గొప్పతనాన్ని , ఆధ్యాత్మికత , శృంగారము, హాస్యముఎలా ఉన్నాయి అని రెండు పేజీల చిన్న ఆర్టికల్స్  రాస్తూ ఉండేవాడిని.  భారతవర్ష  మళ్లీ మళ్ళీ  చదువుతూ  విశ్లేషిస్తూ అనేక పాత్రలమీద, భారతవర్ష లో  స్నేహ సంబంధాలు మీద,  అలంకారాలమీద వ్యాసాలు రాసాను.   


గిన్నిస్ బుక్ పరిశీలనలో భారతవర్ష 

 200 మంది జర్నలిస్టులని సంప్రదించాను ఈ వార్త ని ప్రచురించడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఒక ఇరవై సార్లు  బాగాతెలిసిన జర్నలిస్ట్ మిత్రుడిని సంప్రదించగా ఆయన కూడా మౌనం వహించారు. ప్రయత్నాలు మానకుండా అలా చేస్తూనే ఉన్నాను. చివరకు గురువుగారు అని నన్ను సంబోధించే శ్రీధర్ ఆయాళ్వార్ అనే హైద్రాబాద్ న్యాయవాది  భారతవర్ష గ్రంధాన్ని అమెరికా తెలుగు సంఘంవారికి పంపారు.

అమెరికాలో భారతవర్ష విడుదల 

 2022 జనవరి 16న  కనుమ పండుగనాడు వారు  భారతవర్షను వారి పండుగ సంబరాల్లో  వెబినార్లో ఆవిష్కరిస్తామని చెప్పారు.  అమెరికాలో రిలీజ్ అవుతున్నాదని మళ్లీ  చాలామంది జర్నలిస్ట్ మిత్రులకి చెప్పాను. అనేక మంది విని ఊరుకున్నారు. కానీ సాక్షి జర్నలిస్ట్ నారాయణగారు తెనాలి నుంచి "గిన్నిస్ పరిశీలనలో భారతవర్ష" రేపు అమెరికాలో విడుదల కాబోతోందని వార్త ప్రచురించారు. 


భారతవర్ష ప్రపంచ రికార్డ్ - వార్తల్లోకి భారతవర్ష

భారతవర్ష  గురించి రాయమని పాత్రికేయులు ఎంతో మందిని సంప్రదించాను. ఇలాటివి ఎవరూ చదవరండీ . అక్రమ సంబంధాలు నేరాల వార్తలు చదువుతారు అని ఎక్కువ మంది చెప్పేవారు. ఇంగ్లిష్ న్యూస్పేపర్స్ వాళ్ళు  తెలుగు నవలా అని చాలా తక్కువ చేసి  మాటాడేరు.  ETV, News18, Sakshi,  తెలుగుపై ప్రేమతో మంచి వార్త అనే గౌరవంతో  నిజాయతీగా ఏమీ ఆశించకుండా  వ్రాసారు.  

 భారతవర్ష  పై ప్రత్యేక  టీవీ కార్యక్రమాలు 

ఈటీవీ, మహాన్యూస్, న్యూస్18, భారతవర్ష పై ప్రత్యేక కార్యక్రమాలు, ఇంటర్వూస్ ప్రసారం చేశాయి


 భారతవర్ష పెద్ద పుస్తకం గుడివాడ రామారావుగారు 

భారతవర్ష పెద్ద పుస్తకం నుంచి చిన్న పుస్తకం

 అందుకు 30,000 రూపాయలు ఆర్ధిక సాయం చేసిన మహనీయులు  గుడివాడ రామారావుగారు. 3 రూపాయలు ఇవ్వడానికి సంకోచించే ఈ రోజుల్లో చేతికి ఎముకలేని దాత గుడివాడ రామారావు గారు.  ఆయనకు సాహిత్య నివాళి తప్ప ఏమీ ఇచ్చుకోలేని వాడిని.  అందుకే  గ్రంధం ముందుపేజీల్లో  ఆయన బొమ్మ తో  కూడిన సాహిత్య నివాళి ముద్రించాను.  ఆయన బొమ్మతో ఉన్న గ్రంధం 4 యూనివర్సిటీ గ్రంథాలయాలలో ఉంది. ఇకపై ఆయన బొమ్మ ముఖ చిత్రం పై వేస్తాను. 

భారతవర్ష ఒక ప్రయోజనం ఆశించి రాసిన అచ్చతెలుగు గ్రంథం. ప్రచారం నా లక్ష్యం కాదు. పెద్ద పుస్తకాలు  100 కొట్టించి (ఒకేసారి కాదు) ఉచితంగా పంచాను. 1265 పేజీల పుస్తకం ఎవరూ చదవరు అని 145 పేజీల చిన్న పుస్తకంగా మలిచాను.   మొత్తం కథ టూకీగా 6 పేజీలలో వ్రాసి 100 పాత్రలు అష్టా దశ (18)వర్ణనలు, ముఖ్యమైన ఘట్టాలు , నవరస పద్యాలు ఉండేలా  కూర్చి ముద్రించాను. 

ఏంతో  మందికి భారతవర్ష చిన్న పుస్తకం ఉచితంగా ఇచ్చి  భారతవర్ష మీద అభిప్రాయం వ్రాయమని అడిగితే అలాగే అన్నారు కానీ  ఎవరూ చదివి తమ అభిప్రాయం రాయలేదు.  

ఎఫ్ బీ లో ఒక 1000 మందికి నేను రాసిన అడ్వాన్స్డ్ విజువల్ వొకాబ్యులరీ  పీ డీ ఎఫ్  పుస్తకం ఉచితంగా పంపి దానితో పాటు భారతవర్ష చిన్న పుస్తకం పీ డీ ఎఫ్ కూడా  ఉచితంగా పంపి ఒక ఫీడ్బ్యాక్ రాయమని అడిగితే ఇంగ్లిష్ చెప్పమని అడిగేవారు తప్ప తెలుగు పట్టించుకునేవారు కాదు


ఇంక ఇలా లాభం లేదని

1 గంటలో  భారతవర్ష మొత్తం  కళ్ళముందు వేదికపై   

1265 పేజీల  భారతవర్ష గ్రంధాన్ని అందులో అచ్చతెలుగు మాధుర్యాన్ని, సుందర ప్రకృతి వర్ణనలని, అష్టా దశ వర్ణనలని, నవరస పద్యాలని, సంస్కృత కీర్తనలని,  కథని  సున్నిత హాస్యాన్ని  ఆస్వాదించేలా ఒక గంట సేపు సాగే    సాంస్కృతిక కార్యక్రమంగా రూపొందించి వేదికపై సంగీత నృత్య కార్యక్రమం గా మలిచి ప్రదర్శనలిస్తున్నాను.   చిన్న పుస్తకం నుంచి భారతవర్ష ప్రబంధం వేదికపైకి వచ్చేసింది.  


 రాష్ట్రంలో ప్రతి గ్రంధాలయంలో భారతవర్ష ఉండాలని


విజయవాడలో భారతవర్ష విడుదల 

ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవంనాడు భారతవర్ష అనే ప్రేమ కావ్యం ఘంటసాల సంగీత కళశాలలో సాయింత్రం ఆరు గంటలకి తెలుగు అకాడమీ చైర్పర్సన్  డాక్టర్ లక్ష్మి పార్వతిగారి చేతిమీదుగా, ఆచార్య కృష్ణారావుగారి చేతులమీదుగా,  విడుదలయ్యింది.ఆంధ్రా ఆర్ట్స్  అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు గారి, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజుగారి ఆశీస్సులతో , కానోపి థియేటర్ వారి కేరళ సంప్రదాయ నృత్యాలతో, పాడుతా తీయగా కీర్తి జేత స్వరరాణి  శ్రీవల్లి గాత్రంతో,  కేంద్ర ప్రభుత్వ యువా  కర్నాటక సంగీత యువప్రతిభ  షణ్ముఖ  సంగీత నృత్య విభావరితో  భారతవర్ష పుస్తకావిషకరణ జరిగింది.  భారతవర్ష ప్రయాణం,  అద్భుతాలు కొనసాగుతూనే ఉన్నాయి. 


        

No comments:

Post a Comment