Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, July 17, 2020

Bharatavarsha -8

వానకి తడిసిన నల్లని రహదారిపై తెల్లని వాహనము మెల్లగా సాగుచుండ చెరువున బకమువలె మెరియుచుండె. ప్రకృతి చూపరులకు కడు రమ్యముగా నున్నది. రధాన్తరంగమంతయూ నిశ్శబ్దము రాజ్యమేలుచుండ రమణి అంతరంగమున ఆలోచనా తరంగములిట్లు చెలరేగుచుండె “నేడెందుకో మనసు వికలముగా నున్నది, ఈ వర్షమెందులకో తీతువుపిట్టరాయబారము వలె నున్నది, ఇది ఎట్టి దుశ్శకునమో కదా! పార్టీ కార్యక్రమాలకి పిలవకున్ననూ బోయితిని, సమావేశములు జరిగిననూ నిదియె తీరు ఆహ్వానముండదు,మంచిరోజులకొరకు ఆశతో   ఓర్పుగా  ఎదురు చూసిన నాకు నేడంతిమ పరీక్ష వలె దోచుచున్నది.

కొద్ది గంటలెట్లు గడిచేనోగాని వేదనాభరిత వేదిక నుండి  భవంతి బయటకు వచ్చిజూడ  వాన ఉదృతి పెరిగి ప్రకృతి ఆమె మనసుకు ప్రతిబింబమువలె నగుపించెను. రధికుడు ఛత్రము  బట్టుకు వచ్చుచుండెను. 
“దయ్యపుతాడిని (ఏడాదిపొడుగున గలలువేసి పిందె పాటుననే రాల్చివేయు తాటిచెట్టు; తప్పిదారి ఒకకాయ నిలిచినా, దానిలో ముంజకట్టి యుండదు) సాకిన ఫలసాయ మీరీతినే యుండునుకదా!  పెదవివిప్పి  పలకరించినారు  కారు  పెద్దలు ముఖము తిప్పిచూచినారుగారు  పిన్నలు. సభ్యులందరూ  కూడఁబలుకుకొన్నట్లు ఏకరీతిన క్షోభ పెట్టినారుకదా!!” పెక్కురాశీనులైన రంగస్థలమున శిరచ్ఛేదానుభూతి బొందిన అరుణతార ముఖము వివర్ణనమయ్యెను.  కాలిక్రింద భూమి కంపించుచుండ శోకభారమున అడుగు లు మందగించ  శరీరభారము అధికమైనట్లు తోచెను. వేదికవీడుచు వెనుదిరిగి చూచిన దృశ్యము -కన్నీటిపొరలయందగుపించిన తోడెంపునవ్వుల(ముసిముసినవ్వుల) మొఖములు అడుగడుకు కనులయందు మెదులుతూ తోడేళ్ళను తలపింప అడుగొక సమ్మెట దెబ్బవలె పడుచుండ , తలలో ముచ్చెమటలు బోయుచుండ అరుణతారకు బాల్యమున గోపాలాచారి గారు చదివించిన పెద్దబాల శిక్ష నందు పద్యము

హా వసుదేవ కుమారక 
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా!

స్ఫురణకు వచ్చెను “సోమినాయుడు ప్రభుత్వమున నీవునూ చొరలేకున్నావా మురారీ! ఈ జిత్తులమారి కత్తెరకాడు  నిన్నునూ వశపరుచుకొనెనా? ప్రాణమును తల్లడపఱచి అహర్నిశములు పార్టీకొరకు శ్రమించి, స్త్రీలోలుల యొద్దకు కుంటెనపంపిననూ మారాడక  అవమానములెన్నియో దిగమ్రింగి ఎంత ప్రయాస పడిననూ కడకు మిగిలినదేమి, ఘోర పరాభవము తప్ప.    వేదికపైనున్న నేను తప్ప అందరు ప్రసంగించిరి. అందరికీ  అవకాశ మిచ్చెను నాకు దప్ప. నాకు మాటలాడుటకు అవకామియ్యకున్ననూ నా ఊసైన నెత్త లేదు. సమావేశముముగిసెను , సర్వసంబంధములు ముగిసెను.  అందరినీ కలుపుకు పోవలెనని చెప్పెడి   సోమినాయుడు నన్ను మాత్రము వేఱుపరిచెను.  ఎంగిలి మంగల ము వలే నన్నావల పారవేసెనుకదా! కటకటా!   సోమి నాయుడు ప్రాభవ మున  నాకు పరాభవ ప్రారబ్ధము.”

హృదయాతరంగమున నిప్పు కీలలెగయుచుండ కన్నీరు బొటబొట కారుచుండ ప్రసార మాధ్యమ మిత్రులు రాబందులవలె కమ్ముకొనుచుండ “ఇంతకాలమూ రహస్యముగా రోసి బహిరంగముగా నవ్వితిని నేడా అక్కరతీరిపోయెను” అని భావించి దృశ్యమాధ్యమ బృందములు పరివేష్టిత అరుణతార కడుపుఅవిశిపోవ నిజమును వెల్లడించెను.

పిదప వాహన చోదకునికి  జీతమిచ్చి "ఒక వారంరోజులు నీ తల్లిదండ్రులని చూచిరమ్ము" అని  సెలవుపై పంపి తాళములను తీసుకొని ఆత్మహత్యచేసుకొనుటకు పథక రచన చేసుకొని స్వీయ సారధ్యమున సాగిపోయెను.   
                                              ***
అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! 

నాకు జీతము ముట్టి ఆరు నెలలాయెను. ఇనుపగజ్జెల తల్లి ఇంటిని వీడదాయెను. నీవలె ఆలోచించిన నేను చచ్చి నేటికారునెలలై యుండవలె. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత యన్నట్లు పైకి చెప్పుకొనుటకు పెద్దదృశ్య మాధ్యమ వార్తా సంస్థ నందు జ్జోగము, వరిష్ఠ పాత్రికేయుడు. ప్రజాదరణలేక అనేక వార్త సంస్థలు దివాళా మార్గమున పయనించుచున్నవి. అందు మా సంస్థ కూడా యున్నది. మాసంస్థను అమ్మివేయుటకు మా యజమాని సిద్ధముగా యున్నాడు కొనుటకు ఎవడైనను రాడా  మాకడగండ్లు దీర వాయని  బేహారుల  వలె ఎదురుచూచుచున్నాము.  మేమె ఆశావాదముతో నుండగా నీకేమివచ్చెను ? అని చిరకాల మిత్రుడు దుర్గా ప్రసాద్  “కొండయెక్కిదూకుటకు నీకేమి ఖర్మము” అని జెబ్బపట్టి లాగి తన కార్యాలయమునకు తీసుకుపోయి ఏకాంతమునందు హితవుజెప్పెను.

"నాది ఆర్థిక సమస్య కాదు, మానసిక సమస్య. ఇంత అవమానమును ఎట్లు సయితును అత్యంత హేయంగా అవమానించబడ్డ స్త్రీ ద్రౌపది.  నాకుజరిగిన అవమానము అంతకంటే ఎక్కువగానున్నది."    

“బలగర్వితుడు, అధికార మదాంధుడు, తననెవరూ ఏమీ చేయలేరు అనుకునే రావణుడు –బలవంతంగానే సీత నెత్తుకుపోవుట, ఆ నుమానముతో రాముడడవులకు పంపుట అవమానముకాక సన్మానమా? వంచనతో ఇంద్రుడహల్యను బలాత్కరించి చెరుచుట రావణుడు రంభను చెఱుచుట అవమానముకాక సన్మానమా?”

"విశ్వామిత్రుడి తపస్సుకు భంగం కలిగించాలని రంభను ఆదేశిస్తాడు ఇంద్రుడు. తన పరువాలన్నీ చూపిస్తూ విశ్వామిత్రుడి ఎదుట నిలబడి పాటపాడుతూ నిల్చొంది రంభ. అంతకుముందే మేనక ద్వారా దెబ్బతిన్న విశ్వామిత్రుడు రంభ అందాలను చూసి ఆశపడలేదు.  నా తపస్సునే భంగం చేస్తావా? రాయివై పడి ఉండు అంటూ శపిస్తాడు. పదివేల ఏళ్ల పాటు రంభ అలా శిలలా ఉండాల్సి వచ్చింది."

“కానీ మహాసభలో భర్తల ఎదుట, గొప్ప ధర్మవేత్తలుగా పేరు పొందిన వారు చూస్తుండగానే, గుడ్డలు లాగివేయబడే హీనాతిహీనమైన పరాభవం ద్రౌపదికి జరిగింది.”

"ఓ అదా నీ ఖేదమునకు కారణము అయినచో వినుము చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచెను, పడవలు నడిపెను . పాములు గొట్టెను, బరువులు మోసెను. పదకొండేళ్ళ వయసులో బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసల నెదుర్కొనెను. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్ననాడే ప్రశ్నించి దెబ్బలుతినెను . అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులు లైంగిక దాడులకు గురయ్యి    సామూహిక అత్యాచారం గావించబడెను ."

"రూప డియోల్ బజాజ్ అనే పరిపాలనాధికారి(IAS)కే తప్పలేదు . పంజాబ్ సింహమని పేరుగాంచిన రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి ( డైరెక్టర్ జనరల్ ) ఆమె పృష్ఠ భాగమును తాకినందు నిస్సహాయముగా  శోకించుట మినహా  ఏమీచేయలేక " ఎంత   ఎత్తుకుపోయిననూ ఆడది చివరకు ఆడదే యని జెప్పి వగచి యుండలేదా" 

"ఢిల్లీకి చెందిన వర్ష జోషి అను మరొక పరిపాలనాధికారిణి ఇటువంటి లైంగిక సమస్యలనెదుర్కొని  ఎంత అవమానమును బొందెనో తెలుసుకొన్నచో నీవిట్లు మాట్లాడవు. గుజరాతుకు చెందిన రిజు బఫ్న అనే మరొక పాలనాధికారిణి ఇటువంటి లైంగిక వేధింపులను ఎదుర్కొనిభారతావనిన ఇటువంటి పురుషపుంగవులు అడుగడుగునా యున్నార”ని వ్యాఖ్యానించి ప్రతి దాడిని ఎదుర్కొనెను. భారతావనిని నిందించుట ను అందరూ తప్పుపట్టగా దిక్కుతోచక క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యను ఉపసంహరించుకొనెను. అనేక స్త్రీలు ఉన్నత స్థానములలోయుండి కూడా  బాధను చెప్పలేని దుస్థితిలో నుండగా నీవు దృశ్యమాధ్యమ ముఖాముఖి నందు సోమినాయుడిని తుత్తునియలు జేసిన వనితావు నీవే నాని మరువకుము. నీకంటే ముందు ఇదే అనుభవము ఎదురైననూ నీవలె మాట్లాడువారెవ్వరునూలేరు.” అని చెప్పి యూరడించెను.

నీ జ్ఞానముచే నా అజ్ఞాన తిమిరమును తొలగించి  నాబాధను బాపితివి. నేనెంత తాగిననూ మధువు నాలో భాదను తాత్కాలికంగా నుపశమింపజేయునుగానీ నాలో ఆత్మన్యూనతను తొలగించలేదని జెప్పి తనచేతికున్న వజ్రపుటుంగరమును దీసి  "ఇది నేను నీకిచ్చు బహుమతి " యని చెప్పిఅతనికి వజ్రపుటుంగరమును బహూకరించెను. పిదప రాజకీయరంగమున వోడితిని  నన్నేమి  చేయమందువని అడిగెను. అప్పుడు దుర్గా ప్రసాద్ "పొరపడుచున్నావు రాజకీయరంగమున నీవు ఓడలేదు, ఒక పార్టీ పద్ధతులు నీకు సరిపడక వైతొలగినావు.  కనుక నీవు  సైంధవోదకన్యాయనీవు మును పాటించవలెను అనిన సముద్రపునీరు సూర్యరశ్మిచే ఆవిరియై మేఘరూపాన్ని పొంది వర్షించి ఏరుగా పారి తిరిగి సముద్రంలో కలిసినట్లు ఎచ్చట ఓడినామో అచ్చటనే నెగ్గవలె ననుచూ  అని మందహాసమున "పోయిరాగదమ్మా జానకీ!” అని కొంటెగా పాడుచుండ అవ్యక్తమధుర రాగమేదియో స్నేహారాగమయి అంతర్వాహిని వలె హృదయమును తాకి చిత్తవృత్తి(మూడ్ ) నున్నతి జేసెను.   

10 comments:

 1. తరుణీ వేదనను స్వచ్ఛమైన తెలుగులో చాలా బాగా వర్ణించారు
  చదవగా చదవగా తెలుగు భాష మనస్సుకు హత్తుకొనుచున్నది
  గల గలా పారే సెలయేరులా మనోహరంగా సాగుతుంది మీ రచన

  ReplyDelete
 2. స్త్రీ అవమానించ బడి ఎంత మానసిక వేదన అనుభవిస్తుంన్దో ఉదాహరణలతో వివరించడం రచయితా యొక్క విషయాధ్యాయనము ఎంత లోతుగా, ఎంత విస్తృతంగా ఉన్నదో చెప్పకనే చెప్పుతుంది. Hats off to you.

  ReplyDelete
 3. పురాణాలతొ నేటి సమకాలీన అంశాలతో కలిపి చక్కగా చెప్పారు. ఇన్ని విషయాలను ఇంత బాగా వివరించారు

  ReplyDelete
 4. ఒక్క రాజకీయ రంగంలో మాత్రమే కాదు.ఏ రంగంలో అయినా స్త్రీలు పురుషులు ఆడే ఆటలో పావులుగానే
  మిగులుతున్నారు

  ReplyDelete
  Replies
  1. This has been the injustice of successive generations since the birth of the earth.

   Delete
 5. It is really sad that the women are still facing such issues in 2020 every where around the world. Got to know some inspiring people through this , Merci Beaucoup.

  ReplyDelete
 6. చాల బాగా చెప్పారు సార్ ఆనాటి మహ భారతం సంగటనలొ జరిగిన అవమానం పురాణాల సంఘటనలు
  ఈనాడు జరిగిన అవమానలు గురించి బాగా చెప్పారు

  ReplyDelete
 7. Chaduvu tunte madhuram ga vunnadi

  ReplyDelete
 8. You really expressed the present situation how women's are suffering in society with your impeccable statements

  ReplyDelete
 9. ఎంత పెద్ద హోదాలో ఉన్నా స్త్రీ స్త్రీయే కదా..... నిజమే. ఒక స్త్రీ విజయాన్ని వోర్వలేక, ధైర్యంగా ఆమెని ఎదుర్కోలేక.... కొందరు మగవాళ్ళు ప్రవర్తించు నీచాతి నీచమైన చర్యలు అవి. అవి అవమానమని, అవోరడాలని వాళ్ళు బావిస్తున్నరేమో....100 మద్య కూడా బిడ్డ ఆకలి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించక పైట తొలగించగలిగేది ఒక్క తల్లి మాత్రమే. ఆ తల్లి కూడా ఒక స్త్రీ నే.... ఇది గ్రహించిన ఏ మనిషి అలా ప్రవర్తించడు. మాకు తెలియని ఎన్నో విషయాలు జ్ఞానాన్ని, సాహిత్యాన్ని కలబోసిన మీ నవలకు శతకోటి వందనాలు

  ReplyDelete