Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, September 16, 2020

Bharatavarsha 36

 "వియ్ హావ్ ది  హియరింగ్ ఆఫ్టర్ ద లంచ్ అండ్  వియ్ ఆర్  ఎజ్జిటింగ్ ద  కోర్టు హాల్. బి ఎలర్ట్ !  బి  రెడీ!! "అనుచూ  బయటకు వచ్చుచున్న పాంచాలి గారిని శేషాచలముగారు భారత వర్ష , విదిష  అనుసరించిరి. ఆమె మాట్లాడుచున్నది బసవడితో యని తెలిసి విదిశ పెదవులు విచ్చుకొన్నవి. "బసవడికి ఆంగ్లమేమి అర్ధమగును " యని ఆమె భారతవర్షతో మెల్లగా అనగా " వాడు నన్ను ఇప్పుడే సంప్రదించును చూచుచుండుము " అని వర్షుడనెను.  అట్లే బసవడు వర్షను చరవాణి యందు పిలిచి " ఆంగ్లమున ఆమె ఏమి చెప్పుచున్నది అని తర్జుమా  కోరెను. భోజన విరామము తరువాత, కడపటిసారి వాదనలు విని న్యాయమూర్తి  తీర్పు వినిపించెదరు.  నీవు  సాక్ష్యులను భద్రముగా తీసుకొని రావలెను. సిద్ధముగా ఉండుము " అని జెప్పి ముగించెను. 

జిల్లా కోర్టు ఆవరణంతయు జనముతో కిటకిటలాడు చున్నది. " ఏమీ చోద్యము మన దేశమున నేరములు దిన దినాభివృద్ధి చెందుచున్నవి కాబోలు!" అని శేషాచలముగారు ముక్కున వేలేసుకొనిరి."  తీర్పులు తీర్చుటయందు మన వారు తాబేళ్లతో పోటీ పడుచున్నారు" యని భారతవర్ష చమత్కరించెను.  ఇన్ ఇండియా ది జస్టీస్ డెలివరీ సిస్టం ఐస్ లేట్   బట్ యు సి దేర్ ఆర్ 107 జజెస్ ఇన్ ద  యు ఎస్  ఫర్ ఎవెరీ మిలియన్ కంపార్డ్  టు  10 జజెస్  ఫర్ ఎవెరీ మిలియన్ ఇన్ ఇండియా. అని చక చక సాగిపోయెను "ఆమె ఏమనుచున్నది?”  అని శేషాచలముగారు వర్షను అడిగిరి. "మనదేశమున పదిలక్షలమందికి 10 మంది న్యాయమూర్తులుండుటచే  తీర్పులు తీర్చుట కాలస్యమ గుచున్నది." 

"ఈమె తేనీరు అమ్ముకొను కుర్రవాడు కనిపించిననూ ఆగ్లమునే సంభాషించును, కొంచెము కఠినముగానున్ననూ ఈమె వాగ్ధాటి ఇచ్చట నొక్కడికినీ లేదు." అని హాస్యధోరణిలో మాటలాడుచున్న శేషాచలముగారు "బైర్రెడ్డి న్యాయవాది మనలని జూచుచున్నాడు" అని గతుక్కుమని శిరస్త్రాణము మరిచిన వాహన చోదకునివోలె మొఖం త్రిప్పుకొనినారు. అది చూచి భారత వర్ష విదిష ఇద్దరు నవ్వు కలిగిననూ నిలుపుకొనిరి. "న్యాయస్థానములోపల అతడు ప్రతివాది తరుపున ప్రశ్నలు వేసి తికమక పెట్టుటచే కలిగిన సంశయము మిమ్మలను వేటాడుచున్నది, కానీ నాకు మన గెలుపు ఖాయమని ద్యోతమగుచున్నది" అని వర్ష అనెను. పాంచాలిగారు భోజనమునకు పోయిననూ శేషాచలముగారు, విదిష, వర్ష న్యాయస్తామావరణయందు  చెట్టుక్రింద నిలిచి మాటల నారగించుచూభోజనమును మరచి నారు. 

శేషా: వాడు పై కోర్టుకు పోయెదనని అనుచున్నాడు అట్లు పోవ వీలున్నదా?

వర్ష: సెక్షన్ 374 (2) సిఆర్పిసి  ప్రకారము సెషన్స జడ్జి లేదా మరే కోర్టు నిర్వహించిన విచారణలోనైనా  వ్యక్తికైనా ఏడు సంవత్సరముల కంటేఎక్కువ శిక్ష విధించబడినచో సంబంధిత హైకోర్టుకు అప్పీల్ చేయవచ్చు

శేషా: వాడన్న నాగిరెడ్డి బైలు కొరకు ప్రయత్నించుచున్నాడు, హత్య కేసులో బైలు వచ్చుటకు అవకాశ మున్నదా?

వర్ష: సాధారణంగా హత్య కేసులో, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే వరకు లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులను జైలులో ఉంచెదరు. ఇటువంటి ఘోరమైన నేరములకు,  బెయిల్ మంజూరు చేయుటంత  సులభమైనది కాదు. అనేక నిభందనలతో కూడిన బెయిల్ మంజూరు చేయుదురు.   పాటించుట  విఫలమైనచో ఆ వ్యక్తి మరల జైలుకు పోవును. కానీ నేడు విచారణ పూర్తి అగుటవలన బైరెడ్డి తప్పక జైలుకి పోవును. అంతియే గాక  బైరెడ్డి పై మనము అనేక కేసులు పెట్టినాము అందు 354 ఐపిసి యొకటి ఈ చట్టముక్రింద ఉన్న కేసులకు బైలు ఇవ్వబడదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. మహిళల మానమునకు సంభందించినది. కావున బెయిల్ దక్కుట దుర్లభము. అని భారతవర్ష శేషాచలముగారి ఆందోళనను బాపెను.

శేషా: నీవు అవధానప్రక్రియ నొక చేత, ఆంగ్లబోధననొక చేత , బైరెడ్డి పై వ్యాజ్యమును మరొక చేత పుచ్చుకొన్న సవ్యసాచివలె కనిపించుచున్నావు. బుద్ధిబలంతోసాక్ష్యములను సేకరించి, భుజబలముతో వారిని కాపాడుచూ, శారీరక ఆర్ధిక శ్రమను లక్ష్యపెట్టక మాకొరికింత చేయుచున్న నీ ఋణమెట్లు తీర్చుకొనగలను. మీరు బ్రాహ్మణులు కానిచో నీ కాళ్ళు  అని శేషాచలముగారు భోజనము ముగించి వచ్చుచున్న పాంచాలి గారిని దూరము నుండి గాంచి అక్కడాపివేసినారు. 

కానీ తండ్రి మాటలు చెవికిసోకగానే పాషాణ జడత్వముపొంది పేరుకొన్న విదిష హృదయము  రామపాదము సోకినహల్యవలె సజీవమై మేల్కొన్నది. గూటినుండి గువ్వ పైకెగిరినట్లు విదిష మనసు క్షణకాలము స్వేచ్ఛావలోకనమున విహరించెను. తన చిన్ననాటి చెలిమి భారతవర్ష  వైపు క్రీగంట చూడగా అతడు కూడా అప్పుడే తన ప్రియ నేస్తము వైపు చూచెను. నయనములు కలిసినవి. చూపులు కలిసిననూ అందు మునుపెన్నడూ ఈ మహిమ లేకుండెను. తొలిసారి మనసుకు వయసు స్ఫురణకు వచ్చి బిడియాను భూతిని కలిగెను.                 

చెల్వరాణి సిగ్గుగొన చిన్నికన్నెసోయగము జిగిదేఱ అఱమోడ్పు 

 లాయె కన్నులు మీటారిసోయగపు మోహపుటోర చూపులన్ 

కురిసేను మంచు సోనలు ఒయ్యార ఒంపులన్ నెత్తమ్మినిద్దపుఁద    

నమును కాంచనమువోలె కాంచెను వర్షుడు మెల్లని చూపులన్.                                                         

 విది! అనే వర్ష కేకవినిపించి ఇహలోకంలోకి వచ్చిన చూచిన విదిషకు చకచక సాగుచున్న పాంచాలిగారు వర్ష శేషాచలముగారుకనిపించిరి. "ఏయ్ మొద్దూ, రా!" యనుచూ హస్తసంజ్ఞన బిలుచుచున్న వర్షను మందగమనము  నుసరించుచుండెను. చిన్నప్పుడు నన్ను నల్లపిల్ల అన్నందుకు చేతిని కొరికిన గాటు గురుతింకనూ అస్పష్టముగా కనిపించుచుండును.  ఆ నల్లపిల్ల పై నీభావము నీ కన్నులలో చూచితిని, నీ కేకలూ తీపివలపులే పోవయ్యా! 

హి మస్ట్  బి  హాంగ్డ్ విధౌట్ ఎనీ  మెర్సీ డామ్ క్రూక్ హాట్ హుట్  అనుచు సాగుచున్న పాంచాలిగారి వెనుక "వాడికి కఠిన శిక్ష పడిన చాలును ఆ పాపము మనకెందులకు, భగవంతుడు మెచ్చుడు." అనుచు ఒక ప్రక్క తన తండ్రి మరొక ప్రక్క వర్ష “తండ్రి కళ్ళముందు అబల మర్యాదను హరించినచో భగవంతుడైననూ క్షమించడు. శిశిపాలునకు గోపాలుడు శిరచ్చేదమును చేయుట మరిచినారా ?" అనుచున్న  వర్షను చూచి "ఈ వర్షుడు అలనాడు  ద్రౌపది మానముకాచిన కృష్ణుడేమో! రుక్మిణి ని కాకున్ననూ ఒక గోపికనైననూ అయిన చాలును."                                                                                                              

.పించము దాల్చిన ర్తనము జేయు మురారిని కోరిజేరినా

రంచల  అంబుజా ననల పొంకము జూసినమోహమే గదా

కాంచిన భాగ్యమే దెలియ అంకిలి  వీడును పాశమే విచా

రించిన  గోపికా తరుణు లందరు నొందిరి ఆత్మానందమున్.     

                                                 ***

న్యాయమూరి ఆసీనులన పిదప అందరు ఆసీనులయ్యిరిమరల వాదోపవాదములు ప్రారంభమైనవి.కేసుకు ముఖ్యాధారములైన రుజువులు నాడు సబ్బవరం సినిమాహాలు వద్ద బైరెడ్డి ఛాయాచిత్రములు.కావునా అవి తప్పని నిరూపించ బూనిన ప్రతివాది న్యాయవాది కొన్ని చిత్రములను ఒక పొట్లమందుంచి  న్యాయమూర్తికి సమర్పించెను అవి చూసి న్యాయమూర్తి గతుక్కుమనెను

"మిలార్డ్ ఘనతవహించిన  పాంచాలిగారు సమర్పించిన ఛాయాచిత్రములు నిజమని నమ్మినచో   ఛాయా చిత్రములను కూడా నిజమని నమ్మవలసి యుండును." ప్రతివాది న్యాయవాది అనెను." అవి బనాయించినవని నిరూపించుటకు నా చిత్రములను ముద్రించి ఇట్లు నాటకమాడవలసినపనిలేద"ని న్యాయమూర్తిగారు ప్రతివాది న్యాయవాదిని మందలించిరిఎట్టకేలకు  భారతవర్ష  సంపాదించిన ఛాయాచిత్ర సాక్ష్యము వీగిపోయెను.  

సర్వసిద్ధముగా ఉన్న భారతవర్ష ఈ పరిణామమునకు విస్తుపోక చిరునవ్వుతో స్వీకరించి బసవడు వద్ద సిద్ధముగా నున్న సాక్ష్యులను న్యాయమూర్తి గారనుమతితో ప్రవేశపెట్టెను.  మరీదు మరియు గోవులకాపరి ఇరువురు ప్రత్యక్ష శాఖులు. వారిరువురిలో మరీదు సినిమాహాలు వద్ద బైరెడ్డిని కోటిగాడితో జూచినట్లు చెప్పుటతో కోటిని కూడా ప్రవేశపెట్టిరి. 

ప్రతివాది న్యాయవాది  "అబ్జక్షన్ యువరానర్ కోటి ఒక నేరగాడు  అతడి  మాటలను విశ్వసించ వలసిన పనిలేదు " అని అభ్యంతరము చెప్పుచూ  పాంచాలిగారిని అడ్డుకొనెను. నాగిరెడ్డి అతడి అనుంగులు అతడికి వత్తాసు పలకగా కొద్దీ నిమిషములు కలకలము చెలరేగెను  కానీ ధర్మ పీఠముపైనుండి న్యాయమూర్తిగారు "అబ్జక్షన్ ఓవర్రూల్డ్ " అనుటచే అంతా సద్దుమణిగెను.  పిదప గోవులకాపరి, పెట్రోలు చల్లుట నిప్పంటించుట చూచినది చూచినట్టుగా చెప్పెను. 

"అబ్జక్షన్ యువరానర్ గోవులకాపరిది ఈ వూరు కాదు. అతడు అంత  రాత్రి దహనమైన గృహము వద్ద  ఏమి ఏమిచేయుచున్నాడు ?  ఇది సబోర్నెడ్ విట్నెస్ అనగా దొంగ సాక్ష్యము యని మెలిక పెట్టగా  న్యాయమూర్తిగారు "అబ్జక్షన్ సస్టైన్డ్ " అనగా అచ్చటనే యుండి ఇదంతయూ తిలకించుచున్న నాగిరెడ్డి ముఖమున సంతోషము తాండవించెను.  ప్రతివాది న్యాయవాది " నేను గోవులకాపరిని ప్రశ్నించదలుచుకున్నానని న్యాయమూర్తిని అనుమతి కోరగా  ఆయన " పర్మిషన్ గ్రాంటెడ్ " అనినారు. శేషాచలముగారు , విదిష బిత్తర చూపులు చూచుచుండగా పాంచాలిగారు వారిని కళ్ళతో వారించి భారతవర్ష వైపు చూసినారు.  భారతవర్ష అనుమతి తీసుకొని బైటకు వెళ్లి పోయెను. పాంచాలిగారు తమతరుపున మరొక సాక్ష్యమును ప్రవేశపెట్టుటకు అనుమతిని కోరగా అనుమతి లభించెను.  

బయటకు పోయిన భారతవర్ష స్థానిక మండలాధికారి పరిస్థితిని వివరించి వేడుకొనుచుండగా  అతడు భాషా ప్రియుడగుటచే భారతవర్ష కార్యక్రమములు ప్రత్యక్షముగా చూచి యుండుటచే అప్పటికప్పుడు రికార్డులు చూసి "గోవుల కాపరి  మాచిరాజు  గత ఆరేండ్లుగా సబ్బవరమున నివసించుచున్నట్టు ఒక సంక్షిప్త వీడియో సాక్ష్యమును తయారు జేసి భారతవర్షకు పంపెను.  

పాంచిలిగారు స్థానిక పెట్రోలు బంకులో పనిచేయు పిల్లలను మెల్లగా ప్రశ్నించు చుండిరి. ప్రతివాది న్యాయవాది "వాదితరుపు న్యాయవాది కాలయాపన జేయుచున్నారని ఇదికుట్ర" యని రంకెలు వేయుచుండగా పాంచాలిగారు "చిన్నపిల్లలను ఎట్లు ప్రశ్నించవలెనో తల్లి నైన నాకు తెలుసునని లా పట్టా పుచ్చుకున్న తనకు ఎవరిని ఎట్లు ప్రశ్నించవలెనో తాగుబోతులుతో జెప్పించుకొనవల్సిన ఖర్మములేద" ని ఆంగ్లమున చెలరేగెను. ఆమె ఆంగ్లవాగ్ధాటికి ప్రతివాది న్యాయవాదికి ముచ్చెమటలు పట్టెను.  ఆమె ఆంగ్లమును సూళమువలె పట్టిన  భద్రకాళివలె నగుపించెను. 

 ఆడర్   ఆడర్.. నో పర్సనల్ అటాక్స్ ప్లీస్ , కన్ఫైన్  టు ద కేస్ .. ఆడర్... ఆడర్  న్యాయమూర్తి గారి చెక్క సుత్తి విరిగిపోయెను. భారతవర్ష గోవులకాపరి నివాసమును ధ్రువపరుచు సాక్ష్యమును పాంచాలిగారికి అందజేసెను. "వీడియో సాక్ష్య మును ధ్రువపరుచు కాగితము లేనిదే అది చెల్లద"ని మరల ప్రతివాది న్యాయవాది చెలరేగుచుండ, పాంచాలిగారు "In the age of digitalization and increasing reliance on computerized records in judicial proceedings, the Supreme Court has held that the requirement of a certificate to make an electronic evidence admissible is not mandatory "wherever interest of justice so justifies". అనగా న్యాయమూర్తిగారు అంగీకరించిరి. 

బైరెడ్డి పెట్రోలు పెద్ద సీసాలతో కొన్నట్టుగా పిల్లలు చెప్పుటతో న్యాయమూర్తిగారికి నేరము కళ్ళకు కట్టినట్టు కనబడి "పిల్లలు దేవుళ్లతో సమానము వారి సాక్ష్యమును కోర్టు విశ్వసిస్తున్నది, అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట  బైరెడ్డి నేరము చేసెనని కోర్టు నమ్ముచూ  బైర్ర్రెడ్డికి జీవిత ఖైదు విధించడమైనది. అట్లే చిన్నపిల్లలను పనిలో పెట్టుకున్నందుకు  చైల్డ్ లేబర్ ప్రోహిబిషన్ఏక్ట్ 61 అఫ్ 1986 ప్రకారము పెట్రోల్బంకు యాజమాన్యానికి 50,000 జరిమానా విదించడమైనది. కట్టనియెడల రెండు సంవత్సరముల జైలుశిక్ష ననుభవించవలెను. నౌ ద కోర్ట్ ఈజ్ ఆజర్న్డ్." న్యాయమూర్తి గారు న్యాయపీఠమును సూన్యమొనర్చినారు.    

4 comments:

  1. కోర్టు సీన్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. విదిషకు వర్ష పై ప్రేమ కలగడం ఊహించని మలుపు.

    ReplyDelete
  2. కోర్టు సీన్ నచ్చిందని వ్రాసారు , సంతోషం. ఆనందోబ్రహ్మ. విదిష , లకుమ , జిలేబి , మీనాక్షి , సుందరి , మంజూష , అగస్త్య , మాలిని , దామిని , డయానా, షిరోమి , మిషేల్ బసవ బుచ్చెమ్మ , సర్రాజు , బైరెడ్డి , రాఘవ , సందీప్ అన్నీ 3క్షరాలపేర్లే.

    భారత వర్ష ; దక్షిణ మూర్తి; అంగ్యార్ కన్నె ; వరదా చారి = 3+2 . అందరూ కుటుంబ సభ్యులు లా అయిపోయారు. మీరు కూడా. మీరు చదువుతున్నంతవరకే రాస్తాను. విదిష చిత్రం ఎలావుంది ?

    ReplyDelete
  3. పాత్రల పేర్ల విషయంలో తీసుకున్న శ్రధ్ధకు, పాత్రలను, పాఠకులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్న మీ అంకిత భావానికి నమస్సుమాంజలి

    ReplyDelete
  4. కోర్టు విషయము లందు
    విది, వర్ష ల ప్రాణయం లందు
    పదము ల కూర్పు కొత్తగా అద్భుతం గా ఉంది

    ReplyDelete