Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, March 8, 2021

Bharatavarsha 140

లాంకో హిల్స్ రంజిని నివాసము: ఆనందనిలయములో దిగిన పెళ్లి చిత్రములు చూచుచూ రంజిని  కేశవులు ముచ్చటలాడు కొనుచుండిరి. సోఫాలో కూర్చొని కేశవుడు అతడి ఒడిలో తలపెట్టుకొని రంజని పెండ్లి చిత్రములను చూచుచుండిరి. కేశవుడు రంజని  ముఖమును రెండు అరచేతుల మధ్యన ఉంచి గుండ్రని  నీ మోము దోసిట్లో చంద్రబింబము వలేనున్నది. అనెను రంజని ఆ రెండు చేతులను ముద్దాడి “కలిసి ప్రయాణము చేసిన ప్రతిసారి మరింత దగ్గరగుచున్నాము.” అనెను.

ప్రయాణములు మనని దగ్గరచేయుచున్నను పరిస్థితులు దూరము చేయుచున్నవి. ఢిల్లీ వెళ్లి వచ్చిన నుంచి భానోజీగారు నాతో  మాట్లాడుట మానివేసినారు. శ్రీ భానోదయా కళాపరిషత్ కార్యక్రమములు జీత భత్యములు నీవే చూచుటవల్ల  నేను ఇంకనూ   పని చేయుచున్నాను.” “ఇంకనూ పనిచేయుచున్నా వనే భావనతోనే ఉన్నావా? అయినచో ఎదో ఒకనాడు పని వదిలిపోయెదవా?” “మానసికముగా పనిని ఎప్పుడో వదిలిపెట్టి తిని  నీకొరకే ఈ పనిని అంటిపెట్టుకొని ఉంటిని.  ఆకాశమునుండి ఊడిపడ్డట్టు అమెరికానుండి ఆకాష్  వచ్చుట భానోజీ గారు ఆకాష్ గారిని బాగా  నమ్ముచున్నారు.  మీ అమ్మగారు కూడా అతడినే నమ్ముచున్నారు.” “కానీ నేను నిన్నే నమ్ముచున్నాను. నువ్వు నిశ్చింతగా యుండుము” అని రంజని కేశవుని చిత్రము చూసి  “ఈ చిత్రమందు నీవు  తెల్లని పంచె కట్టి చూడ ముచ్చటగా నున్నావు.”అనెను.“అందుకే కదా ఎక్కువగా పంచెలు కట్టుకొను చున్నాను.  నీకు పంచెలు అంత  నచ్చినచో ఢిల్లీలో ఆధునిక వస్త్రములేల కొనిపెట్టినావు?” అని కేశవుడు కుతూహలంగా అడిగెను. “ఎందుకా నిన్నా  వస్త్రములతో చూడవలెనని  కోరిక గలిగి” అని రంజిని అనెను.    

 “కోరిక తీరిపోయినది కదా!  కోరిక తీరును. తీరి తిరిగిమరల వచ్చును. నేడు మరల నీవు వాటిని ధరించవలెను” కేశవుడు విస్మయముగా చూచి “పెళ్లి చిత్రములు చూచుచున్నప్పుడు ఈ కొరికేల కలిగెనో?” “కొరికేల కలిగెనో నాకేమి తెలియును” రంజని చిరుకోపమును ప్రదర్శించెను. వెంటనే కేశవుడు సరే నేను ఆ బట్టలు ధరించిన నీవునూ ఢిల్లీ లో నీకని కొన్న బట్టలు  ధరింతువా?  ఛీ! అవి చాలా చిన్న దుస్తులు కదా నువ్వు నన్ను కట్టుకొన్న తరువాత నేను వాటిని కట్టుకొందును.” “ఇప్పుడు ధరించిన ఏమగును? ఒక్కసారి ధరించరాదా? అని కేశవుడడిగెను.

 “ఆమ్మో కట్టుకొని చూపించిన నిన్నాప నాతరమా!” “ఛీ నేనట్లెందుకు చేతును?” అని కేశవుడు రంజిని  ముంగురులు సవరించసాగెను. రంజిని తటాలున లేచి దూరంగా కూర్చొని “సుందరికేమాయెను? మీనాక్షికేమాయను?” అని అడిగెను.

“మీనాక్షి కేమాయెను ఆమె చిత్రసీమనేలుచున్నది. రాఘవుఁడే కానరాకుండెను! చాలా దినముల నుండి రాఘవుడి జాడ కనిపించకుండెను.” అని కేశవుడనెను. “మంజూష నిశ్చితార్ధము నకు వచ్చినాడు అతడిని చూచుట అదియే ఆఖరు. పెళ్ళిలో కూడా రాఘవుడి జాడ కానరాలేదు.” అని రంజని అనెను. “పెళ్లి కెట్లు వచ్చును? మీనాక్షిగారికి మొఖం ఎట్లు చూపించును?” అని కేశవుడనెను. “అయ్యో రాఘవుని గతి ఏమాయేనో?” రంజిని అట్లనుచుండగా భానోజీరావు గారు రంజిని తల్లి హైమావతి ప్రవేశించిరి. కేశవుడు నిష్క్రమించెను.

 అమ్మ రంజిని నీవు రాఘవుని గూర్చి విచారించుచున్నావా తల్లీ , మీ అమ్మ నీ గూర్చి ఎంత  మదన పడుచున్నదో గ్రహించితివాగ్రహించితిని, నాగూర్చి కాదు నా మాజీ భర్త గూర్చి ఎంత మదన పడుతున్నదో గ్రహించితిని.

హైమవతి : అమ్మా నీ తమ్ముడు పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా నున్నాడు నీ తోటి వారందరికీ పెళ్లిళ్లు అయినవి. నీవిట్లు వంటరిగా మిగిలిపోవుట చూసి కుమిలి పోవుచున్నాను.

 అమ్మా నువ్వు ఆకాష్ వచ్చినదగ్గరినుంచి  మునుపెన్నడూ లేని విధముగా కుమిలిపోవుచున్నావు.  మావయ్యా నీవు కూడా నాటకములు మాని నా పెండ్లి పై దృష్టి నిలిపినావుఅతడితో ఉన్నది అతడిని వదిలి పోవుటతో,  విడాకులిచ్చిన ఆడడాని కొరకు వెంట పడుచున్నాడు.

కోర్టులు విడాకులు మంజూరు చేసిన  బంధములు తెగిపోవునా? కులము గోత్రము లేని ఒక వ్యక్తిని నువ్వు పెండ్లి ఆడుట అమ్మకి ఎంత అవమానమో ఆలోచించితివా?

ఓహో అదా మీబాధ.  గుణము ఎట్లున్ననూ కులము గోత్రము కావలెను. రెండునెలలుగా ఈమాట వినుటకై ఎదురు చూచు చున్నాను. ఇప్పుడు ఎవరో ఒకరికి నన్నిచ్చి ముడిపెట్టవలెను. అందుకా విడిపోయిన బంధాలగూర్చి నన్నేమార్చుచున్నావు?    అమ్మా నేను చదువు, లోక జ్ఞానంలేని మొద్దుని కాదు. రాయిని మరబొమ్మని కానునాడు పనికి దానినని  విడాకులిచ్చి నవాడు  నేడు ఆకాశము నుండి ఊడిపడునని కలగంటినా? నామనసుకి నచ్చిన మనిషిని నాకు దొరికెను. నేడా సంతోషమును కూడా హరించుచున్నారు

అతడికి బుద్ధి వచ్చి మారెను అతడికి పై నీతో ఎట్లు నడుచుకొనునో చూడుము అని హైమావతి గారు రంజనిని ప్రక్కన కూర్చొని తలనిమురుతూ చెప్పసాగిరి.

ఆకాష్ తో కాపురమెట్లుండునో అనుభవించిన దానిని నాకు మరల ఋజువులనవసరముఅని రంజని తెగేసి చెప్పగా. హైమావతిగారు "విడిపోయిన వారు ఎంత మంది కలిసిపోవుటలేదు  నిదానంగా ఆలోచించు మద్దెల కొట్టుకు తిరుగువాడికంటే..  

కేశవుడి వంటి గుణవంతుడితో అతడికి పోలికా? మరల అతడి గూర్చి ఆలోచించుటాఛీ !

 

 భానోజీ : నీ డబ్బుచూసి ఎరపన్నినవాడు ఎర్రగా ఉన్నచో లొంగిపోవుటయేనా?

రంజని: కేశవుని ఇచ్చట నుండి వెళ్లగొట్టుటకు అతడు సామ, బేధ, దాన దండోపాయములన్నీవాడి చెడిన పిదప చతురోపాయము పన్నుచున్నాడు. ఆకాశ వల్ల  కేశవుడు ఆసుపత్రి పాలయిననూ ఆకాష్ ని గూర్చి  నాకావిషయము చెప్పలేదు. నామనసు మారి ఆకాష్ అంగీకరించినచో తానూ నిష్క్రమించవలెనని మౌనము వహించెను. అంత గుణవంతుడు కేశవుడు.

భానోజీ : ఓహో అందుచే అమ్మనే ఛీ!  అనుచున్నావా రంజని,  నేను నాటకములు మాని నీ పెండ్లిపై దృష్టి నిలిపినానుచున్నావు. అది ఎంతమాత్రమూ అసత్యము కాదు. నాటకములు  నా మేనకోడలు తరువాతే.  సమాజ సేవ కుటుంబసేవ తరువాతేనీ జీవితం  పాడయిన పిదప అట్టిమాటలు  పిచ్చికూతలగును.

రంజని: నాకొరకు ప్రాణములిచ్చు మగాడు నాకు దొరికెను నా జీవితమున కొచ్చిన ముప్పేమియూలేదు. హైమవతి: పెద్ద వయసు స్త్రీని  మోహించి  పిచ్చి పట్టి  రోడ్లు పట్టి తిరుగుచున్న రాఘవుడికి నీకు తేడా ఏమికలదు?” డబ్బు లేకుంటే నీవు రాఘవుఁడేఅని భానోజీరావు అనుచుండెను. అతడింకనూ   పూర్తి చేయకముందే రంజని స్వరము  "మావయ్యా .." అని పిడుగులా ధ్వనించెను. 

రంజని బట్టల పెట్టి తీసుకొని బైటకు వెళ్ళుతుండగా,   రంజని..  రంజని .. ఆగు… ఆగు

“నాకు డబ్బు  అవసరమున్నది  కానీ డబ్బు ఆశ లేదు..”  రంజని వెళ్లిపోవుచుండెను. భానోజీ ఆమెను గేటు వరకు అనుస రించుచూ " రంజనీ .. రంజనీ " అనుచుండగా “డాక్టర్ రంజని” అని గట్టిగా చెప్పి గేటు దాటి గొళ్ళెము మూసివేసెను. కొలది దూరము నడిచి వీధి మలుపు  తిరగగానే   టాక్సీ లో ఎదురు చూచుచున్న  కేశవుడు ఆమె చేతినుండి పెట్టెను అందుకొనెను. రంజని ఆశ్చర్యము నుండి తేరుకొనులోపులే   టాక్సీ వెనుక భాగము తెరిచి పెట్టె అందిడెను.  వారిరువురూ టాక్సీ వెనుక కూర్చొనగా టాక్సీ బయలుదేరెను. రంజని కేశవుని ఎదపైవాలెను.

                                                      ***   


రా.కి : వర్షుడికి హోమ్ కేడర్ లభించెనట,  దామిని: “హోమ్ కేడర్  అనగా?”

రా.కి : అంటే డి ఎమ్ గా విశాఖ వచ్చుచున్నాడు!  దామిని: “డి ఎమ్ అనగా ?”

రా.కి : భారతవర్ష విశాఖపట్నం కలక్టర్ గా వచ్చుచున్నాడట. దామిని: చలన చిత్రమందు అట్లు జరుగును. జీవితమందట్లు జరుగుటకు అవకాశము లేదు. సొంతజిల్లాకి కలక్టర్ గా ఇచ్చుటకు నిబంధనలొప్పుకొనవు.

రా.కి: హోమ్ కేడర్  అనగా  ఐ. ఏ. ఎస్ కి తన సొంత జిల్లాలో నియామకమిచ్చుట.  “డి. ఎమ్. అనగా జిల్లా మెజి స్ట్రేట్. వార్తా పత్రికల్లో ఎక్కువగా వాడు భాష ఇది. ఇదే నీకు తేలియనిచో నియామకపు నిబంధనలు తెలియుటకవకాశము లేదు. దరఖాస్తు చేసుకొనునప్పుడు హోమ్ కేడర్ కావలెనని పేర్కొన్నచో ప్రథముల(toppers) కైనచో ఇచ్చె దరు. 

దామిని “ఇంతింతై వటుడింతై అన్నట్టు మన కళ్లముందే వర్షుడు ఎంత ఎదిగిపోయినాడు. మనకు ఇది ఆనందమే కాక గర్వ కారణము.” అనుచుండగా  “ఇట్లు రమ్ము”, అని   దామినిని రాధాకృషుడు తన దగ్గరకు తీసుకొని కడుపుపై ముద్దిచ్చెను.  దామిని సిగ్గుతో మెలికలు తిరిగెను. ఆమెను  తల్పము పై తన ప్రక్కన కూర్చొండబెట్టుకొని  “మనకి దక్కిన ఆనందము మాలినిగారికి వర్షునికి దక్కవలెనుకదా!” అని అనుచుండగా. “వారి ఆనందమున  కేమొచ్చెను?” అని దామిని అడిగెను.  రా.కి : మంజూష ఇచ్చట ఉన్నచో వారికి ఆనందమెట్లుండును?

దామిని: దానికింత కలత చందవలెనా  అది ఇంకనూ చిన్న పిల్ల అనుచుండగా  అవును మీరిరువురూ చిన్న పిల్లలు పోయి ఆటలాడుకొనుడు , ఇద్దరూ కొద్ది నెలలలో తల్లులు కాబోవుచూ ఇట్లు ప్రవర్తించుటకు సిగ్గుండవలెను. అందరూ  నన్ను ఆడుచున్నారు.  దామిని "ఎవరా ఆడువారు?  ఆ ఆడువారు నావద్దకొచ్చినచోవారిమూతిపళ్ళు రాలగొట్టెదను. 

అబ్బా వారు నీవద్ద కెందుకు వచ్చెదరు. నావద్ద అనుచున్నారు. నాకు తల కొట్టేసినట్లున్నది. 

సమాధానము చెప్పుకొనలేక ఇట్లు మాట్లాడుచున్నావా? మాలిని నన్ను పలుమార్లు మంజూషని మొగుడు వద్దకు  పంపివేయమని చెప్పెను.  రా.కి "మరి అప్పుడు నీవేమి చెప్పినావు?  పంపివేసెదనని చెప్పినావా ? "  

దామిని: బిడ్డను తల్లిని వేరు చేతువా ? పుట్టింటికి  బిడ్డ పురిటికొచ్చినచో ఇట్లే తరిమివే యమందువా?  కాన్పయిన పిదప నేనే కొనిపోయి దాని మగనికి అప్పగించి వత్తును. అని చెప్పి దాని నోరు మూయించితిని.

 రాధాకృష్ణుడు (మనసులో)  ఇప్పుడు నాకర్ధమైనది ఆ ముంగీస ఇట్లెందుకు తయారయినదో దీనిని ఉపాయముతోనే సాధించవలెనని నిర్ణయించుకొనెను. ఇంతలో దూరవాణి  మ్రోగెను. దూరవాణిలో వర్షుడు “మాచెల్లిని  బావ వద్దకు పంపవలెను. సందీపుడు తాగుట మొదలు పెట్టెను. అచ్చటుండి ఆది, దాసు ఈ ఉపకారము చేయుచున్నారు. అయిన వారే ఇట్లు చేయుచున్నారని మా అమ్మ మిక్కిలి కలత చెందినది. చిన్నమ్మ(దామిని)కి నేను చెప్పలేకు న్నాను. వర్షుని గద్గదస్వరము  స్వరము విని రాకి కళ్ళు చెమర్చినవి. 

వర్షునకు సర్ది చెప్పి దూరవాణిని పెట్టి పెద్దగా అరుచుచుండెను, దామిని “ఏమయినది?” అని కంగారు పడుచుండగా “ పెంచలయ్య తనకొడుక్కి ఇంకొక పిల్లను చూచుచున్నాడట.” అని రాకి రుసరుసలాడెను. 

దామిని కలవర పడుచూ “ గొంతు తగ్గించి మట్లాడవలెను, పిల్ల స్త్నానము చేసి వచ్చుచున్నది. అతడు అంత ఘాతుకమునకు వడిగట్టుచున్నా డా!  అయినచో మీరు  అతడి సంగతి చూడలేరా?”

“నీ సంగతే చూడలేకున్నాను ఇక అతడి సంగతి నేనెట్లు చూసెదను!” 

ఛీఛీ మగవారుండి ఏమి ప్రయోజనము! ఆ వర్షుడు ఏమి చేయుచున్నాడు?

వాడిననవలెను అని దూరవాణి వద్దకు పోవుచున్న దామినిని “దామినీ దామినీ కొంచెము యోచింపుము. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొన్నచో ఏమి ప్రయోజనము? అతడికి శిక్ష పడినచో మన పిల్ల జీవితము బాగుపడునా? “అయినచో నేనే మేమి చేయవలెను?” అని దామిని వగచుచుండగా రాకి ఆమె చెవిలో ఒక ఉపాయము చెప్పెను.

                                                                  *** 

శాంతి కేన్సర్ ఆసుపత్రి - విశాఖపట్నం 

దక్షిణామూర్తి మెల్లగా కళ్ళు తెరచి ఎదురుగా కూర్చొన్న సుందరిని చూసి “అమ్మా నీకు రుణ పడిపోవుచున్నాను. నేను మీకు చేసినది ఏమున్నది?  మీరు నాకిట్లు సేవచే చేయుచున్నారు. వదిలి వేసినచో మీకు మేలగును కదా!  నీవు, అగస్త్యుడు సమయమునకు తిని పడుకొనుటకు కూడా లేకుండెను.”
తులసిగారు: ఎవరు ఎంత  చేసినారో చర్చించుటకు ఇదా సమయము! డాక్టరుగారు ఇప్పుడే వచ్చి వెళ్ళినారు . మీ ఆరోగ్యము చక్కబడునని హామీ ఇచ్చినారు.  దక్షిణామూర్తి: డాక్టర్లు అట్లే చెప్పుచుందురు,  ఇంతకీ మీరెవరు?
సుందరి: ఈమె మా అమ్మ కాకినాడ నుండి వచ్చినది. దక్షుడు లేచుటకు ప్రయత్నించి శక్తి లేకుండుటచే వెనుకకువాలి తులసిగారికి రెండు చేతులను జోడించి నమస్క రించెను. నేను మీకు చేసినది ఏమున్నది? మీరు నాకిట్లు సేవచే చేయుట…  అని దక్షుడు అనుచుండగా

సుందరి “మీరు పాడిన పాటే పాడుచున్నారు. మీరు మీ అబ్బాయికి ( అగస్త్యునికి) వలసినంత  ధనమును, ప్రేమను ఇచ్చినారు. ఇట్టి ప్రేమమూర్తి అయిన తండ్రి కి సేవచేయుట కు కొడుకు భాద్యత. “కానీ నీవు ఏల నాకు సేవ చేయుచున్నావు?” అని దక్షు డడగగా, సుందరి " నా భర్తను అనుసరించుట  నాధర్మము.”

తులసిగారు: రేపు మనవడో మనవరాలో కలిగినచో   వారిని  ఆడించి మీ రుణము తీరికగా తీర్చుకొనవచ్చును ఆందోళన మాని పడుకొనవలెను. దక్షుడు ఆనందముగా కనులు మూసుకొనెను. సుందరి తల్లితో కలిసి ఆసుపత్రిలో డబ్బు కట్టుటకు వెడలెను. “పొలమమ్మినట్టు అల్లుడికి, మామగారికి తెలిసినచో క్షోభింతురు.” 
“డబ్బు కట్టినట్టు వారికి తెలియవలసిన పని ఏమున్నది”   

                                                                  ***

మీనాక్షి ఫిషరీస్ లిమిటెడ్ - విశాఖపట్నం : ఆనందపురం ప్రధానశాఖ లో  సంస్థ అన్ని విభాగములు సందర్శించి  అగస్త్య, వివేకుడు దక్షిణామూర్తి గదిలో కూర్చొని యుండిరి. 
అగస్త్య: ఆనందపురము సమీపములో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా ప్రారంభించబడిన సంస్థ,  శ్రీకాకుళం, విజయనగరం , తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, నెల్లూరులలో విస్తరించెను.  
వివేకుడు: ఇచ్చట నీకు వ్యాపారముపై అవగాహన ఉన్ననూ నియంత్రణ లేదు. సంస్థ పై ధ్యాస పెట్టవలెను. ఇచ్చట కొద్దిమందికి మాత్రమే నీవు తెలియును. ఇందుకు కారణములు నాకు తెలియవలెను. 
అగస్త్య: ఈ సంస్థ  ప్రైవేట్ లిమిటెడ్ గా ఉన్న కాలములో అన్ని వ్యవహారములు మా నాన్న చూసుకొనెడివారు. గ్రేస్ కేవలము ఇంటివద్దనుండెదిది. ఆమె మా నాన్నని అనుసరించి సంస్థ లో అడుగు పెట్టిననూ మొదటలో మానాన్న చెప్పిన పని మాత్రమే చేసెడిది. ఈ ఆస్తి పై ఆమె కన్ను పడెను.  

ఈ సంస్థకు నేనే భావి అద్యక్షుడని మా నాన్న అనుట ఆమెకెంత మాత్రమూ నచ్చకుండుటచే కుట్రపన్నెను. ఆ కుట్రపేరు వ్యపారవిస్తరణ,  ప్రజా భాగస్వామ్యమును( పబ్లిక్ ఇష్యూ) కోరుట.  భాగస్తులు వచ్చుట వారు డైరెక్టర్లగా సంస్థ యందు ప్రవేశించుట, మానాన్న ఆమెను నమ్మి కొన్ని కాగితములపై సంతకములు చేయుట తెలిసిననూ, సంస్థ నిధులను స్వాహా చేసి ఆ నేరము మానాన్న మీదకు నెట్టుటకు కారుకొ ని మానాన్నను బెదిరించెడిదని మానాన్న మంచముపట్టిన చాలాకాలమువరకు నాకు తెలియదు. 

ఇచ్చట సిబ్బందిని మార్చివేసి  మానాన్నను మంచము పట్టించి వ్యాపారమును ఆమె హస్తగతము చేసుకొనెను. కుటుంబమునందు కార్యాలయమందు అస్తవ్యస్త పరిస్తితులు నెలకొని ఉండుటచే  నేనిచ్చటికి వచ్చుటకువీలు పడకుండెను. వార్షిక సమావేసమును కూడా ఆమే నిర్వహించెను. బసవడు వచ్చి పరిస్తితులను చక్కదిద్దిన  పిదప కొంత నయము. ఇప్పుడైననూ ఆసుపత్రి యందుండి సుందరి మా నాన్న అరోగ్యము చూచుకొను చుండుటచే  నేనిచ్చటికి …అనుచుండగా అగస్త్యుని కళ్ళు చెమర్చినవి. “ఛీ ఆడదానివలే ఏడ్చుచున్నావా?” అని వివేకుడు కవ్విం చెను. “ఇందు ఆడమగ ఏమున్నది , అయ్యో కొత్తగా పెళ్ళయినది గర్భవతి తిన్నదో లేదో.”  వివేకుడు అతడిలో వచ్చిన మార్పును చూచి సంతోషిం చి “నీకష్టములు త్వరలో తీరిపొవును.”అనగా అగస్త్యుడు ఊపిరి పీల్చుకొని"నువ్వు పరిశోధించనిచో ఆకారు లండన్ లో దొంగిలించబడి దేశములు చుట్టి వచ్చెనని కలనందైననూ ఊహింపలేము."

                                                                     ***

పిదప వారు అప్ ల్యాండ్స్ లో నెలకొల్పబడిన సంస్థ స్థానిక  కార్యాలయమును సందర్శించిరి. 
సుందర్ నీకిది బంగారము వంటి అవకాశము జారవిడిచినచో జైలులో కూర్చొని చింతించవలసి యుండును. అని ఫైల్స్ లో తలదూర్చి హడావుడి నటించు చున్న సుందర్ ను వివేకుడు హెచ్చరించెను. “నాకార్యాలయమునకు వచ్చి నన్నే బెదిరించుచు చున్నావా?” అని సుందర్ మేకపోతు గాంభీర్యమును ప్రదర్శించుచుండగా  
వివేక్: నేను చెప్పెడి మాటలు విన్నచో ఇది బెదిరింపో అవకాశమో నీకే అర్ధమగును
ప్రపంచ పటమందు కారు ప్రయాణమును సూచించు జాడను చూపి “వచ్చే వాయిదాలో  ఇది న్యాయస్తానమందు చూపి సాంకేతికముగా కారు అక్రమ రవాణా జరిగినట్టు సులభముగా నిరూపింతును.  మీరు శ్రీ లంకలో దక్షిణమూర్తి పేర  కారు కొన్నట్టు   ఆపై భారత్ తరలించినట్టు ఆధారములు నావద్దకలవు. “ఏమి కలవు రశీదులా  చెల్లవని మా లాయరు మాటలను న్యాయమూర్తి సమ్మతించినారు కదా. ఉన్న  రసీదులు ప్రయాణపు టికట్లు  కూడా దక్షిణమూర్తి పేరనే ఉన్నవి కదా!” 
వివేక్:  ఒహో అదా నీ బలుపు,  శ్రీలంక పొవుటకు నీవు మద్రాసు నుండి రాముడని ఒక మధ్యవర్తిని కొనిపోయి నావు కదా!  సుందర్   "నాకేమియూ తెలియదు రాముడెవరు?"  వివేక్: "నిన్న నే అతడితో దూరవాణి యందు మాటలాడి తివికదా!" "ఓరి ద్రోహి ఇచ్చట నా కార్యాలయమందు  కూడా ట్రాకింగ్ డివైజ్ అమర్చి నావా!"

అగస్త్యుడు " దీనికి ట్రాకింగ్ డివైజ్ ఏలనయ్యా,  అతడు  మాచిన్నమ్మ మొగుడే అతడి పేరు రోమి.  మేము ముద్దుగా రాముడని పిలుచుకొందుము." అని  వివేకుని చూపుచూ ఇతడి హానీమూన్ వారింటనే జరుపుకొనెను అని చెప్పు చుండగా వివేకుడు రోమితో కలిసి తీయించుకొన్న చిత్ర ములను చరవాణి యందు చూపెను. సుందర్ బిత్తర పోయి చూచుచుండగా వివేకుడు "తనవాటా డబ్బును క్రిప్టోకరన్సీ అనగా బిట్ కాయిన్స్ రూపములో దాచుకొని నీవాటాను బంగారు బిస్కట్ల రూపములో దాచమని సలహా ఇచ్చెను."

సుందర్ “ఇవన్నీ నీకెట్లు తెలియును.” వివేకుడు “పిచ్చివాడా! అవి  జిలేబి పేరనున్న మూడు నక్షత్రముల హొటల్లో  ఎప్పుడూ నీ పేర ఉండు రూమ్ నెంబరు 100 గోడలొ ఉన్నవని అనుకొనుచున్నావు.  సుందర్  “నీవు నన్ను ఏమార్చలేవు నేను నిన్ననే వాటిని తడిమి చూసితిని.” వివేకుడు “వెర్రి సుందరా! నీవు చూచినవి నకిలీ.   అసలు బంగారము ఎప్పుడో తరలించినారు. సుందర్ మొఖము వివర్ణమాయెను అతడి కళ్ళ నీరు సుడులు తిరుగు చుండెను.
వివేకుడు " భర్తనే మోసగించినదానికి నీవెంత? జాన్, జేలని చంపిన కిరాతకుడు శ్యామ్, వాటికి కూడా నావద్ద రుజువులున్నవి అని వివేకుడనుచుండగా అగస్త్యుని కాలివద్ద ఏదో తగిలెను. 
అగస్త్యుడు క్రిందకు చూసెను.  అతడి కాళ్ళ పై బడిన  సుందర్ : నన్ను ఏమి చేయమందువు?
                                                                   ***

2 comments:

  1. వర్డుడు సొంత ఊరికే కలెక్టర్గా రావటం ఆనందంగా ఉంది.కృషితో నాస్తి దుర్భిక్షం.మూడు దృశ్యములు అద్భుతంగా ఉన్నవి.మొదటి రెండు దృశ్యములు చాలా సహజంగా ఉన్నవి.వివేకుని నేర పరిశోధన తీరు అద్భుతం.వివేక్ హనీమూన్ వెనుక ఉన్న కధ ఇదన్నమాట.I feel that I am watching a movie.

    ReplyDelete
  2. The purpose of writing Bharatavarsha is highly fulfilled with such happiness as this is teeming in your heart.

    ReplyDelete