అంగయార్ కన్నె: నీకంత కొడుకు కలడా! నీవట్లు కనిపించవు.
మీనాక్షి: కొలది సంవత్సరములుగా నేనే విశాఖపట్నము పోయి అచ్చటనే వాడిని చూచి వచ్చు చున్నాను. మొదటిసారి నాదగ్గరకు వాడు వచ్చినాడు. విధి వ్రాతెట్లున్నదో చూడుము. జరగకూడనిది జరిగి పోయెను. వినకూడనిదే దైనా వాడు విని యుండునేమో! వాడు నా గురించి ఏమనుకొనునో?
అంగయార్ కన్నె: ఈ పాఠశాలలో ఎవరైననూ నీవు విక్రముడు భార్య భర్తలనుకొందురు. నీ గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు. అతడుకూడా అట్లే అనుకొనును. నీవతడిని పెళ్ళి చేసుకొనిన బాగుండును. మీనాక్షి: హు! అతడితో పెళ్ళా? మగవారి ఊసెత్తిన భయము కలుగుచున్నది.
అంగయార్ కన్నె: అట్లయిన ఎంతకాలమిట్లు కొనసాగింతువు?
మీనాక్షి: నిన్న జరిగినది చెప్పితిని కదా! ఇంక ఈ జీవితములో పెళ్ళి అనునది కల్ల
అంగయార్ కన్నె: ఈరోజెందులకు అగస్త్యను తీసుకొచ్చినావు?
మీనాక్షి మొఖము వివర్ణమయ్యెను. ఆమె మౌనము వహించెను.
అంగయార్ కన్నె: ఏదో కారణముండియె ఉండును. నేను నా వైవాహిక జీవితమును గురించిన అత్యంత గోప్యమైన విషయములను కూడా నీకు జెప్పి యుంటినిగదా నావద్ద దాపరికమెందులకు? "నా యొద్ద దాచిన యెడల నీవొక్కతివే భాదపడవలె"నని కన్నె యనగా. "నీకు తరువాతి తరగతి లేనిచో మనము పచ్చికలో చెట్లక్రింద కూర్చొని మాట్లాడుకొందుము. ఈ ప్రదేశము క్షేమము కాద" ని మీనాక్షి యనెను.
కింకిణి సమ్మేళన మూర్ఛనంబు మేఖల కన్యకా ప్రవాహ లావణ్యమును తలపించుచూ చూపరులకు నయనానంద మగుచుండెను. కన్నె, మీన పచ్చికలో కూర్చొనిరి."అగస్త్యకి చాలా సమస్యలు" మీనాక్షి మొదలు పెట్టెను. నీ కొడుకుకి సమస్యలా ? తానే నీకొక సమస్యవలె నున్నాడు అని కన్నె యనగా "సమస్యలనగా సందేహాలు, ప్రశ్నలు వాటితో బుర్ర వేడెక్కించుకొని మనస్తాపము చెంది విశాఖపట్నము వెళ్లిపోవ సిద్ధమయ్యెను కానీ నేనే పట్టిపట్టి ఇచ్చటికి తీసుకు వచ్చితిని. " ఇంతకీ నీకొడుకు ప్రశ్నలేమి ?" అనుచు కన్నె అమాయకముగా అడిగెను. మీనా చెప్పదొడిగెను.
"అమ్మ ఏమిచేయుచున్నది? ఎట్లు సంపాదించు చున్నది? ఎంత సంపాదించుచున్నది? ఎవరితో గూడి యుంటున్నది? ఇంకా చాలా ఉండవచ్చు, నేను గ్రహించినవి చెప్పగలిగినవి మాత్రము ఇవే. అని మీనా ఆగి దూరముగా వాలీబాల్ ఆడుచున్న విద్యార్థులవంక చూచుచుండెను. తల్లి తండ్రుల వద్ద పెరుగుచున్న పిల్లలకి ఇవి తెలుసుకొనవలసిన పనిలేదు. వంటరి జీవితము గడుపుతున్న తల్లి కనుక ఈ ప్రశ్నలన్నీ సహజంగా వాడి మనసులో తిరుగుచుండును. ఈ ప్రశ్నలన్నీ ఏ తనయుడైననూ నేరుగా తల్లిని అడగలేడు. అట్లని మిన్నకుండలేడు. ఏతల్లికైననూ ఇది మిక్కిలి మనస్తాపము కలిగించును. స్త్రీ ఏమి చేయుచున్నదో వేయి ఆరాలు తీయుటకు పురుషులు ఎప్పుడూ సిద్ధముగా నుందురు. ఆ పురుషుడు కొడుకైననూ."యని మీనాక్షి గద్గద స్వరముతో పల్కుచుండగా కన్నె కళ్ళు చెమ్మగిల్లెను. "విక్రముని వివాహము చేసుకొనిన ఈ సమస్య తొలగి పోవునని అని పించుచున్నది."
మీనాక్షి: అగస్త్య తండ్రి చేసిన పని చూసి నాకు పెళ్లి మీద నమ్మకం పోయినది. విక్రముడు నాకు చాలా సాయపడి మంచితనము నటించెను. ఇప్పుడు విక్రముడు కూడా అట్లే ప్రవర్తించుచున్నాడు. పాఠశాలలో నా కథ నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అగస్త్య ఇప్పుడా విషయమును తెలుసుకొన తహతహ లాడుచున్నాడు
కన్నె: కొన్ని విషయములు చూసి గ్రహించవలెను , కొన్ని విషయములు చదివి గ్రహించవలెను కొన్ని విషయములుచెప్పిన విని అర్థముఁజేసుకోవలెను.
మీనాక్షి: చెప్పిననూ అర్ధముజేసుకొనలేని వానికి జెప్పేమి ప్రయోజనము? జెప్పిన నర్ధముకానివి జూసి యైననూ గ్రహించగలడని ఇచ్చటికి దీసుకువచ్చితిని కన్నె: మంచిపని జేసితివి. నీ దైర్యమునకు నిన్ను మెచ్చుకొనవలెను, నాకు పెళ్లియనిన నమ్మకము లేదని తెగించి చెప్పుచున్నావు. నన్నుజూడుము నాకు పురుషత్వములేని భర్త ఉండి ఏమి ప్రయోజనము? సంఘమునకు వెరచి ఇట్లు బ్రతుకుచున్నాను.
ధైర్యము కాదు ఇది వైరాగ్యము, వెగటు. దక్షిణామూర్తి వల్ల వివాహము మనిన వెగటు పుట్టినది ఇప్పుడు విక్రముని వల్ల పురుషులన్న వెగటు కలుగుచున్నది. ఇక నా జీవిత గమ్యము సృజనాత్మక సంగీత తీరము.
కన్నె:హు!వృత్తి జీవితమేతప్ప వ్యక్తిగత జీవితమునకు తెరదింపవలెనని నిర్ణయించు కొంటివన్నమాట. విడాకులు మంజూరు అయినవా?
మీనాక్షి: కొద్ది రొజులక్రితమే ఆస్తి వ్యాజ్యము పూర్తి ఆయినది. ఈ మధ్యనే విడాకులయినవి.
కన్నె: నీవు స్వేచ్ఛను పొందినావు. నీవిప్పుడు ఒకరి భార్యవికావు. నీస్వేచ్ఛా జీవనమును అభిశంసించు హక్కు నీ పుత్రునకు లేదు సరిగదా వాని తండ్రికైననూ లేదు. పరిపక్వత పెరిగిన యెడల తానే అర్ధము చేసుకొనును. ప్రశాంతముగా నుండుము.
మొదట నా కుమారుడు ప్రశాంతముగా నుండిన పిదప నేను ప్రశాంతముగా నుండగలను. హక్కుల మాటటుంచుము నీతియన్నదొక్కటుండవలెను కదా! హక్కులకోసము ప్రాకులాడు ఇచ్చ నాకున్నచో కానివాడని దెలిసిననూ నా ఆస్తంతయూ అగస్త్య తండ్రికి నేనెల ఇచ్చెదను?
నిన్న రాత్రి అగస్త్య మాగది వైపు వచ్చినట్టు నాకు సందేహము కలుగుచున్నది.వ్యక్తి గతజీవిత మందు స్వేచ్ఛను అనుభవించిననూ సహింపజాలిని సమాజమిది. ఇక నా జీవిత గమ్యము సంగీతమే
కన్నె: దీనికి వేరొకరికి సంజాయిషీ ఇవ్వ పనిలేదు. మీ గదుల మధ్య దూరమెక్కువ కదా అతడెట్లువినును నీవు పొరపడుచున్నావు, పాఠశాల చూచినాడుకదా కొన్నిసందేహములు తీరియే యుండును.
కథనము ఊహాతీతముగా యున్నది
ReplyDeleteఎచటనుండి ఎచటికి బోవుచుండెనో ఊహలకు కూడా అందకుండెను.
This part is beyond the expectations of the reader. Bharatavarsha is really an unique book
ReplyDeleteGreat Sagittarius garu thanks a million, let's forge ahead.
DeleteVery good
ReplyDelete