Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, August 26, 2020

Bharatavarsha 28

మరునాడు విదిష ఆలస్యముగా నిద్ర లేచెను. ఇదంతయూ కలా? నిజమయిన ఎంత బాగుండునని  అనుకొనుచుండగా "రెండున్నర జాములకు(2.pm) పడుకొంటివి కాఫి త్రాగి మరల పడుకొన్న మనసు కుదుటపడును, అనుచు తండ్రి ఆమెకు  కాఫీ  ఇచ్చి   సింహాచలం  మరణవార్త  తెలిపెను. రాత్రి స్వప్నము నేటి సత్యమని గ్రక్కున నమ్మజాలకుండెను. సింహాచలం హత్యోదంతం దూరదర్శన పేటికయందు గాంచువరకూ  స్వప్న, సత్య శంకల నడుమంబడి విదిష డెందము దండసిల్లిననూ(stuck) తత్తరపాటును వీడినామె హృదయము మెల్లన ఉల్లసిల్లె.  అంతలో ఆమెకు ఏదో తెలియని స్పృహ కలిగి  పాదముల క్రింద  భూకంప పానుభూతినిబొందెను. అవ్యక్త భావములు ముప్పిరిగొనుచుండ విదిష, తల్లి చిత్రపటము కడ మోకరిల్లెను.


ఒకప్రక్క చిరుఎండ క్రమక్రమముగా పెరుగుచు  కండ్లను చెదరఁజేయు చుండగా , మరొక ప్రక్క  విగత శాసనసభ సభ్యుని  ఇంటిముంగిట జనవాహిని పెరుగుచుండెను. "తమ ప్రియతమ నాయకుని కడసారి జూచుటకు తరలివచ్చిన జన సంద్రమును చూడండి " యనుచూ ఛాయాగ్రహణములో నిమగ్నమై  కొందరు దృశ్య మాధ్యమ పాత్రికేయులు అటునిటు తిరుగుచూ   అశ్రునయనాలతో ఉన్న కొద్దిమంది బంధు మిత్రులనే పదే పదే  జూపుచుండిరి.  మరికొందరు పాత్రికేయులు " ఆ ప్రజలనోదార్చుట కెవరు గలరు ?  వారికెవరు దిక్కు?" యని అనుచిత పద ప్రయోగమును జేయుచు భాషా కౌసల్య ప్రదర్శనమున పవిత్రభావములను మలిన పరుచుచూ రోతకల్గించుచుండిరి. 

"జన నాయకుని పార్థివ దేహమును సందర్శించుటకు అశేష జనవాహిని ఎట్లు తరలి వచ్చుచున్నదో చూడుడు యని ఒకడు వ్యాఖానించు చుండ ఒక సందర్శకునికి సెగలరేగి " కూలివాని మృతదేహమును  శవమని , ధనవంతుని  మృతదేహమును భౌతిక కాయమని అందురు , పేరు ప్రఖ్యాతులున్నచో  పార్థివదేహమందురు." యనుచూ పాత్రికేయుల దౌష్ట్యమును తూర్పారబట్టెను. చొక్కా పంట్లాముతో నున్న చక్కని చుక్క యొక్కతి కురచ శిరోజాలను మాటకు  ముమ్మారు సవరించుకొనుచూ " సబ్బవరం మూగబోయింది " యని మొదలుపెట్టగా ఊరపండగలో  నాట్యము జేసి  చిల్లర ఏరుకొను శవ నర్తకులు సైతము ఛీ ఛీ యనుచు మొఖం చిట్లించిరి. అతడ్ని దుర్మార్గుడు గర్హించు వారేగానీ అయ్యో పాపమనువారే కరువాయిరి, కొద్దిమంది లబ్దిదారులు మాత్రమతడిని లబ్దప్రతిష్ఠుడని కొనియాడిరి. 

పాడి పైకి లేచెను, పెద్దరోదనలు కలకలం వినవచ్చెను, శవయాత్ర మొదలయ్యెను పెళ్ళుమని ఎండకాయుచుండెను భానుని రౌద్రము మింటిన చండ్ర నిప్పు ను తలపించుచుండ "శవయాత్ర” సాగుచున్నది. నాగిరెడ్డి భుజముపై పాడెనొకవైపు మోయుచుండెను. ఊరంతా కోలాహలంగా ఉంది. డప్పుల మోత, ఈలలు, కేకలు, అరుపుల మధ్య  తరలిపోతున్న శవాన్ని దుకాణదారులు తమ దుకాణాలవద్దే నించుని ఇది మామూలే అన్నట్లుగా అటువైపు చూస్తున్నారు.  

శవం ముందు ముగ్గురు నాట్యం చేయుచుండిరి. వారు బిచ్చగాండ్లు, డప్పు వాళ్ళు. తాగిన మైకం తప్ప వారియందే భావానా కానరాకుండెను.  వారికి కొంచము దూరముగా పిచ్చి పట్టినట్టు  పూనకం వచ్చినట్టు ఒక యువతి నాట్యం చేయుచున్నది . కాళ్లకు చెప్పులు లేక, చింపిరి జుట్టుతో , నలిగిన బట్టలతో నున్న ఆమె వంటిమీద ఒక పురుష హస్తం సుతారముగ వాలెను " విదిషా  పద ఇంటికి పోయెదము”నన్న భారతవర్ష చెంప చెళ్లుమ నెను. మిఠాయి లాగుకొనగా చిన్నప్పుడామె కొట్టిన దెబ్బ గుర్తుకువచ్చెను "ఆమె ఇప్పుడు విదిష కాదు శాంభవి , రుద్రకాళి , మహిషాసురమర్ధిని.    ఆమె  హృదయంలో ఉరుములు మెరుపుల ఘర్షణ తో కూడిన వర్షం కురియుచుండెను. అందులో ఆమె తడిసి ముద్ద యగుచున్నది. ఆమె చెవులలో....

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే 
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే 
భగవతి హేశితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే 
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మారు మ్రోగుచున్నది. వర్షకు ఆమె లయలో రుద్రుడి జటాజూటం నుండి వెలువడిన  ప్రమథగణాల తాండవం కనిపించెను. ఆమె ఉన్మత్త నాట్యవేశము చూపరులకు భీతిగొల్పుచుండెను, ఆమె ఏక్షణమునైన తూలిపడునట్టుగా కనిపించెను. భారతవర్ష ఆమెతో శృతి కలిపి నాట్యం చేయనారంభించెను. విదిష ఇల్లు కొద్దిదూరంలో ఉందనగా ఆమెలో శక్తి పూర్తిగా అడుగంటినది అచేతనంగా భారతవర్ష చేతుల్లోకి ఒరిగిపోయినది. పవిత్ర పూర్ణకుంభయాన్నిదేవళమునకు కొనిపోవు భక్తునివలె  ఆ నవయవ్వన కోమలాంగిని తన రెండు చేతులపై పరుండబెట్టుకొని ఇంటిలోకి కొనిపోయి తల్పంపై పరుండబెట్టి వర్షుడుఆమె ప్రక్కనే కూర్చొనెను.  

శేషాచలం గారు తన్మయత్వ మునంతయూ చూచుచుండిరి. రుద్రభూమికి దారి వారి ఇంటి ప్రక్కనుండి పోవుటవల్ల శవ యాత్ర వారికనులముందునుండే సాగుచుండెను. డప్పులు ఎడతెగక మ్రోగుచుండెను.  మోత అడిగిన పిదప ” ఏజన్మ బంధమో మీది అనేక మంది మిత్రులున్ననూ ఎవ్వరునూ ఆమె కష్టములొ తోడునిలవలేకపోయినారు.” యనుచు వర్ష చేతులని తన చేతులలోకి తీసుకొని అతడి కన్నులందు దృష్టి నిలిపి కృతజ్ఞతా పూర్వకముగా చూచుచుండిరి  

భారతవర్ష   “తథా సత్యం గతం జ్ఞానం యస్య, శ్రీకృష్ణుని చరితంలో ఎన్నోలీలలు కనిపించును. బాల్యంనుండి తన అవతార విశేషాలు తెలుపుతూనే ఉన్నాడు. పండితులు పురాణేతిహాసాలనూ,వేదాలను, శృతులను పరిశోధించి గోపికల పూర్వజన్మ ఏమిటో, వారంతా కృష్ణభగవానుడికి  చేరువ ఎలా అవ్వ గలిగారో వివరించి యుండిరి. సృతులలో గోపికల ప్రస్తావనను పరిశీలించినచో  గోపికలు, ఎంతగొప్పవారో దెలియును.

ఈ గోపికలలో దుర్వాసమహర్షి, ఉగ్రతపుడు, సత్యతపుడు, హరిధాముడు ,జాబాలి, సుచివ్రతుడు వంటి పలువురు తపోధనులు గలరు. వీరిలో కొందరు కృష్ణుని భార్యలుగా అవతరించిరి. దుర్వాసమహర్షి సత్యభామగా, సత్యతపుడు సుభద్రాగా, హరిధాముడు అనే తపస్వి సారంగుడు అనే  వాని ఇంట రంగవేణి పేరున జన్మించి శ్రీకృష్ణుని చేరువయ్యారు. జాబాలి మహర్షి చిత్రాంగధగా, అలాగే సుచివ్రతుడు, సుపర్ణుడు కూడా గోపికగా జన్మించి భగవానునికి చేరువయ్యిరి. ఉగ్రతపుడు సునందుడు అనే గోపాలనుని ఇంట సునందాదేవి పేరున జన్మించి కృష్ణుని చేరువై తన జీవితమును సార్ధకము జేసుకొనెను. కలియుగమున గతజన్మల జ్ఞానముండుట దుర్లభమైపోయినది కదా, మనకెట్లు తెలియును? యని ఆపి  తల్పం ప్రక్కనే యున్న చిత్రమును గాంచెను. మిషెల్ బొమ్మ మహిషాసుర మర్ధిని రూపమున  చిత్రించబడి యున్నది. భారతవర్ష తదేకంగా జీవకళ ఉట్టిపడు ఆ చిత్రమువంక చూచుచుండెను. శేషాచలముగారి ముఖమున చిరునవ్వు తొంగిచూచెను. 

3 comments:

  1. ఎంతో లోతుగా అధ్యయనం చేసి పొందిన జ్ఞానాన్ని అలవోకగా అందిస్తున్నoదులకు అభినందన మందార మాల మీకు పూలబాలా!!!!!!!

    ReplyDelete
  2. సింహాచలం మరణం, విదిష తాండవం, మిషేలు చిత్రపటం, అద్భుతంగా ఉంది. రోజూ ముత్యాల జల్లులు కురిపించే కలం ఈ రోజు అగ్ని కణికలు
    వెదజల్లుతుంది. శ్రీకృష్ణుని భార్యలతో ఉన్న గత జన్మ బంధం గురించిన వివరాలను చక్కగా వివరించారు.

    ReplyDelete