Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, August 5, 2020

Bharatavarsha 19

భారతవర్షను రక్షకభటులు ఎచ్చటికి కొనిపోవుచున్నారని మాలిని గారికి దడ  పుట్టెను. రేపు నేరపరిశోధనా కార్యాలయమునకు వత్తుమని భారతవర్ష చెప్పిననూ వారాలకించలేదు.  మంజూష వేడుకోలు వారిని నిలువరించలేకపోయెను. కేశవుని విన్నపము వారికి బట్టనేలేదు. కేశవుడు వాహనము వెనుక శక్తికొలదీ పరుగిడి డస్సి నిలిచిపోయెను.  మాలినిగారు శోఖండములు  పెట్టుచుండ మంజూష కేకలు వేసి నోరుబెట్టిగా ఆమె ఊరుకొన్ననూ కాస్సేపటికి గుడ్లు తేలవేసెను. కేశవ మంజూషలు వైద్యుని వద్దకొకరు వకీలు వద్దకొకరు బోవ సంకల్పించిననూ మంచమువద్ద నెవ్వరుందురని గుండెలు గుబగుబ లాడు చుండ దూరవాణి ద్వనించెను. మంజూష మాటలాడ ప్రయత్నించిననూ  అవతల వ్యక్తి నోరువిప్పకుండెను .
వాడు ఖచ్చితముగా బైరెడ్డి యే. నాతో పెట్టుకొన్న ఫలితమిట్లే యుండునని జెప్పుట కన్నమాట , యనుచు కేశవుడు సాధనమును చేతబూని స్పందించెను. రేపటి రోజురూఢిగా నాదే యని కేశవుడు పలక బైరెడ్డి పోరా యని.. వికట్టహాసము చేసెను. తెల్లవారులోపు వారేమి చేయకుండిన చాలునని కేశవుడనుచుండగా మాలినిగారిలో చలనము వచ్చెను, ఈ రాత్రికి నాకొడుకునేమిజేయుదురనుచు మరల ఏడుపు మొదలు పెట్టిరి. ఇంతలో మంజూష వకీలుగారికి దూరవాణి ద్వారా విషయమును తెలియజేయగా వారు వైద్యుని వెంటపెట్టుకుని వచ్చిరి. 

వైద్యుడు సూదిమందిచ్చి విభ్రాంతిచే కలత నొందినారని ఏమియునూ భయములేదని చెప్పి వెడలిపోయెను.  బైరెడ్డి దూరవాణి సాధనమున పిలిచి మూగవలె నుండి బెదిరించుచున్నాడని కేశవుడు జెప్పగా వకీలుకి అరికాలి మంట నెత్తికెక్కెను వెంటనే అతడి  సంఖ్యను కలిపి " ఓరి బైరి! నారాధమా, కపటనాటక సూత్రధారి నేను వెలుగు పార్టీ వీరరాఘవ కుమారుడను వీరప్రతాపుడను, నీవొక ఆకురౌడివని అవగతమగుచున్నది మానాయిన సింగము ఆయన పేరువినిన అక్రమార్కులకు వణుకు పుట్టెడిది. ఆయనబోయిననూ నేను బ్రతికేయుంటిని చేవయున్న రమ్ముచూచుకొనెదము జారపుత్రునివలె నక్కుటేల యని హెచ్చరించెను. నేను మీయబ్బాయిని దీసుకువచ్చెదనని జెప్పి వకీలుగారు నిర్భీతినుండమని శెలవిచ్చి దారికాసి చీకటిమాటున రాళ్లతో కొట్ట సిద్ధముగా నున్నారని తెలియక ద్విచక్ర వాహనమునెక్కి వెడలినారు. 

                                             ***
హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయ మార్గమందు అభిసారిక అదరములవలె కెంపువర్ణ కాంతులీనుచున్న ఇన్నోవా వాహనము 10 గంటల 45 నిమిషములకు పైకెగురు ఇండిగో గాలిఓడ జేరుకొన చిత్రకము (చిరుతపులి) వలె సాగుచుండెను. వాహనమునకు ముందు రక్షణాధికారుల వాహనముసాగు చుండెను. వెనుక మరి రెండు వాహనములు అనుసరించుచున్నవి. దక్షిణ భారతము నుండి దిగువసభకెఎంపిక కాబడ్డ విశాఖపట్టణ నియోజకవర్గ సభ్యుడు రామినాయుడు మరియు పశ్చిమ భారతము నుండి  దిగువసభ కెఎంపిక కాబడిన బారామతి నియోజకవర్గ సభ్యురాలు అరుణతార వాహనమందాశీనులై యున్నారు.

తరుణదశయందు అభినవమై అలరారుచున్న పడుచువలె  విమానాశ్రయమునకు బోవు మార్గము సువిశాల మై సుందరమై  కురువింద తళుకులీనుచూ ,  కువలయమువలె( black lotus)  క్రొక్కారు నీలి మేఘమువలె నొప్పు చుండెను. రహదారికిరుచెంపల రత్నకంబళము పరిచినట్లున్న పచ్చని పచ్చిక ఊరట కలిగించుచుండ పచ్చికపై నిలచిన కజ్జూరవృక్షములు  ద్వజస్తంబములవలె   ఉజ్జయిని రాజసమును  సొక్కించుచూ ఆ మార్గమందుబోవు వారికి ఆహ్లాదమందిచు చుండెను.    

ఎంతోకాలమైనట్లున్నది  తార నిన్నుచూసి. నాయుడు నీకు జేసినా అవమానమునకు కృంగిపోక వేరొక పార్టీలో జేరి లోక్సభకు జేరిన నిన్ను తప్పక అభినందించవలె.”  అనెను రామినాయుడు.నువ్వు  ముఖ్యమంత్రితో మంతనలు జరుపుచున్నావు , కుట్రలు పన్నుచున్నావో!” యని హాస్యమాడుచున్న అరుణతారను కిచ కిచ నవ్వున  చెంగగొట్టుచూ నీ చతురములు నాకెప్పుడూ ఒప్పిదములుగానే తోచును. నిజము జెప్పవలె, నాకు ఈమాద్యనొక చేదు అనుభవమెదురైనది. విశాఖపట్నము కలక్టరు యువకుడు గతవారము జరిగిన ఎం పీ  లాడ్స్  (MPLADS)సమావేశమందు కొంచెము దూకుడు ప్రదర్శిం చెను.”

(*పార్లమెంటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఎం పి లాడ్స్ అనేది భారత ప్రభుత్వం 1993  రూపొందించిన ఒక పథకం, ఇది పార్లమెంటు సభ్యులను తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను సిఫారసు చేయటానికి వీలు కల్పిస్తుంది. )

“అవును నేనూ వార్తా పత్రికలో చదివియుంటిని సమావేశములో ఎం పీగారు కలెక్టర్ కార్యాలయము లో సిబ్బందిని  బెదిరించారని కలెక్టర్ ఆరోపణలు చేయుటవల్ల, ఎం పీ గారు కలెక్టర్ నుండి క్షమాపణ కోరినారు.” అన్న వార్త. ఇది చాలా బాధాకరము  అని అరుణతార అనెను.

అప్పుడు రామి నాయుడు భాదాకరమా బొగ్గులా ఇదిగో జూడుమనుచూ అని తన చరవాణి నందు జిల్లాకలక్టరు ముఖపుస్తక ఖాతాను చూపించెను. కలెక్టర్ రామినాయుడుకి షరతులు లేని క్షమాపణ చెపూతూ తన ముఖపుస్తక మందుంచగా 33,000 మంది చూసి ఇష్టపడిరి.  దీనితో ఇద్దరిమధ్య వారం రోజుల “స్లగ్ ఫెస్ట్” (గా వార్తా పత్రికలూ అభివర్ణించిన) ప్రతిష్టంభన ముగిసిపోయెను.

 “నాపట్ల పొరపాటు ఉండటంవల్లనే ఎం పీ గారు నన్ను పరిపక్వత లేనివాడిని గర్విష్టి అన్నారని నమ్ముతున్నాను.” అని వ్రాసినారు. అని అరుణతార చూపగా “నాకంటే హోదాలో అనుభవంలో పెద్దవారు అయిన ఎం పీ గారివద్ద నుండి నేర్చుకొనుటకు నేను సిద్దమే అని వ్రాసినాడు.” చూచితివా అని రామినాయుడు చూపినాడు.

“అహందెబ్బతిన్న ఎవరైనా భాదపడుట సహజమే  అనుచున్న రామినాయుడిని ఆపి అధికారముండి సాగినచో  ఇట్లుండును. నీవు సాధించితివి , కలక్టరుగారు విద్యావంతులు సహృదయతను చూపినారు.   కానీ నావిషయమున వెలుగు పార్టీ నాయుడు ఎట్లు ప్రవర్తించినాడో చూచితివా   నాకు అహం దెబ్బతినుటయే కాక ఘోరపరాభవము జరిగినది, నీకు సాగినది   నీవలె నాకు సాగలేదు నేనువైదొలగితిని. అనుచున్న అరుణతారతో " ఆ నాయుడు అందరితోనే అట్లే ప్రవర్తించును , అతడితోనే  వేగలేక వేగుచుతుండగా  అతడి  వాజెమ్మ పుత్రరత్నమును గూడా భుజములమీదకెత్తుకోవలసి ఖర్మము పట్టినది. " అని రామినాయుడు అనెను. 

 “ఒకరిని భుజములమీద మోయుటకు, కోట్లకు పడగలెత్తిన నీకేమి ఖర్మము” “యన్న అరుణతార తో  “అనాగా నీఉద్దేశ్యము నేను ఆ "ఈ.ఎస్" కుంభకోణంలో 500 కోట్లు బొక్కితినని నీవునూ  నమ్ముచున్నావన్నమాట తస్సాదియ్యా” యని రామినాయుడు మొఖమును పక్కకి త్రిప్పుకొనెను.  అరుణతార  "అబ్బో ఎంత రోషమో ! ఎన్నికలసంఘమునకు ప్రమాణపత్రముందు 600 కోట్లున్నవని వ్రాసి ఇచ్చితివికదా మరి కోట్లకు పడగలెత్తినావన్నచో  ఈసెందులకయ్యా రామినాయుడు" యని అరుణతార పరిహాసముమాడెను.

"మరి యాకుంభకోణము మాట" "ఆ మాట నేనంటినా? "
 "అయినచో పుచ్ఛక్కాయలదొంగ అనిన భుజములు తడుముకొనుచున్నానా?"
"ఆ మాట (పుచ్ఛక్కాయలదొంగ) కూడా నేననలేదు నీవే అనుకొనుచున్నావు."
 ఇన్నోవా విమానాశ్రయమును జేరగా రక్షణాధికారులు వందనమిచ్చి వీడ్కోలుపల్కిరి. 
విమానము 10 నిమిషములు వేళమించి వేచియుండుటచే విసుగు చెందిన ప్రయాణీకులు ఆ ప్రముఖులిద్దరు అడుగిడినంతనే ఊపిరిపీల్చుకొనిరి. విమానము రౌద్రఘంకారమున గాలిలోకి లేచెను.

విశాఖపట్నము విమానాశ్రయము నుండి రామినాయుని వాహన శ్రేణి బయల్వెడలుచుండ ఒక కుర్రవాడు రహదారిపై  వాహనములకెదురు నిలిచెను రాక్షణాధికార్లు అతడిని తన్ని గెంటివేయుచుండగా అరుణతార పేరునుచ్చరించుచూ కదలకున్నాడు. ఒక అధికారి అతడిని లాక్కుపోవుచుండ అరుణతార కంట పడెను. ఆమె కనుసైగతో వాహనశ్రేణి నిలిచిపోయెను. " కేశవా యనుచు దిగిన అరుణతారను చూజి కేశవుడు విలపించుచుండగా అతడిని తన వాహనంలో ఎక్కిచుకొన్నప్పిదప వాహన శ్రేణి కదిలెను. ఒక అధికారి జరిగిన విషయమును  నిస్తంత్రిమాద్యమమున రామినాయుని వాహనమునకు చేరవేసెను.

కేశవా నేను సాయంత్రము విశ్వవిద్యాలయములో జరుగు సభకుహాజరగుటకు వచ్చితిని , నీవెందులకు రోదించుచున్నావు ఏమి జరిగెనని విచారించెను, కేశవుడు బైరెడ్డి ఘాతుకమును , రక్షకభటుల నిర్వాకమును తెలియజేయగా అరుణతార చిరునవ్వు న స్పందించెను. 

                                                ***
జిల్లా పోలీసు అధికారి స్వయముగా సబ్బవరం ఠాణా అధికారిని మందలించుచూ  భారతవర్షను తన వాహనమునెక్కించుకొని  అతిధి గృహమునకు కొనిపోయెను. సబ్బవరం ఠాణా అధికారి బైరెడ్డి ని పోలీసు వాహనమందు ఎక్కించుకొని అతిధి గృహమునకు పోయెను. రామినాయుడు జిల్లా పోలీసు అధికారి అందముగా మందలించెను.  జిల్లా పోలీసు అధికారి ఠాణా అధికారిని మందముగా మందలించెను.  పిమ్మట ఠాణా అధికారి బైరెడ్డిచే  గుంజీలు తీయించెను. జిల్లా పోలీసు అధికారి బైరెడ్డిని ఖైదు చేయవలెనని జెప్పగా బైరెడ్డి  భారతవర్షను , కేశవుని పెద్దమనసుతో క్షమించమని వేడుకొనగా భారత వర్ష కరిగిపోయెను. కానీ కేశవుడు మాత్రము  బైరెడ్డిని కొనిపోయి విదిష ఇంటివద్ద  గుంజీలు తీయవలసినదిగా కోరెను.

4 comments:

 1. మొత్తానికి బైరెడ్డి భరతం పట్టారు

  ReplyDelete
  Replies
  1. Ha hha hha . There is lot more that he can do It is a long epic and there are many wonders. please tell me how is the language? description of the way to airport. How is the story ? is it keeping your interests?

   Delete
  2. సాటి లేని భాషా నైపుణ్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న పాత్రలు, ఊహించని మలుపులు,విషయ పరిజ్ణానం అన్నీ కలిసిన అద్భుతమైన ప్రయోగం (యోగం) భారతవర్ష (పూలబాల గారి రచనా శైలికి మరో ఉదాహరణ)

   Delete
 2. Hellio cinemavilla It is a great job, I love your posts and wish you all the very best. And I hope you continue doing this job well.
  https://www.smore.com/6p8ba-cinemavilla-2020

  ReplyDelete