ప్రొద్దుపొడుపున తూరుపు కనుమల నావరించిన నీహారము(దట్టమైన పొగమంచు) ప్రాచ్యోదధి వరకు ప్రాకి విశాఖపట్టణ కంఠమందు మణిహారమై మెరియుచుండ శిశిరఋతువు వన్నెలుచిన్నెలన్ని వరమాల చేసి రమ్ము రమ్ము ననుగొనిపొమ్ము ఈఅదను వ్యర్ధంబైన రాదెన్నడున్ యని ఘోషిల్లి వైశాఖఱేడును పరిణయమాడు చున్నట్లున్నది. మంచుతుంపర జిగిముత్యాలవలె కురియుచుండ, వధూ వరులకవి అక్షింతలువలె, పూలరేకులవలె నొప్పుచుండెను. వైశాఖ శిశిర రాణిల వివాహసంబరము నంబరము నుండి ఎండఱేడు మందహాసపూరితుఁడై తిలకించు చున్నట్లున్నది.
ధూమిక(పొగమంచు)అలిమిన సాగరతీరము వెంబడి నావవలె తేలియాడుచున్న ఎర్తిగా వాహనమందు జాజ్ సంగీతరాణి ఎల్లా మధురస్వర పుష్పరసాహ్వయము నోలలాడుచున్న అగస్త్య, బసవ, సందీప మిత్రత్రయమునకు - గవాక్షం నుండి ప్రాచ్యోదధి మహా ముకురమువలె నగుపించెను. తీరరేఖ వెంబడి రివ్వున సాగుచున్న వాహనము, విహంగావ లోకనమున, పిపీలకమువలె నగుపించుచుండ, వాహనమునున్నవారి కొకచెంప ఉద్యానవనములు వేరొకచెంప ప్రజ్ఞాశాలుల విగ్రహములు వాహనగతినందు క్రమక్రమముగ అవగతమగుచుండెను. ఉల్లము నవనవోన్మేషమ (increasing delight) గుచుండ వారు చక్కర కణము చిక్కిన చీమలవలె చెలరేగుచుండిరి.
ఏమి ఈ అగస్త్యుని జోరు ఈ విలాస వాహనమునద్దెకు దీసుకొని మమ్మందరిని ఉత్సాహ పరుచుచున్నాడు. అని సాందీపుడనగా “ఎంతడిగిననూ విషయము జెప్పకున్నాడు ఇంకెతమాత్రము నేనోర్వజాలను ఈ సంబరములకు కారణమేదో చెప్పుము” అని బసవడు గట్టిగా అడుగ అగస్త్య వాహనమును నిలపమనెను. చోదకుడు వాహనమును నిలిపెను. ఏమిరా! నీ దౌష్ట్యము! కారణమడిగిన వాహనము దిగమందువా యని బసవడు ఎగ్గుగొనెను. ఇంతలో విరామ కేంద్రమువద్ద వేచియున్న రాఘవ వాహనంలోకి ప్రవేశించెను. అప్రాచ్యుడు సమయపాలకుడే. అని అగస్త్య అనుచుండగా ఎవరిని అప్రాచ్యుడు అనుచున్నారు అంతపెద్దతిట్టు ఎట్లు తిట్టినారు?” అనుచూ రాఘవుడు కోపగించుచుండ బసవడు పడిపడి నవ్వుచూ " అప్రాచ్యుడనిన తిట్టుగాదే , ప్రాచ్యము అనిన తూరుపు యని అర్ధము, బె ఆఫ్ బెంగాల్ అని ఆంగ్లేయులు దీనికి నామకరణము జేయక పూర్వము దీనినే ప్రాచ్యోదధి లేదా తూర్పు సముద్రము అనెడువారు. అప్రాచ్యుడనగా పశ్చిమదేశమువాడు, ప్రాచ్యుడుగాని వానినప్రాచ్యుడు అనిన తప్పులేదు. అయిననూ ఇచ్చట నీకంటే అప్రాచ్యుడెవడు కలడు అమెరికాబోయి వచ్చినావు, మరలబోవుచున్నావు." యని బసవడు ఎకసెక్కెమాడెను.
అంత సాందీపుడాగ్రహించి ఓరీ బసవా! జల్పములాడుచు కాలయాపన జేయుచున్నావు, అగస్త్యుని జూడుము అసలు విషయము మరచి మనము వాదులాడుకొనుటచూచి ఎట్లు ముసి ముసి నవ్వులు నవ్వుచున్నాడో. అనగా బసవడు “ఓరీ అల్పబుద్ధి! మమ్ము తప్పించుకొనవలెనని పన్నాగము పన్నినావా యనుచు అగస్త్యేని పై బడి పిడిగుద్దులు గుద్దుచుండ అగస్త్యుడు నోరువిప్పెను.
మా తండ్రిగారు నాకు ఒక లక్ష రూప్యములనిచ్చినారు. నేనొక అద్భుతము నావిష్కరించ బోవుచున్నాను యని ముదమున జెప్పెను. అంతడబ్బుతో నేమిచేయబోవుచున్నావు యని అందరు ఉత్సుకతతో యడుగగా వారికి, చేతులో లకుమ చిత్రము.. అగస్త్య మౌనము కానవచ్చెను. అతడి నిశ్శబ్దతూటాకి అందరు అదిరిపడి అవాక్కయ్యిరి. భారతవర్షను ఉద్యోగమునుండి తొలగించినారు. యని జెప్పి రెండవ తూటాపేల్చినాడు. అందరు మొగమొగములు జాసుకొనిరి. ఇంతలో వాహనము జంతుప్రదర్శనశాల వద్దకుచేరి నిలిచెను. అగస్త్యుడు వాహనమునున్న శీతలపానీయ సీసా గయకొని వాహనము దిగి చోదకునకు "వేచి యుండు"మని చెప్పి అగస్త్య ఎదుటనున్న కంబాలకొండ అడవిలోనికి బోయెను. మిత్రులతని ననుసరించిరి.
అలనాడు విజయనగర రాజులాధీనమునందున్న కంబాలకొండ విజయవాడ నగరము కంటే పెద్దదనిన విస్మయము కలుగకమానదు. ఆ సతతహరితారణ్యము గిరులతో, విరులెత్తు కొండగోగులతో, రమణించు రేలపూలతో, మేడి, చండ్ర వంటి వృక్షములతో, మదాళించు (over grown) పొదలుతో , ఏటవాలు డొంకలతో, పచ్చని పచ్చికతో పలు మృగ విహగములతో కనువిందు జేయుచుండెను. గిరుల మధ్య నొకసరస్సు పూలపానుపువలె నగుపించెను. అందు కొన్ని జంటలు రాసక్రీడా తత్పరత్వమున నౌకావిహారం చేచున్నవి. వారి సల్లాపములను గాంచిన అగస్త్యుడు చేష్టలుడిగి చూచుచుండ అందొకడు "అగస్త్యునకు శ్వాసక్షయమగుచున్నట్లున్నది" యని పరిహాసమాడగా, అగస్త్యుడు “ఈ అడవిన చొత్తించు జంటపక్షులు దేహంబులాహిరిగొన(మైకము) బాహ్య ప్రపంచము మసక గమ్మి సుషుప్తి (పూర్తిగా లీనమైన స్థితి) శిఖరమునకు చేరుచుందురు.” యని వ్యాఖ్యానించెను.
ఆ మిత్రబృందము ఆ బృందావనమునందు ఒక గోగువృక్షము క్రింద కూర్చొనెను.
సుషుప్తావస్థ వర్ణన రమ్యముగా నున్నదనుచూ రాఘవుడు అగస్త్యునకేలనో నానాటికీ కవితాశక్తి అధికముగుచున్నది అనగా సాందీపుడు " అవధాని సాంగత్యము వలన కావచ్చు"ననెను , " అయినచో అవధానం చేయవచ్చున'ని రాఘవుడు పరిహాసమాడెను. "భారతవర్ష ఇప్పుడేమిచేయుచున్నాడో? నీవేమైననూ ధన సహాయము జేసినచో..."యని బసవడనుచుండగా" అగస్త్యుడు "సార్ధక నామధేయుడు, బసవడు ఎద్దువలె నాలోచించుచున్నాడు , నాడు అరుణతార వారింటికి వచ్చినప్పుడు భోజనమునకు ఇంటికి వచ్చుసరికే కళాశాల యాజమాన్యము వారు ఉద్యోగమూ చాలించుకొమ్మని జెప్పియుండిరి , నాడు అరుణమ్మకీ విషయము జెప్పమనగా నన్ను మందలించెను. నాడు తల్లికైననూ ఆవిషయము జెప్పలేదు, నేను ధనమిచ్చిన, దానమిచ్చిన వర్షుడు పుచ్చుకొనువాడు కాదు." తెలుగు పండితునిగా అతని ప్రతిభను చూచి పిలిచి ఉజ్జోగామిచ్చినారు, అట్లే నేడు వేరొక కళాశాలవారు పిలిచి ఆంగ్లోపన్యాసకునిగా ఇచ్చినారు. యని అగస్త్యుడు జెప్పెను.
నాకు దెలిసి అతడికి ఆంగ్లమున విద్యార్హత లేదు యని రాఘవుడనగా , బసవడు "నీ తెలివి ఇట్లుండబట్టే నిన్నప్రాచ్యుడనుచున్నారు. పర్షియాదేశ కవివరేణ్యుడు ఒమర్ ఖయ్యాం పేర విని యుంటివా ? యని అడుగగా " తెలియుననుచూ , అతడి వ్రాసిన పానశాలను కవికోకిల దువ్వూరి రామిరెడ్డి తెలుగులోకనువదించినారు "అని రాఘవుడనెను. "ఒమర్ ఖయ్యాం పానశాల వ్రాసియుండలేదు ఖయ్యాం వ్రాసిన రుబాయాలను రామిరెడ్డిగారు తెలుగులోకనువదించి పానశాలగా పేరిడినారు. ఆ కవికోకిల బిరుదాంకితుడు రామిరెడ్డి గారి చదువు 8 వతరగతి మాత్రమే.
ఒమర్ ఖయ్యాం ఆర్ధిక పరిస్థితి మందగించినపుడు , అతడి సహపాఠి రాజుగారి కాప్తుడు రాజాస్థానమున ఉద్యోగము ఇప్పించుటకు ఒమర్ ఖయ్యాం ను కొనిపోవగా , అతడు ఉద్యోగము నందు ఆసక్తి చూపక రచనమునందాసక్తి జూపెను. అతడి పాండిత్య ప్రతిభను కాంచి రాజతడికి గౌరవవేతనమునిచ్చి రచనలు జేసుకొమ్మని పంపివేసెను. అతడి చరిత్ర బీజగణితము నందు కూడా విశేష ప్రతిభను కలిగి యుండెను గణితము స్వయముగా సిద్ధాంతములను రూపొందించుచూ ఖగోళ శాస్త్ర పరిశోధనలో నిమగ్నుడై న అతడిని ఖగోళశాస్త్ర పరిశోధనా కేంద్రమందు పరిశీలకుడిగా నియోగించినారు.
అతడి రుబాయాలను ఫిట్ జరాల్డ్ యను అమెరికా రచయిత ఆంగ్లా నువాదము జేయగా అందు పెక్కు లోపాములుండుటచే హరికథ పితామహుడు బహుభాషా కోవిదుడు ఆదిభట్ల నారాయణ దాసు గారు తనదైన శైలిలో ఆంగ్లానువాదం జేయగా ఫిట్ జరాల్డ్ ఆ అనువాదం జూచి తన అనువాదం కంటే మెరుగుగా నున్నదని అంగీకరించెను. యని బసవడు జెప్పుచుండగా " ఇప్పుడు పాండిత్య ప్రతిభ గూర్చి చర్చ ఎందులకు అని సాందీపుడు పలుకగా " మనము జదువము, ఎవరైనా జదివిచెప్పిన వినువారము కూడా కాదని నిరూపించుచున్నావు అనుచూ బసవడు అన్నిటికంటే ముఖ్యమైన విషయమొకటి జెప్పెదను వినుము. నాసావారు చంద్రునియందొక లోయకి ఒమర్ ఖయ్యాం పేరిడినారనిన దానియర్ధమేమి?” యని బసవడన "ప్రతిభాఉన్నచో అమెరికాలో మంచి ఉజ్జోగములు వచ్చున”ని రాఘవుడనుచుండగా “మనుజుడమరుడగును” యని అగస్త్యుడు ముగించి మధువు కలిపిన శీతల పానీయమును అచట దొరుకు కోపల యందు బోసి ఇచ్చెను.
రాఘవ సందీపులు తీసుకొనిరిగానీ బసవడు నిరాకరించెను. సందీపుడు పొదల చాటున జంటలను చూపెను. కొండొక సఖుడు దుద్దుగ చెట్టు వద్దనున్న పొదలలో బిమ్బాధారి ఓష్ఠములను చుంబించు చుండెను. విరగ కాసిన ఎర్రని దుద్దుగ పండ్లువలె ఆమె పెదవులు మెరియుచుండెను. నేలంతయూ రేలపూలు రాలి యుండెను. పచ్చని గోగుపూలు వాటి పై రాలుచూ మనము నాహ్లాద పరుచుచుండెను.
భోగించుట తప్పుకాదని రాఘవ సందీపులు పలుకుచుండ బసవడు వారితో సంవాదమునకు పూనుకొనెను. అప్పుడగస్త్యుడు వాదిప్రతివాదుల పరస్పర ప్రాగల్భ్యము నకిది సమయముకాదు యని జెప్పుచూ,
"ఈ సుందర ప్రకృతి లోకమంతయూ పానశాల వంటిదని స్వర్గమున్నచో ప్రియురాలి ఎదపైనేయున్నదన్న ఒమర్ ఖయ్యాం తత్వమునూ, ఆనందమే జీవిత మకరందమనిన గ్రీసుదేశవాసి ఎపిక్యూరస్ సుఖజీవనవాదమును, విషయాసక్తత పురుషార్థమనిన అరిస్టిపస్ భోగపరాయణ తత్వమును తనలో ఐక్యము జేసుకొనె"ననెను.
Superb!!!!Simply fantabulous!!!!!
ReplyDeleteyour love and encouragement is the fuel of the engine of poesy
Deleteసుందరమైన విశాఖ నగరాన్ని మరింత మనోహరంగా వర్ణించారు.అక్షరములను మేలి ముత్యములుగా చేసి కూర్చబడిన కంఠహారంలా ఉందీ రచన.
ReplyDeleteమీ భాషాభిమానమే నా చేత ఈ కావ్యం రాయిస్తున్నది. భాషను ప్రేమించేవారి కోసం కొన్ని జన్మలు వేచియుండచ్చు.
Delete