Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 31, 2020

Bharatavarsha -31

రేగడ  రాగమున ధగధగ లాడు ఫియాగో   బేగడ రాగమువలె  వలె సాగుచుండ మదోన్మత్త తురంగ సకిలింతలు సద్దుమణిగిన అంగయార్ కన్నెమది సారంగరాగము పాడుచుండె. శృంగార సాఫల్యతా సంతృప్తి బడసిన దేహము కొంగ్రొత్త కాంతులీనుచుండ పంచక్షేత్రాలు నొక్కసారిగా దర్శించిన కలుగు ప్రశాంతత మనమునలుముకొనగా కన్నె కొనకంట వరదాచార్యుని గాంచి మధుర ధరహాసముజే యుచూ మైమరపు బొందుచుండెను. ఆచార్యుడు అంకె యని అల్లన పిలిచెను. బదులుపలకని కన్నెను  గాంచి “అంగయార, అంగయార” యని వత్తి బలికెను. తలతిప్పిజూచిన పూబోణితో   పిలిచిన పలుకక ఏ లోకమునుంటివి యనెను “ ఎప్పుడో  వివాహమైన కొత్తలో  అంగయార , అంకె  యని పిలిచెడివాడవు. ఇంకనూ ఆపిలుపులెట్లు గుర్తుండును. “శృంగార విభావరి తలచుకొన్న ఇంతుల శృంగార కైవల్యము పునఃప్రాప్తి నొందరే, ఏమో యనుకొంటిని అంకెకాడవే నీవు యనుచు బుగ్గ పోటున, సిగ్గునొందె. వాహనమును నడుపుచున్న షిరోమి నవ్వుకొని వాహన వేగమును పెంచెను.

మనముఁబోవుచున్నది తీర్థ యాత్రకు శృంగార యాత్రకు కాదు, చిలకల కొలికి శృంగార కవయిత్రివగుచున్నదే యనగా, నేను గాయకురాలిని అని తెలియజేయుట కన్నట్లు సందర్భోచితముగ

“అంకెకాఁడవోఁగు నూతులౌభళేశ, పొంకమాయ నీ సతి పొందు మఱవకుమీ” 

అన్నమయ్య గీతమునాలపించెను. కన్నులర్ధనిమీలితము లగుచుండగా, ఆ నిండు గోదారితన పెనిమిటి  ఎదపైవాలెను. కుచద్వయ ఒత్తిడికి వరదాచార్యుడు సిద్ధునివలె చలించక, భార్యాజితుని వలె  నొఱగక ఆమెను లేవనెత్తి, దూరముగా జరిగి కిటికీకడకు బోయి బాహ్య ప్రపంచ మందు  లీలమయ్యెను. ఆ ముగ్ద వాహనచాలకుని సమక్షమమునిట్లు జేసిన తన నాథుని కప్రియమగు చున్నదని తానునూ మరొక గవాక్షమునాశ్రయించెను. చిరుగాలి తాకిడికి పైకెగురు ముంగుర్లను సవరించుకొనుచూ మింటినేగుచున్న కొక్కరాయి గుంపులను జూచుచుండెను.  

వారి మౌనమును గమనించిన షిరోమి వాహనము పాటలు మీటనొత్తబోవుచుండగా వలదనివారింనాచార్యుడు “అవివాహితులసంఖ్యాకులెదురు జూచు మాసము మాఘమాసం   తెలుగు నాట వివాహాల సందడి ప్రారంభమైంది.  ఈ నాలుగు రోజులూ వేలాది ముహూర్తాలు!

పెళ్లిల సందడి నాకునూ కలిసి వచ్చును యని శిరోమి శృతి కలిపెను. అది యెట్లని మనమున్నది తమిళనాట కదా యని కన్నె అచ్చెరువొందెను .  

తమిళనాట తెలుగువారుండరా వారు తెలుగు సంప్రదాయములనే పాటించెదరు. వివిధ ప్రాంతములనుండి ఆ వివాహములకు వచ్చు వారందరూ కాకున్నకూ, కొద్దిమంది పుణ్యక్షేత్రములు దర్శింపక మానరు. యని షిరోమి తెలుపగా. 

భళా! షిరోమి భళా! బహు బుద్ధిశాలివి నీవు , సింహళీయునివలె నున్నావు యని ఆచార్యుడనగా షిరోమి అవునని తల పంకించెను. “ఇచ్చట సింహళీయులున్నారా?" యని అనిన  అంగయారుకన్నెను జూచి " ఇదెక్కడి చోద్యము తమిళనాట నివసించుచు ఇక్కడ సింహళీయులున్నటు గ్రహించలేదా?" యని షిరోమి అడుగగా, వరదుడు నవ్వుచూ"  ఆంధ్రదేశము పోయిన ఇంతకంటే చోద్యములెన్నియో చూడగలవు , అచ్చట జనులు కూపస్థమండూకములవలె , కనులున్న కొబోదులవలె దేహధ్యాస తప్ప దేశధ్యాస లేకలమటించుచుందురు, ఆదియట్లుండనిమ్ము నీ వృత్తాంతమును దెలపుమ"నెను.  

భారతదేశంలో రెండు లక్షల మంది సింహళీయులు గలరు. త్రిచిరాపల్లిలోని తువకుడి, నీలంకరై, చెన్నైలోని వలసరవక్కం, కన్నియకుమారిలోని నాగర్‌కోయిల్, కోయంబత్తూరులోని వల్పరైలో శ్రీలంక తమిళ కుటుంబాలు నివాస మేర్పరుచుకొన్నవి. ఐదు వందల సింహళ కుటుంబములు చెన్నపట్నమును తమ గృహముగా జేసుకొని చిరకాలంగా ఇచ్చట బ్రతుకుచున్నవి. వారందరూ శ్రీలంక డెప్యూటీ హై కమీషనర్ గారి కార్యాలయము పనిచేయువారు, సమాచార సాంకేతికశాస్త్ర నిపుణులు. వీరు టైడల్ పార్క్ నందు పనిచేయుచుందురు.  కొద్దిమంది మంది విద్యార్థులు పైచదువులనభ్యసించు వారు కూడా కలరు.

ఇద్దరు తమిళ మత్సకారులను శ్రీలంక నేవి హతమార్చుట వలన నిన్న చెన్నపట్నములో హింసాకాండ జరిగినది. అది పురాతన మహాబోధిసమాజమువారి కెన్నెత్ హౌస్ పై దాడికి కారణం భూతమైనది.  చెన్నపట్టణ నడిబొడ్డునున్న ఎగ్మోర్ నందుగల  కెన్నెత్ హౌస్ 1891 నందు స్థాపింపబడిన ప్రాచీన బుద్ధా సమాజము పైదాడిజరుగుట మిక్కిలి కలకలమును రేపుచున్నది.  

మా నాన్నగారు హై కమీషనర్ గారి కార్యాలయము పనిచేయుచుండెడివారు. వారి మరణానంతరము మేము మా దేశము పోదలచిననూ అన్నగారికి,   సాంకేతిక నిపుణులగుటచే మరియు టైడల్ పార్క్ నందు ఉద్యోగము లభించుటచే, ఎగ్మోర్ నుండి టైడల్ పార్కులకి మకాము మార్చిమేమిచ్చేటనే నివసించుచున్నాము. 

నేను ఐదు సంవత్సరములనుండి ఇచ్చటనే సింహళయాత్రీకులకు మార్గదర్శకుని గా యున్నాను.  యాత్రీకుల సౌకర్యార్ధము నావాహనమునందే  వారిని స్వయముగా తీసుకుపోయి నగరములోపల వెలుపల నున్న పుణ్యక్షేత్రములు చూపుచుందును. యని షిరోమి చెప్పెను .

హింస చెలరేగునని  భయపడుచున్నావా యని వరదాచారి షిరోమిని  అడుగగా  

షిరోమి "తమిళులు మంచివారు, ఇంకనూ హింస ప్రజ్వరిల్లునని భయములేదు కానీ హింసాప్రభావమున సందర్శకులు తప్పక తగ్గిపోవు అవకాశము కలదు.” అనెను

"సందర్శకులు తగ్గినచో నీకొచ్చిన ముప్పేమియునూలేదు నీవు వాహనము కూడా కలిగియున్నావు కదా !" అని అంగయార్ కన్నె పలుకగా షిరోమి నవ్వుచూ వెనుకకు తిరిగి నేను మార్గదర్శకునిగా (టూరిస్ట్ గైడ్) మాత్రమే పనిచేయుదును. అందరివలె వాహనమును కిరాయికి తిప్పువాడనుకాను అని జెప్పి తిరిగి ముందుకు చూచుచూ వాహనమును నడుపసాగెను.

“అబ్బో సింహళీయులు గట్టివారే” యని అంగయార్ కన్నె చమత్కరించగా, మీ తమిళులకంటే కాదనుచూ షిరోమికూడ చతురమైన ప్రత్యుత్తరము నిచ్చెను. నగరంలో నదులు కలుషితమైపోవుటచే నగరంలో నదీస్నానము దుర్లభముయింది. కేశవరం గ్రామంలో మూలం నుండి  పట్టాబిరామ్ ఆనికట్ వరకు, కూవం నది పరిశుభ్రంగా యుండుటచే వారిరువురు  మునక కై అచ్చటికి పోయి వచ్చినారు.  చెన్నపట్నమున ఉత్తరాన కోసస్థలైయార్, దక్షిణాన అడయార్ నది మరియు, పట్టణ మధ్య భాగాన కూమ్ నదులను దాటుతూ సాగిన ప్రయాణము మైలాపూర్ లో ఉన్న అత్యంత పవిత్రమైన పురాతన కపలీశ్వరాలయం వరకు సాగెను.   వాహనము కపలీశ్వరాలయం ముంగిట నిలిపి ...

“కపలీశ్వరాలయం ఏడవ శతాబ్దానికి చెందినది దీని ఎత్తైనగోపురం చూపరులను ఆశ్చర్య చకితులను జేయుచుండును.  మైలాపూర్ అనే పేరు పురాణం నుండి వచ్చినది తమిళంలో "మాయిల్" అంటే నెమలి యనర్ధము . క్రీ.పూ 3000లో, బ్రహ్మాండ పురాణమునందు  మైలాపూర్ను   మయూరపురి గా  పేర్కొనినారు.పార్వతిదేవి  యొక్క ఒక రూపమైన కార్పగంబల్, ఒక శాపం కారణంగా  నెమలిగా   మారి, ఆమె అసలు రూపు  పొందటకు ఇక్కడ తపస్సు చేసెను.   స్కందుడిచ్చట   రాక్షస  నాశనమొనరించుటకు పార్వతిదేవి   నుండి ఈటియను  బొందెను. ఈ ప్రదేశం కైలాష్‌కు సమానమని  మాయిలే కైలై  యని పిలుచుచుందురు ”షిరోమి చెప్పుచూ సాగుచుండ ఆ దంపతులా మార్గదర్శకు ననుసరించు చుండిరి. పుష్కరిణియందు స్నానమాచరించి కపాలీశ్వరుని దర్శించి వారు   చెట్ల వరుసలతో ఆలరారు వీధులమీదుగా ఫియాగో పుంమ్బుహార్ దిశగా ముందుకు సాగిరి. మహాబలిపురం , పుదుచ్చేరి , కడ్డలూరు, చిదంబరం   మీదుగా  సాగిన 260 కిలోమీటర్ల ప్రయాణం రాత్రికి  పూమ్పుహార్ చేరెను.

1 comment: