Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, August 13, 2020

Bharatavarsha 21

హైదరాబాద్నగర పశ్చిమాన పలు చారిత్రాత్మక చిత్రశాలలతో వినోద పరిశ్రమకు నిలయమైనొప్పుచూ ఫిల్మ్ నగర్ గా వ్యవహరించబడుచున్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నానక్రామ్‌గుడ మరియు మాధపూర్లు తెలుగు చలనచిత్ర ప్రముఖుల నివాస కేంద్రమై యున్నవి. కొందరు బేహారిలీ ఫిల్మ్ నగర్ను “టిన్సెల్ టౌన్” యని అభివర్ణింతురు. ఆ మాయకుల మాటలు నిజమని నమ్మి పలువురమాయకులు నిత్యమూ వచ్చి  ఇచ్చటవాలుచుందురు. ప్రజ్ఞను ప్రదర్శించి  ప్రజాదరణ పొందుటకో ధన, భోగ, కీర్తి, ప్రతిష్టలను కాంక్షించియో ముచ్చటనచ్చటజేరు పడుచువారది తళుకులనగరము కాదని పిశాచనగరమని స్వీయానుభవమున తెలుసుకొందురు.  

జూబిలీ హిల్స్ వేంకటగిరి నందు రన్అవే రీల్స్ చిత్రనిర్మాణ సంస్థ అధిపతి రామబ్రహ్మము తన కార్యాలయమున పొగత్రాగుచూ మద్యము సేవించుచూ కూర్చొనెను దూరవాణి మ్రోగుచుండ చూచాముదముత్రాగిన వానివలె మొఖం బెట్టి దూరవాణిని నుండి మొగమును త్రిప్పుకొని ధూమపానమునాస్వాదించుచుండెను. సమంత వచ్చి సాధనమును నెత్తుచుండ ఆమెను కళ్ళతో వద్దని వారించి మరొక గుక్క విస్కీ త్రాగి గ్లాసును బల్లపై నుంచెను. 

ఆ కార్యాల భవన బాహ్యసౌందర్యము మోతీమహల్ వలె అంతః సౌందర్యము  తాజ్మహల్వలె నున్నది పాలరాతి భవంతి అంతః భాగము సువిశాల సుందరమై నిర్మాణ శిల్ప చాతుర్యము సజీవమై మత్యాధునిక హంగులతో కనువిందు చేయుచు శీతల వాతావరణతో ఆహ్లాదపరుచుచున్నది. మరల దూరవాణి ధ్వనించెను. రామబ్రహ్మమాద్వనిని  చీదరించుకొనుచూ మొగము త్రిప్పుకొని మరొక గుటక వేయుచుండగా సమంత ముందుగదినుండి లోపలకి వచ్చి  " మీకొరకు గంటనుండి వేచి చూచుచున్న  రంజనిని  లోనికి  పంపమందురా ?'" యని అడిగెను. “అన్ని విషయములు చెప్పి పంపుము” అని చెప్పెను. “అయ్యవారికింకనూ పనిలో ఉన్నారు తీరికచిక్కలేదు. రెండునిమిషమూలాగి పోవచ్చుననుచూ “వారు మిమ్ములను ఎన్నోరకములుగా పరీక్షించెదరు పేరున్నతారలకు దక్క సామాన్యులాయనతో భేటీ అగుట దుర్లభము, రెండుమాసముల నుండి ఈ కార్యాలయము చుట్టూ తిరుగువారెందరోయున్ననూ మిమ్మల్ని పంపుచున్నాను. యని చెప్పి సమంత ఆ చుక్కని లోనికి పంపెను.

లోనికడుగిడిన రంజనికాగది విశాలత క్రీడాప్రాంగణమును గుఱుతుకు తెచ్చెను. అదియాతడి రాసక్రీడాప్రాంగణమని బొత్తిగాదెలియని పసికూన ఆమె. పైనుండి తలుపు వేయుచున్న  సమంతకామె పులివద్దకు పోవుచున్న జింకవలె కనిపించెను. ఆ విలాసవంతమైన అలంకరణలు చూచినచో నిత్యముజూచువారైననూ ఉద్విగ్నతనుబొందెదరు, ప్రాఢలు అవాక్కగుదురు, ముగ్ధలు భీతిల్లెదరు. రంజని ముందుగా బల్లపైనున్న విస్కీ సీసా, గ్లాసు వాటివెనుక కూర్చొన్న రామబ్రహ్మమును  చూసెను. 

నెరిసిన కేశములు ముదిమికళను, కళ్యాణ మండప పరిమాణమునున్నఆగది కుబేరకళను తెలుపుచున్నవి.  తెల్లనిచొక్కా తొలగిన పైబొత్తాములు మధ్యనుండి నల్లని చర్మముపై పచ్చటి జెర్రిగొడ్డువలె మందమైన స్వర్ణ కంఠాభరణ తళతళలు తటాక మందు మెరియు సూర్య బింబములను తలపించుచున్నవి.  ఎదుటనిలిచిన పడుచును చూసి రామబ్రహ్మం నోరుతెరిచి "నీ పేరు?" అనెను. “రంజని”యని ఆ పడుచు చెప్పగా “రంజని పేరు చక్కగా నున్నది కానీ అది చిత్రపరిశ్రమకుసరిపడదు” పేరుమార్చవలెనని అనుటవిని రంజని తనకవకాశము చిక్కెనని మురిసిపోవుచుండగా “ఇచ్చట పరిశ్రమలో పేరొక్కటి యుండిన జాలదు పేరుతో బాటు ప్రజ్ఞ ఉండవలెను. నీకు నాట్యము వచ్చునా? అని రామబ్రహ్మమడగగా రంజని"వచ్చు"ననెను వచ్చినచో నాట్యము చేసి నన్ను రంజింపజేయగలవా ? అనగా రంజని నాట్యము నారంభించ బోవుచుండగా ఆమెను సమీపించి నడుముపై చేయివేసి  వెనుకభాగమును ఊపుచూ చేయవలెనని చెప్పి పాశ్చత్య సంగీతమును మంద్రముగా ప్రారంభించి మరల మధుపానమందు నిమగ్నమయ్యెను. 

విస్కీ త్రాగినంతసేపు రంజనిని నాట్యము చేయుచుండమని చెప్పి ఆమె జఘన డోలికా వయ్యారమును తిలకించుచూ పులకించుచుండెను. త్రాగుట ముగించి కురచ, బిగుతు వుడుపులను  ధరింపజేసి, హత్తుకొనుచూ పలుభంగిమలలో కూరొండబెట్టి పరుండబెట్టి తుదకు “నిన్ను కథానాయకిని జేసెదను నావద్ద పడుకొందువా?”యని కాంక్ష నిండిన కనులతో చూచుచుండెను. అవమాన మంగారకమువలె మనమును దహించి వేయుచుండ, తనువు  రగులుచుండ,  దుఃఖము  పొగులుచుండ,  రంజని  బైటకు పరుగుదీసెను. 

ఫుట్బాల్ ఆటయందు బంతిని గమ్యస్థానమువద్ద అడ్డగించునట్టు సమంత ఆమెను ఒడుపుగా ఒడిసిపట్టి టాలీవుడ్నందిదంతయూ సర్వసామాన్యమని ఓదార్చుచుండెను. ఆసమయములో  పురుషోత్తమడు  వారిని క్రీగంట చూచుచూ లోనికడుగిడెను. గోడ పంచాంగమున ఎదో లిఖించుచూ రామబ్రహ్మము వెనుకకి తిరిగి యుండెను. పురుషోత్తముని అడుగులు విని “ షో వచ్చితివా అనుమతిలేకున్ననూ నీవుకాక ఇంకెవరు లోనికి రాగలరు రమ్ము” అనెను. నా పేరు పురుషోత్తమరావు పురుషోత్తముడన్నచో ఆహ్లాదమేగాని అభ్యంతమేమియునూలేదు. కానీ దానిని కత్తిరించి షో.. షో... యనుచున్నావు. ఎట్లుండునోయని పురుషోత్తముడు పరితపించుచుండ

  "చైతన్యయను పేరుని చై చై అనుటలేదా, పాయిఖానాలో కూర్చొని దుర్గంధమనరాదు, పానశాలలో గీత, చలచిత్రమందు నీతి .. పనికిరావు. ఇచ్చటంత యూ కత్తిరింపులు , అతికింపులే జుట్టు కత్తరించుకొన్నట్టు ముఖమును ముక్కును కూడా  కత్తిరించుకొందురు , ఒక హీరో  గెడ్డపు ఎముకను కూడా కత్తిరించుకొనుట నీకుతెలియదా , అతగాడు నెత్తిమీద బొచ్చులేదని  లండన్ బోయి బొచ్చు అతికించుకొచ్చినాడు , దానితోపాటు ప్రిన్స్ యని పేరుకూడా అతికించుకొనెను. మనమేమి చెప్పిన అదియే నిజమనుకొను బుర్రతక్కువ సన్నాసులే కదా ప్రేక్షకులు . వారికి చదువు వచ్చి(?) చదవలేని వ్యర్థులు వారికేట్లు తెలియును. మనము హీరోలు అనుచున్న నేటితారలు నిజమైన హీరోలా?  వేయేల తాజ్మహల్ సమాధి అయిననూ , దానికంటే అందమైన కట్టడములెన్ని వున్ననూ  తాజ్మహలే అత్యద్భుత నిర్మాణమని  ప్రేమకు చిహ్నమని దేశమంతా నమ్మలేదా ? సినిమా జెప్పినది వేదము ఏలననగా నకిలీ పండితులని సృష్టించు చదువు నేడు అలంకారమునకు ఆత్మద్రోహమునకు తప్ప దేనికి పనికిరాదు. యని రామము నవ్వుచుండగా షో రామమున కెదురుగా కూర్చొనెను. “కథానాయికిచే సెదనంటిని అయిననూ.." యని రామము పెదవివిరిచెను. "హూ ..   ఇంత అవివేకులిక్కడికి ఎట్లు వచ్చుచున్నారో " యని షో నిట్టూర్చెను. "పిట్టజారిపొయెనని విచారించపనిలేదు , చిక్కుదీయుటకున్నదికదా సమంత" యనుచు నాయుడు లోపలికొచ్చేను.
 
"ఓ నాయుడా! ఏల యిట్లువచ్చితివి?" అయిననూ నీవు అడగక లోనికి రావలదని చెప్పియుంటినికదా యని రామబ్రహ్మము అనుచుండగా, షో ఎదో సర్ది జెప్పబోయెను. "రామం చాలా మారిపోయెను " అని నాయుడు అనుచుండగా " రామబ్రహ్మం తోక తొక్కిన త్రాచువలె లేచి "నాయుడు, నన్ను పూర్తి పేరుతో పిలిచి మర్యాద నిలుపుకొనుము ఇదే ఆఖరిసారి జెప్పుచున్నాను. నీవింక వెళ్లిరావచ్చును నాకు బయటకు పోవు పనియున్నది” అని చెప్పగా జేయునది లేక నాయుడు బైటికి పోయెను. “ఎందుకట్లుజెప్పి అతడిని పంపివేసినావు. ఎంత చెడ్డనూ ఒకప్పటి నిర్మాతకదా యని షో అనగా “ముక్కుతూ మూల్గుతూ నాల్గు చిత్రములు నిర్మించెను, నీవు దాయాదుఁడ (cousin)వగుటచే వాడు నీ మిత్రుడగుటచే ఉపేక్షించు చున్నాను. 

“చేతచిల్లిగవ్వ లేక ఆస్తులమ్మకమునకు బెట్టుచున్నాడీ నాయుడు, అమ్మినచో  ఇంకొక్క చిత్రము నిర్మించగలడు. నాసరసన కూరుని నిర్మాతవలె బడాయి !!! " యని రామబ్రహము చిర్రు బుర్రులాడెను" ఒక చలనచిత్రమందిరము, ఒక బట్టలదుకాణమును కొనగలవాయని నన్నడుగు
చున్నాడు " యని షో అనెను. "నెత్తిన గుడ్డవేసుకొను ఉద్దేశ్యమున్నచో కొనుము నేనొకరిని కలవవలెను బయలుదేరుచున్నాను" అని రామమనగా. " ఎవరా  అతివ ఎట్లుండును?" యని షో అడిగెను "అతివయని నీకెట్లు తెలియునని రామము ప్రశ్నించెను." “అతివకానిచో నీవెందుకు పోయెదవు?” అనుచుండగా అవును సూదంటురాయివలెనుండును అని రామమనెను. " రామం,  నీ కథకి  నప్పు  చక్కటి పిల్లను చూపితిని  ఆమెను నీవు కూడా ఇష్టపడితివి, ఇప్పటికే నలుగురికి మాట ఇచ్చి ఉంటివి.  వేరెవరికీ కథానాయిక పాత్ర ఇత్తునని మాట ఇవ్వవలదు . అని షో జెప్పగా "

పిల్ల నాకథకు మాత్రమే కాదు నాకు కూడా నప్పవలెనని  " నవ్వుచుండగా  " నీకు అరవై నిండెనని మరవక”ని షో అనెను "నేటి హీరోలకు అరవైలు నిండెనని నీవునూ మరువక"నుచూ రామము బయలుదేరెను. అతడు బైటకు పోయిన మరుక్షణము షో అతడి ఎదురుగా రాజఠీవినొలికించు సింహాసనమునాక్రమించెను. ఇప్పుడతడే "రన్నవే రీల్స్" అధిపతి.  గుంటనక్కవలె పైన కాచుకొని కూర్చొన్న నాయుడు కాళ్ళాడించుకొనుచు సిగ్గన్నది లేక పురుషోత్తముని ప్రక్కన ఒక చిన్న కుర్చీచూచుకొనెను. దూరవాణి మ్రోగగానే నాయుడు సాధనమును చేతపుచ్చుకొని పెచ్చు బడాయినొలకబోయుచూ మీరరగంటలోరానిచో నిర్మాతని కలుసుకొనలేరని చెప్పి బెల్లించి పెట్టివేసెను. " కథా రచయిత వచ్చుచున్నాడు కొంతసేపు కాలక్షేపము చేయవచ్చు " అని నాయడనగా " నేనిప్పుడు రంజనితో  కాలక్షేపము చేయుదును వలసినచో నీవు  కథాకాలక్షేపము చేయుము , అదిగో ఆ బల్లవద్ద కూర్చొనుము అని దూరముగా నున్న బల్లను చూపెను. 

"నేను ఈ ఉపద్రవమును నేనూహించలేదు ఆ రచయితకిప్పుడేమి చెప్పవలెను" అనుచూ నాయుడు సణుగుచుండెను. "వాని దగ్గరెంత పట్టితివి నాయుడూ యని షో చమత్కరించగా. బహుస్వల్ప మనుచూ నాయుడు పండ్లికిలించెను. "ఆకులు నాకువాని వద్ద మూతులునాకువాని వలే దాపురించిన శని గ్రహమును జూచినట్లు జూచి షో తలబాదు కొనెను. “ఎంత స్వల్పమైననూ నా సమయమును నాకు తెలియకుండా తస్కరించు…… నిన్ను.. అనుచూ బల్లపైనున్న నాయుడి చరవాణిని కాంచెను.  

తెరపైనున్న లకుమ చిత్రమునుగాంచి మధ్యలో తీగతెగి విద్యుత్ పోయిన  మరబొమ్మవలె నిలిచిపోయి ……"మెచ్చుకొనవలెను." అని నవ్వుచూ "నాయుడు ... ఈ పిట్ట చూడ చక్కగా నున్నది ఎవరీమె? "యని అడిగెను "ఇది అసాధ్యురాలు"యనినాయుడనుచుండ “నాయుడు తలుచుకొనిన అసాధ్యమేమున్నది అన్న షో వంక చూసి నాయుడు నవ్వెను. షో శృతి కలిపెను. చిత్ర పరిశ్రమ చిత్రములన్న ఇవియేగదా!!! 

4 comments:

  1. చిత్ర పరిశ్రమ లో లుకలుకలు, కొత్త వచ్చువారి ఇక్కట్లు చక్కగా వ్రాసినారు

    ReplyDelete
  2. An unglamorous field looks so glamorous.Well described the scenario behind the silver screen.

    ReplyDelete
  3. Lukuma is an irresponsible and immateur girl. She never mind her mother's words while Vidisha is a traditional girl and she respects her parents. She dedicated to Art. But she suffered in a different way. Meenakshi and Arunataara both are matured women. They both struglled in married lives and finally reached their goals.Sho,Raman and Naidu are vultures.

    ReplyDelete