Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, August 4, 2020

Bharatavarsha -18

“జూచితివా అన్నా బైరెడ్డి ఘాతుకములెట్లు పెచ్చుమీరిపోవుచున్నవో!” అన్న మంజూష ను “మరల ఏమిజేసినాడు బైరెడ్డి?” యని భారతవర్ష ప్రశ్నించెను. ప్రేమించుట కెంత మాత్రమూ వీలుపడదని పెక్కుమార్లా మహిషమునకు విదిష చెప్పుట నీవునూ ఎఱుగుదువుకదా. ప్రేమించని యెడల ఆమ్లదాడికి దిగెదనని బెదిరించుచున్నాడు" యని మంజూష చెప్పదొడంగెను  “నేను కళాశాలకు పోవుచున్నాను ఉపోద్గాతమాపి విషయము వివరించుము"యని వర్ష చిరాకుపడగా. "మన మొక్కసారి సబ్బవరం పోవలెను" అనుచున్న మంజూషతో “ఇప్పుడు సబ్బవరము బోవుటయా! నీకేమైననూ మతి చెడినదా?”యని వర్ష యనెను “ఆమ్లదాడి నీకు చిన్నవిషయముగా దోచుచున్నది, అటులనే కానిమ్ము"  యని మంజూష అలిగి మొగమింత జేసుకొనెను.

“నిన్ననే చెన్నపట్టణమునకు బొయితినికదా, మరల నేడెట్లు పోయెదను. అరిచెడి కుక్క కరవద న్నట్టు వాడేమియునూ చేయువాడు కాదు. వాడట్లే బెదిరించును.” యని భారతవర్ష యను చుండగా మాలిని గారు కలుగజేసుకొని “సాహిత్య సభన్నచో,ఉన్నపళమున  ఉదకమండలము బోయెదవు, నీవు కళాశాలకి నేడు పోకున్న భూకంపము సంభవించదుగాని , వాని దాష్టీకము వినుము వాడు విదిష గృహమునకు బోయి తండ్రి ఎదుట దానిని తాకినాడు ఇంకనూనుపేక్షించిన మహాపరాధము చేసినట్టే రేపు వాడు ఆమ్లము ముఖమును జల్లిననూ జల్లును. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొనిన ప్రయోజనమేమి?” యనిరి

అంతవరకూ మృదంగము వాయించి ఆపి  మౌనముగా కూర్చున్న కేశవుడుగ్రనరసింహుని వలె చెలరేగి వాడియంతు చూతునని శపథము జేయుచుండ "శాపములు బెట్ట  శపథములు పూన పనిలేదు రక్షకభటులేమైనారు, తల్లిదండ్రుల తెలివిఏమైనది పోయి పిర్యాదు చేయలేకుండెనా ఆ తండ్రి, నేనా ఉగ్రకర్ముని ఆటకట్టించ ఇప్పుడే బోవుచున్నాను" అని వర్షుడు  బోవుచుండ కేశవుడతనిననుసరించెను .

విదిష ఇంట అందిరి మొగములు శవజాగరము చేసినట్లున్నవి. విదిష తండ్రి ఓడలు మునిగి దివాలా దీసిన సముద్ర వర్తకునివలె నొకమూల నేలపై కూరోని యుండెను. అహల్యగారు  విషణ్ణ వదనమున  నేలపై సాగిలబడి యుండిరి. విదిష మాత్రము తన గదిలో బొమ్మగీయుచూ మధ్యలో ఆపి సూన్యములోకి చూచుచూ కూర్చొనెను.  భారతవర్ష పెద్దలకు ధైర్యము జెప్పి , తప్పక న్యాయము జరుగునని, తాను జరిపించెదనని చెప్పగా  పెద్దవారిద్దరునూ లేచి కూర్చొనిరి. విదిష మాత్రము శూన్యహసమున నిర్లిప్తతను చూపుచుండెను.  "ఎందులకీ శూన్యహసము ?ఎందుకీ ప్రహసము( వెక్కిరింత)?  వైరమందెందులకీ  వైరాగ్యమ"నివర్ష అధిక్షేపించ“ న్యాయము ,ధర్మమను మాటలు నీవంటి విద్యాధికులు సభలయందు జెప్పిన, కరతాళధ్వనుల మ్రోత నొందగలరు. ఠాణాలలో జెప్పిన వినువారెవ్వరునూలేరు బైటజెప్పిన నమ్మువారెవ్వరునూ లేరు. చలన చిత్రములందు చూచుచున్నాము కదా వార్తాపత్రికలలో చదువుచున్నాముకదా  ఆడపిల్లలపై అత్యాచారములు  ఆమ్లదాడుల సంఖ్యా నానాటికీ అధికమగుచున్నది. యని విదిష అనెను

 "చలన చిత్రములు వేఱు జీవితము వేఱు."యని వర్ష యనగా  "సాక్షాత్తు మండలాధికారిణి  తననొక కీచకుడు జుట్టుబట్టి  లాగెనని ఆక్రోశించిననూ ఆంధ్రదేశమున న్యాయము జరగలేదు కదా. మానవతుల శీలమునకు  రక్షణ కల్పించకున్ననూ న్యాయమైననూ జరిపించలేని పరిస్థితులలో జీవిచుచున్నామని మరిచి మనమే  భంగ పడుచున్నాము, మానముబోయిన స్త్రీకి ఇచ్చట నష్టపరిహారమే తప్ప న్యాయము లభించదని మరొకసారి రుజువయినది. యని విదిష పలుకగా. మానము బోయిన స్త్రీ అనుచున్నావు, వాడేమిజేసెనో నేరుగా తెల్పరాదా? యని వర్ష గొంతు రెట్టించెను “నిన్న ఆదివారము మధ్యానము వచ్చిన బైరెడ్డి, కసిరికొట్టిన పిదప కసితో బోయినాడు అప్పటికి వానికి కొంచెము శరము మిగిలియుండెను.

రాత్రి బైరెడ్డి మరల వచ్చెను. అప్పుడు వానికి ఇంతైననూ సిగ్గు శరము లేక పోయెను వాని ముఖమున ప్రతీకారేచ్ఛ మాత్రమే చూచితిని, నేను పెండ్లాడెదనను చున్నప్పుడు మీకేల అభ్యంతరమునుచూ విడవకుండెను , మా నాన్నగారు వాడిమీద పెద్దపెట్టున కేకలు వేయ అదరక బెదరక నిదానముగా నన్ను సమీపించి నాపెదవులను చూపుతివేలుతో నటునిటు  రాసి నిన్నట్లైననూ నాదానిని జేసుకొందును నీవు వొప్పుకోననిచో ఆమ్లము సిద్ధముగా నున్నది అని జెప్పి పోయెను. ఠాణా కుబోయిన మా పిర్యాదును సైతము తీసుకొనలేదు యని   లజ్జాళువై విదిష  విషదమతిశయించ డగ్గుత్తికన బల్కెను. 

ఇట్టి విలోమజాతునికి శిరము వ్రక్కలు చేయవలె, శల్యకముఖమునగ్గిపిడక రాజెయ్యవలె, వీని చేతులు పడిపోవలె నేను నాతండ్రి నటరాజుని ప్రార్ధింతును. యని కేశవుడు చెలరేగెను. భారతవర్ష కేశవుని వారించి ఠాణాకు విదిషను గొనిపోయెను. అచ్చట  పోలీసు అధికారి భారతవర్ష వాలకము జూసి " మీరెవరో చదువుకొన్న వారివలె నున్నారు ఎందులకీ రొంపిలో దిగుచున్నారు , వారు మీకేమగుదురు, రక్త సమ్మంధీకులా,   బంధువులా ?"అనుచూ నిరుత్సాహపరిచెను.  'శల్య సారధ్యం' నర్ధము జేసుకొని( పాండురాజు రెండవ భార్య  మాద్రి సోదరుడు శల్యుడు . మాద్రి కుమారులైన నకుల, సహదేవులకు మేనమామ. అన్ని వ్యసనములుగుల గుల పురుషుడు కానీ మంచి విలుకాడు  ధర్మరాజు శల్యుని సహాయాన్ని ఆర్ధించగా అంగీకరించి మాటతప్పినవాడు. శకుని సలహా మేరకు శల్యునికి  దుర్యోధనుడు  మందు, పొందు లాంటి అనేక వినోద కార్యక్రమాలను ఏర్పరిచాడు.  శృంగార నర్తకీమణులు అతనిని తమ అశ్లీల నృత్యాలతో ఆనందం కలిగించటంతో పాటు, అతని శయ్యను కూడా పంచుకున్నారు. - దీనినే నేడు హానీ ట్రాపింగ్ అని వ్యహరించుచున్నారు. మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఇటువంటి వ్యహారంలో జిక్కి తన స్థాయిని కోల్పోయెను. - సుయోధనుడు ఇచ్చిన విందుకు సంతోషించి,  ధర్మజునికి ఇచ్చిన మాటను మరచిపోయి  శల్యుడు అభిమన్యుని బావమరది అయిన ఉత్తర కుమారుడిని దారుణంగా హతమారుస్తాడు. కర్ణుడు, అసలే శాపగ్రస్తుడు  శల్యుడతని రధసారధి. శల్యుడు పరమ నీచుడు.    ఇటువంటి నీచులు రధసారదులుగా ఉంటే, ఆఖరికి అర్జునుడు కూడా గెలవలేడు. ఇటువంటి వారినే, నేడు అన్ని రాజకీయపక్షాలు కోవర్టులు అని అంటున్నారు. ఇటువంటి కోవర్టులు అన్ని పార్టీలలో ఉన్నారు. తప్పుడు సలహాలిచ్చి, ప్రజలను వక్రమార్గం పట్టించటాన్ని 'శల్య సారధ్యం' అనే మాట వాడుకలోకి వచ్చింది. తప్పుడు సమాచారాన్ని, సలహాలనిచ్చి మనల్ని వక్రమార్గంలో పడెయ్యటంలో వీరు కృతక్రుత్యులవుతారు.) భారతవర్ష  రక్షణాధికారితో  "మీరు శల్యకవానాఖున్యాయమును  పాటించుచున్నారు." అనెను.

దానియర్ధమేమి యని అధికారి అడుగగా " చుంచెలుక పరుండియున్నవారి పాదములను  నొప్పింపక కరుచును దానినే  శల్యకవానాఖున్యాయము అందురు.  అనిన నేను భాధ తెలియకుండా మీకు  చేటు చేయుచున్నాననియర్ధమా ? యని అధికారి అడుగగా "వారిచ్చిన పిర్యాదు స్వీకరించారుగారు ఇప్పుడు మమ్ము అధైర్యపఱచుచున్నారు. దయతో ఆలోచించమని వేడుకొనుచున్నాను అని భారతవర్ష అనగా "పిచ్చివాడా ఎల్లప్పుడూ దయతోనే కాక వివేకముతో కూడా ఆలోచించవలెనని చెప్పగా అచ్చట పనిజేచుచున్న ఒక రక్షక భటుడు వర్షనొక ప్రక్కకి గొనిపోయి " ఆ బైరిరెడ్డి యను వానికి ఎం ఎల్ ఏ గారి మద్దత్తు కలదు. బైరెడ్డి అన్న నాగిరెడ్డి, ఎం ఎల్ ఏ గారి ఇంట ఎల్లప్పుడూ జాగిలమువలె నుండును. ఇది గ్రహింపుము. యని హితబోధ జేసెను. పిదప " మీ పిర్యాదు తీసుకొనుచున్నాను ఇక మీరు బొయిరండ"ని ఠాణా అధికారి తెల్పగా " అయ్యా పిర్యాదు నమోదుచేసుకొని నకలిప్పించ చగలరు యని భారతవర్ష వేడగా " మరల మొదటికే వచ్చినా"డనుచూ అధికారి తలపట్టుకొనెను."

 భారతవర్ష న్యాయవాది ప్రతాప్ ని తోడ్కొనిపోయి అధికారిని కలవగా " లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్" (చట్టము తన పని తానూ చేసుకొనిపోవును)యని అధికారి న్యాయవాదిని మభ్యబెట్టబోయెను "మీరాంగ్లమున  ఆడుచున్న మాటలకు మీకర్ధము తెలియదని నేననుకొనెను కానీ మనదేశమున చట్టము ఎప్పుడు తన పని తాన చేసుకునిపోదు, పోలేదు వర్క్ విల్ హేపెన్ ఆన్ ఇట్స్ ఓన్  వుయ్ హేవ్ టు మేక్ ఇట్ హేపెన్. అనిన అర్ధమేమనగా యని ప్రతాపుడు అర్థమును వివరింపబోవుచుండగా "నాకు భోదపడినది "అని అధికారి గత్యంతరం లేక పిర్యాదు నమోదు చేసుకొని నకలు ఇచ్చి పంపెను.

వర్ష ప్రతాపునికి కృతజ్ఞతలర్పించి సాగనంపి పిమ్మట విదిష తో ఇంటివరకు బోవుచుండగా మార్గమధ్యమున కేశవుడు " నీవు ఠాణా అధికారితో సంభాషించుచున్నప్పుడు నిన్ను ఇద్దరు యువకులు గమనించుచుండిరి ." అనెను వారిఊసు ఇప్పుడేల యని భారతవర్ష యనగా వారు ఇప్పుడు మానని అనుసరించు చున్నారు. యని కేశవుడనెను. వారు వర్షను సమీపించిరి “మేము నాగరాజు మనుషులం ఇరువదినాల్గు గంటలలో  పిర్యాదు వెనక్కి తీసుకోననిచో  దుఃఖించవలసి యుండును " అని హెచ్చరించి పోయిరి. ప్రమాదముని కొనిదెచ్చుకొనక పిర్యాదు ఉపసంహరించుకొనవలెనని విదిష సూచించెను కానీ భారతవర్ష  " నేను నాగరాజుతో మాటలాడెదను అవసరమైనచో ఎం ఎల్ ఏ గారినే కలిసెదను ఇట్లు మధ్యలో దాటవేత కూడద" నెను.  ఇదే ఎం ఎల్ ఏ గారి ఇల్లు యని విదిష చూపగా అయినచో బోయెదను అని వర్ష అనెను.

విదిష అంత దుఃఖ మందు కూడా నవ్వి కొంచెము ముందుకు బోయిన పిమ్మట ఒక  భవనమును చూపి  ఒక ఆంగ్లపాఠశాల భవనమును చూచితివా ఎం ఎల్ ఏ ఇక్కడే యుండును పోవలెనన్నబొమ్ము గానీ నేచెప్పెడిది విని పొమ్ము  కళాశాల విద్యార్థి సమీరని  అత్యాచారం చేసి ఆ నేరమును మరొక అమాయకుడు ముత్యంపై నెట్టివేసి హాయిగా యున్నది ఇతని కొడుకే.  30 సంవత్సరములు గా నడుచుచున్న  శ్వేతజాతి భారతీయులు స్థాపించిన   పాఠశాల ఆటస్థలం పై ఒక దుష్టుడి కన్ను పడినది వాడు పాఠశాలవారిపై వ్యాజ్యము వేసి , వారిని ఇబ్బంది పెట్టుచుండగా యితడు రక్షకుడివలె వారికి కొమ్ము కాయుచుండెను, భారతవర్ష అయోమయముగా మొఖం పెట్టగా ఒక్క నిమిషమాగి ఈ పాఠశాలాయాజమాని కూతురు మిషెల్ చక్కటి అందగత్తె, ఈమధ్యనే ఆమె బొమ్మగీచితిని. ఆ ఆంగ్లో ఇండియన్ పిల్లను వలపన్ని యితడు వశపరుచుకొనెనని అందరికి తెలిసిన రహస్యము. 
                                             ***  

వర్ష కేశవులిరువరు ఆనందానిలయమునకు తిరిగివచ్చుసరికి సాయంత్రమయ్యెను. " మధ్యాన్నాము భోజనము చేసినారా యని మాలిని గారు అడుగగా " ఆ ఠాణాలో వారు పెట్టిరి." యని భారతవర్ష యనెను. " ఇద్దరికీ పెట్టియున్నారా ? "యని మిక్కిలి అమాయకముగా  మాలిని గారడగగా, కేశవునకు నవ్వాగకుండెను. విషయము తెలిసి మాలినిగారు విచారించి ఇద్దరూ  స్నానములు చేసి రాగా వెంటనే వడ్డన చేసిరి.

 భోజనములు చేసిన పిమ్మట భారత వర్ష చదువుకొని చుండగా కేశవుడు మృదంగము తీసుకొని అభ్యాసము చేయుచుండెను. మంజూష  అపరాధభావన తో అన్నగారి పాదములవద్ద కూర్చొని " నేనే నీకీ బెట్టిదము కల్పించితిని తలవంపులు కల్గించితిని యని దుఃఖించెను. వర్ష ఆమెను మాట్లాడవలదని వినమని చెప్పగా , ఏమి వినవలెనో అర్ధము కాక "వినుటకేమున్నది అనెను.  "రాత్రి నిశ్శబ్దము పిల్లనగ్రోవి నూదుచున్నట్లుండి  మృదూక్తులు పల్కి యోదారుచున్నట్లున్నది.  సత్యం శివం సుందరమను ఋషి నిర్మిత వేదసంస్కృతిని  మనము విస్మరించిననూ ధనుష్ఠంకారము (అంటే వింటినారిని లాగి వదలడం) వలే ఇంకనూ కంపించుచున్నది, వినుము జయము మనదే అని చెప్పుచున్నది."యని వర్ష అనెను.  మంజూష అయ్యో అని వగచు చుండ "బాహ్యంలో ఎటువంటి బలము లేకున్ననూ మనోబలం  మనుజునికి విజయము చేకూర్చునుయని శరీరమేలేని మన్మధునికి జయము కల్గిన విధంబెట్టిది ఆ హైమావతి కటాక్ష వీక్షణమువలె కదా  మన్మధుడు విజయము బొందినాడు. అట్లే వాగ్దేవి కటాక్షము నాపైయున్నది, ఈఘటనము అందుకుతార్కాణమగును. అని వర్ష స్థిరముగాచెప్పి 

కేశవా అలసి యుంటివి నేటికి నీ వాదనము చాలించుము అని వర్షయనగా నాకు రేపు ఆంధ్రవిశ్వవిద్యాలయమున కచేరి కలదు. ఓ! చెప్పినావు కదూ మరిచితిని. అని వర్ష అనెను.  ఏమా కార్యక్రమమని  మంజూష అడుగగా "స్వర్గస్తురాలైన మా అమ్మను సత్కరింపబూని విశ్వవిద్యాల ఆంద్ర నాట్య విభాగాధిపతి  చండీప్రియగారు ఒక కార్యక్రమము నేర్పాటు చేసిరి.  నన్నాదరించిన అరుణతార అమ్మగారు కూడా వచ్చుచున్నారు."అని చెప్పెను. వారుపడుకొనుటకు ఉపక్రమించుచుండగా రక్షకభటులు వచ్చి భారతవర్షను గొనిపోయిరి."

2 comments:

  1. బాగుంది.మనోబలం మనుజునికి విజయము చేకూర్చును అన్న వర్ష మాటలు బాగున్నవి.వర్ష విజయం సాధిస్తాడని ఆశిస్తున్నాను

    ReplyDelete