Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, August 22, 2020

Bharatavarsha 26

 సబ్బవరమున అపరాహ్ణము అంజిష్ఠుని తీక్షణ వేండ్రము ఎండకారును తలపించుచున్నది.  ప్రార్ధనలు ముగిసి అనేక మంది స్త్రీ లు చర్చి నుండి  గుంపులు గుంపులుగా ఇండ్లకుబోవుచుండిరి. ఆందొకిద్దరు యువకులు జంబూవృక్షముక్రిందనిలిచి పోవువారిని చూచుచుండిరి. “ఈ తాపమును జూచి శీతాకాలమని ఎవ్వడు ననుకొనజాలడు” అనుచూ అచ్చట నున్న ఒక రాతిపై చతుకుపడెను. అట్లయిన ఈ చెట్టుకింద చాతక పక్షులవలె వేళ్ళాడుటెందులకు మనమును బోయెదమని, ఒకడు సంసిద్దుడగుచుండగా రెండవ వాడు వానిని వారించి  “ఆ పోవుచున్న కన్నెపిల్లలు  నడుములు జూడుము ఆహా! ఎంత వయ్యారంగా నున్నవోకదా.”అనెను అంతట రెండవవాడు “నీకు పైత్యము ముదిరినదనిపించుచున్నది. అందు కన్నెపిల్లలెవ్వరునూలేరు. అందరూ వివాహితులువలె కనిపించుచున్నారు” అనెను. 

                               

బోవువారిలో అధికులు ఆ  జంబూవృక్షము క్రిందనున్న వారిని జూచి అందొకనికి హస్తార్పణము గావించుచుండిరి. "బైరి, నీకింత పలుకుబడి యున్నదని నాకు దెలియదు. ఎం ఎల్ ఏ గా పోటీ చేసించో తప్పక నెగ్గెద వనిపించుచున్నది నీవిక విదిష కై కలవరించుటాపి  ప్రజాదరణ చూరగొను పనులు జేసిన మంచిద”నెను."  ఓరీ! సందీ, తాతకు దగ్గులు నేర్పుచున్నావా?” నాకాసంగతి దెలియును రాజకీయములు మాకుటుంబమునకు వెన్నతోపెట్టిన విద్య ఒక్క రెండు నిమిషమూలాగిన విదిషఇటుగా పోవును. దానిని చూచి జూచి తనివి తీర్చుకొని కోడి పలావు తిని బోయెదము” యనగా సందీపునకు అరికాలిమంట నెత్తికెక్కెను. రౌడీవంశము రాజకీయవంశమెట్లయినదని అడగవలెనని అనుకొన్ననూ కోడిపలావు గుర్తుకొచ్చి నోరూరుటచే “ ఇంతమందిని  చూచిన తీరని తనివి ఆమెను జూచిన ఎట్లు తీరునని మాత్రము అనెను. బైరి "నీవే చెప్పితివి కదా చాతక పక్షులమని అందుకే  చాతకజీమూతన్యాయం (చాతకపక్షికి నీరు అంతటా దొరికినా దానిదప్పిక మేఘంనుండి పడ్డ నీటిబిందువుల చేతనే కాని తీరదు) వర్తించు”నని చతురోక్తి రువ్వెను. 

ఇంతలో విదిష అటుబోవుచూ కనిపించెను “కన్నులు జూచిన కలువలు సిగ్గుపడును నడకలు జూచిన హంసలు సిగ్గుపడును” అనుచూ ఆమె సమీపమునకిపోయి ఆమెకు వినిపించునట్లు అనెను. “కానీ నీవు మాత్రము సిగ్గుపడకున్నావు భీతి యనునది లేకపోయె, మొన్న జరిగిన శృంగ భంగము చాలినట్లు కనబడదు. ఆమె నన్ను కూడా చూచినది” నేను బోయివత్తునని సందీపుడు కదులుచుండగా. “బిడాలము వలె బెంబేలెత్తుచున్నావు  సింగమువలె జీవించనేర్చుకొనుమ”ని బైరెడ్డి జెప్పుచుండగా  “వెరవరిగాక వీఁడు కురువీరులకుం బొడసూపువాఁడె…” అని గానము చేయుచూ ప్రవేశించిన వేరొక యువకుడు “కోట్లవిలువైన మాటను జెప్పినారు రెడ్డిగారు బాగుంటిరా” యనుచు ముకుళిత హస్తములతో నొకడు వారిని సమీపించి “మీరునిక్కముగ సింగమే” యనుచు కావలించుకొనెను. 

మీరెవరు ఏమిచేయుచుందురని సందీపుడడుగగా, “నాపేరు మరీదు, నేను కృషీవలుడను “అనగా రైతన్నమాట యని బైరెడ్డి సంబరపడెను , మీరెట్లనుకొన్ననూ  మంచిదే యనుచూ మరీదు జారు కొనెను. కొలది సమయము లోనే బైరెడ్డి జేబులోనున్న సొమ్ము పోయినట్లు గ్రహించెను. ఇంకేమి కోడిపలావు యని సందీపుడ నుచుండగా హోటల్కు కొనిపోయి వలసినంత తినుము ఇచ్ఛట  నన్ను పైకమడుగు వాడెవ్వడూనూ లేడు యని తిని  ఖాతాలో వ్రాసుకొమ్మని వెడలి వచ్చెను. "బైరెడ్డి నీకు అది దొరకదు నామాట విని దానిని మరచిపొమ్ము ఇదియే నేను  నీకు చెప్పగల మంచిమాట" యని సందీపుడనగా " అయినచో నేను చేయవలసినది జేసెదను" యని బైరెడ్డి ముగించెను. ఆదివారము ఇంటికిబోయి ఏమిజేతువని బైరెడ్డి అనెను. పిమ్మట వారిద్దరూ మధ్యానపు ఆటకు బోయిరి.  

అయ్యారే కోటిగా ! బహుకాల దర్శనము ఎట్లుంటివి ? యని రెడ్డి అడుగగా "  మూడు మాసములు కారాగృహము నందుండి వచ్చుచున్నాను" అని బదులు పలికెను.  అచ్చట మొదటి ఆటకు పెద్దక్యూ ఉండగా  కృషీవలుడచ్చట కనిపించెను. ఏరోయ్ మరీదు బాగుంటివా? యని కోటి వానిని ప్రేమగా పలకరించెను.  సందీపునకు భవిష్యత్తు ఒక్కసారి కళ్ళముందు కనబడగా మెల్లగా జారుకొనెను. కోటి పానశాలకు పోయెదమనగా బైరి సరేయనెను. బైరి త్రాగుచు తన వేదననంతా కోటి కి నివేదించగా " నేనొక ఉపాయము చెప్పెదను మరి నాకునూ వాటా ఇత్తువా? యనెను. "సరే ననగా కోటి " విదిష తండ్రి ఆసుపత్రిలో నుండుటచేత తండ్రికి భోజనము నిత్యమూ తీసుకొని పోవుచున్నది. 8. 00 గంటలకు కాపు కాచిన తప్పక దొరుకును. యని   తన ఉపాయమును రహస్యముగా చెవిలో చెప్పెను. 

బైరెడ్డికి కళ్ళు బైరులు గ్రమ్మెను. అద్దెకు వాహనమును రప్పించ మందువా యని బైరెడ్డి అడుగగా సొంత కారు ఉండి తీరవలెనని కోటి  చెప్పగా తన అన్న వాహనమును  తెప్పించెను. క్రమముగా చీకటి అలుముకొనగా రహదారిపై  వాహనములు పలుచబడెను. కోటి, రెడ్డి  వాహనంలో కూరోని వేచుచుండిరి. కొద్ది సేపటి తరువాత వారి కళ్ళు చీకట్లో నొక్కసారిగా మెరిసినవి. వారి ముఖముల జింకపిల్లను చూచిన పులి కళ కనిపించెను. గ్రెద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్లు విదిషను వారు వాహనంలోకి లాగి , ముందుకు పోనిచ్చిరి. 

రాత్రి పది గంటలు అయ్యెను విదిష ఎందుకు రాలేదో యని అహల్యగారు కంగారు పడుచుండగా వాన మొదలయ్యెను.ఇంతలో గోమాత అరుపు వినిపించెను.  తన ఆందోళనను ఆకాశము, గోమాత అర్ధము జేసుకొని శృతి కలిపినట్లనిపించెను. ఆమె తడుచుచున్న గోమాతను కట్టువిప్పితీసుకుపోయి కొత్తగా కట్టిన శాలలో కట్టివేసి   లోపలకు వచ్చి కిటికీవద్ద నిలబడి విదిషకొరకు ఎదురు తెన్నెలు చూచు చుండెను. 10.00 గంటలు కావచ్చుచుండగా విదిష ఇంటికి వచ్చెను. తల్లి వద్ద బోరున విలపించి ఇంక ఇక్కడ ఉండుట అనవసరము వేరే చోటకి బోవుట ఉత్తమము. అని బైరెడ్డి తనను ఎత్తుకుపోయి నిర్మాణములో నున్న 5 అంతస్తుల భవనమునందు భంగపరుచుటకు ప్రయత్నించగా తప్పించుకొని , ఒకొక్క అంతస్తు నందు నక్కి యుండి,  గుండెలు తల్లడిల్లుచుండ ఒక అంతస్తునుండి వేరొక అంతస్థు కు మారుచూ  చివరకు మిద్దెపైనున్న నీటి తొట్టెనందుదాగి వారి వాహనము వెడలుట మిద్దె పైనుండి చూచి  తరువాతవచ్చితినని చెప్పెను.

నిశరాత్రి సమయము 12 గంటలు సమీపించుచుండ గోమాత  పెద్ద పెట్టున అరచుచుండెను. గోశాల మంటలలో చిక్కుకొనెను. ఎంత సమయమునుండి ఈ దహనము జరుగుచున్నదో శాలకప్పు అంతయూ ముట్టుకొనెను.  అయ్యో గోమాత అందు చిక్కుకొనెను అనుచూ పోవుచున్న విదిషను వారించి అహల్యగారు పరుగుపరుగునపోయి గోమాత కట్టలు విప్పివేసిరి. అంతట కాలిన శాలదూలము కట్టు తెగి ఆమె పైబడగా విదిష లోపలి వెళ్ళుటకు ప్రయత్నించగా మండుచున్న చూరు భాగమంతయూ నేలరాలెను. అమ్మా అమ్మా యని అరచుచూ విదిష నిర్వేదమునచ్చట కుప్పకూలెను. 

గోశాల చుట్టూ  ఇటుక కట్టుబడి యుండుటచే వీరు అందు నిద్రించు చుండుట ఎవరో  గ్రహించిరి. ఇది బైరెడ్డి పనే అయినప్పటికీ వాడికి ఎవరో సహకరించనిచో వాడొక్కడూ ఈ పని చేయజాలడు అని మరుసటిదినమున పోగయిన ప్రజలు అనుకొనుచుండిరి. భారతవర్ష మంజూష మాలినిగారు తరలివచ్చి విదిషనోదార్చిరి. “అయ్యో ! గోమాతను రక్షించి అహల్యగారు అసువులు బాసినారు.” అనుచూ ఇరుగుపొరుగు తరలివెళ్ళినారు. 

 

4 comments:

 1. అనుకోని మలుపు
  దొంగతనాలు మానలేదు మరుదు
  విదిష జీవితం గందరగోళం
  అహల్యగారి మరణం
  చాలా ఆసక్తి కరంగా సాగుతోంది

  ReplyDelete
 2. హతవిధీ!కల్పిత పాత్రలే అయినా విధి రాతను నమ్మేలా ఉందీ మలుపు.గుణవంతులనే కదా భగవంతుడు కూడా పరీక్షించేది.

  ReplyDelete
 3. Nice articel, This article help me very well. Thank you. Also please check my article on my site What is HTML?.

  ReplyDelete
  Replies
  1. Biswajit ji I read your article, it's very interesting.

   Delete