ఆనందపురము సమీపములో శ్వేతకుడ్య పరీవృతంబై మహీధరమును (కొండ) బోలిన భవంతి పంక్తులను దిగ్భ్రమమున గాంచుచూ మహాద్వారము కడనిలచి నగస్త్య శ్వేతకుడ్యమునందు స్థాపించబడిన నల్లసేనపురాయి (granitestone) నామఫలకము (nameboard) నాశక్తితో తిలకించుచుండెను. బాదరాయణుఁడు (wastrel) వలె నిలిచి చోద్యము చూచుచున్నగస్త్యను గాంచిన రక్షణాధికారి పొమ్మని సైగలు చేయుచూ ముందుకు వచ్చుచుండెను. మత్తేభదంష్ట్ర రువారము(ఏనుగు దంతపు మెరుపు) నభివ్యక్తీకరించు నామఫలకము పై మీనాక్షి ఫిషరీస్ లిమిటెడ్ యను సువర్ణాక్షరములు సువ్యక్త మై తేజరిల్లుచుండ తల్లి తలఁపుకు రాగా మాతృనందనుని మదిపుల కించి, చక్ర సంకల్పిత ప్రయాణ పేటిక నందున్న చరవాణిని పరిగ్రహించి ఒక ఛాయా చిత్రమును గొనుచుండ రక్షణాధికారి అడ్డుకొన బోయెను.
అంతట ఇంద్రనీలి వర్ణమున తళుకులీను టొయోటా-కేమ్రి వాహనము మహా ద్వారమువద్ద నిలిచెను. రక్షణాధికారి వందనముజేసి వాహనము లోనికి పోవుటకు తోరణమార్గ ద్వారములను తెరిచెను. కానీ వాహనము ముందుకి కదలకుండెను. వాహనమునుండి వేదవిద్యా విశారదుడు వలె నొప్పు ముఖతేజస్సు గల ఏబది వర్షముల వ్యక్తి దిగెను. నెట్టి వేయుటకు వచ్చిన అధికారి ఈ పరిణామమును నిస్చేస్టుడై చూచుచుండ, ఆ వ్యక్తి అగస్త్యను వాహనమందె క్కించు కొని ముందుకుసాగెను. వాహనంలో వెనుక కూర్చున్న అగస్త్య తండ్రి వామభాగములకరించిన పడుచును కాంచెను. ఆమె అగస్త్యవైపు చూసి నవ్వగా విభ్రాంతిని బొందినగస్త్య ముఖము త్రిప్పుకొనెను. అది చూచిన ఆ పడుచు ముఖము వివర్ణమయ్యెను. వాహనము దిగి భవంతి కార్యాలయములోకి ప్రవేశించుచున్న ఆమెను అగస్త్య తేరిపారి చూచెను. నల్ల కలువవలె నున్న యాపడుచు నున్నని దేహసౌష్ఠవమును కల్గి క్రీడా కారిణివలె నొప్పు చుండెను , ఆమె వంపుసొంపుల చక్కదనము ఖజురజో శృంగార శిల్ప సౌందర్యమును తలపించుచుండెను. ఆమె పక్క నడుచుచున్న తన తండ్రి ఆమెకునూ తండ్రివలె నగుపించెను
ముగ్గురు భవనములోనికి పోవుచున్నప్పుడు గ్రెస్ “నేను శ్రేణీకరణ(sorting) విభాగమును సందర్శించబోవు చున్నా ను, నీవు వచ్చినచో అన్ని విభాగములు చూపించెదను అని అగస్త్యతో అనగా అగస్త్య ఆమె వైపు చూచెను ఆమె కూడా అగస్త్యను చూచెను. ఇద్దరి చూపులు కలిసెను. తనవయసుకు దగ్గరగా నున్న ఆమెతో చూపు కలిపిననే అపరాధ భావ ము కలుగుచున్నది ఇంక మాట కలుపుట ఎట్లు అనుకొని అగస్త్య దూరముగా నుండి పోయెను. "నేను నాన్నతో మాట్లాడవలెన”ని తండ్రినను సరించి తండ్రితో పాటుగా అంతః పురమున కేగి అతడి అద్దాల కొలునందు (chamber) ప్రవేశించెను. "ఇంటికేల రాకుంటివి? నేరుగ నింటికి వచ్చిన నేరమా? నీవు ఈ సంస్థ సందర్శనార్ధము వచ్చితివా ?" యని ఉరిమెను.
"నేరమో ఘోరమో చేసినది మీరు, అపకారము మా అమ్మకు అపరాధభావం నాకు కలిగినది. మీరట్లు ఆగ్రహించినచో నేనుండ జాలను, సెలవిప్పించిన నేను పోయివత్తును.” అని అగస్త్య కుండబ్రద్దలు గొట్టినట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఆ మాటలు విని దక్షిణామూర్తి అనునయ స్వరమున “కసిరినంతెనే ఉలుకెందులకు తనయున్నింటికీ బిలుచుట తప్పు పట్టుచున్నావా ? నన్ను జూచి ఇట్లే పోవుదువా ? నీపై ప్రేమయుండబట్టే కదా ఇంటికి పిలుచుచున్నాను.” అనెను. “ఎవరో నీకొరకు వేచి యున్నారు నేను పోయి వచ్చెదను” అని అగస్త్య బయలుదేరుటకు సిద్దపడగా దక్షిణ మూర్తి అంతర్వాణి వ్యవస్థ ( ఇంటర్ కమ్) నందు ముఖ్య నిర్వహణాధికారి “నా వద్దకు ఎవరినీ పంపవలదని చెప్పి. ఆసనము నుండి లేచి వేచియున్నవారితో ఒక నిమిషము మాటలాడి పంపివేసెను. "ఇప్పుడు మనము మాట్లాడుకొనిన కలత పరచు వారెవరునూ లేరు.” యని ఆసనమునందు కూర్చొన్న తండ్రితో “నేను ఇంటికి రాజాలను ఇచ్చకము లాడ జాలను.” నీ మనో భావములు నా కార్ద మైనవి. నీవాతల్లి బిడ్డవే, ఇచ్చటకి అతిథి గా వచ్చిననూ, నన్ను చూచుటకు వచ్చినావు నాకది జాలును. కానీ రెండు రోజులుండి వెళ్ళవలెనన్న ఎచ్చట ఉందువు హోటల్ నందు బసకేర్పాటు జేయమందువా? అనెను.
“బొబ్బిలి కోటవలె పది ఎకరాల స్థలమునందు నిర్మితమై ఈ రాజసౌధము కంటే ఘనమైన సౌధమెచ్చట గలదు. నీ కభ్యంతరము లేనిచో నేనిచ్చటనే యుందును. ఈ కార్యాలయముననే ఒక బల్లపై పడుకొందును.” అని అగస్త్య అనగా “కార్యాలయము పడుకొని ఖర్మమేమి? మనకిచ్చట ప్రశస్తమైన అతిధి గృహమున్నది” యని ముఖ్య నిర్వహణాధికారి జాన్ ను అంతర్వాణినందు పిలచి తనకుమారుని పరిచయము జేసి భావిఅధిపతిచ్చట అతిధి గృహమున కొన్ని దిన ములుండును ఇతడెక్కడ సంచరించి ననూ ఆటంక పరచవద్దని ఆదేశములిచ్చెను. పిమ్మట వారిరువురూ అతిధి గృహ మునకు పోయిరి. అగస్త్య స్త్నాన మాచరించి, ఫలహారము ముగించి బయటకు వచ్చెను. “అధిపతి ఎచ్చటికో వెళ్లి వెళ్లినారు కొద్దీ సేపటిలోవత్తురని” పనివారు తెలిపిరి.
అతిధి గృహము చుటూ పచ్చిక కనువిందు జేయుచుండెను ఆ పచ్చిక నందొక జలయంత్రమమర్చబడి యున్నది, అందుండి పైకి చిమ్ము రెండు నీటి ధారలు ఈడైన నిగ్గులాడి జోడైన సొగసుకాడిని గూడి సయ్యాటల ఒయ్యార మొలి కించునట్లున్నది. చిప్పిల్లు ధారల విరజిమ్ము సూక్ష్మ బిందువులు సూర్యకాంతి పరావర్తనమున ఇంద్ర ధనుస్సును తలపింపజేయుచున్నవి. జలయంత్రము చుట్టూ మిట్ట పల్లముగా నున్న పాలరాతి కట్టడము ముత్యపు చిప్ప వలె నుండి ఆ కైవారం వెంబడి గుత్తులు గుత్తులు గా నున్న ఎర్రని పూలు జేగంటలు మ్రోగించు చున్నట్లున్నవి. ఆ మనోహర దృశ్యము కాముకునకు మిధునమును, తత్త్వజ్ఞునకు ప్రకృతి శ్రీమన్నారాయణునకు జేయు పూలంగిసేవను ఆవిష్కరించు చున్నది.
కొద్ది సమయము గడిచిన పిదప దక్షిణామూరి కొద్ది మంది పరివారముతో వచ్చుచు కనబడగా అగస్త్య “ఎచ్చటకేగినారు?” అని అడిగెను “ఇచ్చట మనకు చెరువులున్నవి , ఈ వెనకనున్న ఇరువది ఎకరముల నందు కౌలుకు పుచ్చుకొన్న చెరువులు గలవు. అతిధి గృహమునకు బోయి మాట్లాడుకొనవచ్చు”నని ముందుకు సాగెను అగస్త్య అతడిననుసరించెను.మేడమీదకి తీసుకు పోయి ఇచ్చట నుండి చెరువులు చూడవచ్చును అని చెరువులు చూపెను . అచ్చట అనేక శ్రమ జీవులు ఎండలో పని చేయుచున్నారు. వారందరూ మన సంస్థలో పని చేయువారేనా యని అగస్త్య అడిగెను. అవునని మేడమీద గుండ్రని బల్లకమర్చిన ఒక పెద్ద గొడుగు క్రిందున్న రెండు కుర్చీలను చూపుచూ కూర్చొనమని సైగ చేసెను. ఒక పనివాడు కొబ్బరినీరు తెచ్చి ఇచ్చెను. అగస్త్యకు ప్రతి చిన్న పని తానే చేసుకొనుచున్న తల్లి గుర్తుకొచ్చెను. పరధ్యానంగా నున్న కొడుకుని జూచి మూర్తి విషయమును గ్రహించెను.
ఇవేగాక మనకు ఇంకనూ చెరువులుగలవు. అనుచున్న తండ్రితో “ఈ వ్యాపారంలోకి నీవెట్లు వచ్చినావు? నాకునూ సలహాఇచ్చినచో ఈ వ్యాపారమును ప్రారంభింపవలెనని ఉన్నది అనెను. ఈ వ్యాపారము నీదే. మరల కొత్తగా ప్రారం భింప పనిలేదు. యని తనయుని కుతూహలముతీర్చుటకు వ్యాపారము వివరములు తెలియజేసెను. రొయ్యల ఎగుమతి నందు భారతదేశము ప్రధమస్థానము నున్నది. ప్రపంచమునందు ఎగుమతి కాబడు రొయ్యల లో 24.9 శాతము మన దేశము నుండేఎగుమతి అగుచున్నవి. కెనడా ఫ్రాన్స్ రష్యా లకు కూడా మనము ఎగుమతి చేయుచున్నాము. ఎగుమతి కోసం సాధారణ ఎగుమతి లైసెన్స్, ప్రత్యేకముగా ప్రతిదేశమునకు ఎగుమతి చేయు లైసెన్స్ ఇట్లు అనేక అనుమతులు పొందవలెను. “రొయ్యల పంట సాధారణంగా 120రోజులవ్యవధి కావలెను.
“ఒక ఎకరమునకెన్ని చెరువులుండును?” అని అగస్త్య అడిగెను
“ఎకరమునకొక చెరువు”
“చెరువు నుండి ఎంత పంట వచ్చును?”
4000 కిలోగ్రాములు పంట సాధించగలము. అన్ని ఖర్చులుపోగా నికరంగాఐదు లకారములు అనుచుండగానే. "నాన్న నీవు అసాధ్యమును సుసాధ్యము చేసిన ఘనుడవు అమ్మ డబ్బును మాత్రము పాడుజేయక భద్రము జేసినారు. కానీ ..." కాఫీ వచ్చెను. ఇంతలో జాన్ అచ్చటకు వచ్చి లోపాలకి రావచ్చునా యని అడిగి ప్రవేశించెను. ముగ్గురికీ కాఫి ఇచ్చి పనివాడు వెడలిపోయెను. జాన్ తీక్షణ శీతలీకరణ( చిల్లింగ్ స్టోరేజ్) నిర్వాహక ఇంజినీరు వచ్చెను. “వచ్చు చున్నాను అని చెప్పుచూ జపాన్ కి పంపవలసిన కంటైనర్ సాగనంపినారా ?” యని దక్షిణామూర్తి అడిగెను “జపాన్ కంటైనర్ లో పొరపాటున టైగర్ ఎక్కించాడు లోకేశు. అని జాన్ చెప్పగా అతడిని నా కార్యాలయమునకు పంపుము నేను వచ్చుచున్నాను. అని చెప్పగా జాన్ వెడలిపోయెను .
నాన్న టైగర్ అనగా రొయ్యలేకదా ? “ప్రపంచము మొత్తము 300 రకముల రొయ్యలున్నవి. భారతదేశమున 78 రకముల కానవచ్చును. ఆంద్ర దేశమందు టైగర్, ఇండికస్ , వన్నమెయి యను 3 రకములు రొయ్యలు మాత్రము సాగుచేయుచున్నారు. దేశమందు మన రాష్ట్రమే గరిష్ట ఎగుమతి చేయుచున్నది. ఒక్క విశాఖ పట్నము నుండి 8000 వేలకోట్ల ఎగుమతి వ్యాపారము జరుగు చుండగా అందు 70 శాతము రొయ్యల ఎగుమతి జరుగుచున్నది. నాలుగింట మూడువంతులు మన రాష్ట్రము నుండి జరుగు చున్నది.” యని చెప్పి దక్షిణామూర్తి బయలుదేరెను.
ఇది ఊహించని మలుపు.ఒక కార్యాలయమును,ఒక అతిధి గృహమును ఇంత చక్కగా వర్ణించటం వెనుక రచయిత భావుకత్వం, భాషపై ఉన్న మమకారం, అంకిత భావం తేటతెల్లమవుతున్నాయి.
ReplyDeleteనాభిషేకే న సంస్కారః సింహస్య క్రియతే వనే
Deleteఔన్నత్యం కవనార్జితం గ్రన్థకర్తా స్వయమేవ కవీశ్వరః
బిడ్డలకి అన్నం పెట్టడానికి సమయం లేని అమ్మల్లా
ReplyDeleteషోకులకి తప్ప బియ్యం కొనడానికి డబ్బులేని నాన్నల్లా
గుడిలో దీపం పెట్టడానికి నూనె ఖర్చయిపోతుందనే భక్తుల్లా
చదవ సమయం లేని తెలుగువారు ప్రాణం లేని బొమ్మల్లాగా
ఉన్న ఈ రోజుల్లో ఈ కావ్యాన్ని చదివి కావ్య మాధుర్యాన్ని
నాకు పంచుతున్న , రచనా తృష్ణ పెంచుతున్న మీకు
శుభమగుగాక!!!