Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 10, 2020

Bharatavarsha -20

సాయంసంధ్యా సమయాన విశాఖసాగరతీరాన కాకోలము కంటే నల్లని ఆడి వాహనమునురికించుచున్న అరుణతార, అబ్ధిన క్రుంగుచున్నఅంబరీషుని గని వాహనమును రహదారిప్రక్కన నిలిపి గవాక్షావలోకమున, లోకమును మరిచి కొద్ది క్షణములట్లే సాలభంజిక వలే నిలిచి ఆ సుందర దృశ్యమునా స్వాదించుచుండెను. రామినాయుని చిత్తము సారసాక్షి యనురక్తమై మన్మధ శరాఘాతమున స్తంభనము బొందగా అతడామెనే అనిమేషకునివలె చూచుచుండెను.  ఒక్క క్షణకాలము బాహ్య జగత్తును మరిచిన అరుణతార స్మరణను పొంది విశ్వవిద్యాలయమునకు పోయెదమని వాహనమును ముందుకు నడిపించెను. 

                      

ఆంద్రవిశ్వవిద్యాలయ ప్రాంగణమున సభాభవనమెదుట వాహనమును దిగిన ప్రముఖులను ఆహ్వానించుటకు కులపతి, వివిధ విభాగాధిపతులు, ఆచార్యులు, విద్యార్థులు వచ్చిరి. ఆంధ్రనాట్య విభాగాధిపతి మృణాళిని గారితో గూడి కేశవుడు కూడా ఆ సంతోషమందు పాలు పంచుకొనెను.  వారిని తీసుకొనిపోయి రంగస్థలము వద్ద ముందువరుసలో కూర్చొండబెట్టిరి.  రంగభూమి సర్వాగ సుందరమై ఒప్పుచుండెను.  కులపతి సభనుద్దేశించి ముక్తసరిగా "మృణాళినిగారి   గురువుగారైన లంబోదర శాస్త్రిగారి జన్మదిన సందర్భముగా ఏర్పాటయిన ఈ సభ, ఆంద్ర నాట్యవ్యాప్తికి విశేషమైన కృషిచేసిన దేవదాసి స్వర్గీయ చారుమతికి నాట్యనివాళి అర్పించబోవుచున్నది"యని మూడు ముక్కలు జెప్పి తదుపరి అరుణతారను  రామినాయుని పుష్పగుచ్ఛములిచ్చి సత్కరించెను. కులపతి వారిని మాట్లాడమని కోరగా వారు నిరాకరించి తమ స్థానములకు బోయిరి.

రెండు వరుసలవెనుక మాలిని , దామిని , భారతవర్ష , మంజూష లు కూర్చొనగా , వారి వెనుక  వరసలో అగస్త్య , బసవడు , రాఘవ , సందీపులు కూర్చొనిరి. కార్యక్రమము ప్రారంభ మయ్యెను. ముందుగా సంధ్యారాగాలాపన తో సభ ప్రారంభమయినది   అదితి,  అస్సాం నుండి వచ్చిన  ఒక విద్యార్థిని, యమన్ రాగమునాలపించెను. అదితి వెనుక   ఇద్దరు విద్యార్థినులు కూర్చొని సితార మీటు చుండ కేశవుడు మృదంగ సహకారమునిచ్చెను. ఆ స్వరవెల్లువ సభికులను ముంచెత్తగా సభికులు ముగ్దులయ్యిరి. హిందుస్తానిరాగమునామె కర్ణపేయంగా ఆలపించగా  వర్షము కురిసినట్లున్నదని అరుణతార బిగ్గరగా చెప్పినంతనే సభికులు చప్పట్ల వర్షము కురిపించిరి.  ఆమె మాట్లాడుతుండగా ఎవరో శబ్దోద్దరణ యంత్రము అందజేసి  మాట్లాడమని ప్రోత్సహించగా అరుణతార మాట్లాడగోరుతున్న ప్రక్కనున్న మరొక ఆచార్యునకు అందజేసెను  “యమన రాగము ఇంత గొప్పగా ఆలపించుట  నేనెక్కడా చూడలేదు.  పూలకు దార మెటులో సంగీత సాహిత్యములు ఆత్మ కటులు.  పూలసువాసన దారమునకబ్బినట్లు సంగీత సాహిత్య సువాసనలు ఆత్మకబ్బును.  సంగీతమనునదొక జన్మ కృషికాదు. గత జన్మ శృతి చేసుకున్నది  అది ఈ జన్మ సంగీతమైనది అని పాటలో చెప్పినట్టు జన్మ జన్మల కృషి. శాస్త్రీయసంగీతం దైవికశక్తి.  మానవునికి దేవునికి మధ్య వారధి. ఇది దేవుని బహుమతి. “అని చెప్పి అదితిని ఆశీర్వదించెను.      

తరువాత   మృణాళినిగారు లంబోదరశాస్త్రి  గారికి సన్మానము కడువేడుకగా జరిపించి రి. గురువుగారి కి పాదాభివందనం జేసి నాట్యమును ప్రదర్శించిరి. ఆమె నాట్యము ముగియగానే తాత్కాలికముగా రంగస్థలమునకు తెర దింపిరి.  ప్రక్కన జూచిన రామినాయునికి అరుణతార కుర్చీలో కనబడక దిక్కులు చూచుచుండ ఊర్ధ్వగతి నొందుతున్న తెర కనిపించెను, తెరవెనుక రంగస్థల వాతావరణము అలంకరణ మునుపటికంటే భిన్నముగా కనిపించెను  కూచిపూడి  వస్త్రధారణలో అరుణతార వేదికపై కనిపించెను.

 పూర్వాశ్రమ నటీమణి, ప్రముఖ నర్తకీమని నాట్యమా డుతుండగా పాత్రికేయులు ఛాయాచిత్రముల కొరకెగడుచూ వేదికను చుట్టుముట్టిరి.  అరుణతార  అడుగులు వేయుచూ చారుమతి నిలువెత్తు  చిత్రపటమును సమీపించి నమస్కరించెను. వేదికపై కేశవుడు ఆమె అడుగులకనుగుణంగా మృదంగ వాదనము మొదలిడెను.  రెండు వలయములలో విద్యార్థినులు వచ్చి ఇరువైపులా నిలుచునిరి.  నాట్యము ప్రారంభించవద్దని ఆగమని వారికి చేతి సంజ్ఞ చేసి  అరుణతార వంటరిగా నే నాట్యము చేసి నివాళి అర్పించి వేదిక దిగి వచ్చెను. అప్పుడు విద్యార్థినులు 30 నిమిషములు ఆంద్ర నాట్యమొనర్చి చారుమతి కి ఘనివాళి ఇచ్చిరి.  కేశవుని నేత్రములు వర్షించుచుండ మృదంగవాదముచేసెను. ఆ కన్నీటి అర్థం తెలియని సభికులు కలవరపడిరి కానీ అరుణతార మాత్రము కనులనొత్తుకొనుచూ కేశవునివైపు చూసేను. అప్పుడు కేశవుడు అలోకికానందమున స్వర్గద్వారముచెంత నిలిచిన అనుభూతిని నొందుచూ వదలంతయూ కదులుచుండ చారుమతి చిత్రపటమును చూచుచూ మర్దించెను. 

ఉదయము పదిగంటలు మాలినిగారు గృహకృత్యములందు నిమగ్నమయ్యి యుండగా "అమ్మా ఎవరు వచ్చుచున్నారో చూడు" మనుచూ మంజూషతల్లి చెవివద్ద చెప్పెను. మాలినిగారు ప్రవేశ ద్వారమువైపు ద్రుష్టి సారించగా రాచకన్య ధీరత్వము నాయకత్వ ప్రతిభ మూర్తీభవించుచున్న విగ్రహముతో, ముఖములో వ్యంజితముమగు అప్సరకళతో అపూర్వనూపురనాదములతో తరలివచ్చు నందనము వలె నగుపించినరుణతారకు ఎదురేగి గృహములోనికి స్వాగతించి లోనికి తోడ్కొనిపోయిరి. కేశవుడు పరుగున వచ్చి ఆమెనల్లుకుపోయెను. మీరు కబురు పంపిన మీరున్నచోటుకి వచ్చెడివారము అని అనగా నాకు విమానాశ్రయమునకు బోవుటకు సమయమున్నది మీతో మద్యానం వరకు ఉండుటకు వచ్చితిని. యని అనినవిని సంతసించి వర్ష చదువుకొని గదిలోనికి గొనిపోయి సోఫాపై కూర్చొండ బెట్టిరి. 

అచ్చటనున్న విదిష నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడి ఉండగా అరుణతార ఆమెను పిలిచి ప్రక్కన కూరొండబొట్టుకొనెను. కేశవుడామె పాదములవద్ద కూర్చొనెను. ఇది గదివలె గాక  గ్రంధాలయమువలె నున్నది. అని అరుణతార అనగా మాలినిగారు నవ్వి వాడికి సాహిత్యమనిన మక్కువ ఎక్కువ అడ్డువారు ఆడువారు లేకున్నా రాత్రులు నిశాచరునివలె ఇచ్చటనే కూర్చొని ఉండును. ఉన్న ధనమంతయూ పుస్తకములు వెచ్చించి చేతచిల్లిగవ్వ నుంచుకొనక సాహితీ సభలతో అవధానములతో కడుపు నింపుకొనుట వాడికి వెన్నతో పెట్టిన విద్య . అదివిన్న అరుణతారకు లకుమ గురుకురాగా ముఖము వివర్ణమయ్యెను. లకుమ గుర్తుకొచ్చియుండును అయ్యో తల్లిని బాధించుచున్నది ఎంత అయోగ్యురాలు అని వోదార్చిబోవుచున్న మంజూషను మాలినిగారు, వయసుకు మించిన మాటలు పనికిరావని మందలించి  మీ పిల్లలంతా ఇచ్చట ఉండవలదని బయటకు పంపివేసిరి. మీ దుఃఖమును  చూడజాలక మంజూష అట్లన్నదే గానీ వేరొకటిగాదు పిల్లలకు మీరనిన చాలా ప్రేమ. మీరు ఎంత  కలిగినవారో తెలియక మంజూష అట్లు మాట్లాడినది.  నిన్న మీరు చేసిన నాట్యము ఎంతో బాగున్నది మాట మార్చుటకు ప్రయత్నించగా “ నేను  సాహిత్య పిపాసినే కాని ధన పిశాచిని కాను.  ధనమొకనాడు నావద్దలేదు నేడున్నది. కానీ ధనమును నమ్మ జాలము   ధనము చంచలమైనది, ధనముకన్నా గుణము ప్రధానమైనది అది నీ బిడ్డలవద్దనున్నది అటువంటి వారిని చూచిన మనసు తేలికపడును. 

శాంతిపర్వము చతుర్థాశ్వాసములో ధర్మరాజుకి భీష్ముడు పదేశించినట్లు ధనము సంపాదించిసంపాదించి విసుగుపుట్టి ధనంసంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది.  కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు అని చెప్పుచూ ధనతృష్ణ తగ్గి, ఇంద్రియ నిగ్రహం, సహనం కలిగి, శేషజీవితం ప్రశాంతంగా గడిపిన భీష్ముడు చెప్పిన  బ్రాహ్మడి కథను అరుణతార చెప్పగా విన్న మాలినిగారు   “లోగడ మీకు  పురాణ ఇతిహాసములయందు గల ఆశక్తిని భారతవర్ష చెప్పగా విని యుంటిని నేడు స్వీయానుభవము కలిగెను” యనుచుండగా మంజూష కాఫీ తెచ్చి ఇచ్చెను. “వంటచేయుచున్నాను మీరిచటనే భోజనము చేయవలెను.” అని మంజూష అనగా అరుణతార సమ్మతించెను.   

నీ బిడ్డలు బుద్ధిమంతులు. బుద్ధిమంతులను చూచినచో మనసు తేలికపడును మూర్ఖులను స్వార్ధపరులు తలపైననూ చింతకారకము భయానకము. కేశవుని చూచిన కలుగు ఆనందము లకుమను చూచిన కల్గదు. కేశవుని నాబిడ్డ అనే అనుకొంటిని అని అరుణతార చెప్పుచుండగా "కనులున్నవారెవరికైననూ కేశవుని చేరికచూసిన ఆ విషయము బోధపడును." అని మాలినిగారనిరి. ఇంతలో అగస్త్య వచ్చి అరుణతార కు నమస్కరించి మీనృత్యము అద్భుతముగా నున్నది " ఇదిగో చూడుడు వార్తా పత్రికల్లో మీబొమ్మనే ముద్రించి నారు , ఆంధ్రనాట్యమని శీర్షిక , అరుణతార కూచిపూడి నాట్యముచేయు భంగిమ చూచిన అరుణ తారకు నవ్వు వచ్చెను. తరువాత అగస్త్య దేవదాసి చారుమతి  గూర్చి కూడా వ్రాసినారని చెప్పగా పక్కగదిలో నున్న  కేశవుడు " బొమ్మ ముద్రించినారా అని ఆశ క్తిగా అడిగెను. " అరుణతార తాను చూచుచున్న వార్తాపత్రికను కేశవునికివ్వగా కేశవుడు అగస్త్య పక్కగదిలోకి వెళ్లిపోయిరి. 

మాలినిగారప్పుడు ఆ బల్లిపాడు దేవదాసి చారుమతి తో అంత అనుబంధమెట్లు కల్గినదని యడుగగా, తానొక నృత్య ప్రదర్శనకు బల్లిపాడు పోయియుంటినని చెప్పుచూ పది సంవత్సరముల క్రితము జరిగిన కీచక పర్వమును తలుచుకొని చిగురుటాకువలె కంపించుచూ  నెత్తురు త్రాగు రాక్షసులుందురని విని యుంటిని కానీ చూచుట అదే మొదటిసారి, కొల్లాయి గౌడ, కట్ట గౌడ,   రావణ, మారీచులు  ఇద్దరూ కలిసి మాయోపాయంతో సీతను వేటాడినట్లు ఒక కాళ  రాత్రి తననెట్లు వేటాడినారో చెప్పుచూ   ఆ దౌర్జన్య కాండ ఆ కీచక పర్వమును తలుచుకొనిన  నేటికినీ నా వొళ్ళు జలదరించును" యని చెప్పదొడిగెను. నాటికి నేనింకనూ రాజకీయములలోకి ప్రవేశించలేదు విశేష ప్రజాదరణ పొందియుండలేదు.  కొద్దిపాటి చలన చిత్రములలో నటించి యుంటిని అయిననూ అంగన(మంచి అంగ సౌష్టవముకల స్త్రీ) లను చూచిన పురుషులు పోనిత్తురా?

ఎవరైననూ పోనిత్తురేమోగాని  కొల్లాయి గౌడ, కట్ట గౌడయను నిశపిశాచములు మాత్రము పోనివ్వరు. వారిరువురు కర్ణాటకమునుండి వలసవచ్చిన కూలీలు ఒక భూస్వామిని చంపి అతడినుండి ధనమును, స్వర్ణాభరణములను సంగ్రహించి కాలక్రమమున వడ్డీ వ్యాపారమును చేయుచూ పెక్కు ఘోరములు చేయుచుండిరి. అసలు కంటే వడ్డీముద్దను సామెత లోకవిదితము కానీ గౌడసోదరులకు ఆడువారి శరీరమన్న  వడ్డీకన్నా  ముద్దన్నది వివాదరహితము. 

 గుడిసంబరాలు జరుపుకొను తరుణమున ఆలయాచారములలో భాగమైన కళా ప్రదర్శనను స్థానిక వేణుగోపాల స్వామి వారి ఆలయమున ఏర్పాటుచేసిరి . నృత్యము జేయునది చలనచిత్ర నటి యని ప్రచారము చేయుటచే  ప్రజలు పోటెత్తివచ్చుటతో రంగస్తలమును కళ్యాణమండపమునకు మార్చిరి. అప్పుడు మొదటిసారి ఆ కీచకులని  కళ్యాణ మండపమునకు వారే తమ మెర్సిడస్ నందు తరలించిరి. వారు చేయు పటాటోపము ను జూచిన నేను తొలుత  సంబ్రమాశ్చర్యములకు లోనయితిని పిదప జంభమతిశయమగుచున్నకారణమేమో వారి చూపులలో కనిపెట్టి వారిని దూరము బెట్ట ప్రయత్నించితిని. 

కానీ నా ప్రయత్నములేమియునూ సాగలేదు , వారచ్చట   పెద్దమనుషులు. నాట్యము ముగిసిన పిదప కళ్యాణమండపములో ఒక గదిలోకి నన్ను గొనిపోయి " ఈ కళ్యాణమండపము  మాదే ఎట్లున్నదని అడిగిరి, నేను మిన్నకుండి పోయివత్తునని పారితోషకం తీసుకొనుటకైననూ ఆగక నమస్కరించి పోవుచుండ  బయటకు పోవఁవీలులేకుండా కట్ట గౌడ తలుపుమూసి ఆటంక పరిచెను.  ఒప్పుకున్న  పారితోషకమునకు పదిరెట్లు ధనమిచ్చి తనతో ఆ రాత్రికుండి తీరవలెనని పట్టుబట్టెను. మేము కళావంతులకుటుంబము నాకు జెందినవారమే కానీ వేశ్యలము గాదు , విధివశమున ఆ రెంటికి భేదము తెలిసినవారు తక్కువ తెలిసిననూ ఒప్పుకొన్నరు. బైరెడ్డివలె నిన్నుపొందుట నా హక్కున్నట్లు  సర్వోత్తముడైన నన్ను బొందుట నీ యదృష్టమన్నట్లు మాట్లాడుట కుసంస్కారుల లక్షణము కుచ్చితుడు  మాటల్తో సరిపుచ్చును , బైరెడ్డి ప్రతినాయకుడు , ప్రతినాయకుడు దౌష్ట్యమునకు దిగును యని మాలినిగారు స్పందించిరి. కుచ్చితుని కంటే ఘోరము  కిరాతకుడు, వానికంటె ప్రమాదం  స్త్రీ నెత్తురు తాగు గబ్బిలము ఆంగ్లమున  వాంపైర్ అనుమాటకు వీరు తగినవారు. నన్ను ఏమేమి చేసెదరో చెప్పి "పైన ఇంకనూ సద్దుమణగలేదు దీనిపని తరువాత జూసెదమ"ని నన్ను నోరు కట్టివేసి ఆ గదిలో బంధించి పోయిరి. చాలాసేపు తరువాత తలుపు తెరుచుకొనెను కాచుకొని యున్న నేను క్షణమాగక కట్టు తెగిన ఎద్దువలె కట్టగౌడ పైబడి పక్కపిన్నుతో  గాయపరిచి  కళ్యాణమండపమునుండి బైట పడితిని. 

 ఎచటచూచిననూ చిట్ట చీకటలుముకొనియుండెను ఎట్టకేలకు  రహదారిపైకి వచ్చిన నాకు   విద్యుత్ సరఫరాయందంతరాయమేర్పడి నదని తెలిసెను కొంత దూరము నడిచినపిదప వూరు దాటి పొలిమేరలు చేరితిని. వెనుక నెవరో వచ్చుచున్నట్లు గమనించితిని రహదారి దిగి  పొలములోకి ప్రవేశించి తిని.  దూరముగా విద్యుత్ దీపములు కనిపించుచున్నవి.  కానీ నేను నడుచుచున్నపొలమంతయూ చీకట్లు పరుచుకొని యున్నవి. రెండువైపులా పొదలుగల కాలువ గట్టున  పోవుచుండగా అటునుండి  నలుగురు రాక్షసులు వచ్చుట గమనించితిని నాకు ముచ్చెమటలు పోయుచుండ ఒకరు నాచెయ్యి పట్టుకొనిరి. గట్టిగా అరవబోయి చేతిలో చిన్న దీపముతో నాచేతినిపట్టుకున్న6 సంవత్సరముల  చిన్నారిని చూసి ఆగిపోయితిని. ఆ పొదలమధ్యలో ఒక చిన్న బాట, ఆ బాటలో ఒక చిన్న గుడిసె కలవు. ఆ కుర్రవాడు నాన్నగుడిసెలోకి తీసుకుపోయేను.  అని చెప్పి క్షణకాలమాగి మాలినిగారి మొఖంలో ఆత్రమును చూసెను. "ఆ కుర్రవాడే కేశవుడు." అని అరుణతార చెప్పి ముగించగా  అది  విశదమే కానీ ఆ పిశాచములు ? యని మాలినిగారు అడిగిరి.  

ఆ రాత్రి ఆగుడిసెలో నాకు కనిపించిన ఒక స్త్రీమూర్తి ఒక మానవతామూర్తి దేవదాసి చారుమతి ఆమే. అమెకు పార్వతి యను కుమార్తె కూడా కలదు. చారుమతి ఆఖరిఘడియలు సమీపించుచున్నవి. పార్వతి తల్లికి సేవలు చేయుచూ మంచము  ప్రక్కనే యున్నది  ఆ రాత్రి  నాకు భయమునకు మించిన వేదన కలిగినది.  తన సర్వము    దైవసేవకు, సమాజసేవకు అర్పించి  ఊరిలో నున్న ఇంటిని అమ్ముకొని  ఊరివెలుపల పంట కాల్వ గట్టున గుడిసెకి చేరిననూ  కలత చెందక తనయొద్దకొచ్చిన అనాధబాలుడైన  కేశవుని సైతము తనతో యుంచుకొని ఆదరించిన పెద్దమనసున్న పెద్దమ్మ, ఆ రాత్రి పరమపదించెను. ఆమెకు ఉన్నఒక్క రక్త సంబంధము  చంద్రమతి ఆమె  అక్క కూతురితో   మరుసటి దినమున దహనసంస్కారాలకు వచ్చెను. ఆమె తన చెల్లి ఇట్లు దాన ధర్మములు చేయుట కిష్టపడక అక్క చారుమతి  ఆస్తిని  తనవద్దనే ఉంచుకొనెను అని, ఎంగిలి చేతితో కాకిని కొట్టు రకము కాదని  పలువురు అనుకొనిరి.    ఆమె గూర్చి నాకు పూర్తిగా తెలియకున్న నూ ఒక్క విషయము కలచి వేసినది అక్క  అంతిమ సంస్కారములకు ఆమె చిల్లి గవ్వ వెచ్చించ కుండుట తో నేను అంత్యక్రియలు నిర్వహించి పార్వతికి  కొంతడబ్బు ఇచ్చి బయలుదేరితిని. అప్పటికి నా జీవితము తలక్రిందులుగా నున్నది. 

నన్ను వలచి వెంటపడి పెళ్లాడిన దర్శకుడు  దర్శకునిగా అవకాశములు రాక తన ఆస్తులన్నీ కరిగించి  చలన చిత్రనిర్మాణము కొరకు ఖర్చుచేసెను. అదియునూ జాలక నేను సంపాదించినదానితో తినికూర్చోడలేక చిత్ర నిర్మాణము చేసి  నష్టమునార్జించెను.  గోరుచుట్టుమీద రోకటిపోటువలె వడ్డీలు  కట్టుచూ... ఎన్నోరకముల బాధలు. ఇప్పుడు కూతురు ఇట్లైనది ...దానితో చదువుకొన్న వర్ష మంజూష విదిష లు ముచ్చటగా కనిపించుచుండగా అది ముళ్లకంప వలే నున్నది.  అందుకే నా స్నేహితురాలు దామిని వద్ద వసతి గృహమున ఉంచి చదివించుచున్నది.  కానీ దాని జీవితమూ చేయి జారిపోవుచున్నది.  ఆమె కళ్ళు వర్షించుచుండెను.     మీ అమ్మాయి మా అమ్మాయి వేరు కాదు ఇచ్చటనే నీకు అభ్యంతరము లేనిచో  ఉంచవచ్చును మంజూషతో పాటు ఇచ్చటే ఉండును  అని మాలిని గారు నచ్చ  జెప్పిరి

"అమ్మవంటపూర్తి అయినది.  వర్ష కూడా వచ్చెను." యని మంజూష అనగా ఇంకాలస్యమెందులకు  చేతులు కడుక్కొని వచ్చిన అందరమూ కూర్చొనవచ్చు అని మాలినిగారు అనిరి. మాలినిగారు వడ్డన చేయబోవగా ఆమెను కూర్చొన బెట్టి  మంజూష , విదిష వడ్డన చేసిరి. 

బోజనములైన పిదప భారతవర్ష వీణావాదనము గావించి అరుణతార మనసును పులకరింపజేసెను. ఆమె తన  బంగారపుటుంగరమును భారతవర్షకు బహుమతిగా ఇవ్వబోగా నిరాకరించి, ఒక పుష్పమిచ్చిన చాలుననెను  కానీ పుష్పము వాడిపోవునుకదా యని అరుణతార అనగా  విదిష" అట్లెన్నటికీ కాదు  ఆ బాధ్యత  నాది ఇచ్చి చూడ"మనెను. అరుణతార పుష్పమును ఇచ్చుచుండగా చకచకా విదిషా చిత్రమును గీచి చూపగా  అచ్చెరువున విదిషను ముద్దాడి విమానాశ్రయమునకు బయలుదేరెను.  కాలినడకనబోవుచున్న ఆమెను చూచి ఒక యోగినివలె నున్నదని అందరు అనుకొనిరి.                                                   

3 comments:

  1. Nice sir. Well described scene in flowery language

    ReplyDelete
  2. ఊహించని మలుపులతో ఎంతో రమ్యముగా సాగిపోతున్న భారత వర్ష విషయము విదిష కు జరిగిన పరాభవముతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన తరువాత ఏమవుతుందో అని ఆదుర్దాగా యున్నది

    ReplyDelete