Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, August 1, 2020

Bharatavarsha 15

సాయంసంధ్య సమీపించుచుండ పురుచ్చి తలైవార్  డాక్టర్ ఎం జీ రామచంద్రన్  చెన్నపట్టణ  రైలు నిలయము నుండి నిర్గతినొందిన భారతవర్ష అగస్త్య రహదారిపై సాగుచుండిరి. " నీవు చాలాదూరము  బోవలెనోమో? యని అగస్త్య అనగా  ' ఇచ్చటనుండి విశ్వవిద్యాలయము కేవలము మూడు కిలోమీటర్ల దూరమునున్నది నేను , త్రిచక్రవాహనమునైన, లేనియెడల  కాలినడకనైన పోయెదను నీవెచ్చటికేగవలెను  ఎట్లు పోయెదవు ? అని భారతవర్ష యనెను.  నేను తారా మండలము పోవలెను అని అగస్త్య అనగా నీ  వక్రోక్తి  నాయుక్తి కందకున్నది  నీపోకడ  చూచిన రాకెట్టు కావలెనందువేమో ?  అని వర్ష అనగా " అవును వలయును " అని అగస్త్య బెట్టు జేసెను.

జూచిన నీకు ఊర్ధ్వగతి దప్పదనిపించుచున్నది యని శ్లేష (రెండర్థములు గల)  ప్రయోగము చేయగా " నాయనా నీకు దండము " నాకింకనూ భూమిపై నూకలు చెల్లలేదు "  నేను పోవలసినది  తారామణి యను ప్రదేశమునకు అది ఇచ్చటకు పదునైదు కిలోమీటర్ల దూరములో నున్నది. ఊరకనే తారామండల మని వెంగెమాడబోయితినని అగస్త్య బిక్కమొగము వేయ భారతవర్ష నవ్వుకొనెను.  ఇంతలో విశ్వవిద్యాలయము వారు వీరిని గుర్తించి  వీరివద్ద  వాహనమును నిలిపి  భారతవర్షకు హస్త సంజ్ఞ చేసిరి.

వర్ష కూడా వాహనములోనున్నవారిని గుర్తించి  ప్రతిసంజ్ఞ చేసెను.  నాపేరు అన్నయ్య కార్యనిర్వాహకునిని , నాపేరు తంబిదొర నేను వాహన చోదకుడిని అని వాహనము లో నున్న ఇద్దరు పరిచయము చేసుకొని అగస్త్యను తారామణి వద్ద విడిచిపెట్టగలమని పలకగా, మిత్రద్వయము వాహనమునధిరోహించిరి. “టైడల్ పార్కు వద్ద మాగృహము కలదు, నన్నచ్చట వదిలిన చాలును. అన్నయ్య గారు మీపేరు బహు విచిత్రముగా నున్నది, నాకొరకు మీరు శ్రమ తీసుకొనుచున్నారు   సభక సమయము మించిపోవునేమో” అని అగస్త్య వారితో యనగా సభారంభమునకింకనూ సమయమున్నది , ఇంక శ్రమ యందురా ఆతిథ్యమిచ్చువానికి శ్రమయందు అలసట గాక సంతోషముండవలెను అని  అన్నయ్య ఉద్ఘాటించగా అగస్త్య భావావేశం భరితుఁడై అయ్యో నాభావములకు తగ్గ భాష నావద్దలేదు, ఎంత సంస్కారవంతంగా మాట్లాడారు. నేను కవినైనచో …అయిననూ తప్పదు నన్నాపవలదు అని వాహనంలో అందరూ ఉపహసించుచున్ననూ లెక్క చేయక బిగ్గరగా తనకు వచ్చిన

జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం..

అని పాడి ఆపై రాక ఆపేసాడు. అందరూ  అతడినొక కొండముచ్చు వలే చూచుచుండ, “నా భావావేశమెట్లు చల్లారును? విద్యతో, సభ్యత  కాదు కాదు సభ్యతతో.. విద్యను  సంస్కారము చేసుకోవలెను” అని తొట్రుపాటు పడుతూ అగస్త్య ముగించెను. మీరు మీపాటతో విద్యకి  దహన సంస్కారం చేసేశారు అన్నాడు చోదకుడు. అందరూ ఘొల్లుమని నవ్వారు. అప్పుడు భారతవర్ష భావగాంభీర్యమైన భాష క్లిష్టత లేని విశ్వజనీనమైన  దృక్పథముతో

మంచిగంధము కన్న మంచిమాట మిన్న
అబ్ధి కంటే మిన్న సభ్యతొక్కటి యున్న
సహకారమున్న పొత్తు ప్రభవిల్లునన్న
సంస్కారమున విద్య  శోభిల్లునన్న

అంటూ పద్యాన్ని చెప్పి అందరినీ అలరించాడు. వాహన ప్రవాహము గొదావరీ ప్రవాహమును పోలి ఉరకలేయు చుండెను. ప్రవాహము మందగించినప్పుడు వాహనము మీనమువలె జారుచు, కూడళ్ల వద్ద  వాహన నియంత్రణా దీపము ఎరుపు జూపినపుడు వాహనములన్నియూ పాములవలె బుసకొట్టుచుండెను ప్రవాహము పెరిగినప్పుడు శరమువలె శీఘ్రగతిన సాగుచూ వాహనము పురోగతిని పొందుచుండెను.
అప్పుడు అగస్త్య “టైడల్ పార్క్ కు బోయి ఈదులాడవలెననిపించుచున్నది.” అనెను.

అప్పుడు చోదకుడు తంబి” TIDEL is a portmanteau of TIDCO and ELCOT. It is the biggest IT park in India. TIDEL Park is a 13-storied building with 77 companies.” అని ఆంగ్లమున వివరించెను. వాహన చోదకుడైననూ తంబి ఆంగ్లమున దిట్టవలె నున్నాడు portmanteau అనగానేమి? అని అగస్త్య అడగగా “నిఘంటువున చూచుకొనుము” అని తంబి పరిహాసమా డెను. ఫోర్త్ మాంతో  యనిన  రెండు పదముల కలయిక. Edutainment( education and entertainment) , Workaholic ( work and Alcoholic)వలె  అని భారతవర్ష పలుకుచుండ వాహనము టైడల్ పార్క్ ను సమీపించెను. తంబి వాహనమును వెనుకకుతిప్పి విశ్వవిద్యాలయమునకు పోవుటకు సిద్ధముగా నిలిపెను. పిమ్మట  అగస్త్య వాహనమునుంచి దిగి చిరునామా కాగితమును చేతబుచ్చుకుని , అందరికి అభివాదం చేసి సెలవు తీసుకొనెను. వాహనము విశ్వవిద్యాలయము దిశగా అతిరయమున సాగిపోయెను.  
                               
ఆకాశహర్మ్యము జూచి అబ్బురపడి సింహద్వారము చెంగట నిలిచినంతనే కావలివారు మరియు రక్షణాధికారి  "ఎవరివద్దకు పోవుచున్నారు?" అని  ప్రశ్నించగా మీనాక్షిగారి గృహమునకు అని ప్రత్యుత్తరమిచ్చి చేవ్రాలు చేసి  గృహసమూహము నందడుగిడిన అగస్త్య ఇంద్రాగ్ని తళుకును తలపించుచున్న భవనమును గాంచి మయసభా ప్రాంగణమందున్నట్టు  భ్రాంతి నొందెను. నలుదిక్కుల కలయజూచి పిమ్మట ముంగిట నున్న సుందర నందనమును తిలకించి కావి , సింధూర , పీత , హరితవర్ణ దళములతో అల్లుకు పోయిన లతిక, లతాంతములను కాంచినగస్త్యకు  గ్రహాంతరము బోయి నట్లనిపించెను. ఆ అద్భుత సౌందర్యమునకుముగ్దుడయ్యి ఒక ఛాయా చిత్రమును గ్రహించి ముందుకిబోవ నచ్చట నొక జలాశయమగుపించెను. అంతట ఉన్మత్తతనుగొల్పు పెను ఝంకారము వినవచ్చెను  తలెత్తిజూడ ఆకాశమంతయు బంగారు పుప్పొడి అద్దినట్లున్నది అందొక విమానము గాజుతొట్టెనందీదులాడు జలపుష్పమువలె సాగుచుండెను. సూర్యకాంతి పరావర్తనముచే యా లోహవిహంగము దగద్దగాయమానముగా కనులు మిరుమిట్లుగొలుపుచుండెను.
జలాశయమున లతిక లతాంతములను మించిన ఒంపులుగల లతాంగిలు రాజహంసలువలె కనిపించిరి. శృంగార భావనలు చెలరేగుచుండ తేరిపారజూచుట పాడికాదని భవనములోపలకి ప్రవేశించెను. అంతస్తాంతర రవాణా వ్యవస్థ మిక్కిలి ఆధునికంగా యున్నది దర్పణాలంకృతమైన ఎత్తుగదిలో(lift) కి ప్రవేశించి 7 వ అంతస్థు పోవుటకు మీట నొక్కెను.  గది పైకిపోవుచుండ మస్తిష్కమందు ఆలోచనలు మధుపముల వలె పరిభ్రమించు చుండెను.    ఈడేఱి స్వేచ్ఛగా తిరుగువారిని, కట్టుతప్పి హద్దుమీరినవారినితల్లిదండ్రులు ఉన్నచో మందలింతురు, అటువంటి తల్లితండ్రులున్నచో పిల్లలేమిచేయవలెను? మస్తిష్కమందు ఏల  మలిన తలంపులు చెలరేగుచున్నవి,  నా అంతరాత్మకు సైతము తలవంపు కలుగునట్లు  నా తల్లినిగూర్చి నేడేల రోతగా ఆలోచించవలె?

భారతవర్ష అన్న మాటలు “నీ తల్లి నీకు ఊహ వచ్చిన కొలది సంవత్సరములు మాత్రమే నీతో ఉండెను. ఆమె గుణగణములను గ్రహించు వయసు నాడును నేడును నీకులేదు” గుర్తుకువచ్చి ఆలోచనలను కట్టిపెట్టెను. ఎత్తుగది 7వ అంతస్తు జేరెను . తల్లి నవ్వు ముఖంతో తలుపు దీసి సిద్ధముగా నున్నది. అగస్త్య నవ్వుచూతల్లికాళ్ళకి నమస్కరించెను.  తళుకులీనుచున్న విశాలమైన గది. సోఫా ప్రక్కనున్న  పియానోను చూచెను. తల్లికాఫీ చేసి ఇవ్వగా ఆమె ఎదురుగా కూర్చొని కాఫీ త్రాగుచుండెను. తల్లి ఏమిచేయుచున్నది , ఆమె జతగా డెక్కడ?  యను ఆలోచనలు ముప్పిరిగొన అడుగుటకు నోరు రాక తల్లి చేతి కాఫీ త్రాగి స్నానమునకు బోయెను.  కొడుకు తినుటకు అట్లు వేసిపెట్టెను. ఇంతలో గంటమ్రోగెను. ఎవరో ఒక లుంగీధారి, చీరకట్టుకొన్న ఒక స్త్రీ లోనికి ప్రవేశించిరి. అగస్త్య అట్లు తినుచుండగా శ్రావ్యమైన సంగీతము వినిపించసాగెను.  అమ్మ పియానో నేర్చుకొను చున్నదేమో అనుకొనెను.

తినుట పూర్తిచేసి అగస్త్య పక్కగదిలోకి వెళ్ళుటకు ప్రయత్నించి అటులనే  నిలచిఉండెను మీనాక్షి అడుగుల చప్పుడు ఆలకించి " అగస్త్య ఇటురమ్ము అని పిలచి ఈయన వరదాచారిగారు అని పియానో నేర్చుకొనుటకు వచ్చి యున్నారు. ఈమె వారి భార్య అని జెప్పి ఈ అబ్బాయి మా అబ్బాయి విశాఖపట్నమందు చదువుకొనుచున్నాడు అని పరిచయము చేసెను. తరువాత వారిని సాగనంపి తలుపువేసి అగస్త్యవద్దకు వచ్చి కూర్చొనెను. నీ చదువెట్లు సాగుచున్నది?కళాశాల ఎట్లున్నది? ఆరోగ్యము ఎట్లున్నది? అని ప్రశ్నలు వేసెను. అట్లు వారు చాలా సేపు మాట్లాడు కొనిరి. అగస్త్యలో  ఆందోళన తొలగి ఉత్సాహము నిండెను.

మీనాక్షి వంటగదిలోకి పోయి వంట చేయనారంభించెను. అగస్త్య తల్లివద్దకుపోయి సహాయము చేయుచుండెను. భోజనము చేయుచున్నంతసేపు అగస్త్య ఎవరికొరకో ఎదురు చూచుచున్నట్లు మీనాక్షి  గ్రహించిననూ ఏమియునూ మాట్లాడలేదు. భోజనములు ముగించి నపిదప అగస్త్య, భారతవర్ష గూర్చి  బసవడు గూర్చి చెప్పెను. మీనాక్షి అన్నీ శ్రద్ధగా వినుచుండెను. అగస్త్య  "అమ్మా  నాచదువు ముగిసిన  పిదప నేనుకూడా నీతోనే యుందున"నెను.  మీనాక్షి  నవ్వి ఊరుకొనెను.  మంచి స్నేహితులు ఉండుట గొప్ప వరము , ఈ వయసులో స్నేహితుల ప్రభావము పుస్తకముల ప్రభావముకంటె అధికముగా నుండును. నీస్నేహితుల గూర్చి చెప్పినచో నీ గూర్చి చెప్పెద నని  ఆంగ్లమునొక  సామెత కలదు. మంచి స్నేహమునెప్పుడూ వీడరాదు చెడు స్నేహములు చేయరాదని మీనాక్షి కొడుకుకి  హితవాక్యములు  అనుభవములు  చెప్పుచుండగా చాలా సమయము గడిచిపోయెను.  అగస్త్య నువ్వు ఇంక పోయి పడుకొనుము అని మీనాక్షి తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకొనెను.

ఒక అర్ధరాత్రి తలుపు చప్పుడు అగుచుండగా మీనాక్షి బోయి తలుపు తెరిచేను. అగస్త్య చెవులు రిక్కించుకొని విను చుండెను .ఆయన ఎవరు? ఎందుకు ఇప్పుడు వచ్చినాడు? అగస్త్య ఇట్లనుకొనుచుండగా వారిరువురు లోపలికిపొయి తలుపువేసుకొనిరి. లోపలనుంచి ఉండుండి ముక్కలు వినిపించుచుండెను. "త్రాగివచ్చినారా? విందుకి పోయివచ్చుచున్నాను."

పెళ్లి  చేసుకొన్నపిదప  విందులకు పోనని  ఇచ్చిన మాట నిలుపుకొందును  ..అయ్యూ పోయి పోయి మరల అదే గోతిలో పడితిని తాగుడు అలవాటున్నచో నేను కన్నెత్తి చూసెడి దానను కాదు"   " తాగుడు మానలేను కానీ వలసినచో  రేపే మనము పెళ్లి చేసుకొనవచ్చును." అగస్త్య మెల్లగా తలుపుకి చెవి ఆనించెను. "పెళ్ళికంటే గుణము ముఖ్యము నీవద్ద లేని గుణమే."  "నాకే వంక పెట్టుచున్నావా విడాకులు తీసుకొనక ముందే ఇంకొకడితో ... నీ గుణము ఎట్టిది?" 

 "ఛీ! ఛీ! నీవంటి వాడిని నమ్మినందుకు నన్ను నేను చెంపదెబ్బ కొట్టుకొనవలెను"  అని మీనాక్షి అనుచుండగా ఆమె చెంపచెళ్లుమనెను.  అగస్త్యుడు చెంప తడుముకొనెను   మరుసటి దినమున వెళ్లిపోవుటకు  నిర్ణయించుకొనెను.  ఆ రాత్రి అగస్త్యుని ఆలోచనలు తేనెటీగలవలె చుట్టూ ముట్టినవి.  తల్లి ఒక స్త్రీ  ఆమె కూడా సంతోషముగా జీవించుటకు అర్హురాలేకదా అని  మనసును నెమ్మది పరుచుకొనిన పిదప   ఆలోచన అలలు సద్దుమణిగి  నిద్రాదేవి కరుణించెను         

5 comments:

  1. మీనాక్షి జీవితం మూసి ఉంచిన పుస్తకం బోలి యున్నది

    ReplyDelete
    Replies
    1. మీనాక్షి జీవితాన్ని మూసి ఉంచిన పుస్తకం తో పోల్చడం అద్భుతంగా ఉంది.

      Delete
  2. కాదు స్త్రీలందరి జీవితములు నల్లేరు మీద నడకలు
    కీచక, నపుంసక పర్వములు దాటుకుంటూ
    దుఃఖమును గాంభీర్యంగా మార్చుకొన్న జీవితములు
    అంతు లేని కథలు,మూసి ఉన్న పుస్తకములు
    మనోఫలకంపై దుఃఖ చారికలు చూడగలిగిన వాడు పరిపక్వత గల రచయిత

    ReplyDelete