మాపుయి మెల్లగా మంచం మీద నుంచి లేచింది. కొన్ని పండ్లు తిన్నాక కాస్త శక్తి వచ్చినట్టనిపించింది.
టీవీలో వార్తలు చూస్తున్న దేవకి, మాపుయి, కన్నయ్యలకు ఒక్కసారిగా మేఘన అరెస్టు వార్త కనిపించింది.
అంతే—దేవకి గుండె పగిలినట్టుగా ఏడవడం మొదలుపెట్టింది.
ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆగలేదు. ఏడ్చి ఏడ్చి నీరసంగా మంచం మీద వాలిపోయింది. మేఘనను కాపాడడానికి వెళ్లలేదంటూ కన్నయ్యను నిందించడం మొదలుపెట్టింది.
కన్నయ్యకే ఏం చేయాలో తోచడం లేదు. తల్లి మాటలు భరించలేక బయటకు వెళ్లబోతుంటే దేవకి అతని వెనక నుంచి అరిచింది.
“తూ కన్నయ్యా నహీ... షైతాన్ హో! దయాన్ హో!”
“దీదీ, కంగారు పడకండి. జీజాజీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు కదా. ఆయన తప్పకుండా మేఘనను బయటకు తీసుకొస్తారు,” అంటూ మాపుయి ఆమెను ఓదార్చింది.
తర్వాత మాపుయి వంటగదిలోకి వెళ్లింది. దేవకి లేచి వంట చేయబోతుంటే ఆమె అడ్డుకుంది.
“దీదీ, మీరు చాలా అలసిపోయారు. ఇప్పుడు మీరు వంట చేయలేరు. నేను చేస్తాను.”
మాపుయే భోజనం సిద్ధం చేసింది.
కొద్దిసేపటికి కన్నయ్య తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక బాటిల్ ఉంది. దాన్ని మాపుయికి అందిస్తూ,
“నారియల్ పానీ లీజియే, మౌసీ,” అన్నాడు.
మాపుయి, దేవకి ఇద్దరూ ఆశ్చర్యంగా అతని ముఖం చూశారు.
“ఏమన్నావ్? మళ్లీ చెప్పు,” అంది మాపుయి.
“నారియల్ పానీ... అంటే కొబ్బరినీళ్లు.”
“అది నాకు తెలుసు. ఆ తర్వాత ఏమన్నావ్?”
“మౌసీ. అమ్మ చెల్లెల్ని మౌసీ అంటారు కదా?”
అంతవరకూ దేవకి ముఖంలో ఉన్న కోపం ఒక్కసారిగా మాయమైంది.
“వెల్ సెడ్ కన్నయ్యా! నా కన్నయ్య ఎప్పుడూ కరెక్టే!” అంటూ మురిసిపోయింది.
మాపుయి దేవకిని కోపంగా చూసింది.
“ఇందులో తప్పంతా మీదే దీదీ! మీ అబ్బాయి అసలు పేరు డాక్టర్ మయాంక్ అని ఒక్కసారైనా నాకు చెప్పారా?”
దేవకి దగ్గర సమాధానం లేదు.
మాపుయి రెండు చేతులూ జోడించి నాటకీయంగా,
“కమ్ సే కమ్ ఆజ్ సే నా... డాక్టర్ మయాంక్ బోలా కరో!” అంది.
కన్నయ్య నవ్వాడు.
“ఆమె నన్ను డాక్టర్ మయాంక్ అని ఎందుకు పిలుస్తుంది? మయాంక్ అని పిలవొచ్చు. కానీ ఎన్నేళ్లుగానో కన్నయ్య అని పిలవడం అలవాటైపోయింది. ఒక్కసారిగా ఎలా మారుతుంది?”
“మేరే బచ్చే!”
దేవకి కొడుకును దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టుకుంది.
మాపుయి వెంటనే చేతులు నడుముపై పెట్టుకుంది.
“హాయ్ రబ్బా! తేరే కన్నయ్యా కో అభీ భీ బచ్చా సమఝ్‌కర్ బైఠీ హై క్యా? షాదీ కరేగా తో బచ్చే పైదా కర్ సక్తా హై! షకల్ దేఖో!”
కన్నయ్య నవ్వేశాడు.
“మౌసీ, నాకు ఇరవై ఆరేళ్లే. మీకంటే చాలా చిన్నవాడిని. ముందు మీరు పెళ్లి చేసుకోవాలి.”
దేవకి వెంటనే అందుకుంది.
“అవును! ముందు నీ పెళ్లే. కానీ మాపుయీ... నీకు ఇప్పటికే ఒకడు నచ్చేశాడు కదా! ఇందాక వచ్చిన అతనే!”
మాపుయి కంగారుపడింది.
“లేదు దీదీ! అలాంటిదేమీ లేదు. అతను నా మేనేజర్. అంతే.”
“హాయ్ రబ్బా! ఎంత నటిస్తావే! ‘జిట్టూ... జిట్టూ...’ అంటూ నువ్వు పిలవడం నా చెవులతో విన్నాను. నీ మనసులో ఉన్నది ముఖం మీదే కనిపిస్తోంది. నాకు అభ్యంతరం లేదు. కానీ నిజం చెప్పు—అతన్ని పెళ్లి చేసుకుంటావా?”
మాపుయి ముఖంలో నవ్వు మాయమైంది.
“అతను నన్ను పెళ్లి చేసుకోలేడు దీదీ. నా కథ మీకు తెలియదు.”
దేవకి ఆమెను ఆప్యాయంగా చూసింది.
“ఆ అబ్బాయి చాలా మెత్తగా, ప్రేమగా కనిపించాడు. ఒప్పుకుంటాడు. అసలు నీ కథ ఏమిటి?”
మాపుయి కన్నయ్య వైపు చూసింది.
“ముందు కన్నయ్యను అడగండి. అతను పెళ్లి చేసుకుంటాడా?”
అంతవరకూ సరదాగా ఉన్న కన్నయ్య ముఖం ఒక్కసారిగా గంభీరమైంది.
“నా కథ కూడా మీకు తెలియదు, మౌసీ.”
కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పడం మొదలుపెట్టాడు.
“నేను చదువుతో డాక్టర్‌ని. వృత్తితో టీచర్‌ని. అదే నాకు ఇబ్బందిగా అనిపించే నిజం. ఢిల్లీ, నోయిడా లాంటి నగరాల్లో కేవలం ఎంబీబీఎస్‌తో పెద్దగా విలువ ఉండదు. పెద్ద హాస్పిటల్‌లో చిన్న ఉద్యోగం మాత్రమే దొరుకుతుంది.”
దేవకి ముఖంలోని చిరునవ్వు మెల్లగా మాయమైంది.
“నా అమ్మ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని నా కల. కానీ అది ఇప్పటికీ నా అందుబాటుకు చాలా దూరంలో ఉంది.”
కన్నయ్య గొంతు బరువెక్కింది.
“నేను మెడిసిన్ చదివానని, డాక్టర్‌నని ఎవరికీ చెప్పొద్దని అమ్మకు నేనే చెబుతుంటాను. నా చదువు కోసం ఆమె ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మెరిట్ సీటు తెచ్చుకున్నాను. చదివాను. డిగ్రీ సంపాదించాను. కానీ డాక్టర్‌గా అమ్మ గర్వపడే స్థాయికి చేరలేకపోయాను.”
దేవకి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“చివరికి నేను ఆమెకు డాక్టర్ మయాంక్ కాలేకపోయాను. ఆమె కన్నయ్యగానే మిగిలిపోయాను.”
మాపుయి కళ్లూ తడిశాయి.
“అందుకే పెళ్లికి నేను సరిపోనని అనిపిస్తుంది. నాలాంటి డాక్టర్‌ను ఏ అమ్మాయి కోరుకుంటుంది?”
“అలా అనకు కన్నయ్యా!” దేవకి గొంతు వణికింది. “నీ డిగ్రీకి మార్కెట్‌లో ఎంత విలువ ఉందన్నది నాకు అవసరం లేదు. నువ్వూ, నీ చదువూ నాకు అమూల్యం.”
కొడుకు ముఖంలోకి చూసింది. అతని ముఖం ముడుచుకుపోయింది. ఎన్నాళ్లుగానో లోపల దాచుకున్న అవమానం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
“కన్నయ్యా... మంచి మనసున్న అమ్మాయిలు లేరని అనుకోకు.”
“ఉంటారు అమ్మా. కానీ వాళ్లకు నేనూ నచ్చాలి కదా?”
అతను చిన్నగా నవ్వాడు.
“యే సబ్ నహీ హోనేవాలా. ఆప్ చింతా మత్ కీజియే. ఆప్ అప్నా ఖయాల్ రఖియే.”
ఆ తర్వాత తల్లి కళ్లలోకి చూస్తూ,
“మీరు సంతోషంగా ఉంటే చాలు. మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది,” అన్నాడు.
ఆ మాట దేవకి గుండెను మరింత కదిలించింది.
“మై భీ ఏక్ మా హూన్! కోయీ నీచ్ ఔరత్ నహీ!” అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. “నాకూ నా కొడుకు సంతోషమే కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నువ్వు పెళ్లి వద్దంటే నాకూ వద్దు.”
కాసేపు ఆగి,
“నీకు ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది. టీచింగ్ ఏమైనా చిన్న పని కాదు. అదీ మంచి సంస్థలో బోధిస్తున్నావు.”
“అమ్మా, టీచింగ్ గొప్ప వృత్తే. నేను దాన్ని తక్కువ చేయడం లేదు. కానీ...”
“కానీ ఏమిటి?”
“ఈ మధ్య ఢిల్లీ నుంచి మీరట్‌కు వచ్చిన డాక్టర్ రాధిక నా పరిస్థితిని మరింత ఇబ్బందిగా చేసింది.”
“ఏం చేసింది?”
“నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది.”
అంతే!
దేవకి ఒక్కసారిగా ఉత్సాహంతో నిటారుగా కూర్చుంది. అప్పటివరకు గాలి పోయిన బెలూన్‌లా ఉన్న ఆమె, ఒక్క క్షణంలో పూర్తిగా గాలి నింపిన బెలూన్‌లా మారిపోయింది.
“అరే! ఇది గుడ్ న్యూస్ కదా! అమ్మాయి నిన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకో. తప్పేముంది? లడ్కీ తో అచ్చీ హై నా?”
కన్నయ్య ముఖం చిట్లించాడు.
“లడ్కీ అచ్చీ నహీ హై, మా. నాకు ఆ అమ్మాయి నచ్చదు. నేను ఆమెను ప్రేమించను.”
దేవకి క్షణం ఆలోచించింది.
తర్వాత ముఖం వెలిగిపోయింది.
“అయితే ఇంకా మంచిది!”
కన్నయ్య, మాపుయి ఇద్దరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు.
“ఎందుకంటే నీకోసం నా దగ్గర ఇప్పటికే ఒక అమ్మాయి ఉంది!”
“అమ్మా! నేను ఎవరినీ పెళ్లి చేసుకోను!” కన్నయ్య విసుగ్గా అన్నాడు.
కోపంగా లేచి బయటకు వెళ్లబోయాడు.
అదే సమయంలో తలుపు దాటి లోపలికి ఒక అమ్మాయి వస్తోంది.
కన్నయ్య వేగంగా తిరగడంతో—
ధడ్!
నేరుగా ఆమెను ఢీకొట్టాడు.
కన్నయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు.
ఆ అమ్మాయి కూడా అతని ఎదురుగా నిలిచిపోయింది.
దేవకి మాత్రం మంచం మీద నుంచే ఇద్దరినీ చూస్తూ ఉండిపోయింది
“ఏమైనా దెబ్బ తగిలిందా? నువ్వు బాగానే ఉన్నావు కదా?”
ఆ దృశ్యం చూసి దేవకి నిశ్చేష్టురాలైంది.
ఆమె పక్కనే ఉన్న మాపుయీ పరిస్థితీ అంతే. ఇద్దరూ విగ్రహాల్లా నిలబడి కన్నయ్యను, మనూను చూస్తున్నారు. మనూ మాత్రం ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది.
“డాక్టర్ సాబ్… మేరీ దోస్త్ దేఖ్ రహీ హై… ఛోడో నా!” దేవకి వెంటనే తేరుకుంది.
“అచ్చా! నేను చూడకపోతే మాత్రం పరవాలేదన్నమాట!”
ఆమె ముఖంలో కృత్రిమ కోపం. మనూ సిగ్గుతో తల వంచుకుంది.
దేవకి ఆమె దగ్గరకు వెళ్లింది. కూతురిని ఆదరించినట్టు తలమీద ప్రేమగా చేయి వేసి నిమిరింది.
“నేను నీ అత్తను. నువ్వు నా కోడలివి!” అంటూ ఆనందంగా చెప్పింది దేవకి.
మనూకు ఆమె మాటలు అర్థం కాలేదు. అయోమయంగా కన్నయ్యవైపు చూసింది.
కన్నయ్య నవ్వాడు. అవును మనూ! నీ ఫ్రెండ్… నా అమ్మ!” మనూ కళ్ళు పెద్దవయ్యాయి.
“క్యా?!” మరుక్షణమే ఆమె ముఖంలో సిగ్గు, ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిసిపోయాయి. వెంటనే వంగి దేవకి పాదాలను తాకి సంప్రదాయబద్ధంగా నమస్కరించింది.
దేవకి ఆమెను భుజాలు పట్టుకొని పైకి లేపి గుండెలకు హత్తుకుంది.
ఆ కౌగిలిలో ఒక అత్త ఆనందం మాత్రమే లేదు. తన కొడుకు జీవితంలోకి అడుగుపెట్టబోతున్న అమ్మాయిని మొదటిసారి కోడలిగా చూసిన తల్లి గర్వం ఉంది.
“మాజీ… ఐ యామ్ సారీ. నేను మీకు చెప్పలేకపోయాను. కానీ నేను—”
కన్నయ్య ఏదో వివరించబోయాడు.
“చుప్! చుప్!” దేవకి అతని మాట మధ్యలోనే ఆపేసింది.
“నువ్వు పెళ్లి చేసుకోవద్దనుకున్నావు కదా! పో! పో అవతలికి!”
అంటూ అతన్ని తోసుకుంటూ వంటగదిలోకి తీసుకెళ్లి తలుపు వేసేసింది.
“అమ్మా!” లోపల నుంచి కన్నయ్య గొంతు. మనూకు కోపం వచ్చింది.
“ఏ కోయీ తరీకా హై? ఇదేమి పద్ధతి? డాక్టర్ సాబ్ కో బంద్ కర్ రఖ్నా?”
దేవకి రెండు చేతులూ నడుముపై పెట్టుకుంది.
యుద్ధం గెలిచిన సైన్యాధ్యక్షురాలిలా నిలబడింది.
“నేను నీ అత్తను! నన్ను బతిమాలుకుంటే… నీ డాక్టర్ సాబ్‌ను వదిలేస్తాను!”
మాపుయీ నవ్వు ఆపుకోలేకపోయింది. మనూ ముఖం మరింత ఎర్రబడింది.
అప్పుడే తలుపు దగ్గర అలికిడి వినిపించింది. విష్ణు సిసోడియా లోపలికి వచ్చాడు. అతని వెంట మేఘనా ఉంది. విష్ణును చూడగానే దేవకి నడుముపై ఉన్న చేతులు మెరుపువేగంతో కిందికి వచ్చేశాయి. ఆ సైన్యాధ్యక్షురాలి భంగిమ క్షణంలో మాయమైంది.
గబగబా వంటగది తలుపు తీసి లోపలికి వెళ్లి కన్నయ్యను బయటకు తోసేసింది.
కన్నయ్య విష్ణును చూసి రెండు చేతులూ జోడించాడు.
“నమస్కార్! ఆయియే జీ. నిజానికి నేనే మీ దగ్గరకు రావాల్సింది. కానీ…”
“అవును. మేము మీకోసం ఎదురుచూశాం. కానీ ఈలోగా మేఘనా పోలీస్ స్టేషన్‌లో చిక్కుకుపోయింది,” అన్నాడు విష్ణు. వాళ్లిద్దరూ మాట్లాడుతుండగా మేఘనాను పక్కకు తీసుకెళ్లిన మాపుయీ, ఆమె లేని సమయంలో ఇక్కడ జరిగిన కథంతా గుసగుసగా చెప్పేసింది.
మేఘనా ముఖం వెలిగిపోయింది. “సచ్చీ?!”
ఆమె ఉత్సాహంగా వంటగదివైపు పరుగెత్తింది.
దేవకి అక్కడ దాక్కుని ఉంది. “దీదీ! చలో… బాహర్ ఆవో!”
అంటూ మేఘనా ఆమె చేయి పట్టుకొని బయటకు లాగబోయింది.
“హాయ్ హాయ్! నేనెలా ఆయన ముందుకు వస్తాను!”
అంటూ దేవకి మొహమాటపడింది.
అక్కడ కన్నయ్య విష్ణుతో మాట్లాడుతున్నాడు.
“నా మౌసీ కోసం మీరు చాలా శ్రమపడ్డారు. థాంక్యూ వెరీ మచ్.”
ఆ మాట వంటగదిలో ఉన్న మేఘనా చెవిన పడింది. కన్నయ్య తనను ‘మౌసీ’ అని అంత ఆప్యాయంగా సంబోధించడం ఆమె హృదయాన్ని తాకింది.
విష్ణు మాత్రం తనకు లేని గొప్పతనం ఆపాదించుకోవడానికి ఇష్టపడలేదు.
“నేనేం చేయలేదు. నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లేసరికే లకుమాజీ అక్కడికి వస్తున్నారు. ఆమె వెంట డీఐజీతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. నిజానికి ఆమె ఎవరో ఒకరిని పంపించి విషయం పరిష్కరించవచ్చు. కానీ స్వయంగా వచ్చి మేఘనాకు క్షమాపణ చెప్పారు. అప్పుడే ఆమె ఎంత పెద్ద మనసున్న వ్యక్తో నాకు అర్థమైంది.
సెక్యూరిటీ వాళ్లు కేసు వెనక్కి తీసుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే మేఘనాను విడుదల చేశారు. అయితే మేఘనాను తోసిన సెక్యూరిటీ అధికారిని ఆమె ఉద్యోగం నుంచి తొలగించడం మాత్రం దురదృష్టకరం.
తర్వాత మేఘనాను తన బంగళాకు తీసుకెళ్లారు. నేను అక్కడికి వెళ్లి ఆమెను తీసుకొచ్చాను. లకుమాజీ కూడా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు.”
ఒక్క క్షణం ఆగి వంటగదివైపు చూసి విష్ణు నవ్వాడు.
“మేడమ్ వంటగదిలో ఉన్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం ఆమెకు ఇబ్బందిగా ఉంటుంది.” అప్పుడే మంజీత్ లోపలికి వచ్చాడు.
లోపలి పరిస్థితిని ఒక్కసారి చూసి నవ్వుతూ అన్నాడు—
“పెళ్లయ్యేంతవరకు అందరూ అమ్మాయిలే!” విష్ణు పెద్దగా నవ్వాడు.
“అవును! పెళ్లయ్యేంతవరకు అందరూ అమ్మాయిలే!”
మేఘనా మాపుయీ చెవిలో గుసగుసలాడింది.
“దీదీ… జీజాజీ క్యా కహ్ రహే హై?” మాపుయీ నవ్వింది.
“వో భీ లడ్కా హై! ఆయన కూడా అబ్బాయే!”
అంతటా నవ్వులు విరిశాయి.
“సరే, నేను ఇక ఎక్కువసేపు ఉండకూడదు,” అన్న విష్ణు.
తన ఇంటికి తప్పకుండా రావాలని అందరినీ ఆహ్వానించి బయలుదేరాడు.
లిఫ్ట్ తలుపు మూసుకున్న శబ్దం వినిపించిన కొద్దిసేపటికి దేవకి నెమ్మదిగా బయటకు వచ్చింది.
“వో చలే గయే నా?” కన్నయ్య తన తల్లివైపు ఆశ్చర్యంగా చూశాడు.
మాపుయీ, మేఘనా ఇద్దరూ ఒకేసారి అన్నారు—
“దేఖ్! తేరీ మా కిత్నీ చాలూ హై!” కన్నయ్య నవ్వేశాడు.
“పెళ్లయ్యేంతవరకు అందరూ అమ్మాయిలే!” అని మంజీత్ మాటనే మళ్లీ ఉటంకించాడు.
“వాహ్! వాహ్! వాహ్! క్యా కోట్ హై, మంజీత్ జీ!” అంటూ మేఘనా చప్పట్లు కొట్టింది.
ఆ వెంటనే ఆమె మంజీత్ వైపు తిరిగింది. కానీ మీరు అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చారు?”
మంజీత్ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కన్నయ్య విషయం చెప్పాడు.
“నేను మౌసీ కోసం కొబ్బరి నీళ్లు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు మంజీత్‌జీని కలిశాను. మౌసీ ఆఫీసు దగ్గరలోనే ఉందని తెలుసు కదా. ఆయనతో మాట్లాడాను.”
అందరూ ఆసక్తిగా అతనివైపు చూశారు.
“మౌసీ గతం ఏమైనా సరే… ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.”
మాపుయీ ముఖంలో చిరునవ్వు మాయమైంది.
కన్నయ్య ఆమెవైపు తిరిగాడు.
“కానీ మాపుయీ మౌసీ తన కథను ఆయనకు స్వయంగా చెప్పాలి.”
మాపుయీ సందిగ్ధంలో పడింది.
మంజీత్ ఆమెను మృదువుగా ఒప్పిస్తున్నాడు.
కొంతసేపటికి ఇద్దరూ ఒక మూలన కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
మేఘనా, మనూ ఒకరినొకరు చూసుకున్నారు.
అక్కడ కన్నయ్య ఒంటరిగా నిలబడి ఉన్నాడు.
ఇద్దరూ ఒక్కసారిగా అతన్ని మనూ వైపు తోశారు.
“అరే!” అంటూ కన్నయ్య తూలుతూ మనూ దగ్గరకు వెళ్లాడు.
మనూ సిగ్గుతో నవ్వింది.
మేఘనా, మాపుయీ దేవకిని కౌగిలించుకున్నారు.
ముగ్గురూ కొద్దిసేపు ఆ కొత్త జంటను చూస్తూ నిలబడ్డారు.
దేవకి కళ్లలో తృప్తి. ఒకప్పుడు తన కొడుకు పెళ్లి గురించి ఆందోళనపడిన తల్లి ఇప్పుడు తన కళ్లముందే అతని జీవిత భాగస్వామిని చూస్తోంది.ఆమె మేఘనాను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకుంది. “నాకు ఇంకో కొడుకు ఉండి ఉంటే… వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసేదాన్ని మేఘనా!” మేఘనా నవ్వింది. అప్పుడే ఆమెకు ఏదో గుర్తొచ్చింది. లోపలికి వెళ్లి దేవకి గతంలో తనకు ఇచ్చిన బంగారు ఆభరణాలను తీసుకొచ్చింది.వాటిని దేవకి చేతుల్లో పెట్టింది.
“ఇవి తీసుకోండి. మీ కోడలికి ఇవ్వాలని దాచుకున్న నగలు కదా!”
దేవకి వెంటనే చేతులు వెనక్కి తీసుకుంది. “వద్దు! అవి నీవే.”
“లేదు దీదీ. ఇవి మీ కోడలికే చెందాలి.” “నేను తీసుకోను.”
“మీరు తీసుకోవాల్సిందే.” మేఘనా పట్టువదల్లేదు. మాపుయీ కూడా ఆమెకే మద్దతిచ్చింది.
చివరకు దేవకి ఓడిపోయింది. ఆభరణాలను చేతుల్లోకి తీసుకుంది. మనూను దగ్గరకు పిలిచింది.
ఆమెను చూస్తూనే దేవకి కళ్ళు తడిశాయి. “మనూ… నిన్ను నా కోడలిగా చూడాలని నేను ఎంతగా కోరుకున్నానో నీకు తెలియదు. కన్నయ్య నిజంగా గొప్పవాడు. నా మనసులోని కోరికను నాకంటే ముందే తెలుసుకున్నాడు.”
ఆమె చేతులు ఆకాశంవైపు జోడించింది.
“హే ముకుందా… హే మురారీ! నా మీద ఇన్ని సంతోషాలు కురిపించావా! నీ కృప వెలుగుతో నా జీవితమంతా నింపేశావు.” ఆమె పెదవులపై భగవన్నామం. కళ్లలో ఆనందబాష్పాలు.
చేతుల్లో బంగారు ఆభరణాలు. దేవకి నెమ్మదిగా మనూ దగ్గరకు వెళ్లి, కాబోయే కోడలికి ఆ నగలను అందించింది. మనూ వాటిని తీసుకోకుండా క్షణం దేవకి ముఖాన్నే చూస్తూ నిలబడిపోయింది.
ఆమెకు ఆ నగల విలువ బంగారంలో కనిపించలేదు.
తనను కోడలిగా అంగీకరించిన ఒక తల్లి ప్రేమలో కనిపించింది.
మనూ దేవకి చేతులను తన చేతుల్లోకి తీసుకొని నుదుటికి ఆనించుకుంది.
దేవకి ఆమెను మరోసారి గుండెలకు హత్తుకుంది.
ఆ ఇంట్లో అప్పటివరకు నవ్వులు వినిపించాయి.
ఇప్పుడు ఆ నవ్వుల మధ్య కొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి.
ఒక మూల మాపుయీ తన గతాన్ని మంజీత్‌కు చెప్పడానికి ధైర్యం కూడగట్టుకుంటోంది.
మరోవైపు మనూ–కన్నయ్యల భవిష్యత్తుకు దేవకి తన చేతులతో ఆశీర్వాదం అందిస్తోంది.
జీవితం ఒక్క క్షణంలో మారదు.
కానీ కొన్నిసార్లు— ఒక్క క్షణమే జీవితంలోని అన్ని దారులనూ మార్చేస్తుంది.
What! Dr Mayank is the son of Devaki? What about mayur? Where is Kyra?.Unexpected twist.
ReplyDeleteWhat is the story of Maui? Why couldn't Jittu marry her?
May be I am reading with my mind. I couldn't understand the facts.
ReplyDelete25 వ ఎపిసోడ్ లో పాత్రలమధ్య అనుబంధాలు , ప్రేమ , దుఃఖం , ఆందోళన, ఆనందం ఆశ్చర్యకరమైన మలుపులు కనిపిస్తాయి మాఫుయి రెండురోజులు లకుమ కోసం తిరిగి ఆందోళనకు గురై జ్వరం తెచ్చుకుంటుంది . ఆమె మూడవ రోజు వెళ్ళక పోయినా మేఘన వెళుతుంది మేఘనను అరెస్ట్ చేయకూడదు స్త్రీలను రాత్రి అరెస్ట్ చేయకూడదు , కానీ చాలాసార్లు పోలీసులు ఈ రూలు పట్టించుకోరు.( న్యూస్ పేపర్లు చదువుతుంటే ఈవిషయం తెలుస్తుంది )
ReplyDeleteదేవకి పిరికిది కాదు , సంప్రదాయం అనే వలలో చిక్కినది. అందులోంచి బయటపడడానికి సమయం పడుతుంది. ( పిల్లలు ఉన్న స్త్రీ పెళ్లి చేసుకోడానికి జంకడం మామూలే నేను చాలా సార్లు చూసాను . నువ్వు సమాజాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది ) దేవకి తానుకూడా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని చాలా ఆనందపడడం గత ఎపిసోడ్లో జరిగింది.
దేవకీ మనుని గుణగణాలు చూసి కోడలు కావాలనుకుంటుంది , తనకి ఇవ్వడానికి దాచిన నగలు మేఘనకి జీవితం బాగు పడాలని ఇచ్చేస్తుంది.. మేఘన మనుకోసం పెళ్లి లో మోసం జరగకూడదని తెగించి సాహసం చేసి చివరకు అరెస్ట్ అవుతుంది. ఇవి ప్రేమ మానవ సంబంధాలను చూపించడం లేదా ? ఆమెకోసం దేవకీ మాఫుయి ఆందోళన పడడం. లకుమ తాను స్వయంగా వెళ్లి మేఘనని విడిపించుకుని రావడం ఆనందం , ఒకంత ఆశ్చర్యం కలిగించలేదా? బొమ్మతో సహా పెట్టేను .
సిసోడియా మేఘనను తీసుకురాడం , మంజీత్ రావడం , మను మయాంక్ కలవడం మూడు పెద్ద అనుకోని సంఘటనలు ఆశ్చర్య కరమైన మలుపులు. ( గమనించావా?) దేవకి కన్హయ్య ని వంటగదిలోకి నెట్టి మనుని ఆట పట్టించడం అదే సమయంలో విష్ణు రాకతో వంట గదిలోకి దూరడం , ఆమెని మేఘన మాఫుయి ఆట పట్టించడం , చివరకు విష్ణు ని కూడా ఆట పట్టిస్తుంటే అతడు తప్పు కోడం జరుగుతుంది . ఇలా ఎన్నో సరదాలతో ఈ 25 వ ఎపిసోడ్ సాగుతుంది.