కైరా వంట ముగించి, దేవతా పటం ముందు నిలబడి—
“జై సంతోషీమాతా... జై సంతోషీమాతా...” అంటూ భక్తిగా జపిస్తోంది.
రాత్రి ఎనిమిది గంటలకు మను జల్‌వాయు అపార్ట్‌మెంట్స్‌కు చేరుకుంది.
ఆమె శరీరం మాత్రమే జల్‌వాయు అపార్ట్‌మెంట్స్‌కు వచ్చింది. మనసు మాత్రం ఇంకా లావణ్య అపార్ట్‌మెంట్స్‌లో చూసిన ఆ నమ్మశక్యం కాని దృశ్యం దగ్గరే ఆగిపోయింది.
దేవకి ఆమె మనసును దోచుకుంటే, కన్నయ్య ఆమె హృదయాన్నే దొంగిలించాడు.
ఆనందం ఆమెను నిలువెల్లా ముంచెత్తుతోంది.
తలుపు దగ్గరకు వచ్చి, దేవతా పటం ముందు నిలబడి కైరా భక్తిగా జపించడం చూసి మనుకు నవ్వొచ్చింది. కైరా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. కానీ కైరా నవ్వలేదు.
ఆమెకు మను మీద పీకలదాకా కోపం వచ్చింది. రోజూ త్వరగా ఇంటికి రావాలని తనకు చెప్పేది మను. సమయపాలన, క్రమశిక్షణ అంటూ తనకు ఎన్నో పాఠాలు చెప్పింది. అలాంటిది ఈ రోజు తానే ఇంత ఆలస్యంగా రావడమా? కైరా గుమ్మానికి అడ్డంగా నిలబడింది.
మనును లోపలికి రానివ్వకుండా తదేకంగా చూస్తోంది. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు.
అందరికీ ఒకటే న్యాయం కావాలని మొండిగా పట్టుబట్టే చిన్నపిల్లలా కనిపించింది.
మను నవ్వింది. “నవ్వకు! ముందు చెప్పు. ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు?” నిలదీసింది కైరా.
మను మళ్లీ నవ్వింది. కైరా అనుమానంగా ఆమె ముఖంలోకి చూసింది.
“నషా చఢ్ గయీ క్యా? పీకే ఆయా?”
“ఏంటి? మత్తెక్కిందా? తాగేసి వచ్చావా?”
“హాఁ బాబా, హాఁ! తాగాను!” ఒప్పుకుంది మను.
అంతే! కైరా ఒక్కసారిగా మను మీదికి దూకి రెండు చేతులతో ఆమె మెడ పట్టుకుంది. సరదాగా గొంతు నొక్కడం మొదలుపెట్టింది. “నా మెడ వదులు! ఇప్పుడు అది నాది కాదు. అతనికి ఇచ్చేశాను!” అంది మను. ఆ మాటతో కైరాకు మరింత చిర్రెత్తింది.
“తూ సీధా బాత్ కర్, వర్నా మైం...!” పిడికిలి బిగించి మనును కొట్టబోయింది.
మను వెంటనే— “మంగళసూత్రం కట్టడానికి నా మెడను కన్నయ్యకు ఇచ్చేశాను!” అంది.
కైరా చేతులు వెంటనే వదిలేసింది. ఒక్క క్షణం తెల్లబోయి చూసింది.
తర్వాత మను తనను ఆటపట్టిస్తోందని అర్థమై, చిన్నపిల్లలా ఏడుపు ముఖం పెట్టింది.
మను ఇక ఆటలు చాలనుకుంది. “కూల్... కూల్... నిజం చెబుతున్నాను. త్వరలోనే నేను డాక్టర్ మయాంక్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను.” కైరా మరింత అయోమయంలో పడింది.
“ఏంటీ? ఇప్పుడే కన్నయ్య అన్నావు కదా?” మను కన్నుగీటింది. “ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాను!”
“జ్యాదా హో గయా తేరీ హర్కత్! ఆజ్ కుఛ్ నా కుఛ్ పీయా హోగా!”
“నీ డ్రామా మరీ ఎక్కువైంది. ఈ రోజు ఏదో ఒకటి తాగే వచ్చావు!”
అంటూ కైరా మనును చేతులతో కొట్టడం మొదలుపెట్టింది.
“అవును... తాగాను.” మను ఒక్క క్షణం ఆగింది.
ఆమె కళ్లలో ఒక కొత్త వెలుగు మెరిసింది. “ప్రేమను తాగాను!”
అంతే. ఆ తర్వాత లావణ్య అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన కథంతా చెప్పింది.
దేవకి... కన్నయ్య... మయాంక్... పెళ్లి సంబంధం...
ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ కైరా ముఖంలో ఆశ్చర్యం పెరిగిపోయింది.
చివరకు ఆనందంతో మను ముఖాన్ని పరిశీలిస్తూ—
“నీ ముఖంలో అప్పుడే పెళ్లికూతురు కళ వచ్చేసింది!” అంది.
ఆ మాట వినగానే మనుకు దేవకి గుర్తొచ్చింది.
“నువ్వు దేవకి ముఖం చూడాలి. ఆమె ముఖం ముందు సూర్యుడు కూడా టార్చ్‌లైట్‌లా కనిపిస్తాడు!” కైరా పగలబడి నవ్వింది. వెంటనే దేవకిని అనుకరిస్తూ, గొంతు మార్చి—
“హాయ్... హాయ్... నేను పెళ్లి చేసుకోవడమేంటి? ఈ వయసులో నేను పెళ్లికూతుర్నా?”
అంటూ నటించింది.“కైరా... ప్లీజ్! దేవకి చాలా అమాయకురాలు. ఆమెను ఆటపట్టించకు .” మను నిజంగానే వేడుకుంది. కైరా ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసింది.
“హాయ్ రబ్బా! అప్పుడే సాస్–బహూ బంధం ఇంత బలపడిపోయిందా!” మను స్వరం ఒక్కసారిగా మెత్తబడింది. “నా పెళ్లి జరుగుతోందని నాకు చాలా సంతోషంగా ఉంది, కైరా. కానీ... దేవకి పెళ్లి జరుగుతోందనే విషయం నాకు ఇంకా ఎక్కువ సంతోషం కలిగిస్తోంది.”
కైరా ఆప్యాయంగా మనును ముద్దుపెట్టుకుంది. ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేసింది తక్కువ.
మాటలనే ఎక్కువగా తిన్నారు. భోజనం తర్వాత కైరా అడిగింది—
“అయితే మీ ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతాయా?”
“లేదు. ముందు దేవకి పెళ్లి. ఈ నెలలోనే.” “మరి నీది?”
“నా అత్తగారు, మా అమ్మానాన్నలు నిర్ణయిస్తారు. బహుశా వచ్చే నెలలో.”
“అంత త్వరగానా! వావ్... ఎంత బాగుంది!”
“నిజం చెప్పాలంటే, నా పెళ్లి గురించి నాకంటే దేవకికే ఎక్కువ ఉత్సాహంగా ఉంది.”
కైరా కాసేపు ఆలోచించి అంది— “మను, ఒక విషయం గమనించావా? సిసోడియాలు రాజపుత్ర వంశానికి చెందినవారు. సూర్యవంశీయులు. రాజస్థాన్‌లోని మేవార్‌ను పాలించిన రాజవంశం అదే.”
కైరా నవ్వింది. “అన్నీ నీ కోసమే అమర్చినట్టున్నాయి. దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాడు.”
మను నవ్వింది. “అవును. మయాంక్, మయూర్‌లా కనిపిస్తున్నాడని అప్పట్లో మనమందరం ఎంత భయపడ్డామో! జై సంతోషీమాతా! ఇప్పుడు నిజం బయటపడింది. డాక్టర్ మయాంక్ ఎవరో మనకు తెలిసిపోయింది.”
“నీ మయాంక్‌ను నాకు చూపించవా?” అడిగింది కైరా.
“మయాంక్ మాత్రమేనా? దేవకి, కన్నయ్య, మేఘన, మాపుయీ... అందరినీ చూడాలి నాకు!” అంది.
“రేపు మనం సిసోడియాల ఇంటికి వెళ్తున్నాం. నువ్వూ రా. దేవకికి కాబోయే భర్తను కూడా చూడొచ్చు.”
“అది మంచి ఐడియా! తర్వాత నేను కూడా నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను.”
“అదంతా సరే... ఈ రాత్రి నాకు నిద్ర ఎలా పడుతుంది?” అంది మను.
కైరా నవ్వుతూ నిద్రకు ఉపయోగించే మందు తీసుకొచ్చి మనుకూ ఇచ్చింది.
కొద్దిసేపటికే ఇద్దరూ గాఢనిద్రలోకి జారిపోయారు.
మరుసటి రాత్రి — అరుణతార నివాసం
రాత్రి ఎనిమిది గంటలు.
అరుణతార విశాలమైన హాలులో అతిథులతో కూర్చుని ఉంది.
ఆకాశ్ టెలివిజన్ గ్రూప్ చైర్మన్ ఆకాశ్ అగర్వాల్ భార్య ఇషా అగర్వాల్, ఇంటర్‌వరల్డ్ ఏవియేషన్ చైర్మన్ అభయ్ దూబే భార్య ఖుషీ దూబే, జిందాల్, బజాజ్, భాటియా, మిట్టల్ వంటి ప్రముఖ పారిశ్రామిక కుటుంబాలకు చెందిన మహిళలు అక్కడ సమావేశమయ్యారు.
కొద్ది రోజుల క్రితమే ఇషా అగర్వాల్ ఒక ఘనమైన మెహందీ వేడుకను నిర్వహించింది. నిశ్చితార్థానికి ముందస్తు సంబరంలా జరిగిన ఆ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు, పారిశ్రామికవేత్తలు, సంగీతకారులు, క్రికెటర్లు హాజరయ్యారు. ఇప్పుడు ఖుషీ దూబే మరో ఆలోచనతో వచ్చింది.
‘రిచ్ వైవ్స్ క్లబ్’ ప్రారంభించబోతోంది. ఇషా నిర్వహించిన కార్యక్రమాన్ని మించేలా తన ప్రారంభోత్సవం ఉండాలని ఆమె కోరిక. “మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అంజలి కూడా వస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి!” అంటూ అరుణతారను పదేపదే కోరుతోంది.
అంతలో లకుమ హడావుడిగా హాల్లోకి దూసుకొచ్చింది.
“అమ్మా! ఆ ఎన్వలప్ ఎక్కడుంది? ఎంత వెతికినా కనిపించడం లేదు!”
అరుణతార కొంచెం విసుగ్గా చూసింది.
“వెళ్లి నువ్వే వెతుక్కో. ఇప్పుడు నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లివి. ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తించకు.”
లకుమ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. కూతురి ముఖం చూసిన అరుణతారకు జాలి వేసింది. వెంటనే కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లి బుజ్జగించింది. “సరే... వివేక్ ఎక్కడ పెట్టాడో చూడు.” లకుమ వెళ్లిపోయింది. మిసెస్ జిందాల్ నవ్వుతూ— “ఇంత ప్రేమగా చూసుకునే, గారాబం చేసే అమ్మ ఉంటే ఏ కూతురైనా జీవితాంతం చిన్నపిల్లగానే ఉంటుంది!” అంది.
మిసెస్ మిట్టల్ కూడా పొగడ్త జోడించింది.
“అయినా లకుమ సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటుంది. బాధ్యత తెలిసిన అమ్మాయి.”
మిసెస్ భాటియా అంది— “ఆమె భర్త కూడా అసాధారణమైన మేధావి. నేర పరిశోధనలో ఆయన ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.”
అరుణతార గర్వంగా నవ్వింది. “మంచి భర్త దొరకడం మా అదృష్టం. పైగా మా అమ్మాయి ఆడించినట్టల్లా ఆడతాడు!” హాల్లో నవ్వులు విరిశాయి.
“అలాంటి భర్తే ప్రతి భార్యకూ కావాలి!” అంటూ అందరూ నవ్వేశారు.
కొద్దిసేపటికే లకుమ మళ్లీ వచ్చింది. “మా... నాకు ఆ ఎన్వలప్ కావాలి!” అరుణతార ఇబ్బందిగా నవ్వింది. వివేక్ వచ్చాక అతన్నే అడుగు. లేకపోతే మీ నాన్నను అడుగు. ఈ ఇంట్లో కథలు చదివేది ఆయనే కదా!” అదృష్టవశాత్తూ అదే సమయంలో పుస్తకాల అలమర దగ్గర తండ్రి కనిపించాడు.
లకుమ అతని దగ్గరకు వెళ్లింది. అప్పుడే ఆయన ఒక ఎన్వలప్‌ను బుక్‌క్యాబినెట్ పైభాగంలో పెడుతున్నాడు. లకుమ కళ్లలో కోపం మెరిసింది.
“నా ఎన్వలప్స్ ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను! నా పేపర్లు ఎందుకు చదువుతారు?”
తండ్రి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే వివేక్ లోపలికి వచ్చాడు.
“అవి ఉత్తరాలా? అవి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు! దేవుడి దయవల్ల వాటిని ప్రేమలేఖలు అనలేదు. నువ్వూ, మీ నాన్నా సినిమా నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ప్రతిదాంట్లోనూ సినిమా వాసనే వెతుకుతారు!” లకుమ నవ్వింది.
“మా నాన్నకు ఇప్పటికీ సినిమాలు తీయాలనే భ్రమ పోలేదు. నీ కేసులన్నీ చదివి, వాటిని సినిమాలుగా తీస్తున్నట్టు ఊహించుకుంటుంటారు. ఆయనకు సినిమా పిచ్చి!”
వివేక్ కొంటెగా ఆమెను చూశాడు. “మరి నువ్వు ఊహల్లో తేలడం లేదా, హనీ?”
ఆ మాటలోని అర్థం లకుమకు తెలుసు. వివేక్‌కూ ఆమె అలవాటు తెలుసు.
తన భర్త పరిష్కరించిన క్లిష్టమైన కేసులు, అతని సాహసాలు, అతని మేధస్సు గురించి చదవడం లకుమకు ఒక విచిత్రమైన ఉత్సాహాన్ని కలిగించేది. ఇతరులకు అది కేవలం దర్యాప్తు నివేదిక కావచ్చు; లకుమకు మాత్రం తన భర్త వ్యక్తిత్వంలోని మరో ఆకర్షణీయమైన కోణం.
“నేను ఊహల్లో బతకను. చాలా ప్రాక్టికల్!” అంది లకుమ. వివేక్ కొంటెగా నవ్వాడు.
స్నానానికి వెళ్లేందుకు దుస్తులు మార్చుకుంటున్న భర్తవైపు లకుమ చిలిపిగా చూసింది.
వివేక్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. లకుమ మంచం మీద కూర్చుని చక్కగా టైప్ చేసిన రిపోర్టును తెరిచింది. పైన పెద్ద అక్షరాల్లో—
SINGAPORE AIRLINES CRASH
INVESTIGATION REPORT
అని ఉంది.
మొదటి పేజీలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన త్రీ-డైమెన్షనల్ డయాగ్రామ్ ఉంది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 006 ప్రయాణించిన టాక్సీ మార్గం అందులో స్పష్టంగా గుర్తించారు.
ఆకుపచ్చ చుక్కల గీత — రన్‌వే 05Lకు వెళ్లవలసిన సరైన మార్గం.
పసుపు బాణం — 05R వైపు మళ్లిన మార్గం.
ఎర్రని గీత — విమానాన్ని మృత్యువువైపు తీసుకెళ్లిన టేకాఫ్ మార్గం.
లకుమ చదవడం ప్రారంభించింది.
రాత్రి 23:00 గంటలకు, టైఫూన్ కారణంగా కుండపోత వర్షం కురుస్తుండగా, 9V-SPK బే B5 నుంచి బయలుదేరింది.
23:05:57 గంటలకు గ్రౌండ్ కంట్రోల్ విమానాన్ని టాక్సీవే ద్వారా రన్‌వే 05L వైపు వెళ్లడానికి అనుమతించింది.
23:15:22 గంటలకు 05L నుంచి టేకాఫ్‌కు క్లియరెన్స్ లభించింది.
కానీ...
ఆరు సెకన్ల నిరీక్షణ అనంతరం 23:16:36కు విమాన సిబ్బంది పొరపాటున 05R నుంచి టేకాఫ్‌కు ప్రయత్నించారు.
ఆ రన్‌వే మరమ్మతుల కారణంగా మూసివేయబడి ఉంది.
కెప్టెన్‌కు తాను 05L నుంచే టేకాఫ్ చేయాలని స్పష్టంగా తెలుసు. అయినా అతను దాదాపు 215 మీటర్లు ముందుగానే మలుపు తిరిగి 05R మీదకు వచ్చేశాడు.
భారీ వర్షం.
అతి తక్కువ దృశ్యమానత.
పైగా విమానాశ్రయంలో నేలమీద విమానాల కదలికలను పర్యవేక్షించగల ASDE గ్రౌండ్ రాడార్ లేదు.
05R మీద నిర్మాణ పనులకు ఉపయోగించిన యంత్రాలు అలాగే ఉన్నాయి.
రెండు ఎక్స్‌కవేటర్లు.
రెండు వైబ్రేటింగ్ రోలర్లు.
ఒక చిన్న బుల్డోజర్.
ఒక ఎయిర్ కంప్రెసర్.
మరిన్ని నిర్మాణ యంత్రాలు.
చీకటి, వర్షం కారణంగా పైలట్లకు అవి కనిపించలేదు.
దాదాపు నలభై ఒక్క సెకన్ల తర్వాత—
విమానం ఆ యంత్రాలను ఢీకొట్టింది.
ఒక్కసారిగా భయంకర విధ్వంసం.
విమానం మూడు ప్రధాన భాగాలుగా విరిగిపోయింది. ఫ్యూజలాజ్ రెండుగా చీలింది. ఇంజిన్లు, ల్యాండింగ్ గేర్ విడిపోయాయి.
ఒక క్రేన్ ఎడమ రెక్కను చీల్చివేసింది.
విమానం ముందుభాగం ఒక స్కూప్ లోడర్‌ను బలంగా ఢీకొట్టింది.
వెంటనే మంటలు చెలరేగాయి.
ఫ్యూజలాజ్ ముందుభాగం, రెక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.
159 మంది ప్రయాణికుల్లో 79 మంది, 20 మంది సిబ్బందిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో చాలామంది విమానం మధ్యభాగంలో కూర్చున్నవారే.
రెక్కల్లో ఉన్న ఇంధనం మంటలకు చిక్కడంతో ఆ ప్రాంతం అత్యంత తీవ్రంగా దెబ్బతింది.
23:17:36కు ఎమర్జెన్సీ బెల్ మోగింది.
41 అగ్నిమాపక వాహనాలు, 58 అంబులెన్సులు, తొమ్మిది లైటింగ్ యూనిట్లు, మొత్తం 436 మంది సిబ్బంది సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.
లకుమ తర్వాతి పేజీ తిప్పింది.
అక్కడ కొన్ని వాక్యాలు మాత్రమే ఉన్నాయి.
క్లూ: స్కూప్ లోడర్.
అనుమానం కలిగించిన అంశం: పని ముగిసిన తర్వాత కూడా దాని ఆర్మ్ పైకెత్తిన స్థితిలోనే ఉండటం అసాధారణం.
నేర స్వభావం: హత్యాయత్నం / రాజకీయ హత్య కుట్ర.
లక్ష్యం: పాలకపక్ష నాయకుడు టాన్ సీ హెంగ్.
ఉద్దేశం: పాలకపక్షాన్ని అస్థిరపరచడం.
ఫలితం: దర్యాప్తు విజయవంతం.
దర్యాప్తుకు పట్టిన సమయం: ఇరవై నాలుగు గంటలు.
లకుమ రిపోర్టును మూసింది.
వివేక్ బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చి బెడ్‌రూమ్‌లో అడుగుపెట్టేసరికి, లకుమ గులాబీ రంగు నైట్‌వేర్‌లో మంచం మీద పడుకుని ఉంది. నీలిరంగు మసక వెలుతురులో ఆమె శరీరరేఖలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె శ్వాసలో ఒక విచిత్రమైన ఉద్వేగం ఉంది.
వివేక్ ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
తర్వాత గదిలోని దీపాన్ని ఆర్పేశాడు.
అసలు విషయం మరొకటి ఉంది.
ఆ రోజు మధ్యాహ్నం ఆఫీసు నుంచి భోజనానికి వచ్చినప్పుడు వివేక్ రెండు ఎన్వలప్స్ తీసుకొచ్చాడు.
అతను వాటిని అక్కడ పెట్టడం లకుమ చూడలేదు.
కానీ అరుణతార చూసింది.
ఆమె తనలో తానే నవ్వుకుంది.
లకుమ తండ్రి ఆ రెండు రిపోర్టులనూ చదవడానికి తీసుకెళ్లాడు.
కానీ తిరిగి అక్కడ పెట్టింది మాత్రం ఒక్కటే—
Singapore Airlines Crash.
మరి రెండో ఎన్వలప్?
అది ఇంకా అతని దగ్గరే ఉంది.
దాని మీద ఒకే ఒక్క పదం—
DOPPELGANGER
అది మయూర్‌కు సంబంధించిన దర్యాప్తు నివేదిక.
వివేక్ దర్యాప్తు వేగం మెరుపును మించిపోతుంది.
లకుమకు ఇంకా తెలియదు— తాను వెతుకుతున్న అసలు కథ ఆ రెండో ఎన్వలప్‌లోనే ఉందని.
Happy to see Kyra after a long time.
ReplyDeleteShe changed a lot. She is chanting mantras. The description of the Singapore air crash is superb. Waiting to see the mystery behind Mayur.