Tuesday, August 10, 2021

neues Lebens - 24

లావణ్య ఎన్‌క్లేవ్, నోయిడా

మాపూయి మంచం మీద కట్టెలా పడివుంది. రాత్రి నుంచి ఒక్కసారి కూడా ఒళ్ళు కదపలేదు. నిన్న రాత్రంతా తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడింది.

దేవకి దిగులుగా మంచం పక్కనే కూర్చుంది. అప్పుడప్పుడు ఐస్‌ప్యాక్ తీసి మాపూయి నుదుటి మీద పెడుతోంది. రాత్రి కన్నయ్య కూడా తల్లితోపాటే అక్కడే ఉన్నాడు. జ్వరం తగ్గడానికి మాపూయికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అర్ధరాత్రి వరకూ అక్కడే ఉండి, ఆ తర్వాత కిందికి వెళ్లి తన ఇంట్లో పడుకున్నాడు.

వెళ్లేముందు తల్లితో, “అమ్మా, నువ్వు కూడా కిందికి వచ్చి పడుకో,” అన్నాడు.

కానీ దేవకి వినలేదు. మంచం పక్కన మంచంకోడులా అలాగే కూర్చుండిపోయింది. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేదు.

ఉదయం తొమ్మిదైంది.

మాపూయి ఇంకా కళ్లు తెరవలేదు.

మేఘన కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఒకవైపు మాపూయి పరిస్థితి, మరోవైపు మేఘన జాడ లేకపోవడం—దేవకిని మరింత కలవరపెట్టాయి.

కన్నయ్య పైకి వచ్చాడు. మాపూయి చెవిలో ఇయర్ థర్మామీటర్ పెట్టి ఉష్ణోగ్రత చూశాడు.

“తొంభై తొమ్మిది డిగ్రీలే ఉంది అమ్మా. భయపడకు. తగ్గిపోయింది. కొంచెం నీరసంగా ఉంది అంతే. కాసేపట్లో లేస్తుంది,” అన్నాడు.

అక్కడే నిలబడి మాపూయిని చూస్తుండిపోయాడు.

కానీ అతని మనసు మాత్రం అక్కడ లేదు.

సిసోడియాల సంపన్న కుటుంబం నుంచి వచ్చిన పెళ్లి సంబంధం అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆనందం పొంగిపొర్లుతున్నా బయటకు కనిపించకుండా ఎంతో కష్టపడి అదుపు చేసుకుంటున్నాడు.

‘ఇంత ధనవంతుడైన, సంస్కారవంతుడైన మనిషి అమ్మను ఇంతగా అభిమానిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆమె చేయి అందుకోవడానికి అతడు ఎదురుచూస్తున్నాడు. అతని కుటుంబం కూడా నా సమ్మతి కోసం చూస్తోంది. ఇప్పుడు నేను వెళ్లి ఈ పట్టణంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త విష్ణు సిసోడియాను కలవాలి.’

కన్నయ్య మనసులో ఆలోచనలు పరుగులు తీశాయి.

‘అమ్మ నమ్మిన శ్రీకృష్ణుడు నిజంగానే దయామయుడు. అంతేకాదు, తాను చిలిపి కృష్ణుడినని కూడా నిరూపించుకున్నాడు. అమ్మ తన కొడుక్కి ఉద్యోగం రావాలని ప్రార్థించింది. కానీ ఆ కొంటె కృష్ణుడు ఆమెకే ఒక జీవిత భాగస్వామిని, దానితోపాటు అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాడు!’

అతని పెదవుల మీదకు చిరునవ్వు రాబోయి ఆగిపోయింది.

‘ఓ కన్నయ్యా! నీ లీలలు ఎంత విచిత్రమైనవి! అమ్మా... నువ్వు అందమైన రూపంలో దాగిన మానవత్వపు మూర్తివి. ఓ ముకుందా! ఈ ఆనందాన్ని నేను బయటకు చూపించకూడదు. నా సంతోషం కనిపిస్తే అమ్మ దృష్టి తగులుతుందని భయపడుతుంది!’

అలా ఆలోచనల్లో మునిగిపోయిన కొడుకును దేవకి చూసింది.

“ఖడే ఖడే క్యా కర్ రహే హో! అక్కడ అలా నిలబడి ఏం చేస్తున్నావురా? నువ్వు డాక్టర్‌వై ఉండి ఒక జ్వరాన్ని కూడా తగ్గించలేకపోతే నీ డాక్టరు చదువు ఎందుకు?” అంటూ ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడింది.

“అమ్మా! మాపూయికి ఇప్పుడు జ్వరం లేదు. చాలా నీరసంగా ఉంది అంతే. కాసేపట్లో కళ్లు తెరుస్తుంది. నువ్వు కంగారు పడకు,” అంటూ ఏడుస్తున్న తల్లిని కన్నయ్య ఓదార్చాడు.

అప్పుడే బెడ్‌రూమ్ తలుపు దగ్గర ఒక యువకుడు కనిపించాడు.

పొడవుగా, తెల్లగా ఉన్నాడు. చేతిలో పండ్లతో నిండిన పాలిథిన్ సంచి ఉంది. అతని వెనుక మరో డాక్టర్ మెడికల్ కిట్ పట్టుకుని లోపలికి వచ్చాడు.

ఆ యువకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“నేను మంజీత్.”

అదే సమయంలో మాపూయి మెల్లగా కళ్లు తెరిచింది.

మంజీత్ వెంటనే మంచం దగ్గరకు వెళ్లాడు.

అతని వెనకే కన్నయ్య నిలబడి ఉన్నాడు.

“మప్పూ...!”

మంజీత్ గొంతులో ఆందోళన, ఆప్యాయత కలగలిసిపోయాయి.

అతడు మంచం మీద ఆమె పక్కనే కూర్చుని కొద్దిసేపు మాటలేకుండా ఆమెనే చూస్తుండిపోయాడు.

దేవకి ఆ దృశ్యాన్ని మౌనంగా గమనిస్తోంది.

ఆ గదిలో ఒక్కసారిగా ఒక తెలియని ఆత్మీయత వ్యాపించింది. మంజీత్, మాపూయి మధ్య ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ల చూపులే చెబుతున్నాయి.

“సారీ జిత్తూ... నాకు జ్వరం వచ్చిందని నీకు చెప్పలేకపోయాను. నాకు లీవ్ ఇవ్వు. కానీ... నేను జ్వరంతో ఉన్నానని నీకు ఎలా తెలిసింది?”

మాపూయి గొంతు చాలా బలహీనంగా ఉంది.

సన్నగా, తెల్లగా ఉండే ఆమె ఇప్పుడు వాడిపోయిన తమలపాకులా కనిపిస్తోంది.

“చాలు మప్పూ... ఇక మాట్లాడకు. విశ్రాంతి తీసుకో. ప్రశ్నలు వద్దు. నీకు లీవ్ ఇచ్చేశాను,” అన్నాడు మంజీత్.

మాపూయి పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది.

అప్పటివరకు మంజీత్ వెనక నిలబడిన కన్నయ్య ఆమెకు కనిపించలేదు. మంజీత్ పండ్ల సంచిలోంచి ఒక ఆపిల్ తీసి ఆమెకు ఇవ్వడానికి కొంచెం పక్కకు వంగాడు.

అంతే—

మాపూయి చూపు అతని వెనుక నిలబడి ఉన్న కన్నయ్య మీద పడింది.

ఆమె కళ్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి.

ముఖంలో భయం, ఆశ్చర్యం కలగలిశాయి.

“మయూర్...!”

ఆమె గొంతు వణికింది.

“మయూర్... మయూర్!”

కన్నయ్య ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది.

“నేను మయూర్‌ని కాదు,” అన్నాడు కాస్త కఠినంగా. “ఆ రోజు నువ్వు నాకు కారులో లిఫ్ట్ ఇచ్చినప్పటి నుంచీ నన్ను మయూర్ అనే పిలుస్తున్నావు. అప్పుడే చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను—నేను మయాంక్.”

దేవకి వెంటనే ముందుకు వచ్చింది.

మాపూయి వైపు చూసి గర్వంగా అంది—

“అవును మాపూయి. ఇతనే డాక్టర్ మయాంక్... నా కన్నయ్య.

మాపూయి ముఖం పాలిపోయింది.

ఆమె కన్నయ్యను రెప్పవేయకుండా చూసింది.

“మ... మయాంక్...?”

మరుక్షణమే ఆమె కళ్లు మూతపడ్డాయి.

తల దిండుమీదకు వాలిపోయింది.

“మప్పూ...!”

మంజీత్ ఉలిక్కిపడ్డాడు.

“మప్పూ! మప్పూ!”

అతడు ఆమెను పిలుస్తూనే ఉన్నాడు.

కానీ మాపూయి నుంచి సమాధానం లేదు.

గదిలో అంతవరకూ ఉన్న ఆప్యాయత ఒక్క క్షణంలోనే ఆందోళనగా మారిపోయింది.

కన్నయ్య మాత్రం మాపూయి ముఖాన్ని నిశితంగా చూస్తూ నిలబడిపోయాడు.

తనను చూసిన ప్రతిసారీ ఆమె ‘మయూర్’ అని ఎందుకు పిలుస్తోంది?

ఆ ప్రశ్న ఇప్పుడు అతని మనసులోనూ మొదటిసారి బలంగా మెదిలింది

                                                            *** 

కృష్ణవిహార్ – కృష్ణమీనన్ మార్గ్ 3A

ఉదయం.

కృష్ణవిహార్‌లోని విశాలమైన హాల్లో బంగారు వర్ణపు ఉయ్యాల కుర్చీలో కూర్చుని లకుమ టీవీలో వార్తలు చూస్తోంది. ఆ ఇంటి అంతరాలంకరణలో భారతీయ సంస్కృతితోపాటు లకుమ అభిరుచి కూడా అడుగడుగునా కనిపిస్తోంది. నేలమీద పరచిన తివాచీలు చిక్కని రంగులతో కళకళలాడుతున్నాయి. మధ్యలో పెద్ద పెద్ద పూల ఆకృతులు, చుట్టూ వెడల్పాటి నీలిరంగు అంచులు—ఆమె సౌందర్యాభిరుచికి అద్దం పడుతున్నాయి.

అప్పుడే సింగపూర్ నుంచి తిరిగివచ్చిన ఆమె భర్త వివేక్ పండిట్ గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు.

అతన్ని చూడగానే లకుమ లేడి కళ్లలో మెరుపు మెరిసింది. ఒక్క ఉదుటున ఉయ్యాల కుర్చీలోంచి లేచి అతని దగ్గరకు పరుగెత్తి గట్టిగా కౌగిలించుకుంది.

“మన పెళ్లై రెండేళ్లయింది. అది మర్చిపోయావా?” అన్నాడు వివేక్ నవ్వుతూ.

లకుమ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది.

“మన పెళ్లి 2020లో అయిందన్న సంగతి నువ్వు మర్చిపోయావా?”

“అబ్బా! ముందు నన్ను వదులు. మీ అమ్మ ఇక్కడే ఉంది.”

అంటూ వివేక్ ఆమెను మెల్లగా వెనక్కి జరిపాడు.

“అమ్మ మేడమీద ఉంది. భయపడకు. నాకు ఇప్పుడు నీతో కొంచెం ఏకాంతం కావాలి,” అంది లకుమ గారంగా. “ఆవిడ కిందికి రావచ్చు,” అతను గొంతు తగ్గించి అన్నాడు.

“వస్తే రానివ్వు. నాకేం భయం లేదు.” అంటూ మళ్లీ అతని మీద వాలిపోయింది.

ఆమె స్పర్శతో వివేక్‌లోనూ అప్పటివరకు దాచుకున్న ఆరాటం మేల్కొంది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తనవైపు లాక్కున్నాడు. లకుమ అతని పెదవులను ముద్దాడింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరైంది.

ఆ క్షణంలో వాళ్లిద్దరికీ బయటి ప్రపంచమే గుర్తులేదు.

విశాలమైన హాల్లో ఒక మూలన ఉన్న మెత్తని సోఫా వైపు ఇద్దరూ చేరుకున్నారు. క్షణాల్లో వారి కలయిక తీవ్రమైన ఉద్వేగంగా మారింది.

“మెల్లగా... మెల్లగా...” లకుమ పెదవులు గొణిగాయి.

కొద్దిసేపటికి ఆ ఉద్వేగం చల్లారింది.

ఆ హడావుడిలో సోఫా మీద పడివున్న టీవీ రిమోట్ లకుమ చేతికి తగిలింది. టీవీ ఒక్కసారిగా వెలిగింది.

వివేక్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. లకుమ కూడా అతని వెనకే వెళ్లబోయింది.

కానీ టీవీలో వినిపించిన మాటలు ఆమె అడుగులను అక్కడికక్కడే ఆపేశాయి.

తెరమీద కనిపిస్తున్నది— కృష్ణవిహార్! తన సొంత బంగళానే! లకుమ కదలకుండా నిలబడిపోయింది. “గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అరుణతార నివాసమైన కృష్ణవిహార్‌లోకి ప్రవేశించడానికి మూడుసార్లు ప్రయత్నించింది. భద్రతా బారికేడ్లను దాటుకొని హై సెక్యూరిటీ ప్రాంతంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.”

లకుమ కళ్లు టీవీ తెరకు అతుక్కుపోయాయి. తెరమీద భద్రతాధికారి కనిపించాడు.

“ఆమె లకుమాజీని కలవాలని చెబుతోంది. కానీ సరైన అపాయింట్‌మెంట్ లేదు. మొదటిరోజు ఆమె ఒక మిజో యువతితో వచ్చింది. మేము అనుమతించలేదు. రెండో రోజు అదే అమ్మాయితో వచ్చి మంత్రిగారిని కలవాలని పట్టుబట్టింది. ఇక్కడికి ఎవరినైనా ఎప్పుడంటే అప్పుడు అనుమతించరు. మూడో రోజు ఒంటరిగా వచ్చి బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించింది. అందుకే అదుపులోకి తీసుకున్నాం.”

అతని వివరణ పూర్తికాగానే న్యూస్ యాంకర్ ప్రశ్నించింది.

“కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక మహిళను అరెస్టు చేయడంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అరెస్టు సమయంలో మహిళా పోలీసు అధికారి ఉండాలి. మీరు నిబంధనలు ఉల్లంఘించలేదా?”అంతలో ఒక మహిళా పోలీసు అధికారి కెమెరా ముందుకొచ్చింది.

 “ఆమెను అరెస్టు చేసింది నేనే. పురుష పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోలేదు. అసాధారణ పరిస్థితుల్లో చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.”

యాంకర్ వెంటనే అడ్డుకుంది. “పోలీసులు మహిళలను నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి, తర్వాత ఇలాంటి వివరణలు ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇటీవల బెంగళూరులో ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేసే క్యాషియర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి—”

“బెంగళూరు పోలీసులు ఏం చేశారో దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు,” అంటూ మహిళా అధికారి మధ్యలోనే అడ్డుకుంది. “ఈ యువతి గోడ దూకడానికి ప్రయత్నించింది. ఇది చిన్న విషయం కాదు.” ఆమె స్వరం పెరిగింది. యాంకర్ కూడా వెనక్కి తగ్గలేదు.

“మేడమ్! విష్ణు శిశోడియా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని మీకు తెలుసా? ఇప్పుడు ప్రజలు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోతున్నారు—”

అంతలో మరో ఉన్నతాధికారి కెమెరా ముందుకు దూసుకొచ్చాడు.

అతని ముఖం నిప్పుకణికలా మండుతోంది. మాటలు టపాసుల్లా పేలుతున్నాయి.

“గో టు హెల్! గో టు హెల్! మీకు నచ్చింది చేసుకోండి. చట్టాన్ని ఎవరూ ఆపలేరు. మా పని మాకు తెలుసు. కేసు ఎలా పెట్టాలో తెలుసు. ఏ సెక్షన్లు వర్తిస్తాయో తెలుసు. మీరు మాకు చట్టం నేర్పాల్సిన అవసరం లేదు!”

అతను జర్నలిస్టులను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. అదంతా లైవ్. కొద్ది క్షణాల్లోనే కృష్ణమీనన్ మార్గ్ నుంచి మీడియా ప్రతినిధులను పూర్తిగా తొలగించారు. టీవీ తెరమీద ఇప్పుడు విశాలమైన రహదారి నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

లకుమ మాత్రం అలాగే నిలబడిపోయింది.కొద్దిసేపటి క్రితం భర్త రాకతో ఆనందంతో మెరిసిన ఆమె కళ్లు ఇప్పుడు ఆందోళనతో పెద్దవయ్యాయి.

“నన్ను కలవడానికి... ఆ అమ్మాయి మూడుసార్లు ఎందుకు ప్రయత్నించింది?”

ఆ ప్రశ్న ఆమె మనసులో మెరుపులా మెరిసింది.

2 comments:

  1. Wow.3 scenes in the same episode.
    Devaki's caring for Mapui, the romance between Lakuma and Vivek, The live news on the TV. Well picturised every spectacle.

    ReplyDelete
  2. Thank you. There are many thrills. The ending will be unforgettable

    ReplyDelete

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...