Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, November 9, 2020

Bharatavarsha 66

జగమొండీ  వెట్లుంటివి ? నీ ప్రియుడు చంద్రుడని, చంద్రుడే నీ ప్రియుడని వ్రాసితివి. ఇంతకూ నీప్రియుడెవరో నాకు తదుపరి జాబులోనైనా ఖచ్చితముగా తెలియపరుచుము. అరుణమ్మగారు నీ గురించి  అడిగినారు.  

నా శిక్షణ తీరు తెలిపమని సందేశమును పంపినందుకు  సంతోషము. దూరవాణి సందేశములు పంపుటకు బదులు మామూలు టపా వ్రాయుట నాకిష్టము.  అమ్మ నుంచి రేడియో వినుట , ఉత్తరములు వ్రాయుట  అచ్చతెలుగు మాట్లాడుట అబ్బి అలవాట్లు అయినవి. నీవు కూడా కుదిరినచో మామూలు టపా వ్రాయవలెను. నాకింకనూ  3 గంటల రాత్రి శిక్షణ మిగిలి యున్నది. 100 నాటికల్ మైళ్ళకు పైగా క్రాస్ కంట్రీ ఫ్లైట్ మరియు కనీసం 10 టేకాఫ్లు మరియు ల్యాండింగ్లు  మిగిలి ఉన్నవి. సోలో క్రాస్ కంట్రీ, (వంటరి సుదూర వాయుయానము) ప్రారంభిం చుటకు  ముందు నైట్ క్రాస్ కంట్రీ శిక్షణ  మంచిది. ఇది  రేడియో నావిగేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకొనుటకు  అవకా శాన్ని చ్చును. అనూహ్య ముగా ఒకొక్కసారి  సోలో విమానంలో సూర్యకాంతి  పోయినచో  రాత్రి   వైమానిక అనుభవము లేనియెడల  బెంబేలెత్తిపోదురు.  

మొత్తం కనీసం పది రాత్రి టేకాఫ్లు మరియు ల్యాండింగ్ల  చేయడానికి  రాత్రి శిక్షణ  పొందుచున్నాను.  ఈ నైట్ క్రాస్ కంట్రీ ఫ్లైట్(అంధకార  వాయుయానము)లో  రేడియో నావిగేషన్ నైపుణ్యాలను నేర్చుకుంటారు.  కొత్త రాత్రి నైపుణ్యాలను మా శిక్షకుడు ఎల్లప్పుడూ “యు హేవ్ టు లెర్న్  లాట్ అఫ్ నైట్ స్కిల్స్” అని ఎప్పుడు నైట్ స్కిల్స్ గురించి చెపుతుంటాడు. రాత్రి ఎగురుటకు విమానాశ్రయము కాంతి , విమాన కాంతి ,  చీకట్లో త్రోవ యోచన,  ఇట్లు చాలా తతంగమున్నది అవి తదుపరి ఉత్తరమున వ్రాయగలను. నీవు వర్షునితో తామర చెరువు ఒడ్డున  రాత్రంతయూ పొందిన ప్రణయ తాపము  వివరముగా వ్రాసిననూ నాకు అర్థము కాలేదు. 

 నా మొదటి రాత్రి అనుభవము. సుందరి  రెండవ ఉత్తరము 

త. గిలె   యంత్రము పారెయా  నమురా   త్రినింగి   నతేలు   చూ    

    సెగలు   గక్కు చు  చీకటిం     టినసా    గుచున్న దితూర్పు  గా

    గన    సీమన    వాయువే  గముగా    భవంతు  లను గ్ర    ఛా

    గ ని  పించెను    బారు రె  క్కగలా     విమాన   ముసాగ   గా

యంత్రమును రగిలించి గనే రయ్యని  దూసుకుపోయి కొద్దీ క్షణములలో  విమానము  గాలిలో తేలాడసాగెను. వెలుతురంతయూ ఒక్కసారిగా మాయమయ్యెను. అంధకారమందు యానము రివ్వున తూర్పు దిశగా దూసుకుపోవుచున్నది. దిశమాత్రము తెలియును. కోణాలు కొలుచుకొనుటయే  తప్ప  కొండలు  కానరావు , క్రింద ఏమున్నదో కనిపించదు. ఇంతలో బారు రెక్కల క్రింద నుండు ఎర్రని దీపముల ఉగ్ర కాంతులందు  ఎత్తైన  భవనములు కానవచ్చి గుండె గతుక్కుమనెను.  రేడియో నావిగేషనంతయూ నా శిక్షకుడే చూచుకొనుటవల్ల , కేవలము విమాన నియంత్రణ ఒక్కటే నేను చూచుకొనుటవల్ల  ప్రాణము స్థిమిత పడెను. 

నైట్ స్కిల్స్ పెంచుకొనవలెననెడి అతడి మాటలు  అబద్ధము కాదు కానీ విమానమెగురుచుండగా అతడు నన్ను దొంగ చూపుల చూచుట మాత్రము నిజము. విమానమును బారామతి నుండి  150 నాటికల్  మైళ్ళు పోయిన తరువాత ధూలే విమానాశ్రయము లో నేనే  విజయవంతముగా  దింపి కేరింతలు కొట్టితిని.  కెప్టెన్ విజయన్   " మేడమ్ యు డవలప్డ్  ఆ లాట్ సిన్స్  యు జోయిన్డ్ " అని మెచ్చుకొనెను  ఇద్దరమూ కలిసి లిమనాడ్ తాగినాము.  అతడు యు లుక్  బ్యూటిఫుల్ అనుచూ వెడలెను. ఆందోళనతో పరీక్షలకు చదువుకొనుట శిక్షణకు పోవుట ఈ రెండే నాకు తెలియును. విమానమెక్కి విహరించునప్పుడు కలగని ఆనందమునేడు కలిగినది.  నేను అందముగా ఉంటానా ? యు డవలప్డ్  ఆ లాట్ అనుచుండగా అతడు నా పిరుదులను చూచుచూ ద్వందార్ధముతో  అన్న్నట్టు ఆలస్యముగా  గ్రహించితిని.  ఆ దొంగ చూపులు నన్నింక నూ తడుముచున్నవి.  జీవిత సమరంలో కన్నీళ్లు  కష్టములు  తప్ప శృంగారము భావములు ఇంతవరకూ నా చెంతకు  రాలేదు. మొదటి సారిగా నా ఆడతనం  అనుభవమునకు వచ్చెను.

*రెండు ఉత్తరములు ఒక్కసారిగా బట్వాడా చేయబడినవి

2 comments:

  1. చాలా చక్కని వ్యాఖ్యానం
    సుందరి విమానం రాత్రి నడిపిన వైనం చాలా ఉత్కంఠ గా ఉన్నది

    ReplyDelete
  2. రాత్రి వైమానిక శిక్షణ గురించి చాలా బాగా వివరించారు.ఈ సమాచారం వెనుక మీ కఠోర శ్రమ కనపడుతుంది.ఈ మెయిల్, వాట్సప్‌లకు అలవాటు పడి టపా రాయడం మర్చిపోయాము. రెండు లేఖలు మనస్సుకు హాయిని కలిగిస్తున్నాయి.

    ReplyDelete