Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, November 22, 2020

Bharatavarsha -76

అందరూ విడిది  బాట పట్టిరి. ముందుగా స్త్రీలు - అరుణతార, మాలిని, సుందరి, దామని, రంజిని, చంద్రమతి, మంజూష, పార్వతి నడుచుచుండిరి వారి వెనుక పురుషులు నడుచుచుండిరి. బసవడు అగస్త్య ప్రక్కప్రక్కనే నడుచుచుండగా వారి ముందు పార్వతి నడుచుచుండెను. బసవడు పార్వతివైపు కన్నార్పక చూచుచుండెను. "ఏమిరా బసవా పార్వతినట్లు గుడ్లప్పగించి చూచుచున్నావు నమిలి మింగి  వేసెదవా ? ఇచ్చటందరూ స్త్రీలందరూ ప్రౌఢలే , ఆవులించిన పేగులు లెక్కెట్టగలరు. మాలినిగారు పసిగట్టి నారనిపించుచున్నది చూచుకొనుమ"ని అగస్త్య  బసవనిహెచ్చరించెను “అయిననూ నష్టమేమి కలదు పార్వతికి కూడా నన్నట్లే చూచినద."ని బసవడనెను 

 ఆ ఎర్ర పరికిణీ లో  అందము నన్ను ఊపివేయుచున్నవి అని అగస్త్యను ఊపివేయుచుండగా " ఒరేయ్ బసవా నీవు "నన్ను" ఊపివేయుచున్నావురా" అనగా సిగ్గుపడి బసవడు అగస్త్యను వదిలివేసెను. " సార్ధక నామ ధేయుడివిరా!  ఎరుపుచూచిన బసవడు రేగును కదా !" అనిబసవని దిట్టెను.  పార్వతి కివినిపించి వెనుకకు తిరిగి ఒక లిప్త కాలము చూసి ముందుకు  సాగుచుండెను. బసవడు ఎగిరి గంతేసేను  అప్పుడు అగస్త్యుడు మనసులో "వీడి పిచ్చి తట్టుకొనుట నాకు కష్టము. అసలే ఒక పిచ్చిదానితో వేగుచున్నాన"ని పరుగు పరుగున ముందుకు పోయెను. బసవడు ఆనందాతి శయమున అగస్త్యుడనుకొని హృదయాలజిస్ట్ చెంక నెక్కగా, " ఏయ్ అబ్బాయ్ ఏమీ పైత్యము! మనుషుల పైకి గెంతుట మిక్కిలి వెగటుగానున్నది. మంజూష “పైత్యము న నిన్ను మించువాడెవ్వడు!" అనెను. పురుషులందరూ పకపక నవ్వుకొనిరి అట్లు వారందరూ ఇంటికి చేరిరి.  

పార్వతి పెద్దమ్మ చంద్రమతి అరుణను ఇంటికి రావలసిందిగా పిలిచెను.   పార్వతి  కేశవుడు కూడా "అమ్మా , పెద్దమ్మ పిలుచుచున్నది   రా అమ్మా అని పిలుచుచుండిరి."  మాలిని చొరుకుని " మీకు ఆమె పెద్దమ్మ ఈమె అమ్మ , ఇద్దర మ్మల ముద్దు బిడ్డలు వలే నున్నారు, మీ పెద్దమ్మని కూడా ఇచ్చట ఉండమనిన మంచిది, నేను అరుణను పంపను అని ఆమె చేయి పట్టి లాక్కుపోవుచుండగా పార్వతి కది చూడ వేడుకాయెను. చంద్రమతి కూడా వారితోనే ఆ రాత్రి ఉండుటకు ఒప్పుకొనెను. పురుషులు విడిది గృహములో స్నానమాడుటకు,  స్త్రీలందరు కోనేటిలో జలకాలా డుటకు నిశ్చయించుకొని బట్టలు తీసుకొని బయలుదేరిరి.  

తే.ఇంతు లందరు కూడుచు ఈడు మరచి 

   ఈదు లాడిరి కొనేట ఈప్సి తముగ 

   జలక మాడుచు వేడుక-జగడ మాడి

   మురిసి కులికిరి జట్టుగ ముచ్చ టాడి

 

ఆ. మాలి నియతార ముచ్చట  మాట లాడి

   పావ డాలు కట్టి పడుచు లల్లె  

   కోనే  టినదిగి   బంతాడి  కూడి యాడి    

    జలక మాడ వారి జడలు తడిసె 


  ఆ. తడిసి  పావడా   లందున తపత పమని 

      కాళ్ళు గొట్టి ఘనఝ గనము లదర     

       మధ్య పార్వతి మంజూష  మరచి  దూరి 

      చేప పిల్ల లోలె చెలఁగి నారు.


ఆ. సుంద  రందము  సొంపును   శోభ నుకని 

    ఆట  లాపి అరుణ  అతివ   లాల కించ

    ఆకు   రంగిని కేశవు   డందు   కొనును

    అనుచు చెప్ప   మురిసి  రతివ లంత  


ఆ. మదన గోపాల దయజూడ  వయ్య  వచ్చి      

   నాము  ఉత్స వముల నాడి పాడ  

   అనుచు నందరు స్వామికి మొక్కు కొనగ  

    కోవె లందు శుభ గంట మోగె.

అట్లు మత్తకాశిను లందరు స్నానాలు చేసి,   కొలను వద్ద చెట్ల చాటున,  ఒకొక్కరుగా పోయి బట్టలు మార్చుకొనుచున్నారు. చిట్టచివరగా పార్వతి పోయి పరికిణి వోణీ వేసుకొని రాగా అందరూ మదన గోపాలుని దర్శనమునకు పోయినారు.  ఆహా విడిది వద్దనే కొలను, కొలను వద్దనే దేవళము. పచ్చని  పసిడి పొలాలు, వెండి చేరుల  వంటి వీధులు ముత్యముల వంటి మేడలు. బల్లిపాడందము అద్భుతము అని రంజిని అనగా"నా పదవీకాలం ముగిసిన పిదప ఇచ్చటనే నా మనవలు తో ఆడు కొందును." అని అరుణతార అనెను. వారు కోవెలను సమీపించిరి. ఆకోవెల ప్రాంగణమందు ఒక మంటపమందు స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించిన బసవడు కూర్చొని యుండగా  పార్వతి  దొంగ చూపులు చూచుట గమనించి మాలిని గారు  అరుణతార బసవడిని  "ఎవరికొరకు వేచి యున్నావనగా  బసవడు తికమక పడెను పార్వతి జారుకొనెను. మాలిని తారలు    కిలకిలా నవ్వుతూ  వెడలినారు 

.పార్వ తందము బసవని పట్టి లాగ 

ఆమె కళ్ళ లోతు నాట లాడె  

నాల్గు  యనములు జతగూడ నెమ్మి కుదిరె

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ.కలువ  చూపుల వేడికి   కలిసి కరిగె        

వీడ లేని  పడుచు  వివశ  మందె    

మరియె  టులుచూపు  జంటకు మార్గ మింక 

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ. ఊరు  తెలియదు ఎటులింక ఊసు లాడు 

     పెద్ద  లంత కలసి పోవు చుండ 

       పడుచు పిల్లెట్లు వంటిగ మాట లాడు      

       మదన గోప బాలు మహిమ చూడు.


ఆ.కనులార  చూడగ  మనసంత కరిగె  పోయె  

మొదటి చూపు  లోని  మోహ  మాయె 

జంటక  లపెపుడు  మూర్తము జూచి నాడొ   

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ. నాకు   చూపించె  నళినాక్షి నిచట  దొర్లె         

    ముత్తె   మువెదక  కదొరికె    ముద్దు   గుమ్మ  

     ముచ్చ   టగొలుపు  ముత్యపు ముగ్గు పెట్టె  

      మదన గోప బాలు మహిమ చూడు.   

 అతివలందరూ వెనుకకు వచ్చుచుండగా  పార్వతి వారిని కూడి వెనుకకు పోవుచుండెను. బసవడితో నేత్రావధానమందుమునిగి ఉండగా మాలిని గారు  "పార్వతికి దైవ దర్శనముతో పని లేదు " అనిరి అది అర్థము కాని  రంజిని  "సొంతవూరు వారికి మనవలె అభిలాష ఏల కలుగును."  అనెను.  అరుణతార "ఆమెకిచటనే దర్శనము లభించెను." అనెను. అట్లు అందరూ   ఛలోక్తులు విసురుచూ పార్వతిని ఆట పట్టించుచూ విడిదికిపోయిరి. అరుణతార ఒక రహస్య పథకమును స్త్రీల చెవులలో చెప్పెను. ఆరాత్రికి వారు ఆ మంత్రమును అమలుజరుపుటకు నిశ్చయించుకొనిరి 
  
రాత్రి గుడిలో రుక్మిణీ కళ్యాణము హరికథ కలదు. ఈ లోగా   అందరూ పలహారములు లేదా భోజనము తీసుకొన వలసిందిగా విడిది గృహమునందు ప్రకటించ బడెను. ఎక్కువమంది  పలహారమును చేసి సువిశాల చావిడి గదియందు కూర్చొనినారు.   పురుషులు స్త్రీలు పోటీపడి  అంత్యాక్షరి పాటలు పాడిరి. మొదట భక్తి రసముతో ప్రారంభమైన పాటలు శృంగార రసముతో నిండి అందరి చెవులనూ అలరించినవి. తరువాత కళాబృందము వారు నేపధ్యగానము చేసిరి. ఇదంతయూ జరుగు చుండగా బసవడు , పార్వతి సిగ్గిల్లి ఎచ్చటనో నక్కినారు. తరువాత రంజిని ని నాట్యము చేయవలెనని భానోజీ కోరగా మాలినిగారు అరుణతారను నర్తించమనిరి . ఆమె సందేహించుచుండగా భానోజీ  "ఇచ్చట అందరూ కవిపండిత కళాకారులే"   యని ప్రోత్సహించగా ఇరువురి భామల నాట్యము మొదలాయెను.  కేశవుడు మృదంగము వాయించగా అరుణతార నృత్యము చేసెను, ఆమె అంగసౌష్ఠవము , ఆంగికము నందు అందరూ మై మరచిరి.  పిదప అందరూ అతివల  అంచ నడకల పోటీ పెట్టగా ప్రౌఢలందరూ మాలిని చంద్రమతిలతో సహా నడుచుచుండగా ఇంద్రాగ్నిని చూచినట్లు ప్రేక్షకుల కళ్ళు చెదిరినివి. ప్రౌఢాల వంతు ముగిసిన పిదప పిల్లల అంచనడకల పోటీ మొదలయ్యెను. మాలినిగారు పోయి పార్వతిని లాగి తెచ్చిరి. 

అగస్త్య సుందరిని వంపు సొంపులను చూచి మైమరిచి లొట్టలు వేయసాగెను. కేశవుడు మాత్రము రంజిని గారి ప్రక్కన కూర్చొని పట్టించుకొనక ఆమెతో మాటలాడుచుండగా అరుణతార  " కేశవా ఈ అమ్మాయి పేరు సుందరి, తెలియును కదా వైమానికురాలు  ఆమె ను జాగ్రత్తగా గమనించుము " అని చెప్పగా కేశవుడట్లే అని ఆమెను నడకను చూచు చుండెను. సుందరి పార్వతి ఇద్దరూ ఇద్దరే ఎవరికెవరూ తీసిపోరు అందరూ అనగా “మరి మా ముంగీస సంగతేమందురు?” అని రాధాకృష్ణ అనగా. “నాబిడ్డ ఇంకనూ చిన్నది” అని దామిని దగ్గరకు తీసుకొనెను.  అరుణతార స్త్రీలందరినీ దగ్గరకు తీసి  “బసవ పార్వతుల  ప్రణయ నేత్రాభినయము చూచినారు కదా!” అని మొదలిడగా  అవునవుననుచూ స్త్రీలందరూ ఒక నిమిషము   చెవులు  కొరుక్కొని తరువాత అరుణతార తన కవితా గానము మొదలు పెట్టినారు , అతివలందరూ ఆమెతో స్రుతి కలిపినారు. పురుషులవద్ద  బసవడు  స్త్రీల వద్ద పార్వతి ఒక మూల వెనక వరుసలో కూర్చొనిరి , యువకులు  పెద్దలు అందరూ ఆశ్చర్యముగా చూచుచుండ  గానము మొదలయ్యెను. 
  
ముచ్చెపు ముఖమంత చూడ మచ్చెపు కనులున్న దాన     
మచ్చెపు  కనులందు  జూడ  నచ్చిన   సఖుడున్న దాన (పార్వతి  సిగ్గిల్లెను)
మెత్తగ    మనసంత   ఇచ్చి   మొత్తము కనులందు దాచి 
చెక్కిలి   ఎరుపైన    దాన    సిగ్గులు   చిలికేటి   దాన (బసవడికి విషయము భోదపడెను)
అక్కడ   వలపంత   చూపి  ఇక్కడ    సలుపంత   ఓపి 
మోహము తెలిపేటి   వేళ   ఇప్పుడు  మహమాట మేల (స్త్రీలందరూ పార్వతిని చూచుచూ)
దేహము నునుపార   కాంక్ష   వెచ్చగ   దహియించు చుండ 
చప్పుడు  ఇకనైన    జేయి  చిప్పము  సడలించి  చూపు (పురుషులకి విషయము తెలిసెను)
ద్వారము  తెరచింక  జింక    కన్నుల    వరవీణ    మీటు (పార్వతి లేచి  పారిపోయెను)
ఆశుక    వితలెన్నొ   నోట    బల్కెడి   మదరాసు  వాడు
పక్కగదిలోకి దాక్కున్న పార్వతిని తీసుకు రమ్మని కేశవుని మంజూషను పంపగా పార్వతి ఉఁహూహూ అనుచుండగా మగువలందరి నవ్వులతో మండువా నిండి పోయెను. పురుషుల లో కలకలము రేగెను. పార్వతి రాదాయెను. మంచితరుణము మించిన మరల  రాదని  బసవడు పరుగు పరుగున గదిలోకి పోయి పార్వతి చేతిని పట్టుకొని అరుణతారావద్దకు వచ్చి వంగి నమస్కరించెను . పార్వతి కూడా నమస్కరించగా చెవి పట్టుకొని గుంజి " ఎచ్చటికి పారిపోదువే , బసవడు వలదా? వలసినచో  నోరు తెరిచి చెప్పుము ' అనెను. పార్వతి మూగనోము పట్టగా బసవడు మాత్రము "వలయును, వలయును అని నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేయుచుండగా, ఏయ్ మిస్టర్ వాటార్యు డూయింగ్ అమాంగ్ లేడీస్? నీవచ్చట స్త్రీల సమూహమందు ఉండుట  మంచిపని కాదు , ఇటు రమ్ము అని వెనక్కి పురుషుల సమూహములోనికి లాగెను. బసవడు నిస్సహాయుడై చూచుచుండ పార్వతి మౌనముగా నిలిచెను. నీకు ఒక్క నిమిషము సమయము ఇచ్చుచున్నాను అని అరుణ హెచ్చరించెను , ఎట్టకేలకు పార్వతి తార చెవిలో " వలయును"  అని చెప్పగా నవ్వులు చెల రేగినవి.  బసవా పార్వతి పరీక్షనందు గెలుపొందినది, నీకునూ ఒక పరీక్ష కలదు అని చెప్పుచుండగా " పార్వతి కావలెను..  పార్వతి నాకు  కావలెను"  అని అరచుచుండెను. 
అప్పుడు అగస్త్య ఒరేయ్ సాంబారు నీకు వేరే పరీక్ష కలదు ఎందుకట్లు అరిచెదవు  ఆ పరీక్ష ఏమో తెలుసుకొనుము " అనెను. ఒక్క క్షణము నిశ్శబ్దం ఆవరించెను."
రణగొణ ధ్వనులు లేని ఆ పల్లెటూరినందు కీచురాళ్ళ శబ్దము స్పష్టముగా వినిపించుచుండెను.
అరుణతార నోరు తెరచి " బసవా నీవు ఆశు కవితయందు దిట్ట కదూ ! పార్వతి మీద ఒక ఆశు కవిత చెప్పి మమ్ములను మెప్పించవలెను. అని చెప్పగా  మంజూష ఆశుకవితాష్ ఖర్మము వృత్త పద్యములల్లు కవితా ఘనతా జనతా మానస విహారి అతడిని ఏదైననూ వృత్తపద్యము ఆశువుగా చెప్పమనిన బాగుండును అని ఆమెను ఎగదోసెను. కళాబృందంవారు "  లెస్సపలికితివి ,  ఆహా వృత్తపద్యమైన వీనులవిందుగా నుండును !" అని మరింత ఎగదోయగా బసవడు నేను చంపక మాల వరకూ ఎగబ్రాకగలను అనగా " కొత్త సుబ్బారావు " ఊహు శార్దూలమును , పిల్ల దక్కదురా , సాహసము సాయారా డింభకా ! " 

అనగా బసవడు తొలుత  పళ్ళు పటపట కొరికి  పిదప పళ్ళికిలించెను.  సుందరి , రంజని , కేశవుడు ముసిముసి నవ్వులు నవ్వుచుండ  బసవడు " అట్లయిన నాకు మూడు  నిమిషములు సమయము కావలెను అనెను . అందరూ సరే అనిరి  

బసవడు పక్కగదిలోకి పరిగెత్తి తలుపు మూసుకొనెను వీడు తలుపెందుకు మూసుకొనుచున్నాడు అని అగస్త్యడు అనగా అందరూ హాస్యానందమును గ్రోలిరి. 

బసవడు భారతవర్ష కి చరవాణి ని కలిపి విషయమును వివరించగా సంతోషించి పార్వతికి  తన ఆశీస్సులు అందించమని తెలిపి ఒక స్వర సందేశమును పంపెను, అది రెండు సార్లు విని బసవడు బయటకొచ్చి  

   శా. మందార  ద్రుతమే   స్వరమా    ధుర్యమే   పాదాల   తారాడు  నీ 
   కందార      కృతకే      శనిర్ఝ      రిమహా     కాళింది   ప్రవాహ   మే    
   చిందాడు    బృహవీ    ణియాల    యలుచూ  చాకేగ    దాక్షాయ ణీ 
   బంధాలే         బిగిసే      నుపెండ్లి     కొడుకే    ఫాలాక్షుఁ  డేచూడ గన్
 
పద్యము చదివ గానే అందరూ కరతాళ ధ్వనులతో హర్షము వ్యక్తము చేయుచుండగా అగస్త్యుడు " బసవా దీని అర్ధమేమి ? "వివరింపమని కోరగా బసవడు దాట  వేయ జూచెను  కానీ అందరూ పట్టు బట్టగా విఫల ప్రయత్నం చేసెను. కేశవుడు మౌనముగా నుండగా అగస్త్యుడు కేశవా నీకు తెలియును జెప్పుము అనెను.

మందార  ద్రుతమే   స్వరమాధుర్యమే  అనగా  పార్వతి స్వరము మధురము 
పాదాల   తారాడు  నీ కందార కృత  ( నల్లని మేఘములవంటి ) 
కేశనిర్ఝరి  (కురుల ప్రవాహము) 
మహా  కాళింది   ప్రవాహమే   ( యమునానది వలే నుండును) 
చిందాడు    బృహవీణియా   లయలు   ( వీణా వాదనా లయ విన్యాసము)  
చూచాకేగ ( చూచిన తర్వాతే )   దాక్షాయ ణీ  ( పార్వతీ)
బంధాలే    బిగిసేను  పెండ్లి  కొడుకే    ఫాలాక్షుఁడే ( శివుడు లేదా బసవడు)  చూడగన్

భానో: ఈ పద్యము ఎవరో గొప్ప పండితుడు వ్రాసినట్లున్నది.   
మాలిని: పార్వతి వీణ వాయించుట నీవెప్పుడూ చూడలేదే నీ కెట్లు తెలియును?
అగస్త్యుడు: ఇది ఖచ్చితముగావర్షవిరచితమే, నా సందేహము నిజమైన, వీడి చరవాణి నందొక స్వర సందేశముండును.  
పార్వతి : బిక్క మొఖం వేసి తమ్ముడు వైపు చూసెను.
కేశవుడు : ఏమో వ్రాసి ఉండవచ్చుకదా బసవడేమియూ  పాండిత్యమందు తక్కువకాదు.
మాలిని: కేశవా  అక్క కొరకు అట్లు చెప్పుచున్నావు నీవు తగ్గుము  అయ్యో పాపము దీని మొఖం చూడవలెను అని పార్వతి మొఖం చూపెను. పైగా ఈ పద్యము ప్రియుడు వ్రాసినట్లు కాక ఒక అన్న వ్రాసినట్లున్నది. 
 సోదరప్రేమ ద్యోక్త మగుచున్నది అని అందరూ అనిరి 
అరుణ: ఆరోజు సత్య భామ అందమును అంతగా వర్ణించిన బసవడు పార్వతి అందమును పక్కన పెట్టి వీణా వాదనము  స్వర, తాళ గతులను మెచ్చుకొనెను
బసవ: హతవిధీ ఒప్పుకొనుచున్నాను , నేను వ్రాసినది కాదు వర్షుడు ఢిల్లీ నుంచి పంపెను.
నక్క: అతడైననూ ఒక్క నిమిషములో నెట్లు చెప్పును ?
అగస్త్యుడు: అతడు శతావధాని అనగా ఇటువంటివి  వందపద్యములు  అవలీలగా చెప్పును
అరుణ : ఇప్పటినుంచే మోసమా . మాపిల్లనివ్వము పొమ్ము! 
పార్వతి : ఏడ్చుచూ గదిలోకి పోయెను 
ఒట్టు పెట్టి ఆమెను ఓదార్చి , ఆమె చేతిని బసవడి చేతిలో పెట్టి ఈ పిల్ల నీది  కానీ నీ  తల్లి తండ్రులు కూడా వొప్పవలెను  ఇద్దరి మొఖములో కళ కళ లాడినవి  పార్వతి కళ్యాణమట్లు కుదిరినది.  అటుపిమ్మట పార్వతికి కూడా ఒక పరీక్ష పెట్టిరి కానీ ఆమె ఎవరికీ సందేశములు పంపక వీణ తెచ్చి " మదన గోపాలా! యని దేవునికి కృతఙ్ఞతలు తెలుపుతూ గీతమునాల పించగా అందరూ అందరూ ఆ స్వర మాధుర్యమందు కరిగిరి.


1 comment:

  1. I read this type of conversation for the first time. It is very simple, decent and beautiful.

    ReplyDelete