Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, November 24, 2020

Bharatavarsha 77

"హరికథా భాగవతార్ కి దెబ్బలు తగిలెను అతడు వచ్చుటకు ఆలస్యమగును. ఈ లోగా ఏదైనా ఒక చిన్న కార్యక్రమం పెట్టించిన.... మీ వద్ద కళా కారుల బృందం ఉన్నది కదా" అని ఉత్సవ కమిటీ పెద్ద ఆంజనేయులు గారు అరుణ తారను అడిగిరి  ఆమె ప్రక్కనే ఉన్న భానోజీ గారి వైపు చూడగా భానోజీ గారు " ఆయన వచ్చుటకు ఎంతసేపు పట్టును అది తెలిసిన దానికి తగ్గట్టుగా ఒక సన్నివేసమును ప్రదర్శించెదము. " 

"సుమారు ఒక గంట అనుకోండి" "ఆ గౌడల పనేనమ్మా మీరెరుగుదురు కదా మీరు పాతికేళ్ల వయసులో ఈ వూరు వచ్చినప్పుడు మీరు చూసిన రౌడీలు కొల్లాయి గౌడ, కట్ట గౌడ. ఇది వారి పనే నమ్మా, ఆ భాగవతార్ కి కొద్దిగా  స్థలమున్నది , అతడికి ఎవరితోనో స్థల వివాదమట ఆ శత్రువుతో చేతులు కలిపి భాగవతార్ ను  బెదిరించెను. భాగవతార్ విననందుకు అతడి పై  దౌర్జన్యం చేసినాడు. ఈ వూరిలో అందరికీ వాడి సంగతి తెలిసి ఎవరూ వాడితో గొడవ పడరు."

ఆ రౌడీ సోదరులింకనూ మారలేదా ?  నెత్తురు త్రాగు రాక్షసులుందురని విని యుంటిని కానీ చూచుట అదే మొదటిసారి.  కొల్లాయి గౌడ, కట్ట గౌడ,   రావణ, మారీచులు ఇద్దరూ కలిసి మాయోపాయంతో సీతను వేటాడినట్లు ఒక కాళ  రాత్రి తననెట్లు వేటాడినారో తారకు మరల  గుర్తుకు వచ్చెను.

ఈలోపు నక్క నాగేశ్వరరావు పిల్లి పాపాయమ్మ ద్రౌపదీ వస్త్రాపహరణం, దుర్యోధన ఏకపాత్రాభినయం వంటి పథకాలు తెలపగా ఆలయ చరిత్రను బుర్రకథ గానము చేసిన మంచిదని మంచి దని కేశవుడు రంజనిగారు  సూచించిరి. భానోజీరావుగారు సరే అనిరి అందరూ మంచిదనిరి. వారు కళా కారులు మాత్రమే కాదు ఎటువంటి అభ్యాసము అవసరంలేని ఆశువుగా కవితలల్లు  పండితులు.

పార్వతి తనయ గజానన.   పార్వతి తనయ గజానన ( బృందం) 

ఈశ్వర పుత్ర గజానన.  ఈశ్వర పుత్ర గజానన.   ( బృందం) 

నీ తల్లి పార్వా తి  గజానన.  నీ తల్లి పార్వా తి  గజానన ( బృందం)

మీ నాన్న శివుడు  గజానన. మీ నాన్న శివుడు గజానన.( బృందం)

శంభో ..................( గజ్జెలు ధ్వనితో  మారుమ్రోగుతూ ) 

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే|| 

"గురు బ్రహ్మ, గురుర్విష్ణు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

ఈ రోజు చాలా సుదినం రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు.  స్వామివారి ఉత్సవాన్ని తిలకించుటకు వచ్చిన భక్తులందరికీ శ్రీ భానోదయా కళాపరిషత్ తరుపున అభివాదాలు తెలియజేసుకుం టూ మదన గోపాల స్వామి మహిమ ఆలయ చరిత్ర ను తెలియజేయు బుర్రకథ ప్రారంభిస్తున్నాము. 

రంగస్థలం పైనున్న ముగ్గురు బుర్రకథ కళకారులు ప్రేక్షక భక్తులకు అభివాదం చేశారు.

హార్మోనియం , డప్పు,  కంజీర వాద్యకారులు మువ్వురు వేదికపై కూర్చొనిరి.  అగస్త్య కంజీర పట్టగా, ఏనుగు డప్పు, నక్క హార్మోనియం పట్టినవి.  పార్వతి తనయ అను వాద్య సంగీతమును కొద్దీ క్షణములు వినిపించుచుండడిగా పంచ గట్టిన కేశవుడు పక్కనే రంజిని పక్కనే బసవడు మైకుల ముందు నిలిచిరి. హార్మోనియం సంగీతం అంతరించుచుండగానే  

కేశవుడు “తతత్త  తగతగ తడిగిడి జంతరి థా …సకల దేవతలను సంభ్రముగా రజనతప్పక కొనియాడి భవ్యముగా మదనగోపాలుని ఆలయ చరిత చెప్పెదము. రంజని బసవలు"ఆహా !"

చర చర   చర చర చరిత్రలోకి కాలము ప్రాకెను - తందాన తానా  

పదిహేడు వందల డెబ్భై లోని కాలం నిలిచెను - తందాన తానా  

స్వామి చరితము విన్నవారికి పుణ్యము దక్కేను - తందాన తానా  

హై .. వేసవికాలం వచ్చేరా ఎండలు మెండుగా  కాసేరా (పాట వేగం పెరిగెను)

రాళ్లే బ్రద్దలు ఆయెరా, నోళ్లే ఎండీ పోయెరా 

చెరువులు గరువులు ఎండెరా నీటికి ఎద్దడి వచ్చేరా     -  తరికిట  జంతరి థా !    

రంజని: 1770 దశకంలో బల్లిపాడు దగ్గరున్నపెనుమదం గ్రామంలో నీటి ఎద్దడి వచ్చింది. ఆహా! (బృందం) అప్పుడు కూలినాలి చేసు కుంటూ బల్లిపాడు లో నివసించే జనం బల్లిపాడు  నుండి బయలుదేరి   పెనుమదం గ్రామంలో   చెరువులు త్రవ్వడానికి పోతున్నారు.

కేశవుడు : చెరువులు లేక పాట నీళ్లు ఉండవు, నీళ్లు లేక పొతే నోళ్లు ఎండిపోతాయి. 

నోళ్లే కాదు అన్నీఎండి పోతాయి. అని అగస్త్యుడు అనెను.

వేదికకింద ప్రేక్షకులలో: భానోజీగారు అతడివైపు తీక్షణముగా చూసి పక్కనున్నకొత్త సుబ్బారావుతో “కొద్దిపాటి విద్యతో వేదిక ఎక్కిన కళాకారులు ఇటువంటి మొరటు హాస్యమును ప్రదర్శింతురు” 

కొత్త : కానీ పామర జనమును రంజింపజేయుటకు ఇటువంటి వారే కావలెను. 

అరుణ: కానీ మనము పామరజనమును రంజింపజేసి పొట్టపోసుకొనుటకు రాలేదు

వేదికపై : నోళ్లే కాదు అన్నీఎండి పోతాయి. అని అగస్త్యుడు నన్నందుకు బదులుగా

కేశవుడు: ఆవిషయం ప్రత్యేకించి చెప్పక్కరలేదు అందరికీ తెలుసు.  

కేశవుడు: ఒక్కరు కాదు ఇద్దరు కాదు (తక్కువ వేగం తో)

వంద మంది వారు   2

చిన్న చితక ముసలీ ముతకా 

అందరు ఉన్నారూ  2- తందాన తానా 1 


హై .. పలుగుపారా పట్టిరి, నెత్తికి గుడ్డ చుట్టిరి (పాట వేగం పెరిగెను)

తట్ట బుట్ట బట్టి రి బతుకుతెరువుకై కదిలిరి

పొద్దుటేలనే పోయిరి, పొద్దుపోయేదాకా– సాగిరి

పెనుమదమందు చెరువు త్రవ్విరి    తందా.....నా తందానా  దేవానందనాన


అలా చెరువు త్రవ్వుతుండగా అక్కడ ఒకనాడు 

టాన్గ్ టాన్గ్  టాన్గ్  ఠటాన్గ్ ఠటాన్గ్

పైనీ సెగలేమి గునపం దిగేదేమీ పైనీ సెగలేమి గునపం దిగేదేమీ 

ఎంత తవ్వ నేమి గునపం దిగేదేమీ ఎంత తవ్వ నేమి గునపం దిగేదేమీ

టాన్గ్ టాన్గ్  మని చప్పుడాగదేమీ  -  తందానా దేవానందనాన

అప్పుడు ఆ జనం త్రవ్వడం ఆపి చూడగా ఒక విగ్రహం కనిపించింది ఆ విగ్రహాన్ని శుభ్రమైన నీటిలో కడిగి చూడగా ఎలా ఉందయ్యా అంటే 

ఇద్దరు భామల ముద్దుల మదనుని రూపము సుందరమూ 

రుక్మిణి సత్యల మదన  గోపాలుని చూసెద మందరమూ 


హై .. 

దివ్య సుందర రూపము చూచినా కళ్ళ భాగ్యము 

దివ్య సుందర రూపము చూచినా కళ్ళ భాగ్యము  ( బృందం )

మావూరు రావయ్యా మదన గోపాలా

గుడికట్టి నిన్ను పూజింతుమయ్యా  

మావూరు రావయ్యా మదన గోపాలా

గుడికట్టి నిన్ను పూజించమయ్యా  

ఆ ప్రకారంగా ఆ బల్లిపాడు వాసులు తమకు తవ్వకాల్లో దొరికిన  మదన  గోపాల స్వామీ విగ్రహాన్ని బల్లిపాడు తీసుకొచ్చి గ్రామ  పెద్దలకి అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పెనుమదం పెద్దలు బల్లిపాడు వచ్చి  గ్రామ పెద్దతో  ఏమన్నారయ్యా అంటే 


ఏమయ్యా ఓ పెద్దయ్యా ఇదేం బుద్దయ్యా   (లల్లల్ల లా  ...... లల్లల్ల లల్లల్ల లా...)

ఏమయ్యా ఓ పెద్దయ్యా  ఇదేం  బుద్దయ్యా 

ఏమయ్యా ఓ పెద్దయ్యా  ఇదేం  బుద్దయ్యా  ( బృందం )


మావూరి సామిని మాకియ్యి మీ వాడు కాదని ఒట్టేయ్యి 

కాదంటే ఇప్పుడే  చెప్పెయ్యి , ఐసా పైసా తేల్చేయ్యి

కాదంటే ఇప్పుడే  చెప్పెయ్యి , ఐసా పైసా తేల్చేయ్యి  ( బృందం )


ఏమయ్యా కామందూ గొడవెందు కయ్యా - నామాట వినవయ్యా 

లేవయ్యా పెద్దయ్య భోంచేయవయ్యా - నామాట వినవయ్యా 

కాళ్ళు చేతులు  కడగవయ్యా  తువ్వాలు ఇదిగో తుడువయ్యా

గుడికట్టి సామిని పూజింతుమయ్యా  మా మాట  నమ్మయ్యా

అలా విగ్రహం తమకి ఇవ్వాలని గొడవ చేయుచున్న పెనుమదం గ్రామస్థులని బల్లిపాడు గ్రామస్థులు అతిధి మర్యాదలతో సత్కరించి వారితో స్వామి వారికి ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసి , భూములు ఏర్పాటు చేస్తామని చెప్పగా పెనుమదం గ్రామస్థులు సరే అన్నారు.

వొడి కట్టినారు గుడి కట్టినారు మాట నిలిపినారు

గుడి చిన్నదైనా భక్తి పెద్దది మాట నిలిపినారు

నిత్యా పూజలే చేయగా రెండు వందలట్లు సాగేరా  

ఆపై ధ్వజమేనిలిపిరి నిత్యా పూజలే  చేసిరి

చెంతలో వెంకన్న చేరేగా దివ్య క్షేత్రమే ఆయెరా 

తరికిట  జంతరి థా !    

1773 సంవత్సరంలో స్వామి వారికి ఆలయ నిర్మాణం చేశారు. 1901 సంవత్సరంలో గ్రామస్థులు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. తిరిగి 1970 సంవత్సరంలో ఈ ఆలయ సన్నిధి నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమును నిర్మించి స్వామి వారి అలయంను దివ్యస్థలంగా చేసారు.  ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి వారిలోకి ప్రవేశించిందని చెబుతారు. ఆ కారణం చేత స్వామి వారికి నిత్యారాధన చేస్తారు.  ప్రతి సంవత్సరం పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా చేస్తారు. 

అమ్మా! భాగవతార్ రాలేరు కానీ భాగవతారిణి దొరికాగా పోయి తెచ్చినాము అని ఆంజనేయులు గారు చెప్పి ఆవిడను రంగ స్థలము వద్దకు కొనిపోయినారు. ఇప్పుడైననూ లకుమ వచ్చునేమో అని ఎదురుచూచు ఈ రాత్రికి ఇకరాదని తార నిరాశ చెందెను. రేపు వచ్చునులే  మరి సామాన్యురాలుకాదు కదా పెద్ద సినిమా తార నీబిడ్డ అని మాలిని గారు ఆమెను ఓదార్చిరి. రుక్మిణీ కళ్యాణం హరి కథ  మొదలాయెను.

  

1 comment:

  1. బల్లిపాడు చరిత్రను బుర్ర కథా గానంతో చాలా బాగా వివరించారు

    ReplyDelete